సాక్షి, హైదరాబాద్: ‘పచ్చని చెట్లు ప్రగతి మెట్లు’ అని నేర్పించాల్సిన టీచర్ బుద్దే వక్రంగా మారింది. ఇంటి మేడ మీద ఆకులు పడుతున్నాయని, చెట్టు వేర్లు గోడ లోపలికి చొచ్చుకుపోతున్నాయని లేనిపోని తగాదాతో తంటాలు తెచ్చుకుంది ఓ రిటైర్డ్ మహిళా టీచర్. చెట్టును కొట్టేయాలని ఏకంగా హైకోర్టు మెట్లెక్కింది. న్యాయస్థానం ఆదేశాలతో మున్సిపల్ అధికారులు చెట్టును తొలగించారు. దీంతో మొదలైన గొడవ.. పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యే వరకు వచ్చింది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న కేసు వివరాలు ఇలా ఉన్నాయి.
రిటైర్డ్ ఉపాధ్యాయురాలు మల్లికాంబ (పేరు మార్చాం) ఎల్బీనగర్‌లోని ఫతుల్లగూడలో నివాసం ఉంటుంది. ఆమె ఇంటి వెనక ఓ కుటుంబం అద్దెకు ఉంటోంది. వారి ఇంట్లో ఉన్న మామిడి చెట్టు కొమ్మలు, ఆకులు వృద్ధురాలి భవనం మేడ మీద పడుతున్నాయని ప్రతి రోజు అద్దెవాసులతో గొడవ పడేది. దీంతో వారు పలుమార్లు కొమ్మలను కొట్టేశారు. అయినా ఓర్వలేక చెట్టు వేర్లు గోడల్లోపలికి వెళుతున్నాయని మళ్లీ గొడవ పెట్టుకుంది.
కిరాయిదారులు వినకపోవడంతో చెట్టును తొలగించాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసింది. అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోపోవడంతో ఈసారి ఏకంగా హైకోర్టును ఆశ్రయించింది. చెట్టుతో తన ఇంటికి నష్టం వాటిళ్లుతోందని, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడంలేదని కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. విచారణ చేపట్టిన న్యాయస్థానం తగిన చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించింది. చేసేదిలేక సంబంధిత అధికారులు మామిడి చెట్టును కొట్టేశారు.
ఇటీవల అద్దె వసూలు చేసేందుకు ఇంటికి వచ్చిన యజమాని మామిడి చెట్టు కొట్టేసి ఉండటాన్ని గుర్తించి అద్దెవాసులను ప్రశ్నించాడు. వారు అసలు విషయం చెప్పడంతో మల్లికాంబ, ఇంటి యజమాని, అద్దెదారులకు మధ్య గొడవ జరిగింది. అది కాస్తా పోలీసు స్టేషన్‌కు చేరడంతో.. అసలేం జరిగిందో తెలుసుకునేందుకు పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. పోలీసుల రాకను గమనించిన రిటైర్డ్ టీచర్ వాళ్ల మోహం మీదే తలుపులు వేసి లోపలికి వెళ్లిపోయింది.
దీంతో ఇరుగుపొరుగును విచారించిన అధికారులకు ఆమె వైఖరి తెలుసుకుని అవాక్కయ్యారు. కాలనీలోని ప్రతి ఒక్కరితోనూ ఆమెకు తగువులాటేనని, ప్రతి చిన్న విషయానికి దూర్భాషలాడుతుందని చెప్పారు. అద్దెదారుల ఫిర్యాదు మేరకు మలికాంబపై ఎస్సీఎస్టీ కేసులు నమోదు చేసిన పోలీసులు ఆమె వయసును దృష్టిలో ఉంచుకుని అరెస్టు చేయకుండా 41–ఏ నోటీసులు జారీ చేశారు.
ఇదిలా ఉండగా.. ఎస్సీఎస్టీ కేసులో చార్జిషీటు దాఖలు చేయాలంటే బాధితులు, నిందితులు ఇరువర్గాల కుల ధ్రువీకరణ పత్రం అనివార్యం. దీంతో పోలీసుల సూచన మేరకు ఉప్పల్ తహసీల్దార్ కార్యాలయ అధికారులు ఆమె ఇంటికి వెళ్లగా.. మీరెవరు, ఎందుకు వచ్చారు. వారిపై విరుచుకుపడింది. దీంతో విస్తుపోయిన అధికారులు అక్కడ్నుంచి వెళ్లిపోయారు. ఎవరెవరో మా ఇంటికి వస్తున్నారని, వేధిస్తున్నారంటూ పోలీస్ స్టేషన్‌లోనూ వాగ్వాదానికి దిగడం కొసమెరుపు.
Comments
Please login to add a commentAdd a comment