ప్రణాళిక వ్యయం 2% అప్!
న్యూఢిల్లీ: మోడీ సర్కారు సంక్షేమ పథకాలకు తొలి బడ్జెట్‌లో భారీగానే నిధులు కుమ్మరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2014-15)లో బడ్జెట్‌లో ప్రణాళిక వ్యయం(ప్లాన్ ఎక్స్‌పెండిచర్) గతేడాదితో పోలిస్తే 2 శాతం(సుమారు రూ.11,000 కోట్లు) పెరగవచ్చని అంచనా. కాగా, ఈ ఏడాది ప్రతిపాదిత ప్రణాళిక వ్యయం లేదా స్థూల బడ్జెటరీ కేటాయింపు(జీబీఎస్) రూ.90,790 కోట్లు అధికంగా ఉండే అవకాశాలున్నాయని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. 2013-14 ఏడాది సవరించిన అంచనాల ప్రకారం చూస్తే ఈ మొత్తం 19 శాతం ఎక్కువకింద లెక్క.
ప్రధానంగా భారత్ నిర్మాణ్, జాతీయ ఉపాధి హామీ పథకం, గ్రామీణ ఆరోగ్య పథకం వంటి సామాజిక రంగ స్కీమ్‌లకోసం చేసే వ్యయాన్ని జీబీఎస్‌గా వ్యవహరిస్తారు. గతేడాది ఈ మొత్తం రూ.5,55,322 కోట్లుగా ఉంది. వచ్చే నెల 10న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టనున్న మొట్టమొదటి బడ్జెట్‌లో జీబీఎస్ ఎంతుండాలనేది ఇప్పటికే ఖరారైపోయిందనేది ఆయా వర్గాల సమాచారం. కాగా, ద్రవ్యలోటు(ప్రభుత్వ వ్యయం, ఆదాయం మధ్య వ్యత్యాసం)ను అదుపులోపెట్టాల్సిన పరిస్థితుల నేపథ్యంలో జీబీఎస్ పెంపునకు అవకాశాలు కొద్దిగానే ఉన్నాయని సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు పేర్కొనడం గమనార్హం.
తాజా గణాంకాల ప్రకారం గతేడాది ద్రవ్యలోటు 4.5%గా నమోదైంది. సవరించిన అంచనా 4.6% కంటే తగ్గింది. ఇందుకు ప్రభుత్వ వ్యయాల్లో కోత ఇతరత్రా అంశాలు దోహదం చేశాయి. ద్రవ్యలోటు ఆందోళనల నేపథ్యంలో గతేడాదికి జీబీఎస్‌ను బడ్జెట్ అంచనాల కంటే యూపీఏ ప్రభుత్వం తగ్గించింది. రూ.4,75,532 కోట్లకు పరిమితం చేసింది. వరుసగా రెండేళ్లు ప్రణాళిక వ్యయంలో గత సర్కారు భారీగా కోత విధించడం గమనార్హం.