మన మామిడికి.. మంచిరోజులు! | Telangana Arrangements To Bring International Fame To Mango Export | Sakshi
Sakshi News home page

మన మామిడికి.. మంచిరోజులు!

Published Wed, Apr 13 2022 3:17 AM | Last Updated on Wed, Apr 13 2022 8:16 AM

Telangana Arrangements To Bring International Fame To Mango Export - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ మామిడికి అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలతో కలిపి ఎగుమతికి తగ్గ నాణ్యమైన మామిడిని ఉత్పత్తి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. అందుకోసం మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలను కేంద్రం ఎంపిక చేసింది. వీటిని మామిడి క్లస్టర్‌ కింద గుర్తించింది.

ప్రస్తుతం ఈ జిల్లాల్లో 57,344 ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. సగటున 2.29 లక్షల మెట్రిక్‌ టన్నుల మామిడి ఉత్పత్తి అవుతోంది. కొత్తగా మరో 10 వేల ఎకరాల్లో మామిడి పంటను ప్రోత్సహిస్తారు. మొత్తంగా 67 వేల ఎకరాల్లో ఎగుమతి చేసే స్థాయి కలిగి ఉండే నాణ్యమైన మామిడి ఉత్పత్తి అయ్యేలా చూస్తారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.200 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. అందులో కేంద్రం రూ.100 కోట్లు మంజూరు చేసింది. మిగిలిన సొమ్మును ప్రైవేట్‌ కంపెనీలు, రాష్ట్ర ప్రభుత్వం భరిస్తాయి. రాష్ట్ర ఉద్యానశాఖతో ప్రత్యేకంగా నిర్వహించిన సమావేశంలో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

అంతర్జాతీయ బ్రాండ్‌ కోసం ప్రత్యేక చర్యలు
తెలంగాణలో దాదాపు 3.50 లక్షల ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. సాధారణంగా ఎకరానికి ఎనిమిది టన్నుల వరకు ఉత్పత్తి వస్తుంది. అంటే 28 లక్షల టన్నుల మామిడి రాష్ట్రంలో ఉత్పత్తి అవుతుంది. సీజన్‌ను బట్టి ఒక్కోసారి తక్కువ ఎక్కువ అవుతుంది. అయితే తెలంగాణ మామిడికి దేశంలో మార్కెట్‌ ఉన్నా, విదేశీ ఎగుమతులు లేకపోవడంతో రైతులకు అవసరమైన గిట్టుబాటు ధర లభించడం లేదు.

అయితే ఎగుమతి చేయాలంటే అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. ఎలాంటి రసాయనాలు వాడకూడదు. ఎక్స్‌పోర్ట్‌ క్వాలిటీని పెంచేందుకు ప్రాసెసింగ్‌ యూనిట్లను నిర్మిస్తారు. అకాల వర్షాలకు నష్టాలు జరగకుండా అత్యాధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు. రైతులకు అత్యంత నాణ్యమైన మామిడి విత్తనాలను అందజేస్తారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మామిడికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు (బ్రాండ్‌) తీసుకొచ్చేందుకు, తద్వారా రైతులకు ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక క్లస్టర్‌ ఏర్పాటు చేసింది. అందుకోసం ఐదు జిల్లాలను ఎంపిక చేసింది.

బిడ్డింగ్‌ ద్వారా ప్రైవేటు సంస్థల ఎంపిక
ఈ ప్రాజెక్టుకు చేసే రూ.200 కోట్ల వ్యయంలో మామిడి ఉత్పత్తికి ముందు, ఉత్పత్తి సమయంలో రూ.79.89 కోట్లు, కోత అనంతరం నిర్వహణ, అదనపు విలువను జోడించేందుకు రూ.80.70 కోట్లు, మార్కెటింగ్, బ్రాండింగ్‌ కోసం రూ.39.80 కోట్లు ఖర్చు చేస్తారు. మూడేళ్లలో ఈ సొమ్మును ఖర్చు చేయాలి. ప్రాజెక్టు అమలు కోసం రాష్ట్ర ఉద్యానశాఖ, జాతీయ ఉద్యాన మండలి ఒప్పందం చేసుకుంటాయి.

ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయడంతో పాటు ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించే ప్రైవేట్‌ సంస్థలను బిడ్డింగ్‌ పద్ధతిలో ఎంపిక చేస్తారు. రైతు ఉత్పత్తి సంస్థలు, సహకార సంస్థలు, రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్‌ మండళ్లకు భాగస్వామ్యం కల్పిస్తారు. రాష్ట్రంలో పండించే మామిడిని ఢిల్లీకి కిసాన్‌ రైలు ద్వారా పంపిస్తారు.

దళారులదే రాజ్యం: మామిడికి నిర్ధారిత ధర ప్రకటించకపోవడంతో దళారుల హవానే నడుస్తోంది. ప్రస్తుతం రైతుల నుంచి టన్ను మామిడి రూ.40 వేలకు కొంటున్న వ్యాపారులు, వినియోగదారుల నుంచి రెండు మూడింతలు వసూలు చేస్తున్నారు. ప్రస్తుత లెక్క ప్రకారం కిలో పండ్లు రూ.50 వరకు ఉండాల్సి ఉండగా మార్కెట్లో రూ.100 పలుకుతోంది. కొన్ని రకాలకైతే రూ.150–200 వసూలు చేస్తున్నారు. డిమాండ్‌ ఉన్నప్పటికీ గిట్టుబాటు ధరకు అమ్ముకోలేని దుస్థితిలో రైతు ఉన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement