novel writer
-
The Goat Life: 700 గొర్రెలూ.. ఎడారి.. అతను
సౌదీలో రెండేళ్ల పాటు 700 గొర్రెలను ఒంటరిగా మేపాడు. మరో మనిషితో మాట్లాడలేదు. మరో మాట వినలేదు. ఇసుకతో స్నానం ఇసుకే దాహం ఇసుక తప్ప మరేం కనిపించని ఒంటరితనం. బానిస బతుకు. కాని బతికి దేశం తిరిగి వచ్చాడు. 1995లో అతని జీవితం నవలగా వెలువడి మలయాళంలో సెన్సేషన్ సృష్టించింది. ప్రస్తుతం 138వ ప్రచురణకు వచ్చింది. అతని జీవితం ఆధారంగానే ‘గోట్ లైఫ్’ సినిమా తాజాగా విడుదలైంది. కేరళకు చెందిన నజీబ్ సంఘర్షణ ఇది. కేరళలోని అలెప్పి దగ్గరి చిన్న ఊరికి చెందిన నజీబ్ కోరుకుంది ఒక్కటే. సౌదీకి వెళ్లి ఏదో ఒక పని చేసి కుటుంబానికి నాలుగు డబ్బులు పంపాలన్నదే. ఆ రోజుల్లో కేరళ నుంచే కాదు దక్షిణాది రాష్ట్రాల నుంచి గల్ఫ్ దేశాలకు చాలామంది పని కోసం వలస వెళ్లేవారు. నజీబ్ కూడా సౌదీకి వెళ్లాలనుకున్నాడు. ఏజెంట్ అతనికి ఒక మాల్లో సేల్స్‌మ్యాన్‌గా పని ఉంటుందని పంపాడు. అలా నజీబ్ సౌదీలో అడుగు పెట్టాడు. అది 1993వ సంవత్సరం. రెండు రోజుల తర్వాత ఎయిర్‌పోర్ట్‌లో దిగాక నజీబ్ రెండు రోజుల పాటు ప్రయాణిస్తూనే ఉన్నాడు... అప్పుడు గాని అర్థం కాలేదు తాను మోసపోయానని. ఎడారి లోపల అతణ్ణి అరబ్ షేక్‌కు అప్పజె΄్పారు. ఆ షేక్ అక్కడే ఒక షెడ్డు వేసుకుని ఉండేవాడు. నజీబ్‌కు 700 గొర్రెలను కాచే పని అప్పజె΄్పాడు. వేరే బట్టలు ఇవ్వలేదు. స్నానానికి నీళ్లు ఇవ్వలేదు. బతకడానికి మాత్రం ముతక రొట్టెలు పడేసేవాడు. ఆ రొట్టెల్ని గొర్రెపాలలో తడిపి కొద్దిగా తినేవాడు నజీబ్. యజమాని, అతని తమ్ముడు ఈ ఇద్దరు మాత్రమే నజీబ్‌కు కనిపించేవారు. వారి అరబిక్ భాష తప్ప మరో భాష వినలేదు. మరో మనిషిని చూడలేదు. ‘నేను ఏడ్చినప్పుడల్లా వారు కొట్టేవారు’ అంటాడు నజీబ్. భ్రాంతులు నజీబ్‌కు ఎడారిలో ఉండి భ్రాంతులు మొదలయ్యాయి. అతడు గొర్రెల మధ్య ఉండి ఉండి తాను కూడా ఒక గొర్రెనేమో అనుకునేవాడు. రెండేళ్ల పాటు ఇలాగే జరిగింది. ఒకరోజు ఆ అన్నదమ్ములిద్దరూ పెళ్లి ఉందని వెళ్లారు. ఆ అదను కోసమే చూస్తున్న నజీబ్ ఎడారిలో పరిగెత్తడం మొదలుపెట్టాడు. దారి లేదు.. గమ్యమూ తెలియదు. పరిగెట్టడమే. ఒకటిన్నర రోజు తర్వాత మరో మలయాళి కనిపించి దారి చె΄్పాడు. అతడు కూడా తనలాంటి పరిస్థితిలో ఉన్నవాడే. చివరకు ఒక రోడ్డు కనిపించి రియాద్ చేరాడు. అక్కడి మలయాళీలు నజీబ్‌ను కాపాడారు. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోతే తగిన పత్రాలు లేనందున 10 రోజులు జైల్లో పెట్టి ఇండియా పంపారు. నవల సినిమాగా నజీబ్ తిరిగి వచ్చాక కోలుకొని బెహ్రయిన్ వెళ్లాడు ఈసారి పనికి. అక్కడ పని చేస్తున్న రచయిత బెన్యమిన్‌కు నజీబ్‌తో పరిచయమైంది. నజీబ్ జీవితాన్ని బెన్యమిన్ నవలగా ‘ఆడు జీవితం’ (గొర్రె బతుకు) పేరుతో రాసి 2008లో వెలువరించాడు. అది సంచలనంగా మారింది. ఇప్పటికి వందకు పైగా ఎడిషన్స్ వచ్చాయి. 8 భాషల్లో అనువాదమైంది. ఆ నవల ్రపాశస్త్యం సినిమా రంగాన్ని ఆకర్షించింది. మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా ‘ఆడు జీవితం’ పేరుతో నటించి మొన్న మార్చి 28న విడుదల చేశాడు. తెలుగులో గోట్‌లైఫ్ పేరుతో అనువాదమైంది. వాస్తవిక సినిమాగా ఇప్పటికే గోట్‌లైఫ్ ప్రశంసలు పొందుతోంది. -
Annie Ernaux: స్వీయ అనుభవాలే సాహిత్యం
ఆనీ ఎర్నౌకు 23 ఏళ్లు ఉండగా అవాంఛిత గర్భం వచ్చింది. దాంతో చట్టవిరుద్ధంగా అబార్షన్ చేయించుకోవాల్సి వచ్చింది. ఇది జరిగింది 1963లో. 1999లో ఈ అనుభవాన్ని ఆమె నవలగా రాసింది. 130 పేజీల ఈ నవల 2000 సంవత్సరంలో ‘హ్యాపెనింగ్’ పేరుతో వెలువడి సంచలనం రేపింది. కాల్పనిక సాహిత్యం రాసే ఫ్రెంచ్ రచయిత్రి ఆనీ ఎర్నౌ ఆ రకమైన సాహిత్యాన్ని వదిలిపెట్టి స్వీయ జీవితంలోని పరాభవాలు, ఆందోళనలు దాపరికం లేకుండా రాయడం కూడా సాహిత్యమేనని గ్రహించింది. 2022 సంవత్సరానికి ప్రతిష్టాత్మక నోబెల్ ప్రెయిజ్ గెలుచుకున్న ఆనీ ఎర్నౌ ఇంగ్లిష్‌లో రాయకున్నా ఈ బహమతి గెలుచుకున్న అతి కొద్దిమంది మహిళల్లో ఒకరు. ఆమె గురించి... ఆమె పుస్తకాల గురించి... ‘ఇది పురుషాధిక్య ప్రపంచం. దీనిని బోనెక్కించాల్సిన సమయం వచ్చినప్పుడు బోనెక్కించాల్సిందే’ అంటుంది 82 సంవత్సరాల ఫ్రెంచ్ రచయిత్రి ఆనీ ఎర్నౌ. తన జీవితంలో జరిగిన ఒక సంఘటన– చట్ట విరుద్ధంగా అబార్షన్ చేయించుకోవాల్సి రావడాన్ని– 1999లో ఫ్రెంచ్‌లో ‘ఇవెన్మో’ పేరుతో నవలగా రాస్తే మరుసటి సంవత్సరం అది ‘హ్యాపెనింగ్’ పేరుతో ఇంగ్లిష్‌లో అనువాదం అయ్యి వెలువడింది. ఆ సందర్భంగా ఆనీ ఎర్నౌ అన్న మాట అది. ‘నా జీవితంలో నాకు జరిగింది రాయడం ఎందరో స్త్రీలకు గొంతునివ్వడమే’ అని ఆమె అంది. ‘నాకు అవాంఛిత గర్భం వచ్చినప్పుడు అది నా వ్యక్తిగతమైన విషయంగా మిగల్లేదు. బయటపడితే నా కుటుంబం మొత్తం సామాజిక నీతిలో విఫలమైందన్న విమర్శను మోయాల్సి వచ్చేది’ అంటుందామె. కాకతాళీయమే అయినా ఇండియాలో అబార్షన్ గురించి సుప్రీంకోర్టు స్త్రీలకు సంపూర్ణ హక్కులు ఇచ్చిన సందర్భంలోనే అబార్షన్ గురించి, స్త్రీల దైహిక వేదనల గురించి, మనో సంఘర్షణల గురించి, వారికి మాత్రమే ఎదురయ్యే అనుభవాల గురించి అది కూడా శ్రామిక వర్గ కోణం నుంచి విస్తృతంగా రాసిన ఆనీ ఎర్నౌకు నోబెల్ సాహిత్య బహుమతి లభించింది. ఇప్పటి వరకు 119 మంది నోబెల్ సాహిత్య బహుమతి లభిస్తే వారిలో కేవలం 16 మందే స్త్రీలు. ఆనీ ఎర్నౌ 17వ రచయిత్రి. బాల్యం నుంచి గుణపాఠాలే ఫ్రాన్స్‌లోని ఇవెట్తో అనే ఊళ్లో చిన్న పచారీ కొట్టు నడిపేవారు ఆనీ తల్లిదండ్రులు. తండ్రికి పట్టకపోయినా జీవితాలు మారాలంటే చదువు ముఖ్యం అని ఆమె తల్లి గట్టిగా భావించింది. దాంతో తమ స్థాయికి చెందకపోయినా కాస్త మంచిబడిలో ఆనీని చేర్పించింది. ఆ బడికి కలిగిన పిల్లలు వచ్చేవారు. ‘అక్కడే నాకు తొలిపాఠం తెలిసింది. శ్రామిక వర్గానికి దక్కే మర్యాదలు కూడా తెలిశాయి. నిన్ను నువ్వు చిన్నబుచ్చుకుంటూ బతకాల్సి రావడం కంటే ఘోరమైన విషయం లేదు. మన స్థాయికి మించిన విషయాల్లో అడుగు పెట్టకూడదని నాకు గట్టిగా అందిన సందేశం అందింది’ అంటుందామె. ఆమె తన స్వీయానుభవాల ఆధారంగా ‘ఏ గర్ల్స్ స్టోరీ’ (2016) అనే నవల రాసింది. ‘18 ఏళ్ల అమ్మాయి స్టూడెంట్స్ క్యాంప్‌లో లైంగిక అనుభవం పొందితే అది సంతోషకరంగా ఉండాలి. కాని ఇది తెలిసిన వెంటనే మగ విద్యార్థులు ఆ అమ్మాయిని గేలి చేశారు. ఆమె అద్దం మీద అసభ్యకరంగా రాసి వెక్కిరించారు. ఎన్నాళ్లు గడిచినా నైతికంగా పతనమైన భావనను కలిగించారు’ అని రాసిందామె. చదువు ముగిశాక ఆమె టీచర్‌గా మారి ఆనీ ఎర్నౌ 2000 సంవత్సరంలో రిటైరయ్యి పూర్తికాలం రచయిత్రిగా రచనలు కొనసాగిస్తూ ఉంది. సూటిగా, సులభంగా ఆనీ ఎర్నౌ రచనా శైలి సూటిగా సులభంగా ఉంటుంది. నేరుగా పాఠకులకు అందేలా ఆమె వచనశైలి ఉంటుంది. నోబెల్ కమిటీ కూడా ఇదే మాట అంది. ‘ఆమె సాహిత్యం అత్యంత సాధారణ భాషలో అత్యంత పరిశుభ్రంగా ఉంటుంది’ అని అభిప్రాయపడింది. ఆనీ ఎర్నౌ రాసిన పుస్తకాల్లో ‘క్లీన్డ్ ఔట్’ (1974), ‘షేమ్’ (1997), ‘గెటింగ్ లాస్ట్’ (2001), ‘ది ఇయర్స్’ (2008) ముఖ్యమైనవి. 1988లో పారిస్‌లో ఉద్యోగం చేస్తున్న ఒక సోవియెట్ దౌత్యవేత్తతో ఆనీ ఎర్నౌ బంధం ఏర్పరుచుకుంది. అతడు ఆమె కంటే 12 ఏళ్లు చిన్నవాడు. కొంత కాలానికి ఆ బంధం ముగిసింది. ఆ సమయంలో తన భావోద్వేగాలను ‘గెటింగ్ లాస్ట్’ పేరుతో నవల రాసిందామె. అలాగే తన గురించి, ఫ్రాన్స్ సమాజం గురించి రెండో ప్రపంచ యుద్ధం నాటి నుంచి ఇటీవలి కాలం వరకూ జరిగిన ఘటనలను ‘ది ఇయర్స్’గా రాసింది. ఒక రకంగా ఇది స్వీయ చరిత్ర, ఫ్రాన్స్ చరిత్ర కూడా. స్త్రీ పక్షపాతి ఆనీ ఎర్నౌ తనను తాను ‘రచనలు చేసే మహిళ’గా చెప్పుకున్నా ఆమె స్త్రీ పక్షపాతి. స్త్రీవాద ఉద్యమానికి ప్రోత్సాహకురాలు. ‘రాజకీయాలు భ్రష్టుపట్టిన ఈ సమయంలో ఫెమినిస్టులే సరిహద్దులను ప్రశ్నిస్తూ కొత్త ఆలోచనలను చేస్తూ ఆశలు రేకెత్తిస్తున్నారు’ అంటుందామె. ఇటీవల జరిగిన మీటూ ఉద్యమం ఆమెకు చాలా సంతోషాన్నిచ్చింది. ‘తమతో ఎలాగైనా వ్యవహరించవచ్చనే స్థితిని స్త్రీలు ఇక మీద ఏ మాత్రం అంగీకరించరు’ అంటారామె. ‘నేను రాయగలను కాబట్టే నాకు వినూత్న అనుభవాలు ఎదురవుతున్నాయి’ అని చెప్పుకున్న ఆనీ రాయగలిగే మహిళలంతా తమ జీవన అనుభవాలను బెరుకు లేకుండా చెప్పడాన్ని ప్రోత్సహిస్తుంది. అప్పుడే స్త్రీలు, స్త్రీలతో ఉన్న సమాజం మరింత మెరుగ్గా అర్థమవుతాయి. స్వీయ అనుభవాలే రచనలు ఆనీ ఎర్నౌ ఏవో ఊహించి కథలు అల్లడం కన్నా తన జీవితంలో జరిగినవే రాయాలని నిర్ణయం తీసుకుంది. దాంతో ఆమె జ్ఞాపకాల రచయిత్రి అయ్యింది. మన జీవితంలో జరిగినదాన్ని రాయడం వల్ల మిగిలినవారు పోల్చుకోవడానికో, సహానుభూతి చెందడానికో అది ఉపయోగపడుతుంది అంటుందామె. మనుషులు వేరే చోట్ల ఉన్నా వారు భావోద్వేగాలు ఒకటే కదా. ఆనీ ఎర్నౌ రాసిన ‘హ్యాపనింగ్’ నవల ఒక కాలపు ఫ్రాన్స్‌లో స్త్రీల సంఘర్షణను సూటిగా నిలపడంతో ఆమెకు ప్రశంసలు వచ్చాయి. 1963లో ఆమె అబార్షన్ చేయించుకోవాల్సి వస్తే ఆ తర్వాత 12 ఏళ్లకు కాని ఫ్రాన్స్‌లో (అవివాహితులకు) అబార్షన్‌ను చట్టబద్ధం చేయలేదు. ‘అబార్షన్ హక్కు లేకపోవడం అంటే.. చట్టం, సంఘపరమైన నియమాలు వ్యక్తి స్వేచ్ఛను పూర్తిగా ధ్వంసం చేయడమే’ అంటుందామె. -
12 ఏండ్ల 295 రోజులకే రికార్డుల ‘సిరీస్’
సౌదీ అరేబియా: పన్నెండేళ్లు.. వర్డ్ పజిల్స్‌తో ఆడుకునే వయసు. కానీ... వరుసగా మూడు నవలలను రాసిందో అమ్మాయి. తద్వారా నవలల సిరీస్‌ను రాసిన అతి పిన్న వయసు అమ్మాయిగా గిన్నిస్ రికార్డు సృష్టించింది. పైగా.. ఇప్పుడు నాలుగో నవలను పూర్తి చేసే పనిలో ఉంది. సౌదీ అరేబియాకు చెందిన రితాజ్ హుస్సేన్ అల్‌హజ్మీ పుస్తకాలంటే చాలా ఇష్టం. అయితే తన వయసు పిల్లలకోసం సరైన నవలలు లేవనిపించిందామెకు. తానే ఎందుకు రాయకూడదు అని ఆలోచించింది. ఆరేళ్ల వయసులోనే చిన్నచిన్నగా రాయడం మొదలుపెట్టి, పన్నెండేళ్లు వచ్చేనాటికి నవలలే రాసేసింది. మొదటి మూడు పుస్తకాలు పబ్లిష్ అయ్యేనాటికి అల్‌హజ్మీ వయసు 12 ఏండ్ల 295 రోజులు. మొదటి నవల ‘ట్రెజర్ ఆఫ్ ది లాస్ట్ సీ’ 2019లో పూర్తి చేసింది. దానికి సీక్వెల్‌గా ‘పోర్టల్ ఆఫ్ ది హిడెన్ వరల్డ్’ను, తరువాత మూడో పుస్తకంగా ‘బియాండ్ ద ఫ్యూచర్ వరల్డ్’ తీసుకొచ్చింది. ఇప్పుడు అల్‌హజ్మీకి 13 ఏళ్లు. నాలుగో పుస్తకం ‘పాసేజ్ టు అన్నోన్’ రాస్తోంది. -
నెలకో నవల రాస్తారు ఈవిడ
సుందరి వెంకటరామన్ తన 53వ ఏట ఇంగ్లిష్‌లో కాలక్షేప నవలలు రాయడం మొదలుపెట్టారు. తనే స్వయంగా వాటిని పబ్లిష్ చేయడం మొదలెట్టారు. నెలకు ఒక నవల రాయడం ఆమె ప్రత్యేకత. ఇప్పటికి 50 నవలలు పబ్లిష్ అయ్యాయి. వాటిలో కొన్ని బెస్ట్ సెల్లెర్స్‌గా నిలిచాయి. డబ్బు కూడా బాగా వస్తోంది. ‘వచ్చే సంవత్సరం నాకు అరవై నిండుతాయి. ఈలోపు అరవై నవలలు పూర్తి చేయాలనుకుంటున్నాను’ అంటున్నారు. ముంబైలో ఉండే ఈమెతో ఒక పది నిమిషాలు మాట్లాడటం కష్టమే. ఎందుకంటే నవల రాస్తుంటారు కదా బిజీగా. మనకు తెలుగులో యద్దనపూడి సులోచనారాణి, యండమూరి, మల్లాది లాంటి పాపులర్ రచయిత లు తెలుసు. కాని సుందరి వెంకటరామన్ వారిని మించినట్టుగా ఉన్నారు. వారి కంటే భిన్నమైన నేపథ్యం ఉన్నట్టుగా కనిపిస్తారు. ఎందుకంటే ఈమె మిగిలిన వారిలా చిన్న వయసు నుంచి రచనలు చేయడం మొదలు పెట్టలేదు. పిల్లలు ఎదిగొచ్చిన తర్వాత 2001లో నవలలు రాద్దామని ప్రయత్నించారు. కాని ఆ రచనలను పబ్లిషర్లు రిజెక్ట్ చేశారు. దాంతో ఊరికే ఉండిపోయి తిరిగి 2014లో తన 53వ ఏట నుంచి తనే తన నవలలు ప్రచురించుకోవడం మొదలుపెట్టారు. ఆరేళ్లలో యాభై నవలలు రాశారు. అంటే సగటున నెలకు ఒక నవల రాసినట్టు. ఇలాంటి రికార్డు ఉన్న భారతీయ రచయిత్రులు చాలా అరుదు. ఉద్యోగపు విసుగు నుంచి సుందరి వెంకటరామన్ది చెన్నై. చిన్నప్పటి నుంచి బాలల కథలు చదివి ఆ లోకంలో విహరించేవారామె. టీనేజ్‌లో ఉండగా ఇంగ్లిష్‌లో కాలక్షేపంగా, రొమాంటిక్ సాహిత్యంగా ఉధృతంగా వచ్చిన మిల్స్ అండ్ బూన్స్ నవలలను విపరీతంగా చదివేవారు. ఏది చదివినా ముగింపు వాక్యం ‘ఆ తర్వాత వారు కలకాలం సుఖ సంతోషాలతో వర్థిల్లారు’ అని ఉన్న పుస్తకాలే చదివేవారు. ‘సుఖాంతమే అవ్వాలి పుస్తకాలు’ అంటారామె. ఆ తర్వాత పెళ్లి, పిల్లల పెంపకం, ముంబైలో స్థిరపడటంలో పడి నలభై ఏళ్లు వచ్చేశాయి. ఆమె అంతవరకూ చేస్తున్న స్కూల్ అడ్మిన్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఏదో అనిశ్చితి ఉండేది మనసులో ఆ సమయంలో. ఒకరోజు ఈవెనింగ్ వాక్ నుంచి ఇంటికొచ్చి కొన్ని కాగితాలు తీసుకొని రాయడం మొదలుపెట్టారు. అంతవరకూ చదివి చదివి ఉన్న పుస్తకాల ఫలితంగా ఏదో ఒక కథ ఆమె మనసులో గూడు కట్టుకొని అది ఒక్కసారిగా బయట కు వచ్చినట్టుగా వచ్చేసింది. ఆమె రాస్తూ వెళ్లారు. మొత్తం 92 వేల పదాల నవల రాశారు. దాని పేరు ‘ది మల్హోత్రా బ్రైడ్’. ఎంతో ఆశతో దానిని తీసుకుని ఒక పబ్లిషర్ దగ్గరకు వెళ్లారు. కాని ఆ పబ్లిషర్ దానిని చదివి పెదవి విరిచాడు. దానికి కారణం అందులో రొమాన్స్, స్త్రీ పురుష సంబంధాలు ఉండటం ‘ఈ సబ్జెక్ట్ ఇప్పుడు చదవరు’ అని అతను అన్నాడు. సుందరి నిరాశగా ఇంటికి చేరుకున్నారు. భర్త ఆమెతో ‘నిరాశ పడకు. రాస్తూ ఉండు’ అని ప్రోత్సహించాడు. అ³్పుడు ఆమె తిరిగి ‘ముంబై మిర్రర్’ పత్రికలో ఉద్యోగంలో చేరారు. అక్కడ ఐదేళ్లు ఆ పత్రికకు సంబంధించిన వెబ్సైట్ల కోసం పని చేశారు. మళ్లీ విసుగు వచ్చింది. 53 ఏళ్లు వచ్చేశాయి... ఇంకా నేను రైటర్‌గా లోకానికి తెలియలేదు అనుకుని మళ్లీ ఉద్యోగం మానేశారు. ఇప్పుడు నిజంగానే తన రైటింగ్ కెరీర్‌ని సీరియస్‌గా తీసుకున్నారామె. సెల్ఫ్ పబ్లిషర్‌గా ఆ సమయంలో ఆమెకు అప్పటికే సెల్ఫ్ పబ్లిషింగ్కు అవకాశం కల్పిస్తూ పాఠకాదరణ పొందిన అమేజాన్ ‘కిండిల్’ ఈ–రీడర్ ఒక ఆశాకిరణంలా అనిపించింది. తను రాసిన నవలలను ఈ–బుక్స్‌గా పబ్లిష్ చేయాలనుకున్నారామె. 2014 లో తన తొలి ఈ నవలగా ‘ది మల్హోత్రా బ్రైడ్’ను విడుదల చేశారు. ఆ తర్వాత ఒక్కో నవలా జత చేస్తూ వెళ్లారు. సంవత్సరం తిరిగే సరికే ఇటు ఈ–బుక్స్‌తోపాటు పేపర్‌బ్యాక్స్ ప్రచురించడానికి పబ్లిషర్లు ముందుకు రాసాగారు. ‘ది మెడ్రాస్ ఎఫైర్’ అనే నవల ఆమె తొలి ప్రచురణ నవలగా వచ్చింది. ఇప్పుడు ఆమె నవలలు ఈ బుక్స్‌గా దొరుకుతున్నాయి. కోరిన పాఠకులకు పేపర్బ్యాక్స్గా కూడా దొరుకుతున్నాయి. అమెజాన్ ద్వారా అమ్ముడుపోయే కాలక్షేప నవలల్లో టాప్ 100లో సుందరి వెంకటరామన్ నవలలకూ స్థానం. యు.కె, కెనెడా, ఆస్ట్రేలియాల్లో కూడా ఆమె నవలలు బెస్ట్‌సెల్లర్స్‌గా నిలవడం విశేషం. రొమాన్సే వస్తువు ‘రొమాన్స్’ అనే మాటకు ‘ప్రేమకు సంబంధించిన ఉత్సుకత’ అనే డిక్షనరీ అర్థం చెబుతారు సుందరి వెంకటరామన్. ‘ఎరోటిజమ్’ అనే మాటలో ‘లైంగిక వాంఛ’ అర్థాన్ని చూపుతారు. స్త్రీ, పురుషుల సంబంధాల్లో రొమాన్స్ ఉంటుంది... ఎరోటిజమూ ఉంటాయి... ఇవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి.. నా నవలల్లో అదే ప్రధాన వస్తువు అంటారామె. ‘భారతదేశంలో రొమాంటిక్ సబ్జెక్ట్స్‌ను ఇష్టపడేవారు ముందు నుంచి ఉన్నారు. దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే వంటి సినిమాలు అంత హిట్ కావడానికి కారణం మనవాళ్ల అలాంటి కంటెంట్‌ను ఇష్టపడటమే’ అంటారామె. ఆమె నవలల పేర్లు కూడా డెబ్బైల నాటి పల్ప్ ఫిక్షన్‌ను పోలినట్టు ఉంటాయి. ‘ది సీక్రెట్ హజ్బెండ్’, ‘ది కాసనోవాస్ వైఫ్’, ‘రోజ్ గార్డెన్’... ఇలా. వాటికి విస్తృతంగా పాఠకులున్నారు. ‘ప్రతిదానికీ పాఠకులుంటారు’ అంటారామె. ‘నా నవలలు చదివితే ఆ ఆకర్షణల వల్ల వచ్చే సమస్య ల నుంచి కూడా బయటపడొచ్చు’ అంటారు. రచనలు రెండు రకాలు. సమాజ హితాన్ని కోరేవి. సమాజానికి కాలక్షేపం అందించేవి. ఏది ఆసక్తి ఉంటే అందులో రాణించవచ్చు. స్వయంగా పబ్లిష్ చేసి గుర్తింపు పొందవచ్చు. మనసులో ఉన్న భావాలను వ్యక్తపరచవచ్చు. ఏ వయసులో అయినా కొత్త ప్రయాణం మొదలెట్టొచ్చు అనడానికి సుందరి వెంకటరామన్ ఒక ఉదాహరణ. అతి వేగంగా రాసే రచయిత్రి సుందరి వెంకటరామన్ అతి వేగంగా రాస్తారు. ఒక్కో నవల సగటున 35 రోజుల్లో పూర్తి చేస్తారు. భూమి ఆకాశాల మధ్య ఏ వస్తువునైనా తీసుకొని కథ అల్లగలరామె. 2016లో పన్నెండు నెలలకు పన్నెండు నవలలు పబ్లిష్ చేశారామె ఈబుక్స్‌గా. కవర్ డిజైన్ ప్రూఫ్ తనే చూస్తారు. మార్కెటింగ్ తనే చేస్తారు. ప్రచారం కూడా. – సాక్షి ఫ్యామిలీ -
మనుషులు గీసిన గీతలు
ప్రతిష్ఠాత్మక నేషనల్ బుక్ అవార్డ్స్ 2020కి షార్ట్‌లిస్ట్ అయిన ‘మైనర్ డీటైల్’ సైజులో చిన్నదయినా అతిశక్తివంతమైన నవలికగా రూపొందడంలో పాలెస్తీనా రచయిత్రి అదనియా షిబ్లీ, అభినందనీయమైన అనువాదం చేసిన ఎలిజబెత్ జకాట్ సమాన పాత్ర నిర్వహించారు. ఇజ్రాయెల్, పాలెస్తీనాల చరిత్రలోని హింసని లీలామాత్రంగానే స్పృశించినా, పెను అలజడిని కలిగించడంలో వస్తుశిల్పాల సమాన భాగస్వామ్యం ఉంది. నిర్మాణపరంగా నవల కూడా రెండు సమాన భాగాలుగా విభజించబడి ఉంటుంది. 1948లో జరిగిన ఇజ్రాయెల్– పాలెస్తీనా యుద్ధపరిణామం ఇజ్రాయెల్‌కి స్వాతంత్య్ర సాధనగా, పాలెస్తీనాకి ఉత్పాతంగా పరిణమించాక, ఇజ్రాయెల్‌లోని నెగెవ్ ఎడారి దక్షిణ ప్రాంతంలో ఈజిప్ట్‌తో ఉన్న సరిహద్దు భద్రతకోసం మిలిటరీ దళం ఏర్పాటు చేయడంతో ఆగస్ట్ 9, 1949న మొదటిభాగం ప్రారంభమవుతుంది. మొదటిరోజు రాత్రే దళం కమాండర్‌ని గుర్తుతెలియని విషప్పురుగేదో కుట్టడంతో సంబంధిత శరీరభాగమంతా ఇన్ఫెక్షన్కి గురవుతుంది. గాయపు సలపరింత పెరుగుతున్న కొద్దీ, కమాండర్ ఉన్మాదిలాగా కనిపించిన కీటకాలనన్నింటినీ చంపుతుంటాడు. మూడోరోజున దళం ఒక అరబ్బుల సమూహాన్ని గుర్తిస్తుంది. వాళ్లందరినీ కాల్చిపడేసాక, ‘‘కీటకం లాగా’’ బురఖాలో ముడుచుక్కూచుని బతికిబయటపడ్డ ఒక అరబ్ యువతిని పట్టుకుని క్యాంప్‌కి తీసుకొస్తారు. ఆమె వెనకే ఆమె కుక్క కూడా. మురికిగా ఉన్న ఆమెని పెట్రోల్‌తో శుద్ధి చేసి, జుట్టు కత్తిరించేస్తారు. మర్నాటి ఉదయం వరకూ దళసభ్యులు జరిపిన అత్యాచారాలకి గొంతువిప్పి ప్రతిఘటించలేని యువతి ఆక్రోశాన్ని, గొంతెత్తి అరుస్తూనే ఉన్న ఆమె కుక్క ద్వారానే వినగలం. మరుసటిరోజుకి ఆమెకిక అరవాల్సిన అవసరం రాదు– చుట్టూ అలముకుని ఉన్న పెట్రోల్ వాసన, కుక్క అరుపుల మధ్య ఆమెని కాల్చి చంపేయడంతో మొదటిభాగం పూర్తవుతుంది. అయిదురోజుల ఈ కథాభాగం ప్రథమపురుష భూతకాలపు కథనంలో, సూక్ష్మమైన వివరాలను సైతం తటస్థ కథనదూరంతో అందిస్తూ, పాత్రల ఆంతరంగికతలను ఏమాత్రం బహిర్గతం చేయని దృశ్యచిత్రణ. సుమారు అరవై ఏళ్ల తర్వాత పాలెస్తీనాలోని ఒక ఉద్యోగిని పై సంఘటన గురించిన విపులమైన వార్తాకథనాన్ని చదవడంతో రెండవభాగపు ఉత్తమపురుష వర్తమానకాలపు కథనపు హోరు ప్రారంభమవుతుంది. తన భయాల అభద్రతల్లో సాదాసీదా జీవితాన్ని గడుపుతూ, పక్క బిల్డింగ్ బాంబింగ్‌కి గురైతే తన కాగితాల మీద దుమ్ముని ఏమీ జరగనట్టే మామూలుగా దులుపుకునే ఈ అమ్మాయిని ఆ వార్త ఆకర్షించడానికి కారణం– ఆ దారుణం జరిగిన సరిగ్గా పాతికేళ్లకి అదే రోజున తను పుట్టడం అనే చిన్న వివరం. ఈ సంఘటన వెనకాల ఉన్న సత్యాన్ని కనుక్కోవాలని నిర్ణయించుకుంటుంది కానీ, ఇజ్రాయెల్ ఆక్రమిత పాలెస్తీనా ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడానికి ఆంక్షలుంటాయి. కొలీగ్ ఐడీ కార్డ్, అద్దెకి కార్ తీసుకుని, భయాలని అధిగమిస్తూ మాప్స్ పెట్టుకుని (1948కి ముందువీ, తరువాతవీ) ఆమె చేసిన ప్రయాణం మొత్తం నిష్ఫలమవుతుంది. మ్యూజియంలలో చూస్తున్న వస్తువులు గతానికి కేవలం మౌనసాక్ష్యాలు మాత్రమే. మధ్యలో పెట్రోల్ బంక్‌లో పొరపాటున కొంత పెట్రోల్ మీద ఒలకబోసుకుంటుంది. దారీతెన్నూ తెలియకుండా ఒంటిమీద పెట్రోల్ వాసనతో కార్లో తిరుగుతుండగా సుమారు డెబ్భై యేళ్లున్న ముసలామె ఒంటరిగా కనిపిస్తే, ఆగి లిఫ్ట్ ఇవ్వడం ఆమె కథకి మలుపు. ముసలామె దిగిపోయాక, రేప్ బాధితురాలు ఇప్పటికీ బతికుంటే ఇంతే వయసుండేది కదా అని వచ్చిన ఆలోచన ఆమె కథని పూర్తిగా మార్చేస్తుంది. జీవితంలో మొదటిసారిగా ఈ ప్రయాణంలో కొన్న చూయింగ్ గమ్, ఆమె చేసిన ఆఖరి తప్పవుతుంది. గతాలు వర్తమానాన్ని నిర్దేశిస్తాయి; వర్తమానంలోని అనుభవాలు గతాన్ని ప్రశ్నిస్తుంటాయి. కాలాల్లోని భేదాల భౌతికతని కథనంలోని దృష్టికోణపు మార్పు మనం ఉలిక్కిపడే అనుభవాన్ని కలిగించగా, ఆ కాలాలలోని సామ్యతని నవలలో పదేపదే ఉపయోగించే పెట్రోల్ వాసన, కుక్క అరుపులలాంటి ‘మోటిఫ్స్’ ప్రతీకాత్మకంగా చూపిస్తాయి. హింస రాజ్యమేలే చోట ఏమార్పూ ఆశించలేమన్న సారాంశాన్ని నవల ప్రారంభవాక్యమే తేల్చిచెబుతుంది: Nothing moved except the mirage. భ్రాంతి తప్ప మారేది మరోటి ఉండదు! -ఎ.వి.రమణమూర్తి -
అద్దంలోని ముడుపులు
2008 ప్రాంతంలో అమెరికాలో పాంజీ స్కీం రూపంలో అతిపెద్ద ఆర్థికనేరం బయటపడి పెనుసంచలనం సృష్టించింది. ప్రజల నుంచి పెట్టుబడులు ఆహ్వానించి, ఆ సొమ్మును వివిధ రంగాలలో పెట్టుబడులుగా పెట్టి అధిక లాభాలను ఆర్జించి, తిరిగి చెల్లింపుల రూపంలో వారికే అందిస్తామని ప్రలోభపెట్టి, చివరికి ఒకరిచ్చిన సొమ్మునే మరొకరికి లాభాల పేరుతో ముట్టచెప్పే మోసపూరితమైన వ్యాపారమే పాంజీ స్కీం. కొన్ని వేలకోట్ల డాలర్లతో నడిచిన ఈ పాంజీ స్కీం బయటపడ్డాక దీనికి రూపకర్త అయిన బెర్నీ మెడాఫ్కి అమెరికా న్యాయస్థానం 150 యేళ్ల జైలుశిక్ష విధించింది. వైట్‌కాలర్ నేరం ఇతివృత్తంగా రాసిన ‘ద గ్లాస్ హోటల్’ నవలని ఈ కథతో ముడిపెట్టి రాశారు కెనడియన్ రచయిత్రి ఎమిలీ సెయింట్ జాన్ మెండేల్. దయ్యాల కథలన్నా తనకు చాలా ఇష్టమనే ఈ రచయిత్రి, దయ్యాలంటూ వేరే ఉండవనీ తాము జీవించలేకపోయిన జీవితం, తీసుకోలేకపోయిన నిర్ణయాలూ, ఓడిపోయిన పరిస్థితులే మనిషిని ఆ రూపంలో వెంటాడుతుంటాయని అంటారు. పట్టణపు వాసనలు లేని కయేట్ అనే ఊహాజనిత ప్రదేశంలో కథ మొదలవుతుంది. ఒకవైపు సముద్రమూ, మరోవైపు అడవీ, ఇరవై గడపలూ ఉన్న ఆ చిన్న ఊళ్లో అత్యంత ఆధునికమైన హంగులతో, చుట్టూ ఉన్న అడవి కనిపించేలా నిలువెత్తు గాజు పలకలతో ‘కయేట్ హోటల్’ నిర్మిస్తాడు వ్యాపారవేత్త జానథన్. అదే ఊరికి చెందిన విన్సెంట్ అనే మహిళ తన సోదరుడు పాల్‌తో కలిసి ఆ హోటల్లో పనిచేస్తూ ఉంటుంది. భార్య మరణించడంతో ఒంటరిగా ఉన్న జానథన్, సహజీవనం చేసే ఒప్పందం మీద విన్సెంట్‌ని తనతోపాటు కనెక్టికట్‌కి తీసుకెళ్లిపోతాడు. అతిసామాన్యమైన జీవితంలో నుంచి ఐశ్వర్యంలోకి అడుగుపెట్టిన విన్సెంట్ సకల సౌకర్యాలను అనుభవిస్తున్నా, జరిగిన ప్రతి సంఘటనా వేరేలా జరిగుంటే జీవితం మరోలా ఉండేదని అనుకుంటుంది. జానథన్‌తో చేసుకున్న ఒప్పందం సరైనది కాదని అనిపించినా, తాననుభవిస్తున్న జీవితానికి ఆమాత్రం మూల్యం చెల్లించుకోవడం సబబే అని నచ్చజెప్పుకుంటూ ఉంటుంది. ఇంతలో జానథన్ చేసే పెట్టుబడుల వ్యాపారం మోసమనీ, పాంజీ స్కీం అనీ బయటపడి, ప్రభుత్వం అతన్ని జైల్లో పెడుతుంది. రెట్టింపు లాభాలకు ఆశపడి అతని దగ్గర పెట్టుబడి పెట్టిన కొన్ని వందలమంది జీవితాలు అస్తవ్యస్తమవుతాయి. జైల్లో జానథన్ ఉన్నగది గోడలమీద ‘ఏ నక్షత్రమూ శాశ్వతంగా వెలుగులు చిమ్మదు,’ అని రాసివున్న వాక్యం అతని అప్పటి స్థితికి సూచిక. చేసిన తప్పుని సమర్థించుకోడానికి ఎన్ని కారణాలు చెప్పుకున్నా కుదుటబడని అతని మనసు, అపరాధ భావనకి లోనై తనవల్ల మోసపోయినవారూ, తన గజిబిజి ఆలోచనలూ దయ్యాలై చుట్టుముడుతున్న విభ్రాంతికి లోనవుతుంది. జానథన్‌తో పనిచేసిన కొందరు తప్పొప్పుకొని జైలుపాలైతే, మరికొందరి వైవాహిక జీవితాలు విచ్ఛిన్నమవుతాయి. శిక్ష తప్పించుకోటానికి దేశమే వదిలి పారిపోయిన ఒక ఉద్యోగి ఏదోనాడు పోలీసులు తనని అరెస్ట్ చేస్తారన్న ఆందోళనతో మనశ్శాంతిని కోల్పోతాడు. పరిస్థితులని ఎదుర్కొని నిలదొక్కుకున్న విన్సెంట్ పేరూ, రూపం మార్చుకుని ఒక ఓడలో వంటమనిషిగా కుదురుకుని, అనూహ్యంగా సముద్రంలో పడి చనిపోతుంది. ఉద్యోగ విరమణ తరవాత వచ్చిన డబ్బంతా జానథన్ వల్ల కోల్పోయి రోడ్డున పడ్డ లియాన్ అనే వ్యక్తి భార్యతో కలిసి జీవితాన్ని పునర్నిర్మించుకునే ప్రయత్నాలు చేస్తుంటాడు. ‘‘మంచీ చెడూ అని ద్వంద్వాలు నిర్దిష్టంగా ఉంటాయా? రెండు ఛాయలూ ఏకకాలంలో ఉండవచ్చు కదా?’’ అని ప్రశ్నించే పాల్ వీటన్నిటికీ దూరంగా సంగీతకారుడిగా ఎదుగుతున్నప్పటికీ మాదకద్రవ్యాలకు బానిసై జీవితంలో ఎత్తుపల్లాలను చూస్తూనే ఉంటాడు. దయ్యాల, ఆత్మల ప్రమేయాన్ని కొద్దిగా ప్రవేశపెట్టి, భిన్నమైన వ్యక్తిత్వాలని ఛిన్నాభిన్నమైన పరిస్థితుల నేపథ్యంలో, నాన్‌లీనియర్ పద్ధతిలో, సర్వసాక్షి కథనం ద్వారా పరిచయం చేస్తుంది రచయిత్రి. కథనం చురుగ్గా సాగడానికి సూటిగా సులువుగా ఉన్న భాష ప్రధాన కారణం అయింది. మార్చి నెలలో నాప్ఫ్ ప్రచురణ సంస్థ ద్వారా విడుదలయిన ఈ నవలకి పాఠకులు, విశ్లేషకుల స్పందన విశేషంగా ఉంది. -పద్మప్రియ -
కొవ్వొత్తి చుట్టూ తిరిగే చిమ్మట జీవితాలు
పాకిస్తానీ రచయిత మొహ్సీన్ హమీద్ తొలి నవల అయిన, ‘మోథ్ స్మోక్’ 1998లో లాహోర్‌లో మండుతున్న వేసవిలో, ఒకానొకప్పుడు జూనియర్ బ్యాంకర్ అయిన దారాషికో (దారూ) తను చేయని హత్యకి, జైల్లో కూర్చునుండగా ప్రారంభం అవుతుంది. పేదింటి దారూ ధనిక కుటుంబానికి చెందిన ఔరంగజేబ్ (ఓజీ)షాకి స్నేహితుడు. దారూ బాల్యం కాలేజీలో చేరేంతవరకూ సామాన్యంగానే గడుస్తుంది. తరువాత అతని స్నేహితులు ఉన్నత విద్యకోసం అమెరికాకు వెళ్ళిపోతారు. ఓజీ తిరిగి అమెరికా నుండి వెనక్కి రావడంతో దారూ అభద్రతాభావం ఎక్కువవుతుంది. తనకి లేకపోయిన ప్రతీదీ ఓజీ వద్ద ఉంటుంది. పెజొరో కారు, మంచి ఉద్యోగం, అందమైన భార్య ముంతాజ్, కొడుకు. వాళ్ళవల్ల దారూ తిరిగి ఆ ధనిక వృత్తంలోకి అడుగుపెట్టి , బ్లాక్ లేబెల్ విస్కీలు తాగే పార్టీకి వెళ్ళిన మర్నాడే అతని ఉద్యోగం పోతుంది. అదే దారూ అంతానికి ప్రారంభం. ముంతాజ్ పట్ల అతనికున్న కాంక్షా, అతని హెరాయిన్ సేవనం హెచ్చవుతుండగా, అతని సామాజిక, ఆర్థిక హోదా దిగజారుతుంటాయి. ‘నేను ఆమె పట్ల ఆకర్షితుడైనట్టే ఆమె కూడా అయింది. ముంతాజ్ అనే కొవ్వొత్తి చుట్టూ తిరిగే చిమ్మటని నేను. ఆమె కూడా కొవ్వొత్తి అయిన నా చుట్టూ తిరిగే చిమ్మటే’ అంటాడు దారూ. నవల శీర్షిక– దారూ, ముంతాజ్ మధ్యన పెంపొందిన ప్రేమకి రూపకం. కొవ్వొత్తి చుట్టూ ప్రాణాంతకమైన మోహంతో తిరిగి, పొగగా మారి స్వీయ నాశనాన్ని ఎదురుకునే చిమ్మటని ఉటంకిస్తుంది. నవల్లో అధికభాగం దారూ దృష్టికోణంతోనే ఉన్నదైనప్పటికీ, అతనికి డ్రగ్స్ సరఫరా చేసే రిక్షా అతనితో సహా నవల్లో ఉన్న పాత్రలందరి ఆలోచనా ధోరణులూ పాఠకులకు పరిచయం చేయబడతాయి. తను ఎందుకు ‘మంచి/చెడ్డ వ్యక్తో’ అని ప్రతీ పాత్రా వివరిస్తుంది. లంచగొండి అవడం ఎంత అవసరమో అని ఓజీ, భర్త ఆప్త మిత్రుడితో ఎందుకు సంబంధం పెట్టుకోవలిసి వచ్చిందో అని ముంతాజ్, తను డ్రగ్స్ తీసుకోవడమేకాక అమ్మే దశకి కూడా ఎందుకు చేరుకున్నానో అని దారూ చెప్తారు. జీవితం గిరగిరా తిరుగుతూ చేతుల్లోంచి ఎలా జారిపోగలదో అర్థం అవుతుంది పాఠకులకి. తన్ని తాను లోకువ చేసుకుంటూ వినిపించే దారూ స్వగతాలకి అదనంగా, ఇతర గొంతులూ వినిపిస్తాయి. ‘డ్రమెటిక్ మొనొలోగ్’ అన్న ప్రక్రియని నవల్లో విరివిగా ఉపయోగించారు రచయిత. నవల పాకిస్తాన్ ధనిక వర్గపు దురాశా, అభద్రతనీ కనపరిచి– ధనిక వర్గానికీ, పేదవారికీ ఉన్న వ్యత్యాసాన్ని కూడా విశదపరుస్తుంది. పాత్రలని సాంప్రదాయికమైన నైతిక చట్రంలో చూపకుండా– వైరుధ్యం, వంచనతో నింపారు హమీద్. అమెరికన్ పదజాలాన్ని భారీగా ఉపయోగించారు. నవల్లో సమకాలీన పాకిస్తాన్ కనిపించినప్పుడు, ఇది నిజంగా ప్రపంచానికి తెలిసిన దేశమేనా! అన్న అనుమానం కలుగుతుంది. పుస్తకంలో ఉన్న ఏ పాత్రా అనవసరమయినది అనిపించదు. పాకిస్తానుకీ, ఇండియాకీ మధ్యనున్న పరమాణు సంబంధమైన పోటీ అన్న ప్రస్తావన పలుమార్లు కనిపిస్తుంది. నవల– మానవ ఘర్షణలు, ప్రేమ, ద్రోహం, ఓటమి, అసమానతల గురించినది. కథనంలో చమత్కారం, నిష్కల్మషతా కనబడతాయి. పుస్తకం బెట్టీ ట్రాస్క్ అవార్డు గెలుచుకుని, పెన్/హెమింగ్వే అవార్డుకి ఫైనలిస్టుగా ఎంచుకోబడింది. దీని ఆధారంగా, అజ్ఫర్ అలీ దర్శకత్వంతో తీసిన పాకిస్తానీ ఫిల్మ్ ‘దాయిరా’(వృత్తం) వచ్చింది. రాహుల్ బోస్‌తో తీయాలనుకున్న హిందీ సినిమా ఆర్థిక కారణాల వల్ల ఆగిపోయింది. యు. కృష్ణ వేణి -
ప్రముఖ రచయిత దేవరాజు రవి కన్నుమూత
ప్రముఖ కథకుడు, నవలాకారుడు, సినిమా సమీక్షకుడు అన్నిటికి మించి సాంఘిక సేవాకార్యకర్త శ్రీ దేవరాజు రవి మార్చి 2వతేదీ ఉదయం 7 గంటలకు హైదరాబాద్ మేడిపల్లిలో కన్నుమూశారు. దేవరాజు రవి 12 నవలలు, 200 పైగా కధలు, 1250 సినిమా సమీక్షలు ఇంకా పలు ఇతర వ్యాసాలూ రాశారు. 1959 లో ‘రామం’ అనే నవలతో ప్రారంభమైన ఆయన రచనా వ్యాసంగం చివరిరోజు వరకు కొనసాగింది. మూడు కవితా సంపుటాలు, రెండు కథా సంపుటాలు వెలువరించారు. సితార, శివరంజని, మేఘసందేశం, నంబర్ వన్ సినిమా పత్రికలలో ఆయన చేసిన సమీక్షలు విశేషంగా పాఠకుల్ని ఆకట్టుకోడమేకాక నిష్పక్షపాత సమీక్షలు కావడంతో సినీ వర్గాల ప్రశంసల్ని పొందాయి. ఆయన రచనల్ని సర్వేపల్లి రాధాకృష్ణన్, వి.వి. గిరి వంటి ప్రముఖులు మెచ్చుకున్నారు. ఆయన నంది అవార్డుల కమిటీలో రెండుసార్లు సభ్యులుగా పనిచేశారు. తెలుగులో తొలి డిటెక్టివ్ నవల ‘వాడే వీడు’ రచయితైన దేవరాజు వెంకట కృష్ణారావు వీరి తండ్రే. వీరి స్వస్థలం బరంపురం. దేవరాజు రవి సుప్రసిద్ధ సాంఘిక కార్యకర్త. కుష్టువ్యాధి నిర్మూలనకు విశేషంగా కృషిచేశారు. ఎంతోమంది రోగులకు స్వయంగా సేవ చేశారు. లెప్రసీ డాక్టర్ గా ఏరికోరి ఉద్యోగం చేసి, పదవి విరమణ అనంతరం సైతం ఆ సేవల్ని కొనసాగించారు. రేపు హైదరాబాద్ లో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. -
పిట్ట కొంచెం.. రాత ఘనం
సత్తాచాటిన 15 ఏళ్ల కైవల్యదాస్ ఆమె పుస్తకాన్ని ప్రచురించిన అమెజాన్ సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సీనియర్ జర్నలిస్టు దాసు కేశవరావు మనవరాలు పదిహేనేళ్ల కైవల్యదాస్ రచించిన ‘ఎన్‌చాంట్రెస్ ఆఫ్ ఎలెక్ట్రా’ ఎడిషన్స్‌ను అమెజాన్ ప్రచురించింది. 11 ఏళ్ల వయసులోనే అంటే 2011లో రాసిన ‘ఎన్‌చాంట్రెస్ ఆఫ్ ఎలెక్ట్రా’ నవలను ప్రచురణార్థం కొద్దినెలల క్రితం సబ్మిట్ చేసింది. అమెరికాలో పుట్టిన కైవల్యదాస్ బాల్యం ఎక్కువగా హైదరాబాద్‌లోనే గడిచింది. కొండాపూర్‌లోని చిరెక్ స్కూల్ మాజీ విద్యార్థి అయిన ఈమె నాలుగో తరగతి చదువుతున్నప్పుడే కాలిఫోర్నియాలోని కపర్టినోలో జరిగిన అంతర్జాతీయ వ్యాసరచన పోటీల్లో బహుమతి గెలుపొందింది. ముంబైలో ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న కైవల్యదాస్ మంచి వక్త. గాయకురాలు కూడా. పుస్తకాల పురుగు అయిన కైవల్యదాస్ చిన్న వయసులోనే నవల రచించి అందరి మన్ననలు పొందుతూ తాతకు తగ్గ మనవరాలు అనిపించుకుంటోంది.