India Production
-
ప్రపంచ శక్తిగా భారత్
న్యూఢిల్లీ: తాను ఇచ్చిన ‘వోకల్ ఫర్ లోకల్’ పిలుపుతో సత్ఫలితాలు లభిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. భారతీయ ఉత్పత్తులు అంతర్జాతీయ స్థాయికి వెళ్తున్నాయని, ప్రపంచమంతటా అందుబాటులోకి వస్తున్నాయని చెప్పారు. మన ఉత్పత్తులకు విదేశాల్లో డిమాండ్ పెరుగుతోందని అన్నారు. భారతదేశం అత్యున్నత తయారీ కేంద్రంగా, ప్రపంచ కర్మాగారంగా ఎదుగుతోందని స్పష్టంచేశారు. శనివారం ఢిల్లీలో ఎన్ఎక్స్టీ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ‘న్యూస్ఎక్స్ వరల్డ్’ వార్తాచానల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఇండియా ఎన్నో రికార్డులు సృష్టిస్తోందని, ప్రపంచ శక్తిగా మారుతోందని ఉద్ఘాటించారు. అపరిమిత నూతన ఆవిష్కరణలకు భారత్ అడ్డా అని తేల్చిచెప్పారు. ఎన్నో క్లిష్టమైన సమస్యలకు చౌకగా పరిష్కార మార్గాలు కనుగొంటూ ప్రపంచ దేశాలకు సైతం అందిస్తోందని వివరించారు. 21వ శతాబ్దంలో భారతదేశ శక్తిసామర్థ్యాలను ప్రపంచమంతా నిశితంగా గమనిస్తోందని పేర్కొన్నారు. భారత్‌లో పర్యటించాలని, దేశాన్ని అర్థం చేసుకోవాలని ప్రపంచ దేశాల ప్రజలు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారని తెలిపారు. సదస్సులో ప్రధానమంత్రి ఇంకా ఏం మాట్లాడారంటే... ఇండియా ప్రగతికి ప్రపంచమే సాక్షి ‘‘ప్రపంచ దేశాలు కొన్ని దశాబ్దాలపాటు ఇండియాను తమ బ్యాక్ ఆఫీసుగానే పరిగణించాయి. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రపంచానికి న్యూ ఫ్యాక్టరీగా ఇండియా ఎదుగుతోంది. మ నం శ్రమశక్తి కాదు.. ముమ్మాటికీ ప్రపంచ శక్తి. రక్షణ ఉత్పత్తుల్లో మనది అగ్రస్థానం. మన ఇంజనీరింగ్, టెక్నాలజీ సామర్థ్యం ఎలాంటిదో ప్రపంచానికి తెలుస్తోంది. ఎల్రక్టానిక్స్ నుంచి ఆటోమొబైల్ దాకా కీలక రంగాల్లో ఇండియా ప్రగతికి ప్రపంచమే సాక్షి. విదేశాలకు ఎన్నో ఉత్పత్తులు అందజేస్తున్నాం. గ్లోబల్ సప్లై చైన్‌లో విశ్వసనీయ భాగస్వామిగా ఇండియాకు గుర్తింపు దక్కుతోంది. వేర్వేరు రంగాల్లో దేశం నేడు నాయకత్వ స్థాయికి ఎదిగిందంటే ఎన్నో ఏళ్ల నిరి్వరామ శ్రమ, క్రమానుగత విధానపరమైన నిర్ణయాలు’’. ఇండియా అంటే ఇండోవేటింగ్ ‘‘వోకల్ ఫర్ లోకల్, లోకల్ ఫర్ గ్లోబల్ అనే దార్శనికతను కొన్నేళ్ల క్రితం నేను స్వయంగా ఆవిష్కరించా. అది ఇప్పుడు వాస్తవ రూపం దాల్చింది. ఆశయం ఆచరణగా మారింది. ఫలితాలను స్వయంగా చూస్తున్నాం. సెమీకండక్టర్లు, ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ల తయారీలో ముందుకు దూసుకెళ్తున్నాం. మన సూపర్‌ఫుడ్స్ మఖానా, చిరుధాన్యాలకు ప్రపంచమంతటా ఆదరణ దక్కుతోంది. మన ఆయుష్ ఉత్పత్తులు, యోగా గురించి అన్ని దేశాల్లోనూ చర్చించుకుంటున్నారు. మనల్ని మనం ఉన్నది ఉన్నట్లుగా ప్రపంచం ఎదుట వ్యక్తీకరించుకోవాలి. మేకప్ అవసరం లేదు. సంకోచం వద్దు. మన అసలైన విజయగాథలు ఉన్నది ఉన్నట్లుగానే ప్రపంచానికి చేరాలి. ‘సున్నా’ను ప్రపంచానికి పరిచయం చేసిన దేశం ఇండియా. ఇప్పుడు అపరిమిత ఆవిష్కరణల వేదికగా ఎదుగుతోంది. ఇండియా అంటే కేవలం ఇన్నోవేషన్ కాదు.. అది ఇండోవేటింగ్. అంటే ఇన్నోవేటింగ్ ద ఇండియన్ వే. ప్రపంచానికి అవసరమైన ఎన్నో పరిష్కార మార్గాలను చౌకగా, సులభంగా, వేగంగా మనం అందిస్తున్నాం. అద్భుతమైన యూపీఐ వ్యవస్థను అభివృద్ధి చేశాం. ఫ్రాన్స్, యూఏఈ, సింగపూర్ తదితర దేశాలు ఇలాంటి వ్యవస్థను ఉపయోగించుకుంటున్నాయి. కోవిడ్–19 నియంత్రణ కోసం వ్యాక్సిన్లు తయారీ చేసి ఇతర దేశాలకు సరఫరా చేశాం. మనం తీసుకొచ్చిన ఆరోగ్య సేతు యాప్ ఎన్నో దేశాలకు మార్గదర్శిగా మారింది’’ అని మోదీ అన్నారు. -
దీపావళి ధమాకా!
న్యూఢిల్లీ: దేశీయంగా పండుగ సీజన్ సందర్భంగా రికార్డు స్థాయిలో అమ్మకాలు నమోదయ్యాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు రూ. 3.75 లక్షల కోట్ల మేర విక్రయాలు జరిగినట్లు అఖిల భారతీయ ట్రేడర్ల సమాఖ్య (సీఏఐటీ) వెల్లడించింది. రాబోయే గోవర్ధన పూజ, భాయ్ దూజ్, ఛత్ పూజ వంటి పర్వదినాల సందర్భంగా మరో రూ. 50,000 కోట్ల మేర వ్యాపారం జరగవచ్చని అంచనా వేస్తున్నట్లు వివరించింది. ఈసారి దీపావళికి ఎక్కువగా దేశీయంగా తయారైన ఉత్పత్తులే అమ్ముడైనట్లు సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. చైనా ఉత్పత్తులకు రూ. 1 లక్ష కోట్ల మేర వ్యాపారం తగ్గిపోయిందని పేర్కొన్నారు. ‘గతంలో దీపావళి పండుగ సందర్భంగా అమ్మకాల్లో చైనా ఉత్పత్తుల వాటా దాదాపు 70 శాతం ఉండేది. కానీ ఈసారి దేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునకు ఇటు వ్యాపారవర్గాలు, అటు వినియోగదారుల నుంచి భారీగా స్పందన లభించింది‘ అని ఆయన వివరించారు. ఇలా ఖర్చు చేశారు.. కస్టమర్లు ఈ దీపావళికి ఫుడ్, గ్రాసరీపై 13 శాతం వెచ్చించారు. వస్త్రాలు, దుస్తులపై 12 శాతం, ఆభరణాలకు 9 శాతం, ఎలక్ట్రానిక్స్, మొబైల్స్‌పై 8 శాతం, బహుమతులకు 8 శాతం, కాస్మెటిక్స్‌కు 6 శాతం ఖర్చు చేశారు. డ్రైప్రూట్స్, స్వీట్స్, నమ్కీన్ 4 శాతం, ఫర్నీషింగ్, ఫర్నీచర్ 4 శాతం, గృహాలంకరణ 3 శాతం, పూజా సామగ్రి 3, పాత్రలు, వంటింటి ఉపకరణాలు 3 శాతం, కన్ఫెక్షనరీ, బేకరీ 2 శాతం కైవసం చేసుకున్నాయి. ఆటోమొబైల్, హార్డ్‌వేర్, ఎలక్ట్రికల్, బొమ్మలు, ఇతర వస్తువులకు 20 శాతం వెచి్చంచారని సీఏఐటీ తెలిపింది. అన్ని విభాగాల్లోనూ జోష్.. రిటైల్‌లో అన్ని విభాగాలు మెరుగ్గా పనితీరు కనబరిచాయి. అమ్మకాల పరంగా ఆన్‌లైన్‌కు, ఆఫ్‌లైన్‌కు వ్యత్యాసం లేదని రిటైల్ రంగ నిపుణుడు కళిశెట్టి పి.బి.నాయుడు తెలిపారు. మొత్తం రిటైల్ వ్యాపారంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాటా 16 శాతం ఉందన్నారు. తెలుగు రాష్ట్రా ల్లో గతేడాదితో పోలిస్తే ఈ దీపావళికి డైమండ్ జువెల్లరీ విక్రయాలు 15–20 శాతం, బంగారు ఆభరణాలు 35 శాతం దూసుకెళ్లాయని హీరావాలా జెమ్స్, జువెల్లర్స్ ఎండీ గౌతమ్ చవాన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో రూ. 19,000 కోట్లపైనే.. ఇక, దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో రూ.19,000 కోట్లపైన వ్యాపార అమ్మకాలు జరిగినట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందులో అత్యధికంగా దుస్తులు, నిత్యావసర వస్తువులు, టపాసులు, గృహోపకరణాలు జరిగినట్లు తెలిపాయి. దీపావళి అంటే టపాసులతో పాటు స్వీట్లకు అత్యధిక ప్రాధాన్యత ఉండటంతో వీటికోసమే రూ.3,800 కోట్ల వరకు వ్యయం చేసినట్లు పేర్కొన్నాయి. దేశవ్యాప్తంగా సగటున ప్రతి ఒక్కరు దీపావళి పర్వదినం సందర్భంగా రూ.3,500 వరకు ఖర్చు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయని, ఆ లెక్కన చూస్తే రాష్ట్రంలో దీపావళి సందర్భంగా రూ.19,000 కోట్లపైన మార్కెట్ జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. -
ప్రణాళిక వ్యయం 2% అప్!
న్యూఢిల్లీ: మోడీ సర్కారు సంక్షేమ పథకాలకు తొలి బడ్జెట్లో భారీగానే నిధులు కుమ్మరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2014-15)లో బడ్జెట్లో ప్రణాళిక వ్యయం(ప్లాన్ ఎక్స్పెండిచర్) గతేడాదితో పోలిస్తే 2 శాతం(సుమారు రూ.11,000 కోట్లు) పెరగవచ్చని అంచనా. కాగా, ఈ ఏడాది ప్రతిపాదిత ప్రణాళిక వ్యయం లేదా స్థూల బడ్జెటరీ కేటాయింపు(జీబీఎస్) రూ.90,790 కోట్లు అధికంగా ఉండే అవకాశాలున్నాయని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. 2013-14 ఏడాది సవరించిన అంచనాల ప్రకారం చూస్తే ఈ మొత్తం 19 శాతం ఎక్కువకింద లెక్క. ప్రధానంగా భారత్ నిర్మాణ్, జాతీయ ఉపాధి హామీ పథకం, గ్రామీణ ఆరోగ్య పథకం వంటి సామాజిక రంగ స్కీమ్‌లకోసం చేసే వ్యయాన్ని జీబీఎస్‌గా వ్యవహరిస్తారు. గతేడాది ఈ మొత్తం రూ.5,55,322 కోట్లుగా ఉంది. వచ్చే నెల 10న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టనున్న మొట్టమొదటి బడ్జెట్లో జీబీఎస్ ఎంతుండాలనేది ఇప్పటికే ఖరారైపోయిందనేది ఆయా వర్గాల సమాచారం. కాగా, ద్రవ్యలోటు(ప్రభుత్వ వ్యయం, ఆదాయం మధ్య వ్యత్యాసం)ను అదుపులోపెట్టాల్సిన పరిస్థితుల నేపథ్యంలో జీబీఎస్ పెంపునకు అవకాశాలు కొద్దిగానే ఉన్నాయని సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు పేర్కొనడం గమనార్హం. తాజా గణాంకాల ప్రకారం గతేడాది ద్రవ్యలోటు 4.5%గా నమోదైంది. సవరించిన అంచనా 4.6% కంటే తగ్గింది. ఇందుకు ప్రభుత్వ వ్యయాల్లో కోత ఇతరత్రా అంశాలు దోహదం చేశాయి. ద్రవ్యలోటు ఆందోళనల నేపథ్యంలో గతేడాదికి జీబీఎస్‌ను బడ్జెట్ అంచనాల కంటే యూపీఏ ప్రభుత్వం తగ్గించింది. రూ.4,75,532 కోట్లకు పరిమితం చేసింది. వరుసగా రెండేళ్లు ప్రణాళిక వ్యయంలో గత సర్కారు భారీగా కోత విధించడం గమనార్హం.