ఒంటరి మహిళలే లక్ష్యం
మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ల ద్వారా వల
పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి.. ఆపై నగలు, డబ్బులతో పరార్
గాందీనగర్(విజయవాడ సెంట్రల్): పెళ్లి పేరుతో ఒంటరి, విడాకులు తీసుకున్న మహిళలను మోసం చేస్తున్న కేటుగాడిని విజయవాడ గవర్నర్‌పేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో నిందితుడి మోసాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల కథనం ప్రకారం.. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన తుమ్మా మోహన్‌రెడ్డి వ్యసనాలకు బానిసై భార్య, పిల్లలను వదిలేశాడు. ఉన్న డబ్బులన్నీ షేర్ మార్కెట్‌లో పోగొట్టుకున్నాడు. అనంతరం సులభంగా డబ్బులు సంపాదించేందుకు ‘పెళ్లి కొడుకు’ అవతారం ఎత్తాడు.
తెలుగు మ్యాట్రిమోని, షాదీ డాట్ కామ్ తదితర వెబ్‌సైట్లలో రకర కాల పేర్లతో రిజిస్టర్ చేసుకున్నాడు. ఒంటరి మహిళలను పరిచయం చేసుకునేవాడు. మాయమాటలతో నమ్మించి.. డబ్బు, బంగారం తీసుకొని పారిపోయేవాడు. ఈ క్రమంలో తెలుగు మ్యాట్రిమోని ద్వారా విజయవాడకు చెందిన ఓ మహిళను పరిచయం చేసుకున్నాడు. తన పేరు ‘కార్తీక్‌రెడ్డి.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని.. విల్లాలు ఉన్నాయి’ అంటూ మాయమాటలు చెప్పాడు. పెళ్లి చేసుకుందామని ఒప్పించాడు.
ఫొటోషూట్ కోసం నగలతో రావాలని సూచించాడు. ఆ ఫొటోలను తన తల్లిదండ్రులకు చూపించి పెళ్లికి ఒప్పిస్తానని ఆమెను నమ్మించాడు. దీంతో ఆమె ఈ ఏడాది ఏప్రిల్ 14న విజయవాడలోని ఓ హోటల్‌కు వెళ్లింది. ఫొటోషూట్ కోసం సిద్ధమై రావాలని ఆమెను వాష్‌రూమ్‌కు పంపించాడు. ఆమె తెచ్చిన 16 తులాల బంగారం, సెల్‌ఫోన్‌తో హోటల్ నుంచి ఉడాయించాడు. దీనిపై బాధితురాలు గవర్నర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారించగా.. అతని మోసాలన్నీ బయటపడ్డాయి.
మోహన్‌రెడ్డి మోసాలివే..
» 2021 సెపె్టంబర్‌లో తెలంగాణలోని రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఓ మహిళ కారును తీసుకెళ్లిపోయి అమ్మేశాడు.
» 2023 నవంబర్‌లో గుంటూరుకు చెందిన మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. రూ.7 లక్షలు తీసుకుని పారిపోయాడు.
» 2023 నవంబర్‌లో తెలంగాణలో ఓ మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి 25 తులాల బంగారం అపహరించాడు.
» 2023 జనవరిలో తెలంగాణలోని మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో భర్తతో విడిపోయి ఒంటరిగా ఉన్న డాక్టర్‌ను పరిచయం చేసుకుని.. ఆమె క్రెడిట్ కార్డు ద్వారా రూ.లక్షలు వాడుకుని పారిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment