గ్లోబల్... నోబెల్
యువత 2014
శాంతిస్థాపన యత్నానికి అత్యున్నత పురస్కారం.. అపారమైన ప్రతిభకు అవధుల్లేని అవకాశాలు.. ఎవరెస్ట్ స్థాయి సాహసాలు.. ఆటల్లోనూ అబ్బురపరిచే విన్యాసాలు.. మొత్తంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో యువతకు కలిసొచ్చిన సంవత్సరం 2014. ఈ ఏడాదిలో అనేక యువకిరణాలు ఉదయించాయి. వ్యాపార, క్రీడ, సామాజిక, ఆర్థిక రంగాల్లో అనేక మంది యువతీయుకులు తమ ప్రతిభాపాటవాలను చాటారు.
నోబెల్ బహుమతి...
ఈ బహుమతి స్థాయిని బట్టి, తలపండిన వారికే దక్కుతుందనుకోవడం చాలా సహజమైన అభిప్రాయం. అయితే అలాంటి అంచనాలకు భిన్నంగా ఒక 17 యేళ్ల యువతికి నోబెల్ బహుమతి దక్కింది. అది కూడా శాంతి పరిరక్షణకు గానూ.. దక్కిన నోబెల్ శాంతి బహుమానం. ఈ ఏడాది యువతకు సంబంధించి ప్రముఖంగా ప్రస్తావించుకోవాల్సిన విషయం ఇది. యువ శక్తి ఉద్యోగం సంపాదించుకొనేంత స్థాయికో, కొత్త ఆవిష్కరణ చేపట్టడానికో పరిమితం కాదు... టీనేజ్‌లోనే నోబెల్‌ను సాధించుకొనే స్థాయి వరకూ ఎదిగిందనే సందేశాన్ని ఇచ్చింది పాకిస్తాన్ యువతి మలాలాకు దక్కిన ఈ ఖ్యాతి. మలాలానే ఈ ఏడాదికి ‘యూత్ ఆఫ్ ది ఇయర్’ అని చెప్పవచ్చు.
ఎవరెస్ట్‌నూ అధిరోహించేశారు!
ఈ ఏడాది భారతీయ యువతకు దక్కిన ఖ్యాతి ఇది. తెలుగువాళ్లు అయిన మలావత్ పూర్ణ, సద్దనపల్లి ఆనంద్‌లు ఎవరెస్ట్‌ను అధిరోహించి ఆ శిఖర స్థాయి పేరు ప్రఖ్యాతులను సంపాదించుకొన్నారు. టీనేజర్ పూర్ణ ఎవరెస్ట్‌ను అధిరోహించిన అత్యంత పిన్నవయస్కురాలు కూడా. వీరి విజయానికి తెలుగుగడ్డ నీరాజనాలు పల్కింది
జీతాలు కోట్లకు చేరాయి!
ఐదంకెల జీతం ఇన్ని రోజులకూ గొప్ప. అయితే ఇప్పుడు ఐదుకు మరో రెండంకెలను జోడించి ఆ మొత్తాన్ని భారతీయ విద్యార్థులకు ప్యాకేజీలుగా ఇవ్వడానికి ముందుకొచ్చాయి అనేక కంపెనీలు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో విద్యాభ్యాసం చేస్తున్న అనేక మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్‌కు చదువు పూర్తి కాకుండానే ఇలాంటి ఆఫర్లు వచ్చాయి. గూగుల్ వంటి దిగ్గజాలు భారతీయ విశ్వవిద్యాలయాల్లో నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలలో సంచలనాలే నమోదయ్యాయి. వార్షిక వేతనం కోటి, కోటిన్నర రూపాయల స్థాయిలో ఉండే ఉద్యోగాలు మనవాళ్లను పలకరించాయి.
కోటి రూపాయల వేతనం!
2014 మెమరబుల్ ఇయర్.. ఇదే ఏడాది స్టూడెంట్స్ ఎక్సేంజ్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఒక సెమిస్టర్ సింగపూర్‌లో చదివాను. సామ్‌సంగ్‌లో ఇంటర్న్‌షిప్ చేయడం మంచి అనుభవాన్ని మిగిల్చింది. అందులోనే ఉద్యోగం రావడం, అదీ కోటి రూపాయల భారీ వేతనంతో ఉద్యోగం రావడం సంతోషంగా ఉంది. ఈ ఏడాదితో నా విద్యార్థి జీవితం ముగుస్తుంది. 2015 నుంచి బాధ్యత గలిగిన ఉద్యోగిగా మారాలి. అయితే నా జీవితంలో ఇది ఒక మైలురాయి అని చెప్పడం కష్టం. ప్రతిదీ ఒక లెర్నింగ్ ఎక్స్‌పీరియెన్స్ అనే చెప్పాలి. ఐఐటిలో సీటు కోసం కోచింగ్ దగ్గర నుంచి ఐఐటి క్యాంపస్‌లో చదువు అన్నీ ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్పించాయి.
- ఇమ్మడి పృథ్వితేజ్, ముంబయి ఐఐటి విద్యార్థి