
కొలుసు పార్థసారధి
సాక్షి, ఉయ్యూరు(కృష్ణా) : ఉయ్యూరు మండలం పెద ఓగిరాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెరిట్ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి మాట్లాడుతూ.. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు రెడ్డీస్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లు అందజేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో దాదాపు 200 స్కూళ్లలో స్కాలర్‌షిప్‌లు అందజేయడమే గాక, మౌళిక వసతులు లేని స్కూళ్లను ఏంచుకొని వాటి అభివృద్ధికి రెడ్డీస్ ఫౌండేషన్ కృషి చేయడం మంచి పరిణామమని తెలిపారు. అదే విధంగా 'కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ' పేరుతో విద్యార్థులను ప్రోత్సహిస్తూ రెడ్డీస్ ఫౌండేషన్ తమ వంతు ఆర్థిక సాయం చేస్తుందని వెల్లడించారు.
తమ ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య, ఇతర వసతులు కల్పించేందుకు కృషి చేస్తుందని తెలిపారు. ఈ మేరకు వచ్చే జనవరి 26 నుంచి అమ్మ ఒడి పథకం కింద ప్రతి తల్లికి రూ.15వేలు అందజేయనున్నట్లు స్పష్టం చేశారు. అధిక ఫీజుల పేరుతో కార్పొరేట్ విద్యాసంస్థలు తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తున్న వ్యవస్థను మార్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీలో విద్యా నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టిన సంగతి గుర్తు చేశారు. దీంతో తల్లిదండ్రులకు ఫీజుల భారం తగ్గుతుందని పార్థసారధి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment