ఆ అమ్మాయి మాటను అమెరికా మెచ్చింది | Thadivalasa zp school girl best speech On swami Vivekananda | Sakshi
Sakshi News home page

ఆ అమ్మాయి మాటను అమెరికా మెచ్చింది

Published Sun, Dec 27 2020 6:15 AM | Last Updated on Sun, Dec 27 2020 11:16 AM

Thadivalasa zp school girl best speech On swami Vivekananda - Sakshi

ఎక్కడో మారుమూల...  శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం తాడివలస గ్రామం. ఆ గ్రామానికి చెందిన విద్యార్థిని గురుగుబిల్లి ఢిల్లీశ్వరి వివేకానందుని షికాగో ప్రసంగాన్ని అనర్గళంగా చదివి అందరి మన్ననలు అందుకుంది. ఆమె ప్రసంగం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తోంది. విద్యార్థిని ప్రసంగించిన తీరుకు అబ్బురపడిన తానా అధ్యక్షులు స్వయంగా ఆర్థిక సాయం ప్రకటించారు. ఆమె చదువు బాధ్యత అంతా తామే తీసుకుంటామని తానా ప్రకటించింది. అంతేకాకుండా ఆ పాఠశాలలో చదువుతున్న మిగతా పేద విద్యార్థులకు సైతం సాయం చేస్తామని వాగ్దానం చేశారు.

‘అమ్మ ఒడి’తో వివేకానందుని ప్రసంగం..
జనవరి 9, 2019న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకం ప్రారంభోత్సవం సందర్భంగా తాడివలస పాఠశాలలో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. ప్రపంచానికి భారతదేశ గొప్పదనాన్ని, సంస్కృతి, సాంప్రదాయాలను ఎలుగెత్తి చాటిన వివేకానందుని స్ఫూర్తి ప్రసంగాలపై ఉపాధ్యాయులు పోటీలు నిర్వహించారు. పలువురు విద్యార్ధుల ప్రసంగాలకు మించి విద్యార్థిని ఢిల్లీశ్వరి విశేష ప్రతిభను కనబరిచింది.

ఢిల్లీశ్వరి చేసిన ప్రసంగాన్ని సంబంధిత పాఠశాల ఉపాధ్యాయులు సామాజిక మాధ్యమాల్లో వీడియో రూపేణా పెట్టారు. ఈ వీడియోకు విపరీతమైన లైక్‌లు... వేలల్లో షేరింగ్‌లు, కామెంట్స్‌ వచ్చాయి. చివరికి ఈ వీడియో తానా పెద్దల కంట పడింది. ఇంకేముంది... తానా ప్రతినిధులు రామచౌదరి, ఉప్పలూరు రేఖ పాఠశాల హెచ్‌.ఎం లఖినేని హేమనాచార్యులు, ఉపాధ్యాయుడు పూజారి హరి ప్రసన్నలకు ఫోన్‌ చేసి మాట్లాడారు. ఢిల్లీశ్వరి కుటుంబ విషయాలను తెలుసుకున్నారు. ఆమె భవిష్యత్‌కు చేయూతనిచ్చేందుకు. ఆమె ఉన్నత చదువులు చదువుకునేందుకు నగదు పురసారాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు.

ఈ నెల 31న ఆమెకు లక్షా ముప్ఫైవేల రూపాయల నగదు, ఖరీదైన ఆండ్రాయిడ్‌ ఫోన్, సైకిల్‌ ఇవ్వనున్నారు. అదే పాఠశాలలో తల్లితండ్రుల్లో్ల ఒక్కరి సంరక్షణలో మాత్రమే ఉన్నటువంటి 25 మంది విద్యార్థులను ఎంపిక చేసి వారందరికీ సైకిళ్లను అందజేసేందుకు ముందుకొచ్చారు. చుట్టుపక్కల గ్రామాల్లో చదువుతున్న నిరుపేద విద్యార్ధులు మరో 30 మందికి కూడా సైకిళ్లు ఇచ్చేందుకు తానా పెద్దలు హామీ ఇచ్చారు. తానా స్ఫూర్తితో తెలుగు రాష్ట్రాల్లో   మరికొంతమంది సహాయాన్ని అందించేందుకు ముందుకొచ్చారు.

నేడు శ్రీకాకుళంలో నిర్వహించనున్న బాలరంజని కార్యక్రమంలో గన్నవరంకు చెందిన చలసాని దత్తు రూ. 9,999 ఢిల్లీశ్వరికి అందించనున్నారు. కాగా గురుగుబెల్లి ఢిల్లీశ్వరి తండ్రి వెంకటరమణ సెప్టెంబర్‌ 9, 2020న మృతి చెందాడు. ఏడేళ్లుగా బ్లడ్‌ కేన్సర్‌ వ్యా«ధితో బాధపడ్డ వెంకటరమణ కూలిపని, మేస్త్రీ పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారు. కరోనా సమయంలో మృతి చెందారు. దాంతో కుటుంబ భారమంతా ఢిల్లీశ్వరి తల్లి మీద పడింది. ఈ నేపథ్యంలో తానా అందించనున్న సాయం వారికి కొండంత అండ అయింది.

నాన్నే సాయం చేయిస్తున్నట్లుంది..!
గత ఏడాది అమ్మ ఒడి ప్రారంభం రోజున హరిప్రసన్న మాస్టారు రాసి ఇచ్చిన రాతప్రతి ఆధారంగా అందరి ముందు ప్రసంగించాను. వివేకానందుని స్ఫూర్తి ప్రసంగం కావడంతో అందరి మన్ననలను పొందాను. నన్ను గుర్తించిన తానా ప్రతినిధులు, తెలుగు రాష్ట్రాల ప్రజలు చదువుకోవడానికి సాయం చేయడం ఎంతో సంతోషంగా ఉంది. మానాన్నే నాకు సాయం చేయిస్తున్నట్లు అనిపిస్తోంది.
     
– గురుగుబెల్లి ఢిల్లీశ్వరి, ఏడో తరగతి, తాడివలస జెడ్‌పీ హైస్కూల్‌.

అంతా కలలాగా ఉంది!
నా  కూతురు ప్రతిభ ప్రపంచ దేశాల్లోని తెలుగు వారు గుర్తించడంతో చాలా సంతోషంగా ఉంది. భర్త దూరమైన బాధను మరిపిస్తుంది. అమెరికా నుంచి ఫోన్‌ రావడం, వారు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పడం అంతా కలగా ఉన్నట్లు అనిపించింది. వాస్తవంగా జరుగుతుండటంతో చాలా ఆనందంగా ఉంది.

–  గురుగుబెల్లి భాగ్యలక్ష్మి, విద్యార్థిని తల్లి

ఎంతో ఆనందంగా ఉంది...
మా పాఠశాలకు విదేశాల్లోను, తెలుగు రాష్ట్రాల్లోనూ గుర్తింపు రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఇదే స్ఫూర్తితో మున్ముందు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులకు మంచి విలువలతో కూడిన విద్యను అందించేందుకు  కృషి చేస్తాం. తానా సభ్యులు  ఈ విద్యార్థినికి ఆర్థిక సహాయం అందించడంతోపాటు మిగిలిన నిరుపేద పిల్లలకు కూడా సైకిళ్లు ఇవ్వాలనుకోవడం సంతోషం.

– పూజారి హరిప్రసన్న, గణిత ఉపాధ్యాయుడు, తాడివలస.

– కందుల శివశంకర్, సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం,
ఫొటోలు: పాయక మధుసూదనరావు, పొందూరు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement