పిట్ట కొంచెం.. రాత ఘనం
సత్తాచాటిన 15 ఏళ్ల కైవల్యదాస్
ఆమె పుస్తకాన్ని ప్రచురించిన అమెజాన్
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సీనియర్ జర్నలిస్టు దాసు కేశవరావు మనవరాలు పదిహేనేళ్ల కైవల్యదాస్ రచించిన ‘ఎన్‌చాంట్రెస్ ఆఫ్ ఎలెక్ట్రా’ ఎడిషన్స్‌ను అమెజాన్ ప్రచురించింది. 11 ఏళ్ల వయసులోనే అంటే 2011లో రాసిన ‘ఎన్‌చాంట్రెస్ ఆఫ్ ఎలెక్ట్రా’ నవలను ప్రచురణార్థం కొద్దినెలల క్రితం సబ్‌మిట్ చేసింది. అమెరికాలో పుట్టిన కైవల్యదాస్ బాల్యం ఎక్కువగా హైదరాబాద్‌లోనే గడిచింది.
కొండాపూర్‌లోని చిరెక్ స్కూల్ మాజీ విద్యార్థి అయిన ఈమె నాలుగో తరగతి చదువుతున్నప్పుడే కాలిఫోర్నియాలోని కపర్‌టినోలో జరిగిన అంతర్జాతీయ వ్యాసరచన పోటీల్లో బహుమతి గెలుపొందింది. ముంబైలో ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న కైవల్యదాస్ మంచి వక్త. గాయకురాలు కూడా. పుస్తకాల పురుగు అయిన కైవల్యదాస్ చిన్న వయసులోనే నవల రచించి అందరి మన్ననలు పొందుతూ తాతకు తగ్గ మనవరాలు అనిపించుకుంటోంది.