తొమ్మిది నెలలుగా చిట్ పాడుకున్న వారికి సైతం చెల్లింపులు చెల్లించని వైఖరిని మార్గదర్శి అవలంభిస్తోంది. దీంతో చందాదారుల్లో ఆందోళన నెలకొంది. అదే సమయంలో అధికారిక తనిఖీల్లో మార్గదర్శి అక్రమాలు, అవకతవకలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మూడోరోజూ మార్గదర్శి కార్యాలయాల్లో ఏపీ సీఐడీ సోదాలు కొనసాగుతున్నాయి. సీఐడీ అధికారులతో పాటు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో.. మార్గదర్శి అక్రమాలకు సంబంధించిన కీలక ఆధారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే.. తాజా సోదాలలో డిపాజిటర్ల సంతకాలు ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు.
బ్యాంక్ ఖాతాలు, చిట్టీ గ్రూపుల చందాల వివరాలు.. నిధుల మళ్లింపునకు సంబంధించిన పత్రాలతో పాటు ఫోర్జరీ సంతకాలు చేసిన రికార్డులు, హార్డ్ డిస్క్‌లను అధికారులు జప్తు చేశారు. ఇవాళ్టి తనిఖీలలో మరిన్ని అక్రమాలు బయటపడొచ్చనే భావిస్తున్నారు.
ఆ వర్గానికి మాత్రమే చెల్లింపులా?
ఇప్పటికే తొమ్మిది నెలలుగా చిట్ పాడుకున్న వాళ్లకు మార్గదర్శి యాజమాన్యం చెల్లింపులు చెల్లించలేదు. అదే సమయంలో కాల పరిమితి ముగిసినా ప్రైజ్‌మనీ అందించని పరిస్థితి ఉంది. దీంతో మార్గదర్శి చందాదారుల్లో ఆందోళన నెలకొంది. చందాదారులకు రూ.2 వేల కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది మార్గదర్శి. దీంతో చందాదారులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే.. ఒత్తిడి తెస్తున్న ఓ సామాజికవర్గం వారికి మాత్రం చెల్లింపులు జరుగుతున్నాయని తెలుస్తోంది.
రామోజీకి దెబ్బ!
చందాదారుల సొమ్మును రామోజీరావు కుటుంబం తమ సొంత పెట్టుబడులుగా మళ్లించడంతో మార్గదర్శి చిట్ ఫండ్స్ ఆర్థికంగా దివాలా అంచులకు చేరుకుంది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై సీఐడీ కేసు నమోదు చేయడంతో రాష్ట్రంలో 2022 నవంబర్ నుంచి కొత్త చిట్టీ గ్రూపులు నిలిచిపోయాయి. చందాదారుల సొమ్మును మార్గదర్శి చిట్‌ఫండ్స్ చట్టానికి విరుద్ధంగా అక్రమంగా మళ్లిస్తోందన్నది స్పష్టమవడంతో కొత్తగా చిట్టీలు వేసేందుకు చందాదారులు ముందుకు రావడం లేదు. దాంతో మనీ సర్క్యులేషన్ (గొలుసుకట్టు మోసాలు) తరహాలో వ్యాపారం నిర్వహిస్తున్న రామోజీరావుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. అదే సమయంలో.. మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక పరిస్థితి కుదేలైందన్న విషయం వ్యాపార, పారిశ్రామికవర్గాలకు స్పష్టమైంది. ఇతర వ్యాపార సంస్థల నుంచి గుట్టుచప్పుడు కాకుండా నిధులు సేకరిద్దామన్న రామోజీ వ్యూహం బెడిసి కొట్టింది.
నిధుల మళ్లింపు పాపం
కేంద్ర చిట్ ఫండ్స్ చట్టం–1982 ప్రకారం చందాదారుల సొమ్మును.. ఇతర వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టకూడదు. చందాదారులు చెల్లించే చిట్టీ సొమ్మును సంబంధిత బ్రాంచి పరిధిలోని జాతీయ బ్యాంకులో డిపాజిట్ చేయాలి. చిట్ ఫండ్స్ సంస్థ ఏ కారణంతోనైనా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతే చందాదారులు నష్టపోకుండా ఆ నిబంధనలు విధించారు. ఎందుకంటే అక్రమంగా పెట్టిన పెట్టుబడులు వెంటనే వెనక్కి తేవడం సాధ్యం కాదు కాబట్టి.
కానీ ఈ రెండు నిబంధనలను రామోజీరావు ఏనాడూ పట్టించుకోలేదు. మార్గదర్శి చిట్ ఫండ్స్ చందాదారులు చెల్లించిన సొమ్మును మ్యూచువల్ ఫండ్స్‌లో తమ కుటుంబ సభ్యుల పేరిట పెట్టుబడిగా పెట్టారు. దాంతోపాటు తమ కుటుంబ సంస్థలైన ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఉషోదయ ఎంటర్ ప్రైజస్‌లో పెట్టుబడులుగా మళ్లించడంతో మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది.
ఇదొక్కటే దారి
రామోజీ పాపం ఫలితంతో.. 50 వేల మంది చందాదారుల సొమ్ము ప్రశ్నార్థకంగా మారింది. అయితే ‘అగ్రిగోల్డ్’ తరహాలో మార్గదర్శి చందాదారుల హక్కుల పరిరక్షణపైనా సర్కారు దృష్టి సారించింది. ఇందులో భాగంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ అక్రమంగా పెట్టిన పెట్టుబడులను అటాచ్ చేసేందుకు సీఐడీకి అనుమతిచ్చింది. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టిన రూ.1,035 కోట్లతోపాటు రామోజీరావు కుటుంబ సంస్థలైన ఉషా కిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌లో 88.50 శాతం వాటా, ఉషోదయ ఎంటర్ ప్రైజస్‌లో 44.50 శాతం వాటాను అటాచ్ చేసేందుకు అనుమతి కోరుతూ సీఐడీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment