- వరంగల్ పార్కుకు జయశంకర్ పేరు
- అటవీశాఖ మంత్రి జోగు రామన్న
బహదూర్‌పురా: నెహ్రూ జూలాజికల్ పార్కుకు మరిన్ని వన్యప్రాణులను తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. జూలోని వివిధ ఎన్‌క్లోజర్లను గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ వరంగల్ మినీ పార్కును అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసి దానికి తెలంగాణ సిద్ధాంతకర్త దివంగత ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెడతామన్నారు. జూలోని ఉద్యోగులను వాచ్‌మెన్, లేబర్‌గా పిలివడాన్ని మార్చి అసిస్టెంట్ సార్జెంట్‌గా ఇతర పేర్లకు మార్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
జూ కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేస్తామని ప్రకటించారు. అనంతరం జూలోని జిరాఫీకి మంత్రి అరటి పండు, ఆపిల్‌ను తినిపించారు. కార్యక్రమంలో రాష్ట్ర జూ పార్కుల డెరైక్టర్, అడిషనల్ పీసీసీఎఫ్ పి.మల్లికార్జున్ రావు, జూ క్యూరేటర్ బి.ఎన్.ఎన్.మూర్తి, జూ ఏసీఎఫ్ పి.శామ్యూల్, జూ వెటర్నరీ అసిస్టెంట్ డెరైక్టర్ డాక్టర్ అబ్దుల్ హకీం, అసిస్టెంట్ క్యూరేటర్లు మోబీన్, రమేశ్, సరస్వతి, జూ పీఆర్‌వో హనీఫ్ తదితరులు పాల్గొన్నారు.
ఆ పోస్టులను తెలంగాణ ఉద్యోగులకు ఇవ్వండి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బదిలీ చేసిన నెహ్రూ జూలాజికల్ పార్కులోని 40 పోస్టులను ఉద్యోగులను వెంటనే తెలంగాణకు తీసుకొచ్చి జూలో కాంట్రాక్ట్, డెలీవైజ్‌గా పని చేస్తున్న ఉద్యోగులతో పర్మినెంట్ చేయాలని జూ యానిమల్ కీపర్స్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్. దేవేందర్, ఆయూబ్ కౌసర్ మంత్రికి వినతిపత్రం సమర్పించారు.