ముగ్గురి ఖాతాల్లోంచి రూ.26,500 కాజేసిన కేటుగాళ్లు
లబోదిబోమంటున్న బాధితులు
ఆలూరు రూరల్ : సైబర్ నేరగాళ్లు కొత్త పంథాను ఎంచుకున్నారు. అమ్మ ఒడి పేరుతో అమాయకులను బురిడీ కొట్టించి ముగ్గురు వ్యక్తుల నుంచి ఫోన్‌లో మాట్లాడుతూనే రూ.26,500 వారి ఖాతాల నుంచి కాజేశారు. బాధితులు తెలిపిన వివరాలు.. కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికెర గ్రామానికి చెందిన నాగరాజు, మల్లికార్జున బతుకుదెరువు కోసం తెలంగాణ రాష్ట్రానికి వలస వెళ్లారు. వారికి ఆదివారం మధ్యాహ్నం 9266495107 నంబర్ నుంచి ఫోన్ వచ్చింది.
తాము అమరావతిలోని విద్యాశాఖ కమిషనరేట్ నుంచి మాట్లాడుతున్నామని చెప్పారు. ‘మీకు అమ్మ ఒడి వచ్చిందా’ అంటూ ఫోన్ చేసిన వ్యక్తి అడిగి.. వారి వ్యక్తిగత వివరాలు సేకరించారు. అతడి మాటలు నమ్మిన నాగరాజు, మల్లికార్జునలు తమకు రాలేదని చెప్పారు. దీంతో ఆగంతకుడు మీ వలంటీర్ ఆనంద్‌ను కాన్ఫరెన్స్‌లో తీసుకుంటున్నానంటూ వలంటీర్‌కు కాల్ చేశాడు. అనంతరం ఆనంద్‌తో తాను అమరావతి నుంచి మాట్లాడుతున్నామని.. మల్లికార్జున, నాగరాజులకు అమ్మ ఒడి ఎందుకు రాలేదని ప్రశ్నించారు.
త్వరలోనే మీ ఐడీలను అప్‌డేట్ చేస్తామంటూ వారి పూర్తి వివరాలనూ ఫోన్ చేసిన వ్యక్తి తెలుసుకున్నాడు. అనంతరం ‘నీకు పనిచేయడం రాదా’ అంటూ వలంటీర్‌ను దబాయిస్తూ మాట్లాడాడు. ఆగంతకుడు ఫోన్ కట్ చేయగానే.. నాగరాజు ఖాతా నుంచి రూ.12,500, మల్లికార్జున అకౌంట్ నుంచి రూ.9 వేలు, వలంటీర్ ఆనంద్ ఖాతా నుంచి నుంచి రూ.5 వేలు మాయం అయ్యాయి. బాధితులు లబోదిబోమంటూ జరిగిన విషయాన్ని గ్రామస్తులకు ఫోన్ చేసి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment