international level
-
డాక్టరమ్మ శిక్షణ చక్ దే..!
చక్‌దే ఇండియాలో మహిళా హాకీ జట్టును తీర్చిదిద్దుతాడు షారుక్ ఖాన్ . నిజామాబాద్‌లో ఫుట్‌బాల్‌లో బాలికలను మెరికల్లా తీర్చిదిద్దుతున్నారు డాక్టర్ కవితారెడ్డి. ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఇక్కడి నుంచి సెలెక్ట్ అవుతున్న బాలికలు ఇంటర్నేషనల్ స్థాయిలో తెలంగాణ పేరును నిలబెట్టేలా చేయడమే లక్ష్యం అంటున్నారామె. కవితారెడ్డి ఈ క్రీడా శిక్షణ ఎందుకు ప్రారంభించారో తెలిపే కథనం.‘సహాయం చేసే వ్యక్తులు మన జీవితాల్లో ఉంటే సహాయం చేయడం మనక్కూడా అలవడుతుంది’ అంటారు డాక్టర్ శీలం కవితా రెడ్డి. నిజామాబాద్‌లో గైనకాలజిస్ట్‌గా పేరొందిన ఈ డాక్టర్ తన సేవా కార్యక్రమాలతో కూడా అంతే గౌరవాన్ని పొందుతున్నారు. ‘మా తాతగారిది నల్లగొండ. పేదవాళ్లకు ఆయన సహాయం చేయడం, వాళ్లకు ఫీజులు కట్టి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో చదివించడం నేను బాల్యం నుంచి గమనించేదాన్ని. సాయం చేయడంలో సంతృప్తి నాకు అర్థమైంది. నేను డాక్టర్‌గా స్థిరపడ్డాక ‘డాక్టర్ కవితా రెడ్డి ఫౌండేషన్’ స్థాపించి స్త్రీల, బాలికల ఆరోగ్యం కోసం పని చేయాలని నిశ్చయించుకున్నాను. పేద మహిళల ఆరోగ్య సమస్యలను పట్టించుకోవడం అవసరం అనే భావనతో ఈ పని మొదలుపెట్టాను’ అన్నారామె.ఫుట్‌బాల్ మేచ్ చూసి...‘నిజామాబాద్ పట్టణంలో ఒకసారి బాలికల ఫుట్‌బాల్ టోర్నమెంట్ జరుగుతుంటే నన్ను అతిథిగా ఆహ్వానించారు. అక్కడ ΄ాల్గొన్న అమ్మాయిల క్రీడానైపుణ్యం చూసి ఆశ్చర్య΄ోయాను. ఎంతటి పేదరికంలో ఉన్నా సరైన ΄ోషణ, డ్రస్, షూస్ లేక΄ోయినా వారు గ్రౌండ్లో చిరుతల్లా పరిగెడుతూ ఆడారు. అలాంటి పిల్లలకు సరైన శిక్షణ ఇస్తే మరింతగా దూసుకు΄ోతారని భావించి 2019లో డాక్టర్ కవితారెడ్డి ఫుట్‌బాల్ అకాడెమీ స్థాపించాను. నిజామాబాద్ జిల్లాలోని గ్రామీణప్రాంతం బాలికలకు హాస్టల్ ఏర్పాటు చేసి ఫుట్‌బాల్‌లో శిక్షణ ఇప్పిస్తున్నాను. పట్టణంలో ఉన్న బాలికలు రోజూ వచ్చి ఉచిత శిక్షణ పొందితే బయటి ఊళ్ల అమ్మాయిలు హాస్టల్లో ఉంటూ శిక్షణ పొందుతున్నారు’ అని తెలి΄ారామె.అదే ప్రత్యేకం...కవితారెడ్డి తన అకాడెమీని ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్, తెలంగాణ ఫుట్‌బాల్ అసోసియేషన్‌కు అనుబంధంగా రిజిస్టర్ చేశారు. తెలంగాణ లో మొత్తం 8 ఫుట్‌బాల్ క్లబ్బులు ఉండగా మహిళా కార్యదర్శి ఉన్న క్లబ్ మాత్రం ఇదొక్కటే కావడం గమనార్హం. ప్రస్తుతం డాక్టర్ కవితారెడ్డి ఫుట్‌బాల్ అకాడమీలోని 41 మంది బాలికలు కోచ్ గొట్టి΄ాటి నాగరాజు ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్నారు. గతంలో నాగరాజు శిక్షణలోనే అంతర్జాతీయ క్రీడాకారిణి సౌమ్య తయారైంది. శిక్షణ పొందుతున్న బాలికల్లో వివిధ జిల్లాలకు చెందిన ఇంటర్, డిగ్రీ చదువుతున్న గ్రామీణప్రాంతాల వారున్నారు. వీరందరికీ కవితారెడ్డి తన సొంత ఖర్చుతోనే వసతి, ఆహారం, డ్రెస్సులు, వైద్య సౌకర్యం కల్పిస్తున్నారు. ఇతరప్రాంతాల్లో టోర్నమెంట్లకు వెళ్లాల్సి వస్తే అవసరమైన సామగ్రి, ప్రయాణ ఖర్చులన్నీ డాక్టరమ్మే భరిస్తున్నారు. ఈ అకాడమీ నుంచి ఇప్పటివరకు 9 మంది బాలికలు పశ్చిమబెంగాల్, కర్ణాటక, జార్ఖండ్ రాష్ట్రాల్లో నేషనల్స్ ఆడారు. మరో ఐదుగురు ఇతర రాష్ట్రాల క్లబ్‌లకు ఆడారు. ఖేలో ఇండియా కార్యక్రమం కింద అండర్–13, అండర్–15లో 14మంది ఆడారు. ఇక తెలంగాణ ఉమెన్స్ లీగ్‌కు 22 మంది ఈ అకాడమీ బాలికలు ఆడనున్నారు. మిషన్ 2027లో భారత జట్టుకు ఎంపికై అంతర్జాతీయ ΄ోటీలకు వెళ్లేలా బాలికలు శిక్షణ పొందుతున్నారు. మరోవైపు బాక్సింగ్ క్రీడాకారులకు సైతం ఇప్పటివరకు అవసరమైనప్పుడల్లా కిట్లు కొనిస్తున్నారు.హెల్త్ కార్డ్లుడాక్టర్ కవితారెడ్డి తన హెల్త్ ఫౌండేషన్ ద్వారా 2017 నుంచి పేద గర్భిణులకు ఉచితంగా శస్త్రచికిత్సలు చేస్తూ వస్తున్నారు. నాలుగు వేల మందికి హెల్త్ కార్డులు ఇచ్చారు. ఈ కార్డ్ ఉన్నవారికి తన ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలూ కల్పిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ ΄ాఠశాలల్లో 8, 9, 10 తరగతుల విద్యార్ధినులకు అనీమియా వైద్యపరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నారు. సేవాకార్యక్రమాల విషయంలో తనను భర్త రవీందర్‌రెడ్డి, కుమారుడు డాక్టర్ పరీక్షిత్ సాయినాథ్‌రెడ్డి అన్నిరకాలుగా ్ర΄ోత్సహిస్తున్నారని కవితారెడ్డి చెబుతున్నారు.– తుమాటి భద్రారెడ్డి, సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ -
ఎలక్టోరల్ బాండ్లు అంతర్జాతీయ రాకెట్: రాహుల్
థానే: బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకం ముమ్మాటికీ అంతర్జాతీయ స్థాయి బలవంతపు వసూళ్ల రాకెట్ అని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. రాజకీయ పారీ్టలను చీల్చడానికి, రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వాలను పడగొట్టడానికి ఈ పథకాన్ని వాడుకున్నారని మండిపడ్డారు. మహరాష్ట్రలోని జాంభాలీ నాకాలో శనివారం భారత్ జోడో న్యాయ్ యాత్రలో రాహుల్ ప్రసంగించారు. మన దేశంలో ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, నిరసన తెలిపినా ఈడీ, సీబీఐ, ఐటీ శాఖ వంటివి వెంటనే దాడులకు దిగుతున్నాయని విమర్శించారు. మహారాష్ట్రలో ఎన్సీపీ, శివసేన పారీ్టలు రెండుగా చీలడానికి కారణం ఏమిటో చెప్పాలని బీజేపీని ప్రశ్నించారు. దేశ జనాభాలో 80 శాతం ఉన్న బీసీలు, దళితులు, ఆదివాసీలు, మైనారీ్టలు, పేదలకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో తగిన ప్రాతినిధ్యం లేదని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట వేడుకకు కేవలం సంపన్న పారిశ్రామికవేత్తలను, సినిమా నటులను మాత్రమే ఆహా్వనించారని, పేదలను పక్కనపెట్టారని మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆదివాసీ మహిళ అయినందుకే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ఆహా్వనించలేదని ఆరోపించారు. కాంగ్రెస్‌పై బీజేపీ సర్జికల్ స్ట్రైక్: జైరాం లోక్‌సభ ఎన్నికల ముందు బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడం ద్వారా తమపై బీజేపీ ప్రభుత్వం సర్జికల్ స్రైక్‌కు దిగిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ పేర్కొన్నారు. దాంతో పార్టీ ఆర్థికంగా శక్తిహీనంగా మారిందని చెప్పారు. ఎన్నికల ప్రచారానికి కూడా ఇప్పుడు తమ వద్ద డబ్బు లేదని అన్నారు. బాండ్ల ముసుగులో బీజేపీ చట్టవిరుద్ధంగా నిధులు కొల్లగొట్టిందని ఆరోపించారు. -
చిప్‌ల తయారీలో అంతర్జాతీయ స్థాయికి భారత్
న్యూఢిల్లీ: వచ్చే అయిదేళ్లలో సెమీ కండక్టర్ల తయారీలో భారత్ అంతర్జాతీయ స్థాయికి చేరగలదని కేంద్ర ఐటీ, టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. చిప్‌ల విభాగంలో తైవాన్ ఆధిపత్యాన్ని తగ్గించే దిశగా దేశీయంగా కొత్త ఫ్యాబ్రికేషన్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాలు ఇందుకు దోహదపడగలవని ఆయన పేర్కొన్నారు. భారత్‌లో ప్లాంట్లు పెట్టేందుకు, సంబంధిత రంగాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు తయారీ సంస్థలు ముందుకొచ్చేలా ప్రభుత్వ విధానాలు ఆకర్షిస్తున్నాయని మంత్రి చెప్పారు. చైనాకి ప్రత్యామ్నాయంగా, ప్రజాస్వామ్య టెక్నాలజీ హబ్‌గా భారత్ నిలుస్తోందని ఆయన తెలిపారు. ‘భారత్‌కి ఎప్పుడు వెళ్లాలి.. అసలు వెళ్లొచ్చా అని గతంలో అంతా అలోచించే వారు. కానీ ఇప్పుడు వీలైనంత ముందుగా వెళ్లాలి అనుకుంటున్నారు. అటువంటి మార్పు కనిపిస్తోంది. ప్రతి పెద్ద సంస్థ భారత్‌లో పెట్టుబడులు పెట్టే ఆలోచనల్లో ఉంది‘ అని పేర్కొన్నారు. కేంద్రం ఇటీవలే దాదాపు రూ. 1.26 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే మూడు సెమీకండక్టర్ ప్లాంట్ల ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. వీటిలో టాటా గ్రూప్ తలపెట్టిన మెగా ఫ్యాబ్ కూడా ఉంది. -
అంతర్జాతీయ స్థాయిలో విశాఖ రైల్వేస్టేషన్ అభివృద్ధి
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): విశాఖపట్నం రైల్వేస్టేషన్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని కేంద్ర రైల్వే, జౌళి శాఖల సహాయ మంత్రి దర్శనా జర్దోష్ తెలిపారు. వాల్తేర్ డివిజన్ డీఆర్ఎం సౌరబ్ ప్రసాద్‌తో కలిసి శనివారం విశాఖపట్నం రైల్వేస్టేషన్‌ను ఆమె సందర్శించారు. విశాఖ రైల్వేస్టేషన్ దేశంలో రద్దీ స్టేషన్లలో ఒకటని, నిత్యం వేలాదిమంది రాకపోకలు సాగిస్తుంటారని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో దీన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు స్టేషన్ రీడెవలప్మెంట్ ప్రాజెక్టును ప్రధాని మోదీ ప్రారంభించారని చెప్పారు. ఈ పనులపై గతిశక్తి, వాల్తేర్ డివిజన్ అధికారులతో దర్శనా జర్దోష్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జరుగుతున్న పనుల గురించి అధికారులు ఆమెకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తర్వాత ఆమె ఒకటో నంబర్ గేట్ వైపు ప్రారంభమైన మల్టీ లెవెల్ కార్ పార్కింగ్‌ను సందర్శించారు. రైల్వేస్టేషన్, స్టేషన్ రీ డెవలప్మెంట్ ప్రాజెక్టు పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ నిషేధంలో భాగంగా స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న పారిశుధ్య కారి్మకులకు హెల్త్ కిట్స్‌ను అందజేశారు. అనంతరం ఏటికొప్పాక బొమ్మలతో వన్ స్టేషన్–వన్ ప్రొడక్ట్ పథకం కింద ఏర్పాటు చేసిన స్టాల్‌ను పరిశీలించారు. అమ్మకాలు, స్టేషన్ అధికారుల ప్రోత్సాహం, సహకారం గురించి స్టాల్ యజమానితో మాట్లాడారు. 24/7 రైల్ కోచ్ రెస్టారెంట్ ప్రారంభం రైల్వేస్టేషన్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన 24/7 రైల్ కోచ్ రెస్టారెంట్‌ను మంత్రి దర్శనా జర్దోష్ ప్రారంభించారు. రైల్వే ప్రయాణికులకు, నగర వాసులకు ఈ రెస్టారెంట్ 24 గంటలు అందుబాటులో ఉంటుంది. వాల్తేర్ డివిజన్ అధికారుల, సిబ్బంది పనితీరును మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు. -
మరో అద్భుతం ‘యశోభూమి’
ప్రాచీన కట్టడాలు, దర్శనీయ క్షేత్రాలకు నిలయమైన దేశ రాజధాని ఢిల్లీ కీర్తికిరీటంలో మరో మణిహారం చేరబోతోంది. చూపు తిప్పుకోనివ్వని సుందరమైన, విశాలమైన ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సెంటర్(ఐఐసీసీ) యశోభూమి ప్రారంభానికి సిద్ధమైంది. దేశంలో సభలు, సమావేశాలు, ఎగ్జిబిషన్ల కోసం ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్న ప్రధానమంత్రి సంకల్పం మేరకు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో యశోభూమిని అత్యాధునిక పరిజ్ఞానం, అద్భుతమైన వసతులతో నిర్మించింది. ప్రధాన ఆడిటోరియం, కన్వెన్షన్ హాళ్లు, బాల్రూమ్, మీటింగ్ రూమ్‌లతో యశోభూమి సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్లలో ఒకటిగా నిలువనుంది. ఎనిమిది అంతస్తుల యశోభూమిలో మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్, ఎగ్జిబిషన్స్(ఎంఐసీఈ) సదుపాయాలన్నీ ఉన్నాయి. ఐఐసీసీ మొదటి దశను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 17వ తేదీన స్వయంగా ప్రారంభించనున్నారు. అలాగే జాతికి అంకితం ఇస్తారు. విశేషాలివీ.. 1. యశోభూమి కన్వెన్షన్ సెంటర్ ప్రాజెక్టు ఏరియా 8.9 లక్షల చదరపు మీటర్లు, బిల్ట్–అప్ ఏరియా 1.8 లక్షల చదరపు మీటర్లు. కన్వెన్షన్ సెంటర్‌ను 73,000 చదరపు మీటర్లకుపైగా వైశాల్యంలో నిర్మించారు. 2. మొత్తం ప్రాజెక్టులో ప్రధాన ఆడిటోరియంతో సహా మొత్తం 15 కన్వెన్షన్ హాళ్లు, ఒక బాల్రూమ్, 13 మీటింగ్ రూమ్‌లు ఉన్నాయి. 3. అన్ని గదుల్లో కలిపి ఏకకాలంలో 11,000 మంది ఆసీనులు కావొచ్చు. 4. 6,000 మంది అతిథులు సౌకర్యవంతంగా కూర్చునేలా ప్రధాన ఆడిటోరియం(ప్లీనరీ హాల్) నిర్మించారు. ఆటోమేటెడ్ సీటింగ్ సిస్టమ్ ఉంది. 5. అందమైన సీలింగ్‌తో ఆకట్టుకుంటున్న బాల్రూమ్ సీటింగ్ సామర్థ్యం 2,500. ఇక్కడే మరో 500 మంది కోసం ఓపెన్ ఏరియా ఉంది. 6. అలాగే 1.07 లక్షల చదరపు మీటర్ల వైశాల్యంలో ఎగ్జిబిషన్ హాళ్లు ఉన్నాయి. 7. మీడియా రూమ్‌లు, వీవీఐపీ గదులు, విజిటర్ ఇన్ఫర్మేషన్ సెంటర్, టికెటింగ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. 8. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ఇక్కడ వర్షం నీటిని, మురుగు నీటిని శుద్ధి చేసుకొని మళ్లీ ఉపయోగించుకునే ఏర్పాట్లున్నాయి. 9. సౌర విద్యుత్ కోసం రూప్‌టాప్ సోలార్ ప్యానళ్లు బిగించారు. ఈ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణంలో భారతీయ సంస్కృతి, కళలకు పెద్దపీట వేశారు. 10. యశోభూమి కన్వెన్షన్ సెంటర్ భారత పరిశ్రమల సమాఖ్యకు చెందిన ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్(ఐజీబీసీ) నుంచి గ్రీన్ సిటీస్ ప్లాటినమ్ సరి్టఫికేషన్ పొందింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సైబర్ సెక్యూరిటీకి సమిష్టి కృషి అవసరం
న్యూఢిల్లీ: సైబర్ దాడుల ముప్పులను దీటుగా ఎదుర్కొనేందుకు సైబర్‌సెక్యూరిటీ విషయంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. జీ20 సభ్య దేశాలన్నీ కలిసికట్టుగా.. సవాళ్లను అధ్యయనం చేసి, పరిష్కార సాధనాలను కనుగొనడంపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. యూపీఐ, ఓఎన్డీసీ, కోవిన్ వంటి భారీ స్థాయి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఊతంతో టెక్నాలజీ ప్రయోజనాలను సామాన్యులకు కూడా భారత్ అందజేయగలుగుతోందని ఆయన పేర్కొన్నారు. ‘సైబర్‌సెక్యూరిటీ అనేది అందరికీ ఉమ్మడి సవాలే. అది చాలా సంక్లిష్టమైనది దానికి సరిహద్దులేమీ లేవు. టెక్నాలజీ నిత్యం రూపాంతరం చెందుతోంది. ఇవాళ ఒక సమస్యకు పరిష్కారం కనుగొంటే.. రేపు మరో కొత్త సమస్య పుట్టుకొస్తోంది. కృత్రిమ మేథ (ఏఐ)తో సంక్లిష్టత మరిన్ని రెట్లు పెరుగుతుంది‘ అని మంత్రి వివరించారు. ఈ నేపథ్యంలో అందరి ప్రయోజనాల కోసం కొత్త పరిష్కార సాధనాలను రూపొందించడం, పరస్పరం పంచుకోవడం అవసరమని ఆయన చెప్పారు. తాము అభివృద్ధి చేసిన కొన్ని సైబర్‌సెక్యూరిటీ సాధనాలను, వాటిపై ఆసక్తి గల దేశాలతో పంచుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని వైష్ణవ్ తెలిపారు. -
టీచర్ @ ఎకో స్మార్ట్ కుండీ
లక్ష్మీదేవికి పాఠాలూ ప్రయోగాలే ఊపిరి. క్లాసులో పాఠంతోపాటు ప్రయోగమూ చేయిస్తారు. మొక్క కోసం నేలకు హాని తలపెడితే ఎలా? అందుకే నేలకు మేలు చేసే పూల కుండీ చేశారు. ఆ.. ఎకో స్మార్ట్ పూల కుండీ... అంతర్జాతీయ సదస్సులో ప్రదర్శితం కానుంది. ‘టీచర్ ఉద్యోగం ఒక వరం. దేవుడిచ్చిన ఈ అవకాశానికి నూటికి నూరు పాళ్లు న్యాయం చేయాలనేది నా ఆశయం’ అన్నారు కొల్లాటి లక్ష్మీదేవి. ఆమె పుట్టింది, పెరిగింది మచిలీ పట్నంలో. ఎమ్ఎస్సీ, బీఈడీ చేసి 1995లో డీఎస్సీ సెలెక్షన్లో ఉద్యోగం తెచ్చుకున్నారు. తొలి పోస్టింగ్ కృష్ణాజిల్లా, సుల్తానగరంలో. అప్పటి నుంచి మొదలైందామె విజ్ఞాన దానయజ్ఞం. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పాఠ్యాంశాల్లో ఉన్న విషయాలను ప్రయోగాత్మకంగా చేసి చూపించడంతో మొదలైందా యజ్ఞం. పదేళ్ల తర్వాత పెడన మండలం చెన్నూరు ఈస్ట్‌లో మరో స్కూల్‌కి హెడ్మాస్టర్గా బదిలీ. ఆ సంతోషం ఆ స్కూల్‌కి వెళ్లే వరకే. పదిహేనుమంది పిల్లలున్న స్కూల్ అది. అలాగే వదిలేస్తే ఇద్దరు టీచర్ల స్కూల్లో ఒక పోస్ట్ రద్దయ్యే పరిస్థితి. ఇంటింటికీ వెళ్లి ‘మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించండి. మంచి విద్యనందిస్తాం. మా మీద నమ్మకం ఉంచండి’ అని నచ్చచెప్పి ఎన్రోల్మెంట్ 45కి పెంచారు. సైన్స్ ప్రాజెక్టులు చేయించడం ద్వారా విద్యార్థుల్లో ఉత్సాహాన్ని కలిగిస్తూ పాఠశాల పిల్లలను అయస్కాంతంలా ఆకర్షించేటట్లు చేశారు. ఆ తర్వాత చెన్నూరు జిల్లా పరిషత్ స్కూల్‌కి వచ్చినప్పటి నుంచి పెద్ద తరగతులకు పాఠం చెప్పే అవకాశం రావడంతో మరింత విస్తృతంగా ప్రయోగాలు మొదలుపెట్టారు. వందకు పైగా ప్రయోగాలు చేసిన ఆమె ప్రయోగాల్లో ఎకో ఫ్రెండ్లీ పూల కుండీ ప్రయోగం అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఈ నెల 13 నుంచి 18 వరకు ఆమె విద్యార్థులు మణికంఠ, వినయ కుమార్‌లు యూఎస్‌లోని టెక్సాస్ రాష్ట్రం, డల్లాస్ నగరంలో జరిగే ఐఎస్ఈఎఫ్ ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఫెయిర్‌లో ‘స్మార్ట్ సొల్యూషన్ ఫర్ ఎకో పొల్యూషన్’ పేరుతో ఈ ప్రయోగాన్ని ప్రదర్శించనున్నారు. తన ప్రయోగాల పరంపరను సాక్షితో పంచుకున్నారు లక్ష్మీదేవి. ఎంత నేర్పిస్తే అంత నేర్చుకుంటారు! పిల్లల మెదడు కొత్త విషయాలను తెలుసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. వాళ్లకు మనం మనసు పెట్టి నేర్పిస్తే వాళ్లు అంతే చురుగ్గా నేర్చుకుంటారు. ప్రయోగాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. పాఠాలను ప్రయోగాత్మకంగా వివరించడానికి స్లయిడ్లు, స్టెమ్, లీఫ్, ప్లవర్ల భాగాలు నిలువుకోత, అడ్డకోతల నుంచి శరీర అవయవాల పనితీరును వివరించడానికి వధశాలల నుంచి మూత్రపిండాలు, గుండె, ఊపిరితిత్తులను సేకరించేదాన్ని. ఒక సైన్స్ ఫేర్‌లో సులువైన పద్ధతిలో పుట్టగొడుగుల పెంపకాన్ని నిరూపించాం. కానీ మా స్కూల్‌కి గణితం విభాగంలో ఒక అవార్డ్ ప్రకటించడంతో అదే స్కూల్‌కి రెండో అవార్డు ఇవ్వకూడదని చెప్పి అప్రిషియేషన్ ఇచ్చారు. నాచుతో సేద్యం ప్రయోగం రాష్ట్ర స్థాయికి ఎంపికైంది. కోవిడ్ సమయంలో ఎక్కువ ఖాళీ సమయం వచ్చింది. మా ఇంటి ఎదురుగా సంతలో అమ్మే మొక్కలు, నర్సరీల వాళ్లు వాడే పాలిథిన్ కవర్ల మీద దృష్టి పడింది. వాటికి ప్రత్యామ్నాయం కోసం ప్రయోగాలు మొదలుపెట్టాను. వేరుశనగపొట్టు, వేపాకు, కొబ్బరి పీచు, మెంతుల మిశ్రమంతో కుండీ తయారీ విజయవంతమైంది. ఎండకు, వానకు తట్టుకుని నిలవడంలో కష్టమవడంతో కలంకారీలో ఉపయోగించే సహజ రంగులను వేయడంతో సమస్య పరిష్కారమైంది. ఇక అవి మట్టిలో కలిసిపోవడం గురించినదే అసలు ప్రశ్న. నెలరోజుల్లో డీ కంపోజ్ అవుతోంది. ఈ కుండీ మట్టిలో కలిసిన తరవాత మట్టికి పోషణనిస్తోందా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవడమూ అవసరమే. ఎన్పీకే చాలా తక్కువగా ఉన్న మట్టిలో వేసి, కలిసిపోయిన తర్వాత మట్టిని మళ్లీ టెస్ట్‌కి పంపిస్తే ఎన్పీకే గణనీయంగా పెరిగినట్లు రిపోర్ట్ వచ్చింది. అంతే కాదు నీటిని నిలుపుకునే శక్తి పెరిగింది, వేపలోని యాంటీ మైక్రోబియల్ స్వభావం వల్ల తెగుళ్లు నివారణ సాధ్యమైంది. పైటో కెమికల్స్ ఉన్నాయని ల్యాబ్టెస్ట్లో నిర్ధారణ అయింది. నేషనల్ చైల్డ్ సైన్స్ కాంగ్రెస్ పెట్టిన సైన్స్ ఫేర్లలో మండలం, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయులు దాటి జాతీయ స్థాయిలో కూడా ప్రదర్శించాం. మెరిటోరియస్ అవార్డు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ‘బెస్ట్ గైడ్ టీచర్’ అవార్డు అందుకున్నాను. ఈ ప్రయోగాన్ని అంతర్జాతీయ వేదిక మీద ప్రదర్శించడానికి పెడన నుంచి ఈరోజు బయలుదేరుతున్నాం. ఢిల్లీలో కార్యక్రమాలు పూర్తి చేసుకుని 12వ తేదీన అమెరికా విమానం ఎక్కుతారు మా పిల్లలు’’ అని సంతోషంగా చెప్పారు లక్ష్మీదేవి. ఫ్లోరైడ్ జవాబు దొరికింది! నేను గర్వంగా చెప్పుకోదగిన ప్రయోగాల్లో ఫ్లోరైడ్ నీటిని శుద్ధి చేసే కుండ కూడా ముఖ్యమైనదే. మట్టిలో తులసి, మునగ ఆకులు కలిపి చేశాను. ఫ్లోరైడ్ 3.5 పీపీఎమ్ ఉన్న నీటిలో అడవుల్లో దొరికే చిల్లగింజలను వేసి హార్డ్నెస్ తగ్గించిన తరవాత ఆ నీటిని నేను చేసిన కుండలో పోసి ఆరు గంటల తర్వాత టెస్ట్ చేస్తే పీపీఎమ్ 1.5 వచ్చింది. ఈ కుండలో శుద్ధి అయిన నీటి పీహెచ్ సాధారణ స్థాయుల్లో ఉండడమే కాదు నీటిలో ఉండాల్సిన కంపోజిషన్స్ అన్నీ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ ప్రయోగాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఇన్నోవేటివ్ అండ్ ఎడ్యుకేషన్ నిర్వహించిన స్మార్ట్ ఇండియన్ హాకథాన్‌లో ప్రదర్శించాం. ‘ద ఇనిషి యేటివ్ రీసెర్చ్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్‌స్టెమ్ (ఐరిస్)’ నిర్వహించిన పోటీలో ప్రదర్శించినప్పుడు నా స్టూడెంట్ ‘సీహెచ్. తరుణ్‌బాబు’కి ‘యంగ్ ఇన్నోవేటర్ అవార్డు’, 45 వేల క్యాష్ ప్రైజ్ వచ్చింది. ఫిఫ్త్ యాన్యువల్ ఇంటర్నేషనల్ ఇన్నోహెల్త్ ప్రోగ్రామ్ ఢిల్లీ ట్రిపుల్ ఐటీ– ఇన్నో క్యూరియో సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఫైనల్స్‌కి వచ్చి ఆరు బెస్ట్ ప్రాజెక్టుల్లో రెండవ స్థానం. – కొల్లాటి లక్ష్మీదేవి, బయలాజికల్ సైన్స్ అసిస్టెంట్, బీజీకే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పెడన, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ ‘స్మార్ట్ సొల్యూషన్ ఫర్ ఎకో పొల్యూషన్’ పేరుతో మేము తయారు చేసిన ఎకో ఫ్రెండ్లీ పూల కుండీని డల్లాస్‌లో జరిగే ఐఎస్ఈఎఫ్ ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫెయిర్‌లో ప్రదర్శిస్తారు. ఆ కార్యక్రమంలో వంద దేశాలు పాల్గొంటాయి, ప్రదర్శనలో 1800 ప్రాజెక్టులు ఉంటాయి. ఈ కార్యక్రమాన్ని బ్రాడ్‌కామ్ అనే మల్టీనేషనల్ కంపెనీ నిర్వహిస్తోంది. – వాకా మంజులారెడ్డి -
యూపీఐ, రూపేలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి
కోచి: భారత్‌లో విజయవంతమైన యూపీఐ, రూపే ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్న అభిప్రాయాన్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వ్యక్తం చేశారు. భారత్ ఈ విషయంలో తన జీ20 అధ్యక్ష స్థానాన్ని అనుకూలంగా మలుచుకోవాలని సూచించారు. మన దేశంలో రూపొందించిన యూపీఐ చెల్లింపుల వ్యవస్థ ఎంతో విజయవంతమైంది. అంతేకాదు ప్రపంచంలోనే అత్యంత మెరుగైన చెల్లింపుల వ్యవస్థగా గుర్తింపు తెచ్చుకోవడం గమనార్హం. అందుకే పలు దేశాలు ఈ సాధనం విషయంలో ఆసక్తి చూపిస్తున్నాయి. ‘‘రిజర్వ్ బ్యాంక్ పేమెంట్స్ విజన్ 2025 కింద.. ప్రతి ఒక్కరికీ ఈ–చెల్లింపులు, ఎక్కడైనా, ఎప్పుడైనా (4ఈలు) అనే ముఖ్యమైన థీమ్‌కు కట్టుబడి ఉన్నాం. మన చెల్లింపుల ఉత్పత్తులను అంతర్జాతీయం చేసేందుకు ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవాలి. అప్పుడు మన దేశానికి కొత్త అవకాశాల ప్రపంచం ఏర్పడుతుంది. ఈ ఏడాది జీ20 దేశాలకు భారత్ నాయకత్వం వహిస్తోంది. కనుక అంతర్జాతీయంగా అందరి దృష్టికీ మన విజయవంతమైన స్టోరీని తీసుకెళ్లాలి’’అని శక్తికాంతదాస్ పేర్కొన్నారు. అంతర్జాతీయ వ్యవస్థతో అనుసంధానం అంతర్జాతీయ వ్యవస్థతో భారత ఆర్థిక వ్యవస్థ అనుసంధానత పెరుగుతోందన్నారు. సీమాంతర చెల్లింపులు మరింత ప్రాముఖ్యత సంతరించుకున్నాయని.. మన యూపీఐ, రూపే నెట్వర్క్ స్థానం అంతర్జాతీయంగా విస్తరిస్తోందని చెప్పారు. దీనివల్ల భవిష్యత్తులో ఇతర దేశాలతో మన చెల్లింపులు, స్వీకరణ లావాదేవీలు మరింత సులభంగా, చౌకగా, వేగంగా జరిగేందుకు వీలు పడుతుందన్నారు. యూపీఐ ద్వారా క్యూఆర్ కోడ్ ఆధారిత మర్చంట్ చెల్లింపులు ప్రస్తుతం భూటాన్, సింగపూర్, యూఏఈలో అందుబాటులోకి రావడం గమనార్హం. ఈ విషయంలో మనం ఎంతో సాధించామని, రానున్న రోజుల్లో మరింత చేయాల్సి ఉందని శక్తికాంతదాస్ అన్నారు. వైఫల్యాలపై దృష్టి సారించాలి.. ‘‘విజయవంతం కాని ప్రతీ లావాదేవీ, మోసపూరిత ప్రయత్నాలనేవి కొనసాగితే, ప్రతి ఫిర్యాదును సంతృప్తికరంగా పరిష్కరించకపోతే అది ఆందోళనకరమైన అంశమే అవుతుంది. అప్పుడు మరింత లోతైన విశ్లేషణ చేయాల్సి వస్తుంది. దేశంలో ఎవరూ కూడా డిజిటల్ చెల్లింపులకు వెలుపల ఉండకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’’ అని శక్తికాంతదాస్ అన్నారు. -
Tasheen Rahimtoola: స్టార్ స్ట్రాటజిస్ట్
ఫైనాన్షియల్ స్ట్రాటజిస్ట్‌గా తనను తాను నిరూపించుకున్న తషీన్...ఒకరోజు తనకు తానే సలహా ఇచ్చుకుంది. ఆ సలహా 28 సంవత్సరాల తషీన్ను సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మార్చింది... మ్యాథ్స్, ఎకనామిక్స్‌లో డిగ్రీ చేసిన తషీన్ రహిమ్తోలకు ఎప్పుడూ లాభ,నష్టాల గురించి ఆలోచించే అవసరం రాలేదు. ‘ఫైనాన్షియల్ స్ట్రాటజిస్ట్’గా ఆమె మంచి ఉద్యోగంలో ఉంది. ‘ఎందరికో వ్యూహాత్మక సలహాలు ఇస్తున్న నేను ఎందుకు వ్యాపారంలోకి అడుగుపెట్టకూడదు?’ అని ఒక ఫైన్‌మార్నింగ్ ఆలోచించింది. తనకు తానే సలహా ఇచ్చుకుంది. నిజానికి ఎంటర్ప్రెన్యూర్ అనే మాట ఆమెకు కొత్తేమీ కాదు. తల్లిదండ్రులు ఇద్దరూ వేరువేరు వ్యాపారాల్లో ఉన్నారు. అయినప్పటికీ ‘జాబ్ వదిలేస్తున్నాను’ అని చెబితే ‘రిస్క్ తీసుకుంటున్నావు’ అనే మాటే ఎక్కువగా వినిపించింది. ‘బిజినెస్‌లోకి అడుగు పెట్టే ముందు బాగా నవ్వు. ఎందుకంటే రకరకాల టెన్షన్లతో ఆ తరువాత నవ్వే పరిస్థితి ఉండదు’ అన్నారు కొందరు. ఎవరు ఎలా స్పందించినా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు తషీన్. ‘టేస్ట్ రీట్రీట్’తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా తొలి అడుగు వేసింది. మార్కెట్లో పోటీని తట్టుకోవడం, ఆర్డర్స్ సంపాదించడం, టీమ్‌ను లీడ్ చేయడం...అంత తేలికైన విషయం కాదు. అయితే ఆమెకు ప్రతి ఆర్డర్ ఒక విలువైన పాఠం నేర్పింది. థీమ్డ్ పార్టీస్, కార్పొరేట్ గిఫ్టింగ్, సిట్–డౌన్ డిన్నర్....మొదలైన వాటిలో తనదైన ముద్ర వేసింది టేస్ట్ రీట్రీట్. ఒకప్పుడు ‘ముంబై–వోన్లీ సర్వీస్’గా మొదలైన ఈ వెంచర్ పాన్–ఇండియా ఆ తరువాత అంతర్జాతీయ స్థాయికి ఎదగడానికి ఎంతో కాలం పట్టలేదు. 50 లక్షలతో మొదలుపెట్టిన ‘టేస్ట్ రీట్రీట్’ ఇప్పుడు ‘17 క్రోర్ క్లబ్’లో చేరింది. ‘ఎందరో సాధించిన ఎన్నో విజయాల గురించి వింటూ ఉంటాం. నేను కూడా ట్రై చేసి చూస్తాను అనే ఆలోచన మీలో వస్తే మొదటి అడుగు పడినట్లే. మీకు ఇష్టమైన బిజినెస్ మొదలుపెడితే రెండో అడుగు పడుతుంది. మూడో అడుగులో అనుభవాలే పాఠాలు నేర్పించి మనల్ని విజేతగా నిలుపుతాయి’ అంటుంది 28 సంవత్సరాల తషీన్. -
మన మామిడికి.. మంచిరోజులు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మామిడికి అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతో కలిపి ఎగుమతికి తగ్గ నాణ్యమైన మామిడిని ఉత్పత్తి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. అందుకోసం మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలను కేంద్రం ఎంపిక చేసింది. వీటిని మామిడి క్లస్టర్ కింద గుర్తించింది. ప్రస్తుతం ఈ జిల్లాల్లో 57,344 ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. సగటున 2.29 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి ఉత్పత్తి అవుతోంది. కొత్తగా మరో 10 వేల ఎకరాల్లో మామిడి పంటను ప్రోత్సహిస్తారు. మొత్తంగా 67 వేల ఎకరాల్లో ఎగుమతి చేసే స్థాయి కలిగి ఉండే నాణ్యమైన మామిడి ఉత్పత్తి అయ్యేలా చూస్తారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.200 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. అందులో కేంద్రం రూ.100 కోట్లు మంజూరు చేసింది. మిగిలిన సొమ్మును ప్రైవేట్ కంపెనీలు, రాష్ట్ర ప్రభుత్వం భరిస్తాయి. రాష్ట్ర ఉద్యానశాఖతో ప్రత్యేకంగా నిర్వహించిన సమావేశంలో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ బ్రాండ్ కోసం ప్రత్యేక చర్యలు తెలంగాణలో దాదాపు 3.50 లక్షల ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. సాధారణంగా ఎకరానికి ఎనిమిది టన్నుల వరకు ఉత్పత్తి వస్తుంది. అంటే 28 లక్షల టన్నుల మామిడి రాష్ట్రంలో ఉత్పత్తి అవుతుంది. సీజన్‌ను బట్టి ఒక్కోసారి తక్కువ ఎక్కువ అవుతుంది. అయితే తెలంగాణ మామిడికి దేశంలో మార్కెట్ ఉన్నా, విదేశీ ఎగుమతులు లేకపోవడంతో రైతులకు అవసరమైన గిట్టుబాటు ధర లభించడం లేదు. అయితే ఎగుమతి చేయాలంటే అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. ఎలాంటి రసాయనాలు వాడకూడదు. ఎక్స్పోర్ట్ క్వాలిటీని పెంచేందుకు ప్రాసెసింగ్ యూనిట్లను నిర్మిస్తారు. అకాల వర్షాలకు నష్టాలు జరగకుండా అత్యాధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు. రైతులకు అత్యంత నాణ్యమైన మామిడి విత్తనాలను అందజేస్తారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మామిడికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు (బ్రాండ్) తీసుకొచ్చేందుకు, తద్వారా రైతులకు ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక క్లస్టర్ ఏర్పాటు చేసింది. అందుకోసం ఐదు జిల్లాలను ఎంపిక చేసింది. బిడ్డింగ్ ద్వారా ప్రైవేటు సంస్థల ఎంపిక ఈ ప్రాజెక్టుకు చేసే రూ.200 కోట్ల వ్యయంలో మామిడి ఉత్పత్తికి ముందు, ఉత్పత్తి సమయంలో రూ.79.89 కోట్లు, కోత అనంతరం నిర్వహణ, అదనపు విలువను జోడించేందుకు రూ.80.70 కోట్లు, మార్కెటింగ్, బ్రాండింగ్ కోసం రూ.39.80 కోట్లు ఖర్చు చేస్తారు. మూడేళ్లలో ఈ సొమ్మును ఖర్చు చేయాలి. ప్రాజెక్టు అమలు కోసం రాష్ట్ర ఉద్యానశాఖ, జాతీయ ఉద్యాన మండలి ఒప్పందం చేసుకుంటాయి. ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయడంతో పాటు ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించే ప్రైవేట్ సంస్థలను బిడ్డింగ్ పద్ధతిలో ఎంపిక చేస్తారు. రైతు ఉత్పత్తి సంస్థలు, సహకార సంస్థలు, రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ మండళ్లకు భాగస్వామ్యం కల్పిస్తారు. రాష్ట్రంలో పండించే మామిడిని ఢిల్లీకి కిసాన్ రైలు ద్వారా పంపిస్తారు. దళారులదే రాజ్యం: మామిడికి నిర్ధారిత ధర ప్రకటించకపోవడంతో దళారుల హవానే నడుస్తోంది. ప్రస్తుతం రైతుల నుంచి టన్ను మామిడి రూ.40 వేలకు కొంటున్న వ్యాపారులు, వినియోగదారుల నుంచి రెండు మూడింతలు వసూలు చేస్తున్నారు. ప్రస్తుత లెక్క ప్రకారం కిలో పండ్లు రూ.50 వరకు ఉండాల్సి ఉండగా మార్కెట్లో రూ.100 పలుకుతోంది. కొన్ని రకాలకైతే రూ.150–200 వసూలు చేస్తున్నారు. డిమాండ్ ఉన్నప్పటికీ గిట్టుబాటు ధరకు అమ్ముకోలేని దుస్థితిలో రైతు ఉన్నాడు. -
పంట సిరులే లక్ష్యంగా..
సాక్షి, అమరావతి: వ్యవసాయ ఉత్పత్తులన్నింటికీ సముచితమైన ధర, అదనపు విలువ జోడింపుతో అంతర్జాతీయ స్థాయిలో పోటీని తట్టుకునేలా అభివృద్ధి చేసే లక్ష్యంతో రాష్ట్రంలో చిరు ధాన్యాల బోర్డు ఏర్పాటు కానుంది. చిరు ధాన్యాల సాగును ప్రోత్సహించి ప్రజల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించే దిశగా ఈ బోర్డు ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం సూత్రప్రాయంగా నిర్ణయించింది. బోర్డు విధి విధానాలు, చిరుధాన్యాల సాగు విస్తీర్ణం పెంపు, అనుబంధ ఉత్పత్తులు వంటి అంశాలపై ఏ విధంగా ముందుకు సాగాలనే అంశాల పరిశీలనకు మార్కెటింగ్, వ్యవసాయ శాఖాధికారులు వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే పర్యటనలు చేసివచ్చారు. కేంద్ర సంస్థలతో సంప్రదింపులు జరిపారు. ఇంతకీ చిరు ధాన్యాల బోర్డు ఏర్పాటు ఆవశ్యకత ఏమిటి, దేనికి ఉపయోగపడుతుందనే దానిపై అధికార వర్గాలు ఏమంటున్నాయంటే... వ్యవసాయ రంగానికి మంచి ఊపు పంటల ఉత్పత్తి, శుద్ధి, ప్రతి ఉత్పత్తికి గిట్టుబాటు ధర వచ్చేలా చూడటం చిరు ధాన్యాల బోర్డు ప్రధాన ఉద్దేశం. తద్వారా వ్యవసాయ రంగానికి, అందులో భాగస్వాములయ్యే వారికి ఊపు, ఉత్సాహాన్ని ఇవ్వడమే దీని పని. బోర్డు స్వయం ప్రతిపత్తి కలిగి ఉంటుంది. పంటల ప్రణాళిక నుంచి ఆహార శుద్ధి వరకు, మార్కెటింగ్ మొదలు ఎగుమతుల వరకు స్వయంగా నిర్ణయాలు తీసుకోవడంతో పాటు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతుంది. పరిశోధన, మార్కెటింగ్, ఎగుమతి సహా అంతర్లీనంగా ఉండే వాటన్నిటి మధ్య సమన్వయం, సహకారం ఉండేలా చూస్తుంది. బోర్డు విధులు ఇలా.. ఏయే చిరు ధాన్యంతో ఏమేం చేయొచ్చో వాటన్నింటినీ గుర్తిస్తుంది. ఉదాహరణకు కొర్రలతో అన్నం మాత్రమే కాకుండా ఎన్ని రకాల వంటకాలు, ఇతర పదార్థాలు చేయవచ్చో ఈ బోర్డు గుర్తిస్తుంది. ఉత్పత్తిదారులకు వివరిస్తుంది. ఏయే ప్రాంతాల్లో ఏయే రకాల చిరు ధాన్యాలు పండించవచ్చో ప్రణాళికను తయారు చేయడంతో పాటు ఆచరణాత్మక పద్ధతుల్ని రూపొందిస్తుంది. గ్రామ స్థాయిల్లో వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేస్తుంది. సేకరణ, మార్కెటింగ్‌లో ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే జోక్యం చేసుకుంటుంది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తుల ప్రమాణాలు ఉండేలా రైతులకు అవగాహన కల్పిస్తుంది. ఇందుకు అవసరమైన మౌలిక వసతులను కల్పించేలా ప్రణాళికను తయారు చేస్తుంది. ప్రైవేట్ భాగస్వాములతో కలిసి ఉత్పత్తులకు అదనపు విలువ జోడించేలా చూస్తుంది. సమర్థమైన మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్‌ను ప్రోత్సహిస్తుంది. వ్యవస్థ ఎలా ఉంటుందంటే.. ఇది నాలుగు ప్రధాన వ్యవస్థలతో అనుసంధానమై ఉంటుంది. పరిశోధన, విస్తరణ, మార్కెటింగ్ ఇంటెలిజెన్స్, వాణిజ్యం పెంపుదల, గిడ్డంగులు, శీతల గిడ్డంగులు, ఇతర యంత్రాంగం, మార్కెటింగ్, ప్రాసెసింగ్ వంటివి ఇందులో ఉంటాయి. ప్రతి వ్యవస్థకు నిర్ధిష్టమైన పని విభజన ఉంటుంది. వీటితో పాటు బోర్డు ప్రస్తుతం వ్యవసాయ శాఖ, విశ్వవిద్యాలయాలు, మార్కెటింగ్ ఇతర ప్రభుత్వ సంస్థలలో ఉన్న సౌకర్యాలను, మౌలిక వసతులను వినియోగించుకుంటుంది. ఈ బోర్డుకు ఎవర్ని చైర్మన్‌గా నియమించాలనేది ఖరారు కానప్పటికీ ఎంఎల్ఏ లేదా ఎమ్మెల్సీ చైర్మన్‌గా ఉంటారని భావిస్తున్నారు. వైస్ చైర్మన్‌గా రైతు నాయకుడు ఉంటారు. విస్తరణ, మార్కెటింగ్, స్టోరేజి, మౌలిక వసతులు, ప్రాసెసింగ్, వ్యాపార–వాణిజ్య వర్గాల నిపుణులు, వ్యవసాయ రంగం నుంచి ఒక రైతు, ఇతర భాగస్వామ్య పక్షాల వారు బోర్డులో ప్రతినిధులుగా ఉంటారు. -
సూపర్ డూపర్ కంప్యూటర్లు అవసరమే!
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ చిక్కుల నుంచి తప్పించుకోవడం మొదలుకొని ప్రాణాంతక కేన్సర్ చికిత్స వరకు.. కంప్యూటర్ల వాడకం లేని రంగమంటూ లేదంటే అతిశయోక్తి కాదు.. ఏటా కంప్యూటర్ల వేగం పెరుగుతూనే ఉన్నా.. మరింత వేగవంతమైన యంత్రాల కోసం ప్రయత్నాలు ఊపందుకుంటున్నాయి.. ఎందుకు? నిజంగానే వీటి అవసరముందా? అడ్డంకులు ఏంటి? అధిగమించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఎలా సాగుతున్నాయి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకునేందుకు కంప్యూటర్ శాస్త్రవేత్త చిరంజీబ్ సుర్ను ‘సాక్షి’కలిసింది. అత్యధిక సామర్థ్యంతో పనిచేసే కంప్యూటింగ్ వ్యవస్థలపై హైదరాబాద్‌లో జరుగుతున్న హెచ్‌ఐపీసీ అంతర్జాతీయ సదస్సుకు అధ్యక్షుడు చిరంజీబ్ సమాధానాలు.. ప్ర: హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ (హెచ్‌ఐపీసీ) అవసరం ఏంటి? జ: చాలా ఉంది. ఉదాహరణకు మనలో చాలామంది ఉపయోగిస్తున్న గూగుల్ మ్యాప్స్‌ను తీసుకుందాం. ఇప్పుడైతే మీరు స్క్రీన్‌పై వేలిని కదిలిస్తూ సమాచారాన్ని రాబట్టుకుంటున్నారు గానీ.. భవిష్యత్తులో మీ మాటతోనే అన్ని పనులు చక్కబెట్టుకోవచ్చు. పర్సనల్ అసిస్టెంట్ల రూపంలో ఇప్పటికే మాటలకు స్పందించే వ్యవస్థలు ఉన్నా.. హెచ్‌ఐపీసీ కారణంగా భాషతోపాటు.. యాసను గుర్తించి తదనుగుణంగా స్పందించే వ్యవస్థలు అందుబాటులోకి వస్తాయి. వాతావరణ అంచనాలను కచ్చితంగా తెలుసుకునేందుకు, కొత్త మందుల ఆవిష్కరణలో నూ కీలక ప్రాత పోషించనుంది. సమాచారాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషించి అందరికీ ఉపయోగపడే కొత్త కొత్త విషయాలను తెలుసుకునేందుకు, వాటిని ఆచరణలో పెట్టేందుకు కూడా కంప్యూటర్ల వేగం, సామర్థ్యం మరింత పెరగాల్సి ఉంది. ప్ర: కంప్యూటర్ల వేగం, సామర్థ్యం ప్రతి 18 నెలలకు రెట్టింపు అవుతుందని మూర్స్ నిబంధన చెబుతుంది. ప్రస్తుతం ట్రాన్సిస్టర్ల సైజు 9 నానోమీటర్లు. ఇంతకంటే తక్కువ సైజువి తయారు చేసే అవకాశం లేదు. మరి.. కంప్యూటర్ల వేగం పెంచడం ఎలా సాధ్యం? జ: మూర్స్ నిబంధనను అధిగమించేందుకు గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లను ఉపయోగిస్తున్నారు. ‘ఫీల్డ్ ప్రోగ్రామబుల్ గేట్ అరే’ల వంటి పరికరాల ద్వారా హార్డ్‌వేర్ సామర్థ్యాన్ని పెంచుతున్నారు. సాఫ్ట్వేర్లు పనిచేసే తీరులో నూ మార్పులు చేయడం ద్వారా డెస్క్‌టాప్ కంప్యూటర్‌కే సూపర్ కంప్యూ టర్ సామర్థ్యం ఇవ్వగలుగుతున్నాం. వైద్యరంగంలోనూ హెచ్‌ఐపీసీతో అద్భుతాలు సృష్టించొచ్చు. ఒకసారి ఎంఆర్ఐ తీసుకుంటే రేడియేషన్ వస్తుందని మనకు తెలుసు. దీనిని హెచ్‌ఐపీసీతో అధిగమించవచ్చు. ప్ర: భారత్‌లో హెచ్‌ఐపీసీ పరిస్థితి ఏంటి? జ: నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్‌ను కేంద్రం ఇప్పటికే అమలు చేస్తోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి సమస్యల పరిష్కారానికి సూపర్ కంప్యూటర్లను వాడటం, దీనికి తగ్గ మానవ వనరులు అభివృద్ధి చేయడం దీని ప్రధాన ఉద్దేశం. దీనిలో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని మోదీ ‘పరమ్ శివాయ్’ పేరుతో ఓ సూపర్ కంప్యూటర్ను అభివృద్ధి చేశారు. దేశంలో హైపర్ఫార్మెన్స్ కంప్యూటింగ్‌పై కోర్సులు అందించే విద్యాసంస్థలు తక్కువగా ఉన్నాయి. విశ్వవిద్యాలయాల స్థాయిలోనూ ఈ రం గంలో కోర్సులు మొదలైతే సమీప భవిష్యత్తులో డేటా, ఆరి్టఫీíÙయల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో దేశ యువత ఉద్యోగాలు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. హెచ్‌ఐపీసీ రంగంలో పరిశోధనలను ముమ్మరం చేసేందుకు, అంతర్జాతీయ పురోగతిని అర్థం చేసుకునేందుకు హెచ్‌ఐపీసీ వంటి సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. హెచ్‌ఐపీసీ సమావేశంలో సుమారు 500 మంది దేశ, విదేశీ ప్రతినిధులు పాల్గొంటున్నారు. -
అడవి కాచిన వన్నెలు
అడవి కాచిన వెన్నెల అడవికే పరిమితం అవుతుంది. డేబ్భయ్ ఏళ్ల వయసులో ఈ గిరిపుత్రిక నేర్చుకున్నచిత్రలేఖనం మాత్రం విశ్వ విధిలో కాంతులు విరజిమ్ముతోంది. ఖండాంతర ఖ్యాతిని సముపార్జిస్తోంది. పుట్టినప్పటి నుంచి డెబ్బై ఏళ్ల వరకు జీవించిందామె. అన్నేళ్లలో తనకు చెప్పుకోవడానికంటూ ఏ ప్రత్యేకతా లేదు. మధ్యప్రదేశ్‌లోని ‘లోరా’ అనే మారుమూల గిరిజన గ్రామం ఆమెది. భర్త, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. అడవిలో దొరికే పనులతో బతుకు వెళ్లదీసింది. ఆమెకు నలబై ఏళ్ల వయసులో భర్త పోయాడు. ముగ్గురు పిల్లల్ని ఒక ఇంటి వాళ్లను చేసే బాధ్యత ఆమె భుజాల మీద పడింది. భర్త వదిలి వెళ్లిన ఆ బాధ్యతలను పూర్తి చేసిందామె. అయితే డెబ్బై ఏళ్ల వయసులో ఆమె జీవితం ఆమెకు కూడా తెలియకుండా ఊహించని మలుపు తిరిగింది! ఇప్పుడామెకి ఎనబై ఏళ్లు. ఈ పదేళ్లలో ఆమె అంతర్జాతీయ స్థాయి చిత్రకారిణి అయింది! రాష్ట్రం దాటి బయటకు రాని జీవితం ఆమెది. ఆమె వేసిన బొమ్మలు ఖండాంతరాలు దాటి ఇప్పుడు పారిస్‌లోనూ, ఇటలీలోని మిలన్ ఆర్ట్ ఎగ్జిబిషన్‌లోనూ ప్రఖ్యాత చిత్రకారుల చిత్రాల వరుసలో స్థానం సంపాదించుకున్నాయి. ప్రైజులు కూడా గెలుచుకున్నాయి. దేశంలో అనేక ఆర్ట్ గ్యాలరీలలో అంతకంటే ముందునుంచే ప్రదర్శితమవుతున్నాయి. ఈ ఎనబై ఏళ్ల చిత్రకారిణి పేరు జుధైయా బాయ్ బైగా. ‘‘పెయింటింగ్ నన్ను మరొక ప్రపంచంలోకి తీసుకెళ్లింది. అక్కడ నేను స్వేచ్ఛావిహంగాన్ని’’ అంటోంది బైగా. ఆమె అంటున్నట్లే ఆకాశమే హద్దుగా తన కుంచె శక్తితో మేధా యుక్తితో సృజనాత్మక లోకంలో విహరిస్తోందామె. జీవితమే థీమ్ బైగా కి బొమ్మలు వేయడానికి థీమ్ గురించి మేధామథనం చేయాల్సిన అవసరమే ఉండదు. తన చుట్టూ కనిపించే సామాన్య గిరిజన జీవితాన్నే కాన్వాస్ మీదకు తెస్తుంది. గిరిజన సంప్రదాయ జీవనశైలికి ప్రతిబింబాలవి. ఒక్కో బొమ్మకు మూడు వందల నుంచి ఎనిమిది వేల వరకు ధర పలుకుతోంది. గ్రామస్థులు ఆమె ధరిస్తున్న రంగురంగుల కొత్త దుస్తులను చూస్తూ ‘‘బైగా అవ్వ జీవితం రంగులమయం అయింది’’ అని చమత్కరిస్తున్నారు. ‘‘ఆమె నుంచి నేర్చుకోవలసింది డబ్బు సంపాదించడం గురించి మాత్రమే కాదు. డెబ్బై ఏళ్ల వయసులో చిత్రలేఖనం నేర్చుకోవడానికి ముందుకు రావడమే’’నన్నారు ఆషిశ్ స్వామి. అడవి బిడ్డలకే సొంతం బెంగాల్‌కు చెందిన ఆషిశ్ ప్రముఖ చిత్రకారుడు, శాంతినికేతన్ విద్యార్థి. ఆషిశ్ తన ఆర్ట్ స్టూడియో ‘జన్‌గాన్ తస్వీర్‌ఖానా’లో ప్రదర్శన కోసం మధ్యప్రదేశ్‌లోని గిరిజన గ్రామాలను సందర్శిస్తూ పదేళ్ల కిందట లోరా వచ్చాడు. ఉచితంగా చిత్రలేఖనం నేర్పిస్తున్నాడని తెలియడంతో పదిహేను మంది మహిళలు నేర్చుకోవడానికి వచ్చారు. డెబ్బై ఏళ్ల బైగా కూడా. ‘‘కుంచె పట్టుకున్న తొలిరోజు నుంచే ఆమె దీక్షతో బొమ్మలు వేసింది. ఒకటి వేసిన తర్వాత మరింకేదో కొత్తగా వేయాలనే తపన కూడా కనిపించేదామెలో. శిక్షణ తీసుకున్న నాగరిక చిత్రకారులకు సాధ్యం కానిది, అడవి బిడ్డలకు మాత్రమే ఒంటపట్టే మెళకువ ఒకటుంది. వాళ్లు అడవిలో సంచరించే జంతువుల కళ్లలోని భావాన్ని ఇట్టే పసిగట్టేస్తారు. బైగా ఆ భావాన్ని బొమ్మలోకి పట్టుకొస్తుంది’’ అన్నాడు ఆషిశ్ స్వామి. ‘నేర్చుకోవడానికి వయసు అడ్డంకి కాదు’ అని ఇప్పటికే ఎందరో నిరూపించారు. జుధైయా బాయ్ బైగా మరోసారి నిరూపించింది, తన కుగ్రామం లోరా పేరును ప్రపంచస్థాయి వేదికల మీదకు తీసుకెళ్లింది. – మంజీర -
హ్యాపీ.. హ్యాపీ
నిర్మించిన తొలి సినిమాయే అంతర్జాతీయ స్థాయి వేదికపై ప్రదర్శితమయ్యే అవకాశం వస్తే ఏ నిర్మాతకైనా ఆనందంగానే ఉంటుంది. ఆ హ్యాపీ ఫీలింగ్‌లోనే ఉన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్. మ్యూజిషియన్ విశ్వేష్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించిన ‘99 సాంగ్స్’ చిత్రానికి ఏఆర్ రెహమాన్ ఒక నిర్మాతగా ఉన్నారు. అంతే కాదండోయ్ ఈ సినిమాకు రచయిత కూడా. ఈ ‘99 సాంగ్స్’ సినిమాతో ఇహన్ భట్, ఎడిల్సీ హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. వచ్చే నెల 3 నుంచి 12 వరకు 24వ దక్షిణ కొరియాలో బూసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది. ఈ చిత్రోత్సవాల్లో అక్టోబరు 9న ‘99 సాంగ్స్’ ప్రదర్శితం కానుంది. ‘‘99 సాంగ్స్’ చిత్రం బూసాన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితం కాబోతుందని చెప్పడానికి చాలా హ్యాపీగా ఉంది. టీమ్ అందరికీ ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు ఏఆర్ రెహమాన్. 85 దేశాల నుంచి వచ్చిన దాదాపు 299 సినిమాలు ఈ చిత్రోత్సవాల్లో ప్రదర్శితం కానున్నాయి. స్క్రీనింగ్ అయ్యే సినిమాల జాబితాలో ‘ది స్కై ఈజ్ పింక్, ఆధార్’ వంటి హిందీ చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించే వాటిలో కొన్ని షార్ట్‌ఫిల్మ్స్ కూడా ఉన్నాయి. -
అంతర్జాతీయ స్థాయిలో తెలుగుకవులకు స్థానం
సాక్షి, నెల్లూరు(వీఆర్సీసెంటర్): అంతర్జాతీయ స్థాయిలో ఇద్దరు కవులకు స్థానం లభించడం తెలుగు వారందరికీ గర్వకారణమని సుప్రసిద్ధకవి, జిల్లా వాసి డాక్టర్ పెరుగు రామకృష్ణ పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన దక్షిణాసియా కవిత సంకలనంలో సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతల్లో ఒకరైన శివారెడ్డికి సోమవారం నెల్లూరు నగరంలో పెరుగు రామకృష్ణ సంపాదకీయం వహించి, వెలరించిన ‘దిపొయెట్రి ఆఫ్ సౌత్ ఏసియా’ పుస్తకాన్ని శివారెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా పెరుగు మాట్లాడుతూ తొమ్మిది దేశాల కవుల సరసన ఇద్దరు తెలుగు కవులు శివారెడ్డి, పాపినేని శిశంకర్ నిలవడం అభినందనీయమన్నారు. సార్క్ దేశాల కవులు రాసిన 53 కవితల్లో వీరి కవితలు కూడా ఉండడం తెలుగువారందరికీ గర్వకారణమ న్నారు. తెలుగుభాష కన్వీనర్ కూడా అయిన శివారెడ్డి రాసి ప్రచురించిన కవితలతో వారికి తెలుగుకవుల ప్రతిభాపాటవాలు ఇతర భాషా కవులకు తెలియవచ్చిందని పేర్కొన్నారు. -
బ్లాక్‌లిస్ట్‌లో పాకిస్తాన్!
న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌ను అంతర్జాతీయ వేదికలపై ఒంటరి చేసేందుకు భారత్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఉగ్రసంస్థలకు ఆర్థిక సాయంపై నిఘా ఉంచే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్)కు పుల్వామా ఘటనపై కీలక సాక్ష్యాధారాలను సమర్పించనుంది. వచ్చేవారం ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఎఫ్ఏటీఏ ప్లీనరీ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో ఉగ్రసంస్థ జైషే మొహమ్మద్‌కు పాకిస్తాన్ నిఘా సంస్థలు అందజేస్తున్న సాయాన్ని భారత్ ఎండగట్టనుంది. ఈ పత్రాలను భద్రతా సంస్థలు రూపొందిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పారిస్‌లో జరిగే సమావేశంలో పాకిస్తాన్‌ను నిషేధిత జాబితా(బ్లాక్ లిస్ట్)లో చేర్చాల్సిందిగా కోరతామని తెలిపారు. మనీ లాండరింగ్‌తో పాటు ఉగ్రవాదులకు ఆర్థిక సాయమందించే దేశాలను ఎఫ్ఏటీఎఫ్ నిషేధిత జాబితాలో చేరుస్తుంది. దీనివల్ల అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ), యూరోపియన్ యూనియన్(ఈయూ)లు సదరు దేశపు రేటింగ్‌ను డౌన్‌గ్రేడింగ్ చేస్తాయి. దీంతో అంతర్జాతీయ సంస్థల నుంచి రుణసాయం, పెట్టుబడులు నిలిచిపోతాయి. అలాగే ఎస్అండ్పీ, ఫిచ్, మూడీస్ వంటి రేటింగ్ ఏజెన్సీలు సైతం పెట్టుబడులపై రిస్క్ రేటింగ్లను తగ్గించేస్తాయి. తద్వారా నిషేధిత దేశానికి అన్నివైపుల నుంచి దారులు మూసుకుపోతాయి. 2018, జూలైలో జరిగిన ప్లీనరీ సమావేశంలో ఎఫ్ఏటీఎఫ్ పాక్‌ను ‘గ్రే’ జాబితాలో చేర్చింది. నిర్దేశిత నిబంధనలను పాటించకుంటే నిషేధిత జాబితాలో చేరుస్తామని హెచ్చరించింది. ఎఫ్ఏటీఎఫ్లో 35 దేశాలు, ఈయూ కమిషన్, గల్ఫ్ సహకార మండలి సభ్యులుగా ఉన్నాయి. ఉత్తరకొరియా, ఇరాన్ దేశాలను ఎఫ్ఏటీఎఫ్ నిషేధిత జాబితాలో చేర్చింది. -
దేశానికి లిఫ్ట్ ఇచ్చినా దేశం లిఫ్ట్ ఇవ్వలేదు!
అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన శ్యామలాదేవికి నేడు సొంత రాష్ట్రంలోనే ఆదరణ కరువైంది! శిక్షకులు, మార్గదర్శకులు లేకుండా.. పట్టుదల, సాధనే కృషిగా అంతర్జాతీయ స్థాయిలో ఇరవై నాలుగు దేశాలు పాల్గొన్న ఆసియా జూనియర్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించి దేశానికి వన్నె తెచ్చినప్పటికీ ఏ గుర్తింపు లేకుండా ఆమె అనామకంగా ఉండవలసి వస్తోంది! కేంద్రం నుంచి కూడా ఎటువంటి సహాయం అందకపోవడంతో చిరు ఉద్యోగంతో ఆమె కాలం వెళ్లదీస్తున్నారు. శ్యామల 2006లో దక్షిణకొరియాలో జరిగిన జూనియర్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీలలో బంగారు పతకం సాధించి, భారతదేశ జెండాను రెపరెపలాడించారు. దాంతో పాటు జాతీయ స్థాయిలో 8 రజిత, 16 కాంస్య పతకాలు గెలుపొందారు.శ్యామల స్వస్థలం ప్రకాశం జిల్లా ఒంగోలు. తండ్రి కిషోర్‌కుమార్. తల్లి విజయలక్ష్మి. తండ్రి అల్యూమినియం వస్తువులు తయారు చేసే పరిశ్రమలో దినసరి కార్మికుడిగా పని చేసేవారు. పెద్ద కుటుంబం, తక్కువ ఆదాయం కావడంతో తండ్రికి అండగా ఉండేందుకు బి.కాం. చదివినప్పటికీ శ్యామల కూడా దినసరి కార్మికురాలిగా వెళ్లేవారు. శ్యామలకు పాఠశాలస్థాయి నుంచే ఆటలపై మక్కువ. ఎన్ని అవరోధాలు ఎదురైనా నిరాశ చెందకుండా వెయిట్ లిఫ్టింగ్ సాధన చేస్తూ పవర్ లిఫ్టింగ్‌లో ఒడుపు సాధించారు. అలా కళాశాల నుంచి జాతీయ స్థాయికి అక్కడ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. 2005లో పవర్ లిఫ్టింగ్ అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించినప్పటికీ లక్షల్లో ఖర్చు కనుక ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో శ్యామలకు ఆ అవకాశం చేజారిపోయింది. ‘శాప్’ అధికారులకు విన్నవించుకుంటే.. ‘ఇంతా ఖర్చు చేశాక పతకం తీసుకురాకుంటే!’ అనే సందేహం వ్యక్తం చేశారు. ఆ మరుసటి సంవత్సరం దాతలు కొందరు ముందుకు రావడంతో పవర్ లిఫ్టింగ్ పోటీలకు అర్హత సాధించి దక్షిణ కొరియాలో పతకం సాధించారు. అప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆమె వైపు చూడను కూడా చూడలేదు. ప్రభుత్వ ఆదరణ లేకపోవడంతో ఆ క్షణం నుంచే ఆటలకు ఆమె స్వస్తి పలికారు. ప్రస్తుతం శ్యామల నెల్లూరు పౌర సరఫరాల సంస్థలో ఔట్సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నారు. భర్త ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. ప్రోత్సహించే వారు కరువవడం, బంగారుపతకం సాధించిన తరువాత ఆమెను మంత్రులు, పెద్ద అధికారులకు పరిచయం చేసే వారు లేకపోవడంతో ఆ ఆణిముత్యం ప్రతిభ అంతటితో అగిపోయింది. పేద కుటుంబంలో జన్మించి దేశం గర్వించే విధంగా పతకం సాధించిన శ్యామలాదేవి ప్రతిభను గుర్తించి ప్రభుత్వం ఆమెకు ఆర్థికంగా సహాయం చేయవలసిన అవసరం ఉంది. వెయిట్ ‘లిస్ట్’ ►2004 ఆగస్టులో... సీనియర్ నేషనల్స్‌లో కాంస్యం. ►2004 నవంబర్‌లో... సౌత్ ఇండియాచాంపియన్షిప్లో స్వర్ణం. ►2005 జనవరిలో...జూనియర్ నేషనల్స్ చాంపియన్‌షిప్‌లో 4 కాంస్యాలు. ►2005 ఫిబ్రవరిలో...జూనియర్స్ ఫెడరేషన్ కప్‌లో స్వర్ణం. ►2005లో ఏషియన్ పవర్ లిఫ్టింగ్ పోటీలకు అర్హత.అదే ఏడాది...అఖిల భారత అంతర విశ్వవిద్యాలయాల పోటీల్లో రజతం. ►2006లో...జూనియర్ నేషనల్ పవర్ లిఫ్టింగ్‌లో 4 రజతాలు. ►2006... ఫెడరేషన్ కప్ జూనియర్స్ పోటీలలో స్వర్ణం. అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లోపాల్గొనేందుకు అర్హత. -
గుంతకల్లు రైల్వేస్టేషన్‌కు అంతర్జాతీయ స్థాయి
గుంతకల్లు: గుంతకల్లు రైల్వేస్టేషన్‌కు అంతర్జాతీయ స్థాయి హోదానిస్తూ రూ.25 కోట్లతో ఆధునికీకరణ పనులు చేపట్టేందుకు కేంద్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఈ స్టేషన్‌కు మహర్దశేనని రైల్వేవర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మొత్తం ఆరు రైల్వేస్టేషన్లకు, రాయలసీమలో గుంతకల్లు, కర్నూలు స్టేషన్లకు అంతర్జాతీయ హోదా ఇచ్చారు. ప్రస్తుతం గుంతకల్లు స్టేషన్లో రూ.6 కోట్లతో మోడల్ స్టేషన్ భవన నిర్మాణ పనులు చేస్తున్నారు. ఈ పనుల్లో మార్పులు చేర్పులు చేసి అంతర్జాతీయ స్థాయిలో భవనం నిర్మించేందుకు ప్రభుత్వానికి నివేదికలు పంపినట్లు రైల్వేవర్గాలు తెలిపాయి. రైల్వే అధికారులు పంపిన నమూనాలు పరిశీలిస్తే అవి విమానాశ్రయాలకు ఏమాత్రం తీసిపోవడం లేదు. మోడల్ స్టేషన్ బిల్డింగ్ దక్షిణం వైపున నిర్మిస్తున్నారు. స్టేషన్ ప్రాంగణంలో దాదాపు 2 ఎకరాలపైగా స్థలం ఉంది. అందులో పార్కులు, పౌంటెయిన్లు, ఇతరత్రా అందమైన కళాకృతులు ఏర్పాటు చేయాలన్న యోచనతో ఊహాత్మక నమూనాలను బోర్డు అనుమతికి పంపారు. అదేవిధంగా స్టేషన్లో ఎస్కలేటర్లు, వైఫై సదుపాయం, ఆధునిక ఎలక్ట్రికల్ డిస్ప్లే తదితర హంగులతో గుంతకల్లు రైల్వేస్టేషన్ రూపురేఖలు మారనున్నాయి. -
అంతర్జాతీయ స్థాయిలో మేడారం జాతర
సాక్షి, హైదరాబాద్: సమ్మక్క, సారలమ్మ జాతరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం లభించేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ పలు శాఖల అధికారులను ఆదేశించారు. దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరను ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరిగే మేడారం జాతర ఏర్పాట్లపై గురువారం సచివాలయంలో ఆయన సమీక్షించారు. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందించాలని, విదేశీ యాత్రికుల కోసం అత్యున్నత సదుపాయాలతో ప్రత్యేక నివాసాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సాంస్కృతిక శాఖలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి, జాతర కార్యక్రమాలను పర్యవేక్షించాలని పేర్కొన్నారు. గతంలో వరంగల్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన వాకాటి కరుణను జాతర కోసం ప్రత్యేకాధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిపారు. జాతరకు దేశంలోని అన్ని రాష్ట్రాల గిరిజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రులు, సెక్రటరీలు, గిరిజన ఎంపీలను ఆహ్వానించాలని ఆదేశించారు. పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అత్యాధునిక మరుగుదొడ్లు నిర్మించాలని సూచించారు. జాతర ఏర్పాట్లపై సాంస్కృతిక దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేకంగా శాఖల వారీగా సమావేశాలు నిర్వహించాలని చెప్పారు. యాత్రికులకు హెలికాప్టర్ సేవలను కల్పించాలన్నారు. జాతర సందర్భంగా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా భద్రత, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ అర్వింద్ కుమార్, పర్యాటక, సాంస్కృతిక కార్యదర్శి వెంకటేశం, దేవాదాయ శాఖ కమిషనర్ శివ శంకర్, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినా జడ్ చొంగ్తూ, నాగిరెడ్డి పాల్గొన్నారు. -
ముచ్చటగా మూడో మహాసభల్లో..
1975, 2012లో జరిగిన రెండు తెలుగు మహాసభల్లో పాల్గొన్న ఈయన ఈసారి మూడోసభల్లోనూ పాలుపంచుకోనున్నారు. ఈ సందర్భంగా గత సభల ద్వారా తెలుగు భాషకు, సాహిత్యానికి జరిగిన ప్రయోజనాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ విశేషాలివీ.. మొదటి సభలతో... వివిధ రాష్ట్రాలలో ఉన్న ఆంధ్ర సాంస్కృతిక సంస్థలను ఒకే వేదిక మీదకు చేర్చే ప్రయత్నం జరిగింది. అంతర్జాతీయ తెలుగు సంస్థ ద్వారా భాషాభివృద్ధికి చేయూత లభించింది. అజ్ఞాతంగా ఉండిపోయిన శంకరంబాడి సుందరాచారి రచన ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ గేయం ప్రాచుర్యంలోకి వచ్చి రాష్ట్రగీతంగా గుర్తింపునకు నోచుకుంది. తెలుగు బోధనాభాషగా అభివృద్ధి చెంది తెలుగు అకాడమీ కార్యకలాపాలు విస్తరించాయి. ఆ తర్వాత మలేషియా తదితర ప్రాంతాలలో జరిగిన మహాసభలతో అంతర్జాతీయ స్థాయిలో తెలుగు గుర్తింపు పొందింది. రెండవ సభలు తిరుపతిలో 2012, డిసెంబర్లో జరిగిన ఈ సభలకు దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రతినిధులు హాజరయ్యారు. అదొక భాషా బ్రహ్మోత్సవంగా జరిగాయి. ఈ సభల ద్వారా... ► అప్పటికి తెలుగు భాషలో సంస్కృతి, భాష, కళలు, సంగీతం, నాటికలు, అష్టావధానాలు... వంటి ప్రక్రియలు విస్తరించాయి. వాటన్నింటినీ ఒకే వేదిక మీదపై పంచుకునే వీలు కలిగింది. ► తెలుగు అకాడమీ చైర్మన్ యాదగిరి ఆధ్వర్యంలో వందకు పైగా తెలుగు సాహిత్యాల మోనోగ్రాఫ్‌లు వచ్చాయి. ► అమెరికా వంటి దేశాలలో తెలుగు నేర్చుకునే విద్యార్థులకు ‘తెలుగుబడి’ వంటి కార్యక్రమాలకు వ్యాప్తి జరిగింది. ఈ సభలు ఎలా ఉండనున్నాయంటే! ఇలాంటి సభల ద్వారా ఎందరో వర్ధమాన, ప్రసిద్ధ, అజ్ఞాత రచయితలకు కళాకారులకు ప్రచారం లభిస్తుంది. అజ్ఞాతంగా ఉన్న ఎందరో తెలంగాణ కళాకారులకు తమ గళం విప్పే అవకాశం వస్తుంది. ఈ సభలు కాంతులు వెదజల్లి భాషా సంస్కృతులను ప్రపంచ వేదికలపైకి చేరుస్తాయి. – డాక్టర్ రేవూరు అనంతపద్మనాభరావు, అష్టావధాని, దూరదర్శన్ మాజీ అడిషనల్ డైరెక్టర్ ..: వాకా మంజుల -
అంతర్జాతీయ స్థాయిలో లేపాక్షి ఉత్సవాలు
లేపాక్షి : అంతర్జాతీయ స్థాయిలో లేపాక్షి ఉత్సవాలు నిర్వహించడానికి నిపుణులతో సలహాలు తీసుకుంటున్నట్లు అనంతపురం టూరిజం శాఖ డీఈఈ సాయిసుధీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఈశ్వరయ్య, ఆర్కెటిక్స్ బీకే తాటియా, ఆర్టిస్ట్ రమాదేవి తెలిపారు. శుక్రవారం సాయంత్రం లేపాక్షిలోని పలు ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే బాలకృష్ణ, కలెక్టర్ ఆదేశాల మేరకు లేపాక్షికి వచ్చామన్నారు. అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకోవడానికి ఎలాంటి సందర్శన స్థలాలను అభివృద్ధి చేయాలనే దానిపై ఆలోచన చేస్తున్నట్టు తెలిపారు. లేపాక్షి నంది విగ్రహానికి దక్షిణ భాగంలో పెద్దగుండ్లపై ఆకర్షణీయమైన జఠాయువు పక్షి విగ్రహం ఏర్పాటుకు ప్రణాళిక తయారు చేస్తున్నట్టు వివరించారు. అదేవిధంగా లేపాక్షికి తూర్పు, పడమటి ద్వారాలను ఆధునికీకరించుటకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. -
అంతర్జాతీయ కరాటే పోటీల్లో చందన ప్రతిభ
వర్ధన్నపేట టౌన్: మండల కేంద్రంలోని ఫుస్కోస్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న కాట బోయిన చందన అంతర్జాతీయ కరాటే పోటీ ల్లో వెండి, రజత పతకాలు సాధించినట్లు పా ఠశాలప్రిన్సిపాల్ సిస్టర్ ఆనిస్ తెలిపారు. ఇటీవల వరంగల్, ఖమ్మంలో నిర్వహించిన రాష్ట్ర, జాతీయ స్థాయి 13 సంవత్సరాల బాలికల విభాగం పోటీలలో బంగారు పతకం సాధించిన చందన అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పేర్కొన్నారు. ముంబ యిలో ఈనెల 24న నిర్వహించిన అంతర్జాతీయ 18వ వరల్డ్‌కప్ కరాటే పోటీల్లో కెనడా బాలికతో తలపడిన చందన రెండో స్థానంలో నిలి స్పారింగ్లో వెండి, కటాస్‌లో రజత పతకం సాధించినట్లు వివరించారు. ఈ సందర్భంగా శిక్షణ ఇచ్చిన కోచ్ సోమ శ్రీధర్‌ను ఆమె అభినందించారు. -
హెచ్ఎండీఏను ముట్టడించి ఉద్యమిస్తామం..
హిమాయత్‌నగర్: యువతకు ప్రాధాన్యతను ఇస్తామని ముఖ్యమంత్రి చెబుతుంటే మరో పక్క అధికారులు ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని ‘ఇంటర్నేషనల్ హంప్టీ–డంప్టీ’ ఫుడ్ ఫెస్టివల్ నిర్వాహకులు ఆరోపించారు.అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించతలపెట్టిన ఫుడ్‌ఫెస్టివల్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెచ్ఎండీఏ తమకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని నిర్వాహకులు తుల్లూరి పృథ్వితేజ్, గుణశేఖర్రెడ్డి, జయదీప్‌రెడ్డి తదితరులు డిమాండ్ చేశారు. సోషల్ నెట్వర్క్ ద్వారా యువతకు సమాచారాన్ని చేరవేసి హెచ్ఎండీఏను ముట్టడించి ఉద్యమిస్తామని హెచ్చరించారు. వీరికి మద్దతుగా నగర కార్యదర్శి డాక్టర్ సుధాకర్ విలేకరులతోమాట్లాడారు. భారతదేశ వంటలను రుచి చూపించేందుకు ఫుడ్‌ఫెస్టివల్ నిర్వహిద్దామనుకుంటే సహకారం అందించాల్సిన హెచ్ఎండీఏ నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. తక్షణం వీరికి న్యాయపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేసేందుకు వెనకాడమని హెచ్చరించారు. నిర్వాహకులు ప్రిత్వితేజ్, శ్రీదివ్య, గుణశేఖర్లు మాట్లాడుతూ హెచ్ఎండీఏ తీరువల్ల తాము తలెత్తుకోలేని పరిస్థితి వచ్చిందన్నారు. రూ.60లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. -
రాడాన్ లఘు చిత్ర అవార్డుల ప్రదానం
రాడాన్ లఘు చిత్రాల అవార్డుల వేడుక బుధవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా జరిగింది.జాతీయ,అంతర్జాతీయ స్థాయికి చెందిన పలు లఘు చిత్రాలు పోటీలో పాల్గొనడం విశేషం. నటి రాధిక శరత్‌కుమార్ కూతురు రెయాన్ నిర్వహించిన ఈ లఘు చిత్ర పోటీ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది.ఈ పోటీలో దర్శకుడు వివేక్ ఇళంగోవన్ దర్శకత్వం వహించిన ఓడమ్ అనే లఘు చిత్రం టైటిల్ విన్నర్‌గా నిలిచింది.దీనికి రూ 1.5 లక్షల నగదు బహుమతిని అందించారు.కాగా అంజలి పద్మనాభన్ దర్శకత్వం వహించిన నిళల్ షార్ట్ ఫిలిం రన్నరప్ టైటిల్‌ను గెలుచుకుంది. దీనికి 75 వేల నగదు బహుమతిని అందించారు. వీటితో పాటు జీకే దర్శకత్వం వహించిన అస్సారి చిత్రం, వివేక్ మనో తడై,అంజలి ఇరుదివరై చిత్రాలు వరుసగా ప్రధమ,ద్వితీయ,తృతీయ అవార్డులను గెలుచుకున్నాయి.ఈ కార్యక్రమంలో నటుడు శరత్‌కుమార్,రాధిక శరత్‌కుమార్,దర్శకుడు కే. భాగ్యరాజ్,కార్తీక్ సుబ్బరాజ్, నటుడు ఆర్య,సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ సినీ ప్రముఖులు పాల్గొని విజేతలకు అవార్డులను అందించారు.ఆ పోటీల్లో అవార్డులు పొందిన లఘు చిత్ర దర్శకులను సినీ అవకాశం కల్పించనున్నట్లు నిర్వాహకురాలు రెయాన్ వెల్లడించారు. -
అంతర్జాతీయ స్థాయికి విశాఖ
ఫ్లీట్ రివ్యూతో ప్రపంచ పటంలో చోటు జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాలకు వేదిక రూ.30 వేల కోట్లతో పరిశ్రమలు సబ్బవరం సమీపంలో ఎడ్యుకేషన్ సిటీ జిల్లాలో 20 వేల మందికి ఇళ్లు గణతంత్ర సందేశంలో కలెక్టర్ యువరాజ్ అల్లిపురం: అంతర్జాతీయ స్థాయి నగరంగా, ఆర్థిక కేంద్రంగా విశాఖను తీర్చిదిద్దనున్నట్లు కలెక్టర్ ఎన్.యువరాజ్ చెప్పారు. గత ఏడాది కాలంగా నగరం ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, ఈవెంట్లకు వేదికగా మారిందన్నారు. ఈ పరంపరలో భాగంగా ఫిబ్రవరి 4 నుండి 8 వరకు అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూను విశాఖ తీరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని, దీంట్లో 51 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటున్నారన్నారు. సూర్యాబాగ్ ఏఆర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో మంగళవారం జరిగిన 67వ గణతంత్ర వేడుకల్లో ఆయన ముందుగా పోలీస్ సిబ్బంది గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఇటీవల నగరంలో జరిగిన సీఐఐ సదస్సులో కుదిరిన ఒప్పందాల వల్ల రూ.30 వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు స్థాపించడానికి అవకాశమేర్పడిందని చెప్పారు. పరిశ్రమల స్థాపన వల్ల పెద్ద సంఖ్యలో ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. ఎడ్యుకేషన్ హబ్‌గా విశాఖ జాతీయ అంతర్జాతీయ గుర్తింపు కలిగిన విద్యాసంస్థలను నగరానికి కే ంద్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు. సబ్బవరం వద్ద వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో అన్ని వసతులతో ఎడ్యుకేషన్ సిటీని నెలకొల్పడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. స్వచ్ఛభారత్ పథకం కింద 48 పాఠశాలకు మరుగుదొడ్ల సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు చెప్పారు. మండలాల్లో విద్యా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు మూడు దశల్లో 34 ఆదర్శ పాఠశాలలను నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. బహిరంగ మలమూత్ర విసర్జన రహిత జిల్లా లక్ష్యంగా.. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా 2019 అక్టోబర్ 2 నాటికి బహిరంగ మలమూత్ర విసర్జన రహిత జిల్లాగా విశాఖ జిల్లాను రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. దారిద్య్రరేఖకు దిగువన గల 1,65.399 మందికి వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేశామన్నారు. జిల్లాలో క్రీడా సౌకర్యాలను మెరుగుపరచడానికి స్పోర్ట్స్ అధారిటీ కొమ్మాదిలో మిని స్టేడియంను, యలమంచిలిలో ఇండోర్ స్టేడియంను నిర్మిస్తుందన్నారు. రహదారులకు మహర్దశ అనకాపల్లి-పూడిమడక, ఎలమంచిలి-గాజువాక, విశాఖపట్నం-అనంతగిరి-అరుకు, నర్సీపట్నం-తుని, భీమునిపట్నం-నర్సీపట్నం, సబ్బవరం-కొత్తవలస-కె.కోటపాడుల మధ్య నాలుగు లైన్ల రహదారిని అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశాన్నారు. గిరిజన ప్రాంతాల్లో రూ.173 కోట్ల ఖర్చుతో రహదారులను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. స్వయంసహాయక సంఘాల అభివృద్ధి : జిల్లాలో 44 వేల 214 స్వయం సహాయక సంఘాలు చురుగ్గా పనిచేస్తున్నాయన్నారు. మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేయడానికి ఈ సంఘాలకు రూ.508 కోట్లు సహాయంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వీటిలో ఇప్పటి వరకు రూ,139.49 కోట్లు మహిళా సంఘాల ఖాతాలలోకి జమ చేశామన్నారు. మూడవ విడత జన్మభూమిలో భాగంగా ప్రజల నుండి లక్ష ఎనిమిదివేల ధరఖాస్తులు వచ్చాయని, వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్మార్ట్ సిటీగా.. స్మార్ట్ సిటీగా నగరంలో సౌకర్యాల మెరుగుకు కృషి చేస్తున్నామన్నారు. విశాఖలో ఇల్లు లేని వారికి 20 వేల ఇళ్లు నిర్మించాలని నిర్ణయించటం జరిగిందన్నారు. హుద్‌హుద్ తుఫాను సహాయం కింద కార్పొరేట్ సంస్థల సహకారంతో జిల్లాలో 5,462 ఇళ్లను ఒక్కొక్కటి రూ.4.80 లక్షల వ్యయంతో నిర్మిస్తున్నామన్నారు. ఇవి వచ్చే ఆరు నెలల్లో పూర్తి కానున్నాయన్నారు. ఉత్తమ సేవలకు పురస్కారాలు ఉత్తమ సేవలందించిన వివిధ విభాగాలకు చెందిన 470 మంది ఉద్యోగులకు కలెక్టర్ ప్రతిభా పురస్కారాలు అందజేశారు. విదేశీయులు పోగొట్టుకున్న లక్ష డాలర్ల కరెన్సీని నిజాయితీగా పోలీసులకు అప్పగించిన శివశివానీ పాఠశాల విద్యార్థులు ఎం.సాయి సూర్య, పవన్సాయిలకు కలెక్టర్ ప్రశంసా పత్రాలను అందజేశారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 2015లో పర్యావరణంపై ప్రజంటేషన్ ఇచ్చి మెరిట్ సర్టిఫికేట్ పొందిన జిల్లా విద్యార్థి ఆనంద్‌కు కూడా ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందిన 42,361 మందికి రూ.101.07 కోట్ల ఆస్తులను కలెక్టర్ పంపిణీ చేశారు.