
ప్రపంచానికి న్యూ ఫ్యాక్టరీగా ఎదుగుతున్న ఇండియా
అపరిమిత నూతన ఆవిష్కరణల వేదికగా మారుతోంది
‘వోకల్ ఫర్ లోకల్’ పిలుపుతో సత్ఫలితాలు
అంతర్జాతీయ స్థాయికి చేరుతున్న భారత ఉత్పత్తులు
ఎన్‌ఎక్స్‌టీ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటన
‘న్యూస్‌ఎక్స్ వరల్డ్’ వార్తాచానల్ ప్రారంభం
న్యూఢిల్లీ: తాను ఇచ్చిన ‘వోకల్ ఫర్ లోకల్’ పిలుపుతో సత్ఫలితాలు లభిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. భారతీయ ఉత్పత్తులు అంతర్జాతీయ స్థాయికి వెళ్తున్నాయని, ప్రపంచమంతటా అందుబాటులోకి వస్తున్నాయని చెప్పారు. మన ఉత్పత్తులకు విదేశాల్లో డిమాండ్ పెరుగుతోందని అన్నారు. భారతదేశం అత్యున్నత తయారీ కేంద్రంగా, ప్రపంచ కర్మాగారంగా ఎదుగుతోందని స్పష్టంచేశారు.
శనివారం ఢిల్లీలో ఎన్‌ఎక్స్‌టీ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ‘న్యూస్‌ఎక్స్ వరల్డ్’ వార్తాచానల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఇండియా ఎన్నో రికార్డులు సృష్టిస్తోందని, ప్రపంచ శక్తిగా మారుతోందని ఉద్ఘాటించారు. అపరిమిత నూతన ఆవిష్కరణలకు భారత్ అడ్డా అని తేల్చిచెప్పారు.
ఎన్నో క్లిష్టమైన సమస్యలకు చౌకగా పరిష్కార మార్గాలు కనుగొంటూ ప్రపంచ దేశాలకు సైతం అందిస్తోందని వివరించారు. 21వ శతాబ్దంలో భారతదేశ శక్తిసామర్థ్యాలను ప్రపంచమంతా నిశితంగా గమనిస్తోందని పేర్కొన్నారు. భారత్‌లో పర్యటించాలని, దేశాన్ని అర్థం చేసుకోవాలని ప్రపంచ దేశాల ప్రజలు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారని తెలిపారు. సదస్సులో ప్రధానమంత్రి ఇంకా ఏం మాట్లాడారంటే...
ఇండియా ప్రగతికి ప్రపంచమే సాక్షి
‘‘ప్రపంచ దేశాలు కొన్ని దశాబ్దాలపాటు ఇండియాను తమ బ్యాక్ ఆఫీసుగానే పరిగణించాయి. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రపంచానికి న్యూ ఫ్యాక్టరీగా ఇండియా ఎదుగుతోంది. మ నం శ్రమశక్తి కాదు.. ముమ్మాటికీ ప్రపంచ శక్తి. రక్షణ ఉత్పత్తుల్లో మనది అగ్రస్థానం. మన ఇంజనీరింగ్, టెక్నాలజీ సామర్థ్యం ఎలాంటిదో ప్రపంచానికి తెలుస్తోంది. ఎల్రక్టానిక్స్ నుంచి ఆటోమొబైల్ దాకా కీలక రంగాల్లో ఇండియా ప్రగతికి ప్రపంచమే సాక్షి. విదేశాలకు ఎన్నో ఉత్పత్తులు అందజేస్తున్నాం. గ్లోబల్ సప్లై చైన్‌లో విశ్వసనీయ భాగస్వామిగా ఇండియాకు గుర్తింపు దక్కుతోంది. వేర్వేరు రంగాల్లో దేశం నేడు నాయకత్వ స్థాయికి ఎదిగిందంటే ఎన్నో ఏళ్ల నిరి్వరామ శ్రమ, క్రమానుగత విధానపరమైన నిర్ణయాలు’’.
ఇండియా అంటే ఇండోవేటింగ్
‘‘వోకల్ ఫర్ లోకల్, లోకల్ ఫర్ గ్లోబల్ అనే దార్శనికతను కొన్నేళ్ల క్రితం నేను స్వయంగా ఆవిష్కరించా. అది ఇప్పుడు వాస్తవ రూపం దాల్చింది. ఆశయం ఆచరణగా మారింది. ఫలితాలను స్వయంగా చూస్తున్నాం. సెమీకండక్టర్లు, ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ల తయారీలో ముందుకు దూసుకెళ్తున్నాం. మన సూపర్‌ఫుడ్స్ మఖానా, చిరుధాన్యాలకు ప్రపంచమంతటా ఆదరణ దక్కుతోంది. మన ఆయుష్ ఉత్పత్తులు, యోగా గురించి అన్ని దేశాల్లోనూ చర్చించుకుంటున్నారు. మనల్ని మనం ఉన్నది ఉన్నట్లుగా ప్రపంచం ఎదుట వ్యక్తీకరించుకోవాలి. మేకప్ అవసరం లేదు. సంకోచం వద్దు.
మన అసలైన విజయగాథలు ఉన్నది ఉన్నట్లుగానే ప్రపంచానికి చేరాలి. ‘సున్నా’ను ప్రపంచానికి పరిచయం చేసిన దేశం ఇండియా. ఇప్పుడు అపరిమిత ఆవిష్కరణల వేదికగా ఎదుగుతోంది. ఇండియా అంటే కేవలం ఇన్నోవేషన్ కాదు.. అది ఇండోవేటింగ్. అంటే ఇన్నోవేటింగ్ ద ఇండియన్ వే. ప్రపంచానికి అవసరమైన ఎన్నో పరిష్కార మార్గాలను చౌకగా, సులభంగా, వేగంగా మనం అందిస్తున్నాం. అద్భుతమైన యూపీఐ వ్యవస్థను అభివృద్ధి చేశాం. ఫ్రాన్స్, యూఏఈ, సింగపూర్ తదితర దేశాలు ఇలాంటి వ్యవస్థను ఉపయోగించుకుంటున్నాయి. కోవిడ్–19 నియంత్రణ కోసం వ్యాక్సిన్లు తయారీ చేసి ఇతర దేశాలకు సరఫరా చేశాం. మనం తీసుకొచ్చిన ఆరోగ్య సేతు యాప్ ఎన్నో దేశాలకు మార్గదర్శిగా మారింది’’ అని మోదీ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment