ammavodi
-
అమ్మ ఒడి మూడో విడత నిధులను విడుదల చేసిన సీఎం జగన్
Jagananna Amma Vodi Srikakulam Tour Updates 12: 54PM అమ్మ ఒడి మూడో విడత నిధులను విడుదల చేసిన సీఎం జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి రూ. 6,595 కోట్లు జమ చేసిన సీఎం జగన్ విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నగదు జమ చేసిన సీఎం జగన్ 12:05 PM చదువే నిజమైన ఆస్తి అని సీఎం జగన్ స్పష్టం చేశారు. మనిషి తలరాతను మార్చగలిగే శక్తి చదువుకు మాత్రమే ఉందని, చదువుపై పెట్టే ప్రతి రూపాయి కూడా పిల్లల తలరాతలు మారుస్తుందని సీఎం జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. చదువులు ఎక్కువగా ఉండే దేశాల్లో ఆదాయం ఎక్కువగా ఉందన్నారు సీఎం జ.గన్. అమ్మఒడి మూడో విడతలో రూ. 6,595 కోట్లు జమ చేస్తున్నట్లు తెలిపారు. సుదీర్ఘ పాదయాత్రలో ప్రతి తల్లి కష్టాన్ని చూశానని, అందుకే అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామన్నారు. ‘జగన్ మావయ్యా..’ అంటూ ఇంగ్లీష్‌లో.. ► శ్రీకాకుళం ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న నిహారిక.. సీఎం జగన్‌ను మావయ్యా అని సంబోధిస్తూ.. అమ్మఒడి కార్యక్రమంలో ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడింది. అమ్మ ఒడితో పాటు పలుసంక్షేమ పథకాల ద్వారా తనలాంటి లక్షల మంది పిల్లలకు.. తల్లిదండ్రులకు చేకూరుతున్న లబ్ది గురించి చక్కగా వివరించింది ఆ చిన్నారి. చివర్లో.. ‘జగన్ మావయ్యా.. మీరు రాజన్నకి పుత్రుడు రైతన్నకి మిత్రుడు అక్కాచెల్లెలమ్మకు అన్నదమ్ముడు మాలాంటి పిల్లలకు విద్యాదేవుడు’.. అంటూ సీఎం జగన్ నుంచి ఆశీర్వాదం తీసుకుంది. ఆంగ్లంలో అనర్గళంగా ప్రసంగించిన ఆ చిన్నారి ప్రతిభను చూసి సీఎం జగన్ మురిసిపోయారు. ►11.48AM అమ్మఒడి కార్యక్రమం ఓ అద్భుతం. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చాలన్నదే సీఎం జగన్ ఆశయం. గతంలో ఎన్నడూ విద్య కోసం ఇంత పెద్దఎత్తున ఖర్చు చేయలేదు. విద్య, ఆరోగ్యానికి సీఎం జగన్ పెద్దపీట వేస్తున్నారు. విద్యార్థులంతా మంచి చదువులు చదువుకోవాలని ఆయన బలంగా కోరుకుంటున్నారు. ప్రతీ సంక్షేమ పథకం వెనుక దీర్ఘకాలమైన ఆలోచన ఉంది. అమ్మఒడిపై విపక్షాలు, ఎల్లోమీడియా విషప్రచారం చేస్తున్నాయి. అయితే.. వాస్తవాలేంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు: మంత్రి బొత్స ►11.40AM అమ్మఒడి పథకాన్ని దూరదృష్టితో సీఎం జగన్ ప్రవేశపెట్టారు. గత పాలకులు విద్యకు ప్రాధాన్యత ఇవ్వలేదు. రాష్ట్రంలో విద్యన్ ఆయన ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. తన బిడ్డల్లాగే అందరూ చదువుకోవాలన్నది సీఎం జగన్ ఆశయం. పేద పిల్లలు కూడా ఉన్నత విద్య చదవాలన్నది ఆయన తపన అని మంత్రి ధర్మాన ప్రసంగించారు. ఇదే వేదిక నుంచి ప్రతిపక్షాలకు అసత్య ప్రచారం మానుకోవాలని పిలుపు ఇచ్చారాయన. 11.35AM ► స్థానిక శాసన సభ్యులు, రెవెన్యూ మంత్రి శ్రీ ధర్మాన ప్రసాదరావు సభాక్షతన ప్రారంభమైన అమ్మఒడి మూడో విడుత నిధుల విడుదల కార్యక్రమ సభ. ► జగనన్న అమ్మఒడి కార్యక్రమంలో భాగంగా.. వేదికపైకి చేరుకున్న సీఎం జగన్. దివంగత మహానేత వైఎస్సార్‌కు నివాళి.. జ్యోతి ప్రజల్వన అనంతరం నేతలతో ఆప్యాయ పలకరింపు. ► అమ్మ ఒడి కార్యక్రమం సభా వేదిక వద్ద విద్యార్థులు, తల్లులతో సీఎం జగన్ ఆప్యాయ పలకరింపు. వాళ్లతో ఫొటో దిగిన సీఎం జగన్. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► అమ్మ ఒడి మూడవ విడత కార్యక్రమం సందర్భంగా.. విద్యార్థులు, తల్లిదండ్రుల ముఖాల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమ్మ ఒడితో.. రాష్ట్రంలో ఎక్కువగా పేద విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. చిన్న చిన్న పనులు చేసుకునే తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడకుండా.. వాళ్లకు సీఎం జగన్ ప్రభుత్వం భరోసా ఇస్తోంది. శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియం వద్ద కాసేపట్లో సీఎం జగన్ ప్రసంగించి.. నిధులు విడుదల చేయనున్నారు. 10.56AM ► శ్రీకాకుళం చేరుకున్న సీఎం వైఎస్ జగన్. మరికాసేపట్లో జగనన్న అమ్మ ఒడి మూడో విడుత నగదు విడుదల. 10.35AM ► విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి శ్రీకాకుళం బయల్దేరిన సీఎం జగన్. శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియంలో జగనన్న అమ్మ ఒడి మూడో విడత నగదు రిలీజ్ కార్యక్రమం. ఆనందంగా బడికి పంపుతున్నారు ► అమ్మ ఒడి మూడో విడత కార్యక్రమం నేపథ్యంలో.. శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియం వద్ద కోలాహలం నెలకొంది. సీఎం జగన్ తెచ్చిన ఈ పథకం వల్ల ఎందరో పేద తల్లిదండ్రులు.. తమ తమ పిల్లలను ఆనందంగా బడికి పంపుతున్నారు. ఈ విషయాన్నే కొందరు విద్యార్థులు సాక్షికి తెలియజేశారు. ‘‘మా నాన్నగారు ఒక రైతు. ప్రభుత్వ కాలేజీలోనే చదివిస్తున్నారంటూ ఓ విద్యార్థిని చెప్పగా.. తన తండ్రి తాపీ మేస్త్రీ అని, పల్లెటూరి నుంచి వచ్చిన తనకు తండ్రిపై ఆర్థిక భారం లేకుండా అమ్మ ఒడి సాయం చేస్తోందని మరో విద్యార్థిని తెలిపింది. 8.35 AM ► జగనన్న అమ్మ ఒడి పథకం కోసం.. శ్రీకాకుళం పర్యటనకు బయల్దేరారు సీఎం వైఎస్ జగన్. ► తాజాగా ఇచ్చే సొమ్ముతో కలిపి ఇప్పటివరకు జగనన్న అమ్మ ఒడి పథకం ద్వారా ప్రభుత్వం మొత్తం దాదాపు రూ.19,618 కోట్లు అందించినట్లు కానుంది. ► జగనన్న అమ్మ ఒడి పథకాన్ని వరుసగా మూడో ఏడాది (2021–22 విద్యా సంవత్సరానికి) అమలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ► ఒకటి తరగతి నుంచి ఇంటర్ దాకా చదువుతున్న 82,31,502 మంది విద్యార్ధులకు అమ్మ ఒడితో లబ్ధి చేకూరుతుంది. ► 43,96,402 మంది తల్లుల ఖాతాల్లో.. రూ.6,595 కోట్లను సీఎం జగన్, సోమవారం శ్రీకాకుళంలో నిర్వహించే కార్యక్రమంలో జమ చేయనున్నారు. ► అమ్మ ఒడి ద్వారా 2019 –20లో రాష్ట్ర ప్రభుత్వం 42,33,098 మంది తల్లులకు రూ.6,349.53 కోట్లు అందించింది. 2020– 21లో 44,48,865 మందికి రూ.6,673 కోట్లకుపై సాయంగా ఖాతాల్లో జమ చేసింది. ► సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం 11 గంటల ప్రాంతంలో.. శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. అమ్మ ఒడి పథకం లబ్ధిదారులతో ముఖాముఖి అనంతరం సీఎం జగన్ ప్రసంగిస్తారు. కార్యక్రమం తర్వాత బయలుదేరి.. తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
CM YS Jagan: శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటన ఇలా..
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 27న జిల్లా పర్యటనకు రానున్న సందర్భంగా సీఎం అదనపు పీఎస్ కె.నాగేశ్వరరెడ్డి టూర్ షెడ్యూల్‌ను వివరిస్తూ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సీఎం ఉదయం 9 గంటలకు ఆయన నివాసం నుంచి బయల్దేరి 9.20 గన్నవరం ఎయిర్‌పోర్టుకి చేరుతారు. 9.30 గంటలకు విమానంలో బయల్దేరి విశాఖపట్నంకి 10.15కు చేరుకుంటారు. 10.25కు హెలీకాప్టర్‌లో విశాఖపట్నం నుంచి బయలుదేరి 11గంటలకు శ్రీకాకుళం చేరుకుంటారు. 11 నుంచి 11.15 వరకు ప్రజలు, అధికారులతో మాట్లాడుతారు. ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద ఉన్న హెలీప్యాడ్ నుంచి బయల్దేరి కోడి రామ్మూర్తి స్టేడియానికి 11.25కు చేరుకుంటారు. 11.25 నుంచి 11.45 వరకు సభావేదికపైన అతిథుల ప్రసంగం ఉంటుంది. 11.45 నుంచి 11.55 వరకు సంక్షేమ పథకాల లబ్ధిదారులతో మాట్లాడతారు. 11.55 నుంచి 12.40 వరకు సీఎం ప్రసంగిస్తారు. 12.40 నుంచి 12.45 రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అమ్మఒడి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు వేసేందుకు బటన్ నొక్కుతారు. 12.45కి బయలుదేరి ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద హెలీప్యాడ్‌కు చేరుకుంటా రు. మధ్యాహ్నం 1 గంటకు హెలీకాప్టర్‌లో బయల్దేరి 1.35కు విశాఖపట్నం చేరుకుంటారు. అనంతరం 1.45కు విశాఖపట్నం నుంచి విమానంలో బయలుదేరి గన్నవరం ఎయిర్‌పోర్టుకు 2.30గంటలకు చేరుకుంటారు. అనంతరం సీఎం నివాసానికి 2.40 గంటలకు చేరుకుంటారు. చదవండి: (గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ జీవో విడుదల) -
CM Jagan: శ్రీకాకుళం జిల్లా పర్యటనకు సీఎం జగన్
సాక్షి, శ్రీకాకుళం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 27న శ్రీకాకుళం రాను న్నారు. అమ్మఒడి పథకం మూడో విడత పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే సీఎం చేపట్టనున్నా రు. ఇదే సందర్భంలో శ్రీకాకుళం–ఆమదాలవలస రోడ్డు నాలుగు లైన్ల విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన కోసం ఏర్పాట్లు సమీక్షించేందుకు సీఎం ప్రోగ్రాం కో ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ మంగళవారం శ్రీకాకుళం వచ్చారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌తో కలిసి కోడి రామ్మూర్తి స్టేడియం, ఆర్ట్స్ కళాశాల ప్రాంగణాలను పరిశీలించారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం పర్యటన సాగేదిలా.. ఈ నెల 27న సోమవారం ఉదయం 11 గంటల కు శ్రీకాకుళంలో బహిరంగ సభ జరగనుంది. ఈ కార్యక్రమానికి అమ్మ ఒడి లబ్ధిదారులు హాజరు కానున్నారు. మూడో విడత పంపిణీ కార్యక్రమం ఇక్కడి నుంచే జరుగుతుంది. అంతకుముందు ఆమదాలవలస–శ్రీకాకుళం రోడ్డు నాలుగు లైన్ల విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అమ్మ ఒడి లబ్ధిదారులతో మమేకమవుతారు. తిత్లీ, వంశధార ప్రాజెక్టుకు అదనపు పరిహారం పొందుతున్న లబ్ధిదారులతో కూడా కాసేపు ముచ్చటిస్తారు. ఈ సందర్భంగా ఆ లబ్ధిదారులు సీఎంకు ధన్యవాదాలు తెలియజేయనున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన సందర్భంగా కోడి రామ్మూర్తి స్టేడియంను పరిశీలించిన సీఎం ప్రోగ్రాం కో ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్, ఎస్పీ రాధిక తదితరులు ఏర్పాట్లపై సమీక్ష.. సీఎం హాజరవుతున్న ఈ కార్యక్రమాలకు సంబంధించి, పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై తలశిల రఘురాం, ధర్మాన కృష్ణదాస్, కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్, ఎస్పీ రాధిక సమీక్షించారు. ముందు గా కోడి రామ్మూర్తి స్టేడియం, ఆర్ట్ కళాశాల మైదా నం పరిశీలించారు. అనంతరం హెలీపాడ్ స్థలి, సీఎం పయనించే మార్గం, బహిరంగ సభ, లబ్ధిదారులతో ముఖాముఖీ తదితర వాటిపై చర్చించారు. అనంతరం ఆర్అండ్బీ బంగ్లాకు చేరుకుని జిల్లా స్థాయి అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సీఎం పర్యటనకు సంబంధించి పలు సూచన, సలహాలు చేశారు. కార్యక్రమంలో ధర్మా న రామ్ మనోహర్‌నాయుడు, తూర్పు కాపు కార్పొరేషన్ అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్, కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అంధవరపు సూరిబాబు, డీఆర్డీఎ పీడీ బి.శాంతిశ్రీ, ఆర్డీవో బి.శాంతి, శ్రీకాకుళం కార్పొరేషన్ కమిషనర్ ఓబులేసు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వడ్డి సుందర్, ఆర్అండ్బి ఎస్ఈ కాంతిమతి, డీఈవో పగడాలమ్మ, సమగ్ర శిక్ష అభియాన్ పీఓ జయప్రకాష్, డీఎస్పీ మహేంద్ర, వైఎస్సార్సీపీ నాయకులు మెంటాడ స్వరూప్, జలుమూరు ఎంపీపీ వాన గోపి, శిమ్మ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: (28న ప్యారిస్‌కు సీఎం జగన్) సీఎం పర్యటన విజయవంతం చేయాలి అమ్మ ఒడి మూడో విడత పంపిణీ, మరికొన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు జిల్లాకొస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన విజయవంతం చేయాలని ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. అమ్మ ఒడి లబ్ధిదారులు, పార్టీ శ్రేణు లు హాజరై జయప్రదం చేయాలని కోరారు. -
చదువుల విప్లవం.. విద్యా రంగంలో ఏపీ ఆదర్శం..
ఎంత ఖర్చయినా సరే మీరు చదువుకోండి.. మీ చదువులకయ్యే ఖర్చు ప్రభుత్వానికి వదిలేయండి.. ఆర్థిక పరిస్థితులు సహకరించడం లేదని ఏనాడూ చింతించవద్దు.. మీ చదువుకు నాదీ గ్యారంటీ.. ఇవీ మొదటి నుంచీ విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్న ప్రకటనలు.. రాష్ట్రంలో చదువుల విప్లవం కోసం ఆయన ఎంతగానో తపిస్తున్నారు. లక్షలాది మంది విద్యార్థుల కోసం చేస్తున్న వేలాది కోట్ల రూపాయల ఖర్చు రాష్ట్ర బంగారు భవిష్యత్తుకే అనేది ఆయన ప్రగాఢమైన నమ్మకం.. ఈ నేపథ్యంలో ప్రారంభించిన అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక, మన బడి-నాడు నేడు, గోరు ముద్ద, వైఎస్సార్ పోషణ మొదలైన పథకాలు, కార్యక్రమాలు విద్యారంగంలో సమూల మార్పులకు కారణమవుతున్నాయి. చదవండి: అవధులు లేని సంతోషం.. సీఎం జగన్ మేలు మరిచిపోలేం.. రాజమండ్రి తాడితోట ప్రాంతం చిన్న ఇంట్లో పార్వతి కుటుంబం నివసిస్తోంది. ఈమె ఇస్త్రీ పని చేసుకుంటూ ఇద్దరు పిల్లల్ని చదివిస్తోంది. నాలుగేళ్ల క్రితం భర్త చనిపోయాడు.. మొత్తం కుటుంబ భారం తన మీద పడడంతో ఏం చేయాలో దిక్కు తెలియని పరిస్థితి వుండేది. పిల్లల చదువులు ఎలా అని పార్వతి చింతిస్తున్న సమయంలో వైఎస్ జగన్ ప్రభుత్వ పాలన ప్రారంభమైంది. విద్యారంగ పథకాలు ఒక్కటొక్కటిగా అందుబాటులోకి వచ్చాయి. విద్యారంగ పథకాలు ముఖ్యంగా అమ్మఒడి వీరికి అండగా నిలిచింది. పిల్లలను బడికి పంపే ప్రతి పేదతల్లికి ఏటా రూ. 15 వేల రూపాయలు ఇస్తానని ఎన్నికలకు ముందు చెప్పిన వైఎస్ జగన్.. తన మాట నిలబెట్టుకున్నాడు. అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించి పాఠశాల విద్యార్థులకేకాకుండా ఇంటర్ దాకా ఈ పథకాన్ని విస్తరించి ప్రతి ఏటా ఆర్థిక సాయం అందిస్తున్నారు. తండ్రి చనిపోయిన సమయంలో తల్లి నిస్సహాయంగా నిలిచిపోయిన కష్టకాలంలో మనం చూస్తున్న ఈ భువనేశ్వర్ అనే కుర్రాడికి అమ్మ ఒడి పథకం ఒక వెలుగు దివ్వెలాగా అవతరించింది. ఆర్థిక కష్టాలు భరించలేక, ఎంతో కొంత ఆదాయం వస్తుంది కదా అని పిల్లల్ని బడికి పంపకుండా పనులకు పంపే తల్లిదండ్రుల్లో మార్పు వచ్చిందనడానికి ఈ కుర్రాడే నిదర్శనం. పార్వతి కుమారుడు భువనేశ్వర్ చదువు మధ్యలో ఆగిపోలేదు. ఇరుకు గదుల్లో ఇబ్బందులు పడుతూ రేపటి బంగారు భవిష్యత్తు కోసం అలుపెరగని శ్రమ చేస్తున్న సామాన్య సాధారణ కుటుంబాల్లో విద్యా వెలుగులు విస్తరిస్తున్నాయి. దీనికి నిదర్శనమే రాజమండ్రి నగరంలో నివసిస్తోన్న ఈ కుటుంబం. ఈమె పేరు రామలక్ష్మి. ఈమె టైలర్ పని ద్వారా, ఈమె భర్త కూలీ పని ద్వారా ఉపాధి పొందుతున్నారు. రామలక్ష్మి దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరినీ చదివించడం కష్టమే అని గతంలో భావించిన రామలక్ష్మి ప్రస్తుతం ఇద్దరినీ చక్కగా చదివిస్తున్నారు. చిన్న చిన్న వృత్తులను నమ్ముకొని బతుకు పోరాటం చేస్తున్న లక్షలాది కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు అండగా నిలుస్తున్నాయి. విద్యారంగ పథకాల కారణంగా సామాన్య పేద కుటుంబాల తల్లిదండ్రులు చదువులపట్ల మొగ్గు చూపుతున్నారు. దాంతో రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మధ్యలోనే చదువులు మానేసేవారి సంఖ్య తగ్గిపోయి అదే సమయంలో చదువుల బాట పట్టిన వారి సంఖ్య పెరుగుతోంది. ఇది మన కళ్ల ముందే కనిపిస్తున్న మార్పు.. అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, విద్యా కానుక, మన బడి నాడు-నేడు, గోరుముద్ద, వైఎస్సార్ పోషణ, విదేశీ విద్యాదీవెన.. ఇవీ ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో అమలవుతున్న విశిష్ట పథకాలు.. ఒక్కొక్కటి ఒక్కో వైవిధ్యతతో రూపొంది విద్యార్థులకు అండగా నిలుస్తున్నాయి. ప్రతి పథకం విషయంలో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచనల ప్రకారం అమలు చేస్తున్నారు. మనం మన పిల్లలకు ఇచ్చే అసలు సిసలైన ఆస్తి చదువే అనేది వైఎస్ జగన్ సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతున్న మాట.. దానికి అనుగుణంగానే రాష్ట్రమంతా పలు విద్యారంగ పథకాలు అమలువుతున్నాయి. ఇక్కడ ఇంటి పనులు చేస్తూ, తల్లికి చేదోడు వాదోడుగా వున్న ఈ అమ్మాయి పేరు సబ్బెళ్ల లక్ష్మీ.. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామానికి చెందిన లక్ష్మీ ప్రస్తుతం బిటెక్ ఆఖరి సంవత్సరం పూర్తి చేసే పనిలో వుంది. తమ్ముడితో కలిసి విశాఖపట్టణంలోని ప్రైవేటు కాలేజీలో చదువుకుంటున్న ఈ అమ్మాయి చదువు పూర్తి కాకముందే ప్రముఖ కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం సంపాదించుకుంది. వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు ఆదుకున్నాయని, కరోనా కారణంగా ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్న సమయంలో ఈ రెండు పథకాలు అండగా నిలిచాయని ఈ అమ్మాయి అంటోంది. విద్యాదీవెన అంటే విద్యార్థులకు పూర్తి ఫీజులు చెల్లించే పథకం.. గతంలో చంద్రబాబు ప్రభుత్వం అరకొర ఫీజులు చెల్లిస్తే.. వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంత ఫీజుంటే అంత ఫీజూ ఇస్తోంది.. ఇది ఈ పథకంలో ప్రత్యేకత. ఇక అంతటితో ఆగిపోకుండా వసతి దీవెన అనే మరో పథకాన్ని కూడా వైఎస్ జగన్ ప్రవేశపెట్టారు. ఊరుగాని ఊరిలో తల్లిదండ్రులకు దూరంగా హాస్టళ్లలో వుండి చదువుకునే పిల్లలకు అక్కడ వారి ఖర్చులకోసం ప్రతి ఏడాది ఇరవై వేల రూపాయలవరకు అందిస్తున్నారు. దాంతో విద్యార్థుల తల్లిదండ్రులపై హాస్టల్, మెస్ భారం తొలగిపోతోంది. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొమరిపాలెం గ్రామానికి చెందిన వీర వెంకట సత్యనారాయణ స్థానికంగా కిరాణా షాపు నడుపుకుంటున్నారు. ఈయనకు ఇద్దరు మగపిల్లలు. ఇద్దరిలో ఒకరు బిటెక్ చదువుతుండగా మరొకరు బీసీఏ చదువుతున్నారు. పిల్లలు తెలివైనవారు..లక్షలాది రూపాయలు ఖర్చు చేసి వారిని ప్రొఫెషనల్ కోర్సులు చదివించడం కష్టమే అని ఈయన అనుకుంటున్న సమయంలో ప్రభుత్వ విద్యారంగ పథకాలు చక్కగా అందుబాటులోకి వచ్చాయి. రాజమండ్రిలో ఓ హాస్టల్లో వుంటూ చదువుకుంటున్న సత్యనారాయణ చిన్న కుమారుడు విఘ్నేష్ సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు సాక్షి పలకరించింది. తన తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ప్రభుత్వం ఆదుకుంటోందని విద్యాదీవెన వసతి దీవెన పథకాలు తమకు అందుతున్నాయన్నారు. ఎన్నికలకు ముందు ఒకలాగా, ఎన్నికలైపోయి అధికారం చేపట్టిన తర్వాత మరొకలా వ్యవహరించే రాజకీయ పార్టీల గురించి మనకు తెలుసు.. మేనిఫెస్టోను ఘనంగా ముద్రించి అవి చేస్తాం ఇవి చేస్తామని ఊరూవాడా ప్రచారం చేసి ఆ తర్వాత మేనిఫెస్టోను బుట్టదాఖలు చేసిన పార్టీలను మనం చూశాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తమది అలాంటి పార్టీ కాదని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం ద్వారా ప్రజాభిమానం మరింత పొందుతున్నామని సగర్వంగా చెబుతున్నారు. -
శ్రమ విలువ తెలుసు కాబట్టే...
జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఆంధ్రప్రదేశ్ సామాజిక ముఖచిత్రమే మారిపోయింది. పేదవాడి అవసరాలను తీర్చడం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. విద్య, వైద్యం ఉచితంగా అందించడం, ఆహార ధాన్యాల ఉత్పత్తికి అనువుగా పెట్టుబడి రాయితీలు ఇవ్వడం, ‘రైతు భరోసా’ కేంద్రాల ద్వారా నాణ్య మైన విత్తనాలు, ఎరువులు అందించడం, మెట్ట ప్రాంతాలలో ఉచిత బోర్లు వేసే ‘జలకళ‘ కార్య క్రమాలను చేపట్టడం; ‘అమ్మ ఒడి’ పథకాన్ని ప్రారంభించడం, డ్వాక్రా రుణాలు ఇవ్వడం; పాడి పశువులు, గొర్రెలు, మేకల పెంపకానికి ‘చేయూత’ అందించడం; ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోతే ఏ సీజన్లో నష్టాన్ని అదే సీజన్లో చెల్లించే నూతన ఒరవడికి శ్రీకారం చుట్టడం, రోజు వారీ పనులు చేసుకునే వారికి ‘ఆసరా’ ఇస్తూ నిత్యం పేదవాడి చేతిలో డబ్బు ఉండేలా చూసి ఉత్పత్తి రంగం దెబ్బతినకుండా చూడడం వంటి జగనన్న ప్రభుత్వం చేపట్టిన ఎన్నో పథకాలు పేదలకు, మహిళలకు, మైనారి టీలకు వెన్నుదన్నుగా నిలిచాయి. శ్రమైక జీవులైన వెనుకబడిన 139 కులాల వారిని 58 కార్పొరేషన్ల ద్వారా ఆదుకునే ప్రయత్నం మామూలు విషయం కాదు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి 760 మందిని... అంటే ఐదేళ్లలో దాదాపు 2,000 మందికి పైగా ఈ కులాలకు చెందిన వారిని నాయకులుగా తీర్చిదిద్ది రాజకీయంగా ఎదిగే అవకాశం కల్పిస్తున్నారు. శ్రమజీవుల కోసం మరో మహా యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. అదే 35 లక్షల మందికి ఇంటి పట్టాలు ఇచ్చి, అందరికీ గృహాలు నిర్మించి సొంత ఇంటి కలను నెరవేర్చ పూనుకోవడం. ఇది ఒక విప్లవాత్మకమైన చర్య. అంతేకాకుండా విద్యాల యాలను, వైద్యశాలలను ఆధునికీకరించడం ద్వారా నాణ్యమైన విద్య, వైద్యం పేదవాడికి అందుబాటులో ఉంచారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చెందడానికి పాలనా వికేంద్రీకరణకు వీలు కల్పించే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. అన్ని మతాల వారినీ సమానంగా గౌరవించడంలో భాగంగా మసీదులు, మదరసాలు, దేవాలయాలు, చర్చిల... నిర్మాణాలు, పునరుద్ధరణ కార్యక్రమాలకు ప్రభుత్వ సాయం అందించడం, ఆయా ప్రార్థనా మందిరాల్లో పనిచేసే మత పెద్దలుగా లేదా పూజారులుగా ఉన్నవారికి జీతాలు ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించడం జగన్ ప్రభుత్వ చలవే. ఇవన్నీ చూసినప్పుడు పేదవాని శ్రమను గుర్తించిన వాడుగా జగన్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారనిపిస్తుంది. ప్రతిపక్షం ప్రభుత్వ ప్రతిష్ఠను పలుచన చేయడా నికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా లెక్కచేయకుండా ముందుకు పోతున్నారు జగన్. – కె.వి. రమణ బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ -
అమ్మఒడిపై లఘు చిత్రం ఆవిష్కరణ
సాక్షి, అమరావతి: జగనన్న అమ్మఒడి పథకంపై నిర్మాత చుండూరు సుందర రామశర్మ నిర్మించిన లఘు చిత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఈ కార్యక్రమం జరిగింది. ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆ అమ్మాయి మాటను అమెరికా మెచ్చింది
ఎక్కడో మారుమూల... శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం తాడివలస గ్రామం. ఆ గ్రామానికి చెందిన విద్యార్థిని గురుగుబిల్లి ఢిల్లీశ్వరి వివేకానందుని షికాగో ప్రసంగాన్ని అనర్గళంగా చదివి అందరి మన్ననలు అందుకుంది. ఆమె ప్రసంగం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తోంది. విద్యార్థిని ప్రసంగించిన తీరుకు అబ్బురపడిన తానా అధ్యక్షులు స్వయంగా ఆర్థిక సాయం ప్రకటించారు. ఆమె చదువు బాధ్యత అంతా తామే తీసుకుంటామని తానా ప్రకటించింది. అంతేకాకుండా ఆ పాఠశాలలో చదువుతున్న మిగతా పేద విద్యార్థులకు సైతం సాయం చేస్తామని వాగ్దానం చేశారు. ‘అమ్మ ఒడి’తో వివేకానందుని ప్రసంగం.. జనవరి 9, 2019న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకం ప్రారంభోత్సవం సందర్భంగా తాడివలస పాఠశాలలో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. ప్రపంచానికి భారతదేశ గొప్పదనాన్ని, సంస్కృతి, సాంప్రదాయాలను ఎలుగెత్తి చాటిన వివేకానందుని స్ఫూర్తి ప్రసంగాలపై ఉపాధ్యాయులు పోటీలు నిర్వహించారు. పలువురు విద్యార్ధుల ప్రసంగాలకు మించి విద్యార్థిని ఢిల్లీశ్వరి విశేష ప్రతిభను కనబరిచింది. ఢిల్లీశ్వరి చేసిన ప్రసంగాన్ని సంబంధిత పాఠశాల ఉపాధ్యాయులు సామాజిక మాధ్యమాల్లో వీడియో రూపేణా పెట్టారు. ఈ వీడియోకు విపరీతమైన లైక్‌లు... వేలల్లో షేరింగ్‌లు, కామెంట్స్ వచ్చాయి. చివరికి ఈ వీడియో తానా పెద్దల కంట పడింది. ఇంకేముంది... తానా ప్రతినిధులు రామచౌదరి, ఉప్పలూరు రేఖ పాఠశాల హెచ్.ఎం లఖినేని హేమనాచార్యులు, ఉపాధ్యాయుడు పూజారి హరి ప్రసన్నలకు ఫోన్ చేసి మాట్లాడారు. ఢిల్లీశ్వరి కుటుంబ విషయాలను తెలుసుకున్నారు. ఆమె భవిష్యత్‌కు చేయూతనిచ్చేందుకు. ఆమె ఉన్నత చదువులు చదువుకునేందుకు నగదు పురసారాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 31న ఆమెకు లక్షా ముప్ఫైవేల రూపాయల నగదు, ఖరీదైన ఆండ్రాయిడ్ ఫోన్, సైకిల్ ఇవ్వనున్నారు. అదే పాఠశాలలో తల్లితండ్రుల్లో్ల ఒక్కరి సంరక్షణలో మాత్రమే ఉన్నటువంటి 25 మంది విద్యార్థులను ఎంపిక చేసి వారందరికీ సైకిళ్లను అందజేసేందుకు ముందుకొచ్చారు. చుట్టుపక్కల గ్రామాల్లో చదువుతున్న నిరుపేద విద్యార్ధులు మరో 30 మందికి కూడా సైకిళ్లు ఇచ్చేందుకు తానా పెద్దలు హామీ ఇచ్చారు. తానా స్ఫూర్తితో తెలుగు రాష్ట్రాల్లో మరికొంతమంది సహాయాన్ని అందించేందుకు ముందుకొచ్చారు. నేడు శ్రీకాకుళంలో నిర్వహించనున్న బాలరంజని కార్యక్రమంలో గన్నవరంకు చెందిన చలసాని దత్తు రూ. 9,999 ఢిల్లీశ్వరికి అందించనున్నారు. కాగా గురుగుబెల్లి ఢిల్లీశ్వరి తండ్రి వెంకటరమణ సెప్టెంబర్ 9, 2020న మృతి చెందాడు. ఏడేళ్లుగా బ్లడ్ కేన్సర్ వ్యా«ధితో బాధపడ్డ వెంకటరమణ కూలిపని, మేస్త్రీ పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారు. కరోనా సమయంలో మృతి చెందారు. దాంతో కుటుంబ భారమంతా ఢిల్లీశ్వరి తల్లి మీద పడింది. ఈ నేపథ్యంలో తానా అందించనున్న సాయం వారికి కొండంత అండ అయింది. నాన్నే సాయం చేయిస్తున్నట్లుంది..! గత ఏడాది అమ్మ ఒడి ప్రారంభం రోజున హరిప్రసన్న మాస్టారు రాసి ఇచ్చిన రాతప్రతి ఆధారంగా అందరి ముందు ప్రసంగించాను. వివేకానందుని స్ఫూర్తి ప్రసంగం కావడంతో అందరి మన్ననలను పొందాను. నన్ను గుర్తించిన తానా ప్రతినిధులు, తెలుగు రాష్ట్రాల ప్రజలు చదువుకోవడానికి సాయం చేయడం ఎంతో సంతోషంగా ఉంది. మానాన్నే నాకు సాయం చేయిస్తున్నట్లు అనిపిస్తోంది. – గురుగుబెల్లి ఢిల్లీశ్వరి, ఏడో తరగతి, తాడివలస జెడ్పీ హైస్కూల్. అంతా కలలాగా ఉంది! నా కూతురు ప్రతిభ ప్రపంచ దేశాల్లోని తెలుగు వారు గుర్తించడంతో చాలా సంతోషంగా ఉంది. భర్త దూరమైన బాధను మరిపిస్తుంది. అమెరికా నుంచి ఫోన్ రావడం, వారు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పడం అంతా కలగా ఉన్నట్లు అనిపించింది. వాస్తవంగా జరుగుతుండటంతో చాలా ఆనందంగా ఉంది. – గురుగుబెల్లి భాగ్యలక్ష్మి, విద్యార్థిని తల్లి ఎంతో ఆనందంగా ఉంది... మా పాఠశాలకు విదేశాల్లోను, తెలుగు రాష్ట్రాల్లోనూ గుర్తింపు రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఇదే స్ఫూర్తితో మున్ముందు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులకు మంచి విలువలతో కూడిన విద్యను అందించేందుకు కృషి చేస్తాం. తానా సభ్యులు ఈ విద్యార్థినికి ఆర్థిక సహాయం అందించడంతోపాటు మిగిలిన నిరుపేద పిల్లలకు కూడా సైకిళ్లు ఇవ్వాలనుకోవడం సంతోషం. – పూజారి హరిప్రసన్న, గణిత ఉపాధ్యాయుడు, తాడివలస. – కందుల శివశంకర్, సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం, ఫొటోలు: పాయక మధుసూదనరావు, పొందూరు -
బినామీ ఆస్తులు కాపాడుకునేందుకే డ్రామాలు..
సాక్షి, అనంతపురం: ‘అమ్మఒడి పథకం’ వల్ల అక్షరాస్యత శాతం గణనీయంగా పెరుగుతుందని ఏపీ మంత్రి శంకర్ నారాయణ స్పష్టం చేశారు. అనంతపురం శారదా మున్సిపల్ హైస్కూల్లో ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డితో కలిసి మంత్రి శంకర్ నారాయణ అమ్మఒడి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చరిత్ర సృష్టిస్తున్నాయని తెలిపారు. అమరావతిలో బినామీ ఆస్తులు కాపాడుకునేందుకే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉద్యమం పేరుతో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఏపీలోని 13 జిల్లాలను అభివృద్ధి చేస్తామంటే చంద్రబాబు వద్దంటున్నారని.. రాయలసీమ, ఉత్తరాంధ్ర లకు చంద్రబాబు తీరని ద్రోహం చేశారని ధ్వజమెత్తారు. బోస్టన్, జీఎన్ రావు కమిటీ నివేదికలను హైపర్ కమిటీ నిశితంగా పరిశీలిస్తోందని.. అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ ఏపీకి అత్యవసరం అని శంకర్‌నారాయణ పేర్కొన్నారు. దేశం చూపు..జగన్ పాలన వైపు.. అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలన వైపు.. దేశం యావత్తు చూస్తోందని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు. అమ్మఒడి పథకం పేద విద్యార్థుల పాలిట ఓ వరం అని ఏపీ పాఠశాల విద్య కమిషన్ సీఈవో ఆలూరు సాంబశివారెడ్డి, డీసీసీబీ ఛైర్మన్ పామిడి వీరాంజనేయులు చెప్పారు. (చదవండి: ఫిబ్రవరి 9లోపు నమోదు చేసుకోండి: సీఎం జగన్) (చదవండి: ‘వచ్చారు జగన్.. మెచ్చారు జనం’) -
'మెరుగైన విద్యను అందించడమే మా లక్ష్యం'
సాక్షి, ఉయ్యూరు(కృష్ణా) : ఉయ్యూరు మండలం పెద ఓగిరాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి మాట్లాడుతూ.. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు రెడ్డీస్ ఫౌండేషన్ స్కాలర్షిప్లు అందజేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో దాదాపు 200 స్కూళ్లలో స్కాలర్షిప్లు అందజేయడమే గాక, మౌళిక వసతులు లేని స్కూళ్లను ఏంచుకొని వాటి అభివృద్ధికి రెడ్డీస్ ఫౌండేషన్ కృషి చేయడం మంచి పరిణామమని తెలిపారు. అదే విధంగా 'కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ' పేరుతో విద్యార్థులను ప్రోత్సహిస్తూ రెడ్డీస్ ఫౌండేషన్ తమ వంతు ఆర్థిక సాయం చేస్తుందని వెల్లడించారు. తమ ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య, ఇతర వసతులు కల్పించేందుకు కృషి చేస్తుందని తెలిపారు. ఈ మేరకు వచ్చే జనవరి 26 నుంచి అమ్మ ఒడి పథకం కింద ప్రతి తల్లికి రూ.15వేలు అందజేయనున్నట్లు స్పష్టం చేశారు. అధిక ఫీజుల పేరుతో కార్పొరేట్ విద్యాసంస్థలు తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తున్న వ్యవస్థను మార్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీలో విద్యా నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టిన సంగతి గుర్తు చేశారు. దీంతో తల్లిదండ్రులకు ఫీజుల భారం తగ్గుతుందని పార్థసారధి పేర్కొన్నారు. -
అమ్మ ఒడి..చదువుల గుడి
సాక్షి,అమరావతి : ఐదేళ్ల టీడీపీ పాలనలో రాష్ట్రంలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు చదువు అందని ద్రాక్షగా మారింది. పిల్లలను బడికి పంపించాలంటేనే.. తల్లిదండ్రులు బెంబేలెత్తాల్సిన పరిస్థితి. ఎల్కేజీ, యూకేజీల్లో చేర్పించాలన్నా.. వేలకు వేలు ఫీజులు కట్టాల్సిందే. చంద్రబాబు సర్కారు ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్‌ను ప్రోత్సహిస్తూ.. సర్కారీ బడులను నిర్వీర్యం చేసింది. వేల సంఖ్యలో ప్రభుత్వ స్కూళ్లను మూసేసింది. ఉన్న పాఠశాలల్లోనూ టీచర్లను నియమించకుండా.. సరైన సదుపాయాలు కల్పించకుండా సర్కారీ బడులను అధ్వానంగా మార్చివేసింది. దీంతో రెక్కాడితే కాని డొక్కాడని నిరుపేద తల్లిదండ్రులు సైతం పిల్లలకు వేలకు వేలు ఫీజులు కట్టి ప్రైవేట్ స్కూల్స్‌లో చేర్పించక తప్పడం లేదు. ఇలాంటి పరిస్థితిల్లో ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ సాగిన సుదీర్ఘ పాదయాత్రలో.. తల్లిదండ్రుల ఇబ్బందులను స్వయంగా చూసిన జననేత వైఎస్ జగన్.. పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనం కల్గించేలా ‘అమ్మ ఒడి’ పథకం ప్రకటించారు. పిల్లలను బడికి పంపితే చాలు.. ప్రతి తల్లికి ఏటా రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. జగన్ హామీతో తమపై పిల్లల చదువుల భారం తగ్గుతుందని తల్లిదండ్రుల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇక తమ పిల్లల చదువులకు ఎలాంటి ఢోకా ఉండదని తల్లిదండ్రులు విశ్వాసం వ్యక్తంచేస్తున్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చి ‘అమ్మ ఒడి’ అమలైతే తమపై పిల్లల చదువుల భారం తగ్గుతుందని.. బడుల్లో డ్రాపవుట్లు కూడా తగ్గుతాయని వారు అభిప్రాయపడుతున్నారు. తమ పిల్లలను పాఠశాలలకు పంపించేందుకు ఇది ఎంతగానో ఉపకరిస్తుందని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. పిల్లల చదువు భారం కాకూడదనే.. పిల్లల చదువులు కుటుంబానికి భారం కాకూడదని.. తల్లిదండ్రులు ఆందోళన చెందకూడదన్న ఆశయంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నవరత్నాల్లో భాగంగా ‘అమ్మ ఒడి’ పథకం ప్రకటించారు. దీంతోపాటు సర్కారీ బడులను పటిష్ట పరిచేందుకు ప్రభుత్వ పాఠశాలల్లోని టీచర్ పోస్టులన్నిటినీ భర్తీచేసేందుకు మెగా డీఎస్సీని నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ప్రైవేట్ స్కూల్స్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని, ప్రతి ఒక్క విద్యార్థికి నాణ్యమైన అందిస్తామని భరోసా ఇచ్చారు. మొన్న..1995 –2004 విద్యావ్యాపారానికి ద్వారాలు తెరిచిన చంద్రబాబు చంద్రబాబు 1995లో అధికారంలోకి వచ్చీరాగానే ప్రైవేట్ విద్యావ్యాపారానికి ద్వారాలు తెరిచారు. నారాయణ, శ్రీచైతన్య వంటి బినామీ సంస్థలను ఏర్పాటుచేసి.. విద్యను వ్యాపార వస్తువుగా మార్చేశారు. ప్రభుత్వ పాఠశాలలను అప్పటినుంచే నిర్వీర్యం చేస్తూ వచ్చారు. ప్రభుత్వ బడుల్లో వేలాది ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకుండా ఖాళీగా ఉంచేశారు. మరోవైపు విద్యావాలంటీర్ల వ్యవస్థకు తెరతీశారు. విద్యార్ధులు లేరనే సాకుతో వేలాది పాఠశాలలను మూసేయించారు. ఫలితంగా వేలాది మారుమూల గ్రామాలకు ప్రాథమిక పాఠశాలలు అందుబాటులో లేకుండాపోయాయి. వాటి స్థానంలో పుట్టగొడుగుల్లా ప్రైవేట్ స్కూల్స్ పుట్టుకొచ్చాయి. నాటి చంద్రబాబు పాలనలో సామాన్య, మధ్యతరగతి పిల్లలకు చదువు అందుబాటులో లేకుండా పోయింది. నిన్న.. 2004–2009 వైఎస్ హయాం.. సర్కారీ విద్యకు స్వర్ణయుగం దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో అధికారం చేపట్టిన తరువాత విద్యావ్యవస్థను మెరుగుపర్చడానికి అనేక చర్యలు చేపట్టారు. తాను అధికారంలోకి వచ్చాక వరుసగా డీఎస్సీలు నిర్వహించి టీచర్ పోస్టుల భర్తీచేశారు. 2008 డీఎస్సీలో ఏకంగా 50వేలకు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేసిన ఘనత వైఎస్‌కే దక్కింది. ప్రైవేటు స్కూల్స్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు కృషిచేశారు. ప్రభుత్వ స్కూల్స్‌లో ఆంగ్లమాధ్యమం ఉండేలా.. సమాంతరంగా సక్సెస్ స్కూళ్లను ప్రారంభించారు. మోడల్ స్కూళ్లూ అప్పుడే వచ్చాయి. మారుమూల గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో పాఠశాలలను వేలాదిగా ప్రారంభించారు. హైస్కూళ్ల సంఖ్య అప్పటివరకు 3వేలకు పరిమితం కాగా వైఎస్ పాలనలో వాటిసంఖ్య 6వేలకు పైగా చేరింది. పాఠశాలల్లో కంప్యూటర్ విద్యకు ప్రాధాన్యత కల్పించారు. డిజిటల్ తరగతులకు శ్రీకారం చుట్టింది వైఎస్సారే. ప్రతి పాఠశాలలో సబ్జెక్టు టీచర్లు తప్పనిసరిగా ఉండేలా చేశారు. సక్సెస్ స్కూళ్లలో ఆంగ్లమాధ్యమ తరగతులకోసం ప్రత్యేక శిక్షణ పొందిన టీచర్లను నియమించారు. నేడు.. 2014–2019 చంద్రబాబు ఐదేళ్ల పాలనలో కునారిల్లిన విద్యావ్యవస్థ 2014లో చంద్రబాబు అధికారం చేపట్టాక విద్యావ్యవస్థలో మళ్లీ ప్రైవేట్ పెత్తనం పెరిగిపోయింది. చంద్రబాబు వచ్చీరావడంతోనే రేషనలైజేషన్‌కు తెరతీశారు. ఈ ఐదేళ్లలో 6వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలను మూసేయించారు. ఎస్సీ,ఎస్టీ కుటుంబాలున్న ప్రాంతాలు, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని స్కూళ్లు మూతపడటంతో అక్కడ చదువుతున్న వేలాది మంది పిల్లలు చదువుకు దూరమయ్యారు. ప్రభుత్వ స్కూళ్లల్లో నిబంధనల మేరకు తగినంత సంఖ్యలో టీచర్లను నియమించడం లేదు. 30వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీలున్నా.. వాటిని భర్తీచేయడం లేదు. ఇప్పటికీ ఏకోపాధ్యాయ పాఠశాలలు 6వేల వరకు ఉన్నాయంటే.. పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పాఠశాలల్లో కనీస సదుపాయాలు కల్పించడం లేదు. బయోమెట్రిక్ యంత్రాలు, ట్యాబ్‌ల పంపిణీ, పాఠశాలలకు ఫర్నీచర్ సరఫరా, మరుగుదొడ్ల నిర్మాణం.. ఇలా అన్ని వ్యవహారాల్లో భారీగా నిధులు దండుకున్నారు. నాలుగున్నరేళ్లలో సర్వశిక్ష అభియాన్ నిధులతోపాటు ఇటు బడ్జెట్ నిధులనూ ఇష్టానుసారంగా తమ వారికి కాంట్రాక్టుల పేరిట కట్టబెట్టింది చంద్రబాబు సర్కారు. తాజాగా రూ.4800 కోట్లతో మౌలిక సదుపాయాల పేరిట మరిన్ని కాంట్రాక్టులు ఇచ్చింది. మధ్యాహ్నం భోజనం, దుస్తుల పంపిణీ, పాఠ్యపుస్తకాల సరఫరా, ఇతర పరికరాలు ఏర్పాటు వంటి టెండర్లలో కోట్లాది రూపాయలను కమీషన్లు తీసుకొని వాటిని తమ అనుయాయులకు అప్పగించారు. రేపు.. జగన్... అమ్మ ఒడితో తల్లిదండ్రులకు భరోసా ఫీజుల భారం పెరిగి పోయిన ప్రస్తుత పరిస్థితుల్లో.. ‘అమ్మ ఒడి’ పథకం ద్వారా.. పిల్లలను బడికి పంపితే చాలు ఏటా రూ.15వేలు నేరుగా తల్లి చేతికే ఇస్తామని వైఎస్ జగన్ ప్రకటించారు. సర్కారీ బడులను పటిష్ట పరిచేందుకు ప్రభుత్వ పాఠశాలల్లోని టీచర్ పోస్టులన్నిటినీ భర్తీచేసేందుకు మెగా డీఎస్సీని నిర్వహిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ప్రైవేట్ స్కూల్స్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు. చంద్రబాబు హామీ ఇచ్చి మరిచారు 2014 ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే కేజీ నుంచి పీజీ వరకు.. ఉచిత విద్య అందిస్తామని చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చారు. అది అమలు కాలేదు. ప్రతి కిలోమీటరుకు ఒక ప్రాథమిక పాఠశాల.. ప్రతి 3కిలో మీటర్లకు ఒక ప్రాథమికోన్నత పాఠశాల.. ప్రతి 5 కిలోమీటర్లకు ఒక హైస్కూలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. వాస్తవానికి గత ఐదేళ్లలో ఉన్న స్కూళ్లను సైతం మూసేయించారు. ప్రతి ఏటా విద్యాసంవత్సరానికి మూడు నెలల ముందే డీఎస్సీని నిర్వహించి టీచర్లను నియమిస్తామన్నారు. తన ఐదేళ్ల పాలనలో ఎన్నికలకు ముందు అరకొర పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి మమ అనిపించారు.ఆ చట్టంతో చదువులు మరింత భారం: చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేట్‌ను ప్రోత్సహించడానికి ఏకంగా ఒక ప్రత్యేక చట్టాన్ని తెస్తోంది. సెల్ఫ్‌ఫైనాన్స్‌డ్ ఇండిపెండెంటు స్కూల్సు పేరిట తెస్తున్న ఈ చట్టంతో ఇక చదువులు మరింత భారంగా మారనున్నాయి. పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థలు మాత్రమే పాఠశాలలు స్థాపించేలా ఈ నిబంధనలు పెట్టింది. ఈ చట్టంవస్తే ప్రస్తుతం అందుబాటులో ఉన్న విద్య కూడా పేద మధ్యతరగతి పిల్లలకు అందకుండాపోనుంది. కార్పొరేట్ విద్య మరింత భారంగా మారనుంది. నారాయణ, చైతన్య చేతుల్లో ఇంటర్ విద్య చంద్రబాబు పాలనలో ఇంటర్మీడియెట్ విద్య మరింత భారంగా మారింది. రాష్ట్రంలో 3500 వరకు జూనియర్ కాలేజీలుంటే.. అందులో 1100 మాత్రమే ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీలు. మిగతావన్నీ ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల చేతుల్లోనే ఉన్నాయి. వీటిల్లో అత్యధిక శాతం నారాయణ, చైతన్య సంస్థలవే. ఈ కార్పొరేట్ స్కూల్స్‌లో ఫీజులపై నియంత్రణ లేకపోవడంతో ఆయా యాజమాన్యాలు ఇష్టానుసారం ఫీజులు పెంచేస్తున్నాయి. రూ.30వేల నుంచి లక్షకు పైగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇవి కాకుండా పుస్తకాలు, యూనిఫారాలు, ఇతరాల పేరిట వేలకు వేలు డబ్బు వసూలు చేస్తున్నాయి. పుస్తకాలకు రూ.15వేలు, యూనిఫారానికి రూ.7వేలు, ఇతర సామగ్రి అంటూ మరో 2వేలు దండుకుంటున్నాయి. ఇంటర్మీడియెట్ విద్య పేరిట కార్పొరేట్ సంస్థలు విద్యార్ధులను పీల్చిపిప్పిచేస్తున్నాయి. ఏటా రూ.లక్షన్నర నుంచి రూ.3లక్షల వరకు ఇంటర్‌కు ఫీజులుగా వసూలు చేస్తున్నాయి. -
పేద విద్యార్థుల భవిష్యత్ కోసం ‘అమ్మఒడి’
బుట్టాయగూడెం, న్యూస్‌లైన్ : అమ్మఒడి పేద విద్యార్థుల భవిష్యత్‌కి ఆనందాల ఒడి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు అన్నారు. స్థానిక సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహాన్ని శనివారం ఆయన సందర్శించి విద్యార్థులతో మమేకమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించేందుకు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట పథకాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఫీజురీయంబర్స్‌మెంట్ పథకాన్ని సక్రమంగా అమలు చేయకపోవడంతో పేద విద్యార్థుల చదువు మధ్యలో ఆగిపోయే దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే పేద విద్యార్థుల బంగారు భవిష్యత్ కోసం అమ్మఒడి పథకంతోపాటు మరిన్ని పథకాలు అమలు చేస్తారని చెప్పారు. పార్టీ శ్రేణులు రేపాకుల చంద్రం, ఆరేటి సత్యనారాయణ, కోరం దుర్గారావు, అన్నవరం, కడియ్య పాల్గొన్నారు. తమకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఆదుకోవాలని కోరుతూ మండలంలోని వెలుతురువారిగూడెం గ్రామానికి చెందిన గిరిజనులు బాలరాజును కోరారు.