రచయిత్రి సుందరి వెంకటరామన్
సుందరి వెంకటరామన్ తన 53వ ఏట ఇంగ్లిష్‌లో కాలక్షేప నవలలు రాయడం మొదలుపెట్టారు. తనే స్వయంగా వాటిని పబ్లిష్ చేయడం మొదలెట్టారు. నెలకు ఒక నవల రాయడం ఆమె ప్రత్యేకత. ఇప్పటికి 50 నవలలు పబ్లిష్ అయ్యాయి. వాటిలో కొన్ని బెస్ట్ సెల్లెర్స్‌గా నిలిచాయి. డబ్బు కూడా బాగా వస్తోంది. ‘వచ్చే సంవత్సరం నాకు అరవై నిండుతాయి. ఈలోపు అరవై నవలలు పూర్తి చేయాలనుకుంటున్నాను’ అంటున్నారు. ముంబైలో ఉండే ఈమెతో ఒక పది నిమిషాలు మాట్లాడటం కష్టమే. ఎందుకంటే నవల రాస్తుంటారు కదా బిజీగా.
మనకు తెలుగులో యద్దనపూడి సులోచనారాణి, యండమూరి, మల్లాది లాంటి పాపులర్ రచయిత లు తెలుసు. కాని సుందరి వెంకటరామన్ వారిని మించినట్టుగా ఉన్నారు. వారి కంటే భిన్నమైన నేపథ్యం ఉన్నట్టుగా కనిపిస్తారు. ఎందుకంటే ఈమె మిగిలిన వారిలా చిన్న వయసు నుంచి రచనలు చేయడం మొదలు పెట్టలేదు. పిల్లలు ఎదిగొచ్చిన తర్వాత 2001లో నవలలు రాద్దామని ప్రయత్నించారు. కాని ఆ రచనలను పబ్లిషర్లు రిజెక్ట్ చేశారు. దాంతో ఊరికే ఉండిపోయి తిరిగి 2014లో తన 53వ ఏట నుంచి తనే తన నవలలు ప్రచురించుకోవడం మొదలుపెట్టారు. ఆరేళ్లలో యాభై నవలలు రాశారు. అంటే సగటున నెలకు ఒక నవల రాసినట్టు. ఇలాంటి రికార్డు ఉన్న భారతీయ రచయిత్రులు చాలా అరుదు.
ఉద్యోగపు విసుగు నుంచి
సుందరి వెంకటరామన్‌ది చెన్నై. చిన్నప్పటి నుంచి బాలల కథలు చదివి ఆ లోకంలో విహరించేవారామె. టీనేజ్‌లో ఉండగా ఇంగ్లిష్‌లో కాలక్షేపంగా, రొమాంటిక్ సాహిత్యంగా ఉధృతంగా వచ్చిన మిల్స్ అండ్ బూన్స్ నవలలను విపరీతంగా చదివేవారు. ఏది చదివినా ముగింపు వాక్యం ‘ఆ తర్వాత వారు కలకాలం సుఖ సంతోషాలతో వర్థిల్లారు’ అని ఉన్న పుస్తకాలే చదివేవారు. ‘సుఖాంతమే అవ్వాలి పుస్తకాలు’ అంటారామె. ఆ తర్వాత పెళ్లి, పిల్లల పెంపకం, ముంబైలో స్థిరపడటంలో పడి నలభై ఏళ్లు వచ్చేశాయి. ఆమె అంతవరకూ చేస్తున్న స్కూల్ అడ్మిన్ ఉద్యోగానికి రాజీనామా చేశారు.
ఏదో అనిశ్చితి ఉండేది మనసులో ఆ సమయంలో. ఒకరోజు ఈవెనింగ్ వాక్ నుంచి ఇంటికొచ్చి కొన్ని కాగితాలు తీసుకొని రాయడం మొదలుపెట్టారు. అంతవరకూ చదివి చదివి ఉన్న పుస్తకాల ఫలితంగా ఏదో ఒక కథ ఆమె మనసులో గూడు కట్టుకొని అది ఒక్కసారిగా బయట కు వచ్చినట్టుగా వచ్చేసింది. ఆమె రాస్తూ వెళ్లారు. మొత్తం 92 వేల పదాల నవల రాశారు. దాని పేరు ‘ది మల్హోత్రా బ్రైడ్’. ఎంతో ఆశతో దానిని తీసుకుని ఒక పబ్లిషర్ దగ్గరకు వెళ్లారు. కాని ఆ పబ్లిషర్ దానిని చదివి పెదవి విరిచాడు. దానికి కారణం అందులో రొమాన్స్, స్త్రీ పురుష సంబంధాలు ఉండటం ‘ఈ సబ్జెక్ట్ ఇప్పుడు చదవరు’ అని అతను అన్నాడు.
సుందరి నిరాశగా ఇంటికి చేరుకున్నారు. భర్త ఆమెతో ‘నిరాశ పడకు. రాస్తూ ఉండు’ అని ప్రోత్సహించాడు. అ³్పుడు ఆమె తిరిగి ‘ముంబై మిర్రర్’ పత్రికలో ఉద్యోగంలో చేరారు. అక్కడ ఐదేళ్లు ఆ పత్రికకు సంబంధించిన వెబ్‌సైట్ల కోసం పని చేశారు. మళ్లీ విసుగు వచ్చింది. 53 ఏళ్లు వచ్చేశాయి... ఇంకా నేను రైటర్‌గా లోకానికి తెలియలేదు అనుకుని మళ్లీ ఉద్యోగం మానేశారు. ఇప్పుడు నిజంగానే తన రైటింగ్ కెరీర్‌ని సీరియస్‌గా తీసుకున్నారామె.
సెల్ఫ్ పబ్లిషర్‌గా
ఆ సమయంలో ఆమెకు అప్పటికే సెల్ఫ్ పబ్లిషింగ్‌కు అవకాశం కల్పిస్తూ పాఠకాదరణ పొందిన అమేజాన్ ‘కిండిల్’ ఈ–రీడర్ ఒక ఆశాకిరణంలా అనిపించింది. తను రాసిన నవలలను ఈ–బుక్స్‌గా పబ్లిష్ చేయాలనుకున్నారామె. 2014 లో తన తొలి ఈ నవలగా ‘ది మల్హోత్రా బ్రైడ్’ను విడుదల చేశారు. ఆ తర్వాత ఒక్కో నవలా జత చేస్తూ వెళ్లారు. సంవత్సరం తిరిగే సరికే ఇటు ఈ–బుక్స్‌తోపాటు పేపర్‌బ్యాక్స్ ప్రచురించడానికి పబ్లిషర్లు ముందుకు రాసాగారు. ‘ది మెడ్రాస్ ఎఫైర్’ అనే నవల ఆమె తొలి ప్రచురణ నవలగా వచ్చింది. ఇప్పుడు ఆమె నవలలు ఈ బుక్స్‌గా దొరుకుతున్నాయి. కోరిన పాఠకులకు పేపర్‌బ్యాక్స్‌గా కూడా దొరుకుతున్నాయి. అమెజాన్ ద్వారా అమ్ముడుపోయే కాలక్షేప నవలల్లో టాప్ 100లో సుందరి వెంకటరామన్ నవలలకూ స్థానం. యు.కె, కెనెడా, ఆస్ట్రేలియాల్లో కూడా ఆమె నవలలు బెస్ట్‌సెల్లర్స్‌గా నిలవడం విశేషం.
రొమాన్సే వస్తువు
‘రొమాన్స్’ అనే మాటకు ‘ప్రేమకు సంబంధించిన ఉత్సుకత’ అనే డిక్షనరీ అర్థం చెబుతారు సుందరి వెంకటరామన్. ‘ఎరోటిజమ్’ అనే మాటలో ‘లైంగిక వాంఛ’ అర్థాన్ని చూపుతారు. స్త్రీ, పురుషుల సంబంధాల్లో రొమాన్స్ ఉంటుంది... ఎరోటిజమూ ఉంటాయి... ఇవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి.. నా నవలల్లో అదే ప్రధాన వస్తువు అంటారామె. ‘భారతదేశంలో రొమాంటిక్ సబ్జెక్ట్స్‌ను ఇష్టపడేవారు ముందు నుంచి ఉన్నారు. దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే వంటి సినిమాలు అంత హిట్ కావడానికి కారణం మనవాళ్ల అలాంటి కంటెంట్‌ను ఇష్టపడటమే’ అంటారామె. ఆమె నవలల పేర్లు కూడా డెబ్బైల నాటి పల్ప్ ఫిక్షన్‌ను పోలినట్టు ఉంటాయి. ‘ది సీక్రెట్ హజ్బెండ్’, ‘ది కాసనోవాస్ వైఫ్’, ‘రోజ్ గార్డెన్’... ఇలా. వాటికి విస్తృతంగా పాఠకులున్నారు. ‘ప్రతిదానికీ పాఠకులుంటారు’ అంటారామె. ‘నా నవలలు చదివితే ఆ ఆకర్షణల వల్ల వచ్చే సమస్య ల నుంచి కూడా బయటపడొచ్చు’ అంటారు.
రచనలు రెండు రకాలు. సమాజ హితాన్ని కోరేవి. సమాజానికి కాలక్షేపం అందించేవి. ఏది ఆసక్తి ఉంటే అందులో రాణించవచ్చు. స్వయంగా పబ్లిష్ చేసి గుర్తింపు పొందవచ్చు. మనసులో ఉన్న భావాలను వ్యక్తపరచవచ్చు. ఏ వయసులో అయినా కొత్త ప్రయాణం మొదలెట్టొచ్చు అనడానికి సుందరి వెంకటరామన్ ఒక ఉదాహరణ.
అతి వేగంగా రాసే రచయిత్రి
సుందరి వెంకటరామన్ అతి వేగంగా రాస్తారు. ఒక్కో నవల సగటున 35 రోజుల్లో పూర్తి చేస్తారు. భూమి ఆకాశాల మధ్య ఏ వస్తువునైనా తీసుకొని కథ అల్లగలరామె. 2016లో పన్నెండు నెలలకు పన్నెండు నవలలు పబ్లిష్ చేశారామె ఈబుక్స్‌గా. కవర్ డిజైన్ ప్రూఫ్ తనే చూస్తారు. మార్కెటింగ్ తనే చేస్తారు. ప్రచారం కూడా.
– సాక్షి ఫ్యామిలీ
Comments
Please login to add a commentAdd a comment