గుంటూరు, సాక్షి: ఎన్నికల హామీల పేరిట మహిళలను తేలికగా మోసం చేయొచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు అనుకుంటున్నారని.. కానీ, రాష్ట్రంలోని ప్రతి మహిళా ఇప్పుడు ఆయన్ని గద్దె దించాలని అనుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల (Are Syamala) అన్నారు. కూటమి ప్రభుత్వ హామీల ఎగవేతపై శనివారం ఉదయం ఆమె మీడియాతో మాట్లాడారు.
‘‘దీపం పథకం ఏమైందో చంద్రబాబు(Chandrababu) చెప్పాలి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ఏమైందో చంద్రబాబు చెప్పాలి. కూటమి ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. నమ్మించి.. మాటిచ్చి.. ప్రజలను చంద్రబాబు మోసం చేశారు. ఏరు దాటాక తెప్ప తగలేయడం బాబుకు అలవాటే. చేతగానప్పుడు, చేయలేనప్పుడు శుష్కవాగ్ధానాలు చేయకూడదు. చంద్రబాబు మహిళలకు ఎన్నో పథకాలను అమలు చేస్తామని చెప్పి అలాగే మోసం చేశారు. సూపర్ సిక్స్ పేరుతో బాండు పేపర్లు ఇచ్చి నిలువునా మోసం చేశారు. చంద్రబాబూ.. ఇదే నా మీ సంతకం విలువ?. మహిళలను మోసం చేసినందుకు చంద్రబాబుపై 420 కేసు పెట్టవచ్చు..
.. 2014లో కూడా డ్వాక్రా రుణమాఫీ పేరుతో మోసం చేశారు. నమ్ముతున్నారని మహిళలను సులువుగా మోసం చేస్తున్నారు. తల్లికివందనం(thalliki vandanam) పేరుతో జగన్ ఇస్తున్న అమ్మ ఒడి పథకాన్ని ఆపేశారు. లక్షలాది మంది తల్లులు, విద్యార్ధులు ఎదురు చూస్తున్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ రూ.15 వేలు చొప్పున ఇస్తామన్నారు. రాసి పెట్టుకోమని కూడా చెప్పారు. ఇప్పుడు మంత్రిగా ఉన్న రామానాయుడు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. పొర్లు దండాలు పెట్టుకుంటూ ఎన్నికల ముందు తిరిగారు. కానీ ఇప్పుడు సమాధానం చెప్పకుండా తిరుగుతున్నారు
.. హామీలు మాత్రం జనంలో ఇచ్చారు. ఇవ్వలేకపోతున్నామని నాలుగు గోడల మధ్య ఎందుకు చెప్తున్నారు?. తల్లికి వందనం ఇవ్వట్లేదని టీడీపీ నేతలు జనంలోకి వచ్చి చెప్పాలి. దీపం పథకం కింద ఇవ్వాల్సిన రూ.4,115 కోట్లు ఎగ్గొట్టారు. కనీసం ఉచిత బస్సు పథకాన్ని కూడా ఎందుకు అమలు చేయటం లేదు?
.. 2025 జనవరి ఫస్టున జాబ్ కేలండర్ ఇస్తామని లోకేష్(Nara Lokesh) ప్రకటించారు. ఎన్ని ఉద్యోగాలు ఇస్తారో కాదుకదా.. కనీసం జాబ్ కేలండర్ కూడా ఎప్పుడు ప్రకటిస్తారో తెలియటం లేదు. పండుగ హామీలు లేవు, పెళ్లిళ్ల కానుకలూ లేవు. కూటమి నేతలు ప్రజలకు క్షమాపణలు చెప్పాలి.
సంపద సృష్టి అంటే ప్రజలకేమో అనుకున్నాం.. చంద్రబాబు సొంతంగా సృష్టించుకోవటం అని ఇప్పుడే తెలిసింది. రూ.74 వేల కోట్లకు పైగా ఖర్చు అవుతుందని లెక్క తెలిసినా చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు డబ్బుల్లేవని ఎలా చెప్తారు?. ‘‘ఇప్పుడు గనుక జగన్ మోహన్‌రెడ్డి ఉండి ఉంటే..’’ అని రాష్ట్రంలో ప్రతీ ఒక్కరూ అనుకుంటున్నారు. ఈ హామీల అమలుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది’’ అని స్పష్టం చేశారామె.( ఈ క్రమంలో హామీల పేరుతో ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలు చేసిన హడావిడిని.. ప్రకటనలను వీడియో రూపంలో శ్యామల మీడియాకు ప్రదర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment