‘రెవెన్యూ’కు నిరాశ
బడ్జెట్ కేటాయింపుల్లో గతేడాది కన్నా రూ.300 కోట్ల గండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కీలకమైన రెవెన్యూ శాఖకు తాజా బడ్జెట్‌లో నిరాశే మిగిలింది. పైగా గత సంవత్సరం కంటే తక్కువ నిధులను ప్రభుత్వం కేటాయించింది. సిబ్బంది వేతనాలు, కార్యాలయాల ఖర్చులు, అద్దె వాహన చార్జీలకు మాత్రమే నిధులను కేటాయించింది. శాఖాపరంగా తీసుకురాదలిచిన సంస్కరణలకు ఊతమిచ్చే ప్రయత్నం చేయలేదు. గత ఏడాది బడ్జెట్లో రూ.1,687 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈ ఏడాది కేటాయింపుల్లో రూ.300 కోట్లకుపైగా కోత పెట్టింది. ఈసారి 1,384.13 కోట్లను మాత్రమే కేటాయించింది.
ఇందులో ప్రణాళికా వ్యయం కింద రూ.46.76 కోట్లు, ప్రణాళికేతర పద్దులో రూ.1337.37 కోట్లు ఉన్నాయి. అన్ని గ్రామాల్లోనూ వీఆర్వో కార్యాలయాలు, రెవెన్యూ డివిజన్లలో ఆర్డీవో ఆఫీసులు, కలెక్టరేట్లకు కొత్త భవనాల నిర్మాణానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు. తాజా రెవెన్యూ చట్టాలపై సిబ్బందికి శిక్షణ, రెవెన్యూ వ్యవస్థ సంపూర్ణ కంప్యూటరీకరణకు కేవలం రూ.కోటితో సరిపెట్టింది. రెవెన్యూ శాఖకు సంబంధించి సచివాలయ విభాగానికి రూ.10.71 కోట్లు, జిల్లాల్లో భూపరిపాలన విభాగానికి రూ.859 కోట్లు కేటాయించింది.