ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఐదు నెలల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది. రూ. 2 లక్షల 94 వేల 427 కోట్ల బడ్జెట్‌లో విద్యా రంగానికి చేసిన కేటాయింపులు అరకొరగానే ఉన్నాయి. విద్యార్థుల సంక్షేమానికి ఇవి ఏమాత్రమూ సరిపోవు. గత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధిక నిధులు కేటాయించి విద్యారంగ సంక్షేమానికి పెద్దపీట వేసిన సంగతి ఈ సందర్భంగా గమనార్హం.
పాఠశాల విద్యకు చంద్రబాబు సర్కారు 2024–25 బడ్జెట్‌లో రూ. 29 వేల 909 కోట్లు కేటాయించింది. అంటే మొత్తం బడ్జెట్‌లో ఇది కేవలం 9.84 శాతం మాత్రమే. ఈ కేటాయింపు పాఠశాల విద్యను ఎలా బలోపేతం చేస్తుంది? ‘నాడు–నేడు’ పథకం గురించి బడ్జెట్‌లో ఊసె త్తలేదు. గత జగన్ ప్రభుత్వం పాఠశాల భవనాల నిర్మాణం, మరమ్మత్తుల కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలల స్థాయిలో తీర్చిదిద్దింది. 8వ తరగతి విద్యార్థులకు ఉచిత బైజూస్ కంటెంట్ ట్యాబ్‌లు పంపిణీ చేసింది. ఆరో తరగతీ, ఆపై చదువు తున్న విద్యార్థులకు 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్‌పీ) ఏర్పాటు చేసింది. 45 వేల స్మార్ట్ టీవీలను ప్రాథమిక పాఠశాలల్లో ఏర్పాటు చేసింది. పాఠ్య, నోట్ పుస్తకాలు; బ్యాగులు, బూట్లు, యూనిఫారాలు వంటి వాటిని పాఠశాలల ప్రారంభం రోజునే పూర్తి స్థాయిలో జగన్ ప్రభుత్వం అందించింది. ‘విద్యా కానుక’, ‘జగనన్న గోరుముద్ద’ వంటి పథకాలకు వేలకోట్లు ఖర్చు చేసింది.
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం, సీబీఎస్‌ఈ, ఐబీ సిలబస్‌లను జగన్ పటిష్టంగా అమలు చేశారు. గడిచిన ఐదేళ్లలో ఏకంగా రూ. 73 వేల కోట్లు విద్యారంగానికి కేటాయించి ఖర్చు చేశారు. గొల్లప్రోలు జెడ్పీ పాఠశాలలో తరగతి గదులు, ల్యాబ్‌లను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరిశీలించి ప్రైవేట్ పాఠశాలల కంటే ఇవే బాగున్నాయని వ్యాఖ్యనించారు. జగన్ అమలు చేసిన విప్లవాత్మక సంస్కరణలకు పవన్ వ్యాఖ్యలే అద్దం పడుతున్నాయి.
‘తల్లికి వందనం’ (జగన్ హయాంలో ‘అమ్మఒడి’) పథకానికి చంద్రబాబు సర్కారు బడ్జెట్‌లో కేవలం రూ. 5,387.03 కోట్లు మాత్రమే కేటాయించింది. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే వాళ్లందరికీ 15 వేల రూపాయల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చిన బాబు వాస్తవంగా 84 లక్షల మంది విద్యార్థులకు రూ. 12 వేల 600 కోట్లు ఇవ్వాలి. కేవలం ఐదు వేల కోట్ల రూపాయలు బడ్జెట్‌లో కేటాయించి చంద్రబాబు సర్కారు తల్లుల్ని తీవ్రంగా దగా చేసింది. ఇంగ్లీష్ మీడియం సీబీఎస్‌ఈ, ఐబీ బోధనను చంద్రబాబు సర్కారు రద్దు చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అట్టడుగు శ్రామిక వర్గాల పిల్లలకు నాణ్యమైన ఆంగ్ల మాధ్యమ చదువుల్ని కూటమి నేతలు దూరం చేస్తున్నారు.
చదవండి: ‘ఏపీ’ కోసం ప్రత్యేకమైన ‘ప్లానింగ్’ ఎందుకు జరుగుతున్నది?
ఉన్నత విద్యకి బడ్జెట్‌లో రూ. 2,326.68 కోట్లు కేటాయించారు. బోధనా ఫీజులు, ఉపకార వేతనాల బకాయిలు గత ఆరు నెలల నుండి రూ. 3,500 కోట్లు రావాలి. ఒక్క పైసా కూడా చంద్ర బాబు సర్కారు ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం 2024–25 బడ్జెట్‌లో బోధనా ఫీజులు, ఉపకార వేతనాల కోసం రూ. 2,542.95 కోట్లు కేటాయించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా 75 శాతం. ప్రతీ ఏటా 12 లక్షల మంది విద్యార్థులకి రూ. 2,800 కోట్లు అవసరం. హాస్టల్ మెస్ చార్జీలకు రూ. 1,100 కోట్లు అవసరం.
ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పోస్టు గత 5 నెలల నుండి ఖాళీగా ఉంది. జగన్ హయాంలో వున్న వైస్ ఛాన్స్‌లర్లను బలవంతంగా రాజీనామాలు చేయించింది చంద్రబాబు సర్కారు. 18 విశ్వ విద్యాలయాల వీసీ పోస్టుల్ని ఇంకా భర్తీ చేయలేదు. విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని చంద్రబాబు మోసగిస్తున్నారు. విద్యార్థి లోకం ఉద్యమించాల్సిన అవసరం ఉంది.
– ఎ. రవిచంద్ర
వైఎస్సార్ ఎస్‌యూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్
Comments
Please login to add a commentAdd a comment