Chicago Speech
-
ఆ అమ్మాయి మాటను అమెరికా మెచ్చింది
ఎక్కడో మారుమూల... శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం తాడివలస గ్రామం. ఆ గ్రామానికి చెందిన విద్యార్థిని గురుగుబిల్లి ఢిల్లీశ్వరి వివేకానందుని షికాగో ప్రసంగాన్ని అనర్గళంగా చదివి అందరి మన్ననలు అందుకుంది. ఆమె ప్రసంగం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తోంది. విద్యార్థిని ప్రసంగించిన తీరుకు అబ్బురపడిన తానా అధ్యక్షులు స్వయంగా ఆర్థిక సాయం ప్రకటించారు. ఆమె చదువు బాధ్యత అంతా తామే తీసుకుంటామని తానా ప్రకటించింది. అంతేకాకుండా ఆ పాఠశాలలో చదువుతున్న మిగతా పేద విద్యార్థులకు సైతం సాయం చేస్తామని వాగ్దానం చేశారు. ‘అమ్మ ఒడి’తో వివేకానందుని ప్రసంగం.. జనవరి 9, 2019న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకం ప్రారంభోత్సవం సందర్భంగా తాడివలస పాఠశాలలో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. ప్రపంచానికి భారతదేశ గొప్పదనాన్ని, సంస్కృతి, సాంప్రదాయాలను ఎలుగెత్తి చాటిన వివేకానందుని స్ఫూర్తి ప్రసంగాలపై ఉపాధ్యాయులు పోటీలు నిర్వహించారు. పలువురు విద్యార్ధుల ప్రసంగాలకు మించి విద్యార్థిని ఢిల్లీశ్వరి విశేష ప్రతిభను కనబరిచింది. ఢిల్లీశ్వరి చేసిన ప్రసంగాన్ని సంబంధిత పాఠశాల ఉపాధ్యాయులు సామాజిక మాధ్యమాల్లో వీడియో రూపేణా పెట్టారు. ఈ వీడియోకు విపరీతమైన లైక్‌లు... వేలల్లో షేరింగ్‌లు, కామెంట్స్ వచ్చాయి. చివరికి ఈ వీడియో తానా పెద్దల కంట పడింది. ఇంకేముంది... తానా ప్రతినిధులు రామచౌదరి, ఉప్పలూరు రేఖ పాఠశాల హెచ్.ఎం లఖినేని హేమనాచార్యులు, ఉపాధ్యాయుడు పూజారి హరి ప్రసన్నలకు ఫోన్ చేసి మాట్లాడారు. ఢిల్లీశ్వరి కుటుంబ విషయాలను తెలుసుకున్నారు. ఆమె భవిష్యత్‌కు చేయూతనిచ్చేందుకు. ఆమె ఉన్నత చదువులు చదువుకునేందుకు నగదు పురసారాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 31న ఆమెకు లక్షా ముప్ఫైవేల రూపాయల నగదు, ఖరీదైన ఆండ్రాయిడ్ ఫోన్, సైకిల్ ఇవ్వనున్నారు. అదే పాఠశాలలో తల్లితండ్రుల్లో్ల ఒక్కరి సంరక్షణలో మాత్రమే ఉన్నటువంటి 25 మంది విద్యార్థులను ఎంపిక చేసి వారందరికీ సైకిళ్లను అందజేసేందుకు ముందుకొచ్చారు. చుట్టుపక్కల గ్రామాల్లో చదువుతున్న నిరుపేద విద్యార్ధులు మరో 30 మందికి కూడా సైకిళ్లు ఇచ్చేందుకు తానా పెద్దలు హామీ ఇచ్చారు. తానా స్ఫూర్తితో తెలుగు రాష్ట్రాల్లో మరికొంతమంది సహాయాన్ని అందించేందుకు ముందుకొచ్చారు. నేడు శ్రీకాకుళంలో నిర్వహించనున్న బాలరంజని కార్యక్రమంలో గన్నవరంకు చెందిన చలసాని దత్తు రూ. 9,999 ఢిల్లీశ్వరికి అందించనున్నారు. కాగా గురుగుబెల్లి ఢిల్లీశ్వరి తండ్రి వెంకటరమణ సెప్టెంబర్ 9, 2020న మృతి చెందాడు. ఏడేళ్లుగా బ్లడ్ కేన్సర్ వ్యా«ధితో బాధపడ్డ వెంకటరమణ కూలిపని, మేస్త్రీ పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారు. కరోనా సమయంలో మృతి చెందారు. దాంతో కుటుంబ భారమంతా ఢిల్లీశ్వరి తల్లి మీద పడింది. ఈ నేపథ్యంలో తానా అందించనున్న సాయం వారికి కొండంత అండ అయింది. నాన్నే సాయం చేయిస్తున్నట్లుంది..! గత ఏడాది అమ్మ ఒడి ప్రారంభం రోజున హరిప్రసన్న మాస్టారు రాసి ఇచ్చిన రాతప్రతి ఆధారంగా అందరి ముందు ప్రసంగించాను. వివేకానందుని స్ఫూర్తి ప్రసంగం కావడంతో అందరి మన్ననలను పొందాను. నన్ను గుర్తించిన తానా ప్రతినిధులు, తెలుగు రాష్ట్రాల ప్రజలు చదువుకోవడానికి సాయం చేయడం ఎంతో సంతోషంగా ఉంది. మానాన్నే నాకు సాయం చేయిస్తున్నట్లు అనిపిస్తోంది. – గురుగుబెల్లి ఢిల్లీశ్వరి, ఏడో తరగతి, తాడివలస జెడ్పీ హైస్కూల్. అంతా కలలాగా ఉంది! నా కూతురు ప్రతిభ ప్రపంచ దేశాల్లోని తెలుగు వారు గుర్తించడంతో చాలా సంతోషంగా ఉంది. భర్త దూరమైన బాధను మరిపిస్తుంది. అమెరికా నుంచి ఫోన్ రావడం, వారు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పడం అంతా కలగా ఉన్నట్లు అనిపించింది. వాస్తవంగా జరుగుతుండటంతో చాలా ఆనందంగా ఉంది. – గురుగుబెల్లి భాగ్యలక్ష్మి, విద్యార్థిని తల్లి ఎంతో ఆనందంగా ఉంది... మా పాఠశాలకు విదేశాల్లోను, తెలుగు రాష్ట్రాల్లోనూ గుర్తింపు రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఇదే స్ఫూర్తితో మున్ముందు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులకు మంచి విలువలతో కూడిన విద్యను అందించేందుకు కృషి చేస్తాం. తానా సభ్యులు ఈ విద్యార్థినికి ఆర్థిక సహాయం అందించడంతోపాటు మిగిలిన నిరుపేద పిల్లలకు కూడా సైకిళ్లు ఇవ్వాలనుకోవడం సంతోషం. – పూజారి హరిప్రసన్న, గణిత ఉపాధ్యాయుడు, తాడివలస. – కందుల శివశంకర్, సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం, ఫొటోలు: పాయక మధుసూదనరావు, పొందూరు -
ప్రపంచ హిందూ కాంగ్రెస్‌లో ఉపరాష్ట్రపతి ప్రసంగం
సాక్షి, న్యూఢిల్లీ: షికాగోలో స్వామి వివేకానంద ఉపన్యసించి 125 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా అక్కడ ఏర్పాటు చేయనున్న ప్రపంచ హిందూ కాంగ్రెస్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రసంగించనున్నారు. ఇందుకు ఆయన రెండు రోజుల అమెరికా పర్యటనకు శుక్రవారం బయలుదేరి వెళ్లనున్నారు. శనివారం హిందూ టెంపుల్ ఆఫ్ గ్రేటర్ షికాగోలో 14 తెలుగు సంఘాలు ఏర్పాటు చేయనున్న కార్యక్రమంలో పాల్గొంటారు. ఆదివారం ప్రపంచ హిందూ కాంగ్రెస్ మహాసభలో ప్రసంగిస్తారు. తిరిగి అదే రోజు రాత్రి భారత్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు. -
చెత్త పడేసి వందేమాతరం అంటే ఎలా? : మోదీ
వాళ్లకు మాత్రమే ఆ హక్కు ఉంది మీ సృజనాత్మకతను దేశం కోసం వాడండి వివేకానందుడు కొరుకుంది కూడా అదే చికాగో ఉపన్యాస 125వ విద్యార్థి సదస్సులో ప్రధాని పిలుపు సాక్షి, న్యూఢిల్లీ: దేశాన్ని ప్రక్షాళన చేయాలని భావించే ప్రతీ ఒక్కరూ భరత మాత ముద్దు బిడ్డలేనని.. వాళ్లకు మాత్రమే వందేమాతర నినాదం చేసే హక్కు ఉంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. స్వామి వివేకానంద చికాగో ప్రసంగానికి నేటితో సరిగ్గా 125 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన సదస్సులో విద్యార్థులను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. యంగ్ ఇండియా న్యూ ఇండియా- ఏ రిజర్జెంట్ నేషన్. ఫ్రమ్ సంకల్ప్ టూ సిద్ధి పేరిట నిర్వహించిన ఈ సదస్సును సుమారు 40,000 విద్యాసంస్థల్లో లైవ్ టెలికాస్ట్ ఏర్పాట్లు చేసింది యూజీసీ. ఇక కార్యక్రమంలో మోదీ ప్రసంగిస్తూ... 2001 సరిగ్గా ఇదే రోజున అమెరికాలో ఉగ్రవాది చోటు చేసుకుంది. 9/11 అంటే అందరికీ అదే గుర్తుకు వస్తుంది కానీ, వందేళ్ల క్రితం అదే తేదీన కాషాయం బట్టలు ధరించిన ఓ వ్యక్తి చికాగో వేదికగా భారత ఔనత్యాన్ని చాటి చెప్పాడు అని చెప్పుకొచ్చారు. ‘అంతర్జాతీయ వేదికలపై అవకాశం దొరికినప్పుడల్లా తన మాతృభూమి గురించి, ఇక్కడి సాంప్రదయాలు, అపారమైన మేధో సంపద... ఇలా అన్ని అంశాలపై సుదీర్ఘ ఉపన్యాసాలు ఆయన(వివేకానందుడు) ఇచ్చేవారు. అదే సమయంలో జాతిని విమర్శించే వారికి సరైన సమాధానమే ఆయన ఇచ్చేవారు. సంకుచిత భావజాలాలను విడనాడీ దేశ ఔన్నత్యం కోసం పాటుపడాలంటూ తరచూ తన ఉపన్యాసాలలో వివేకానందుడు పిలుపునిచ్చేవారు. ముఖ్యంగా తన జీవితంలో సత్యాన్వేషిగానే ఆయన ఎక్కువ కాలం గడిపారు’ అని మోదీ పేర్కొన్నారు. నోబెల్ బహుమతి ద్వారా రవీంద్రనాథ్ ఠాగూర్, తన ఉపన్యాసం ద్వారా స్వామి వివేకానందుడు ప్రపంచ పటంలో భారత పేరును స్థిరస్థాయిగా నిలిపారని, యాధృచ్ఛికంగా ఈ ఇద్దరూ బెంగాల్‌కు చెందిన వాళ్లే కావటం విశేషమని మోదీ అన్నారు. కేవలం వివేకానందుడి కృషి వల్లే భారత్ ఇప్పుడు యువ జాతిగా వెలుగొందుతుందని మోదీ తెలిపారు. యువత ఉద్యోగాల కోసం రోడ్డున పడటం కాదు.. ఉపాధి కల్పన కల్పించే స్థాయికి చేరుకోవాలన్నది వివేకానందుడి కల అని మోదీ ప్రస్తావించారు. గుళ్లు కాదు.. టాయ్లెట్లు నిర్మించాలి పరిజ్ఞానంతోపాటు నైపుణ్యానికి కూడా మనం సమాన ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. కుల, వర్గ విభజనకు వివేకానందుడు వ్యతిరేకమన్న మోదీ.. ఆ బాటలో ఇప్పటి యువత కూడా ప్రయాణించాలని ఆకాంక్షించారు. ప్రపంచ సమస్యలన్నీ ఆసియా దేశాల ద్వారానే పరిష్కారం అవుతుందన్న ఉద్దేశ్యంతో వన్ ఏషియా నినాదాన్ని వివేకానందుడు ఇచ్చారని తెలిపారు. వందేమాతర నినాదం ప్రతీ ఒక్క భారతీయుడు హక్కు అన్న ఆయన.. దేశాన్ని..తమ ఇళ్లను అపరిశుభ్రంగా ఉంచుకునేవాళ్లకు ఆ నినాదం చేసే హక్కు లేదని.. ఎవరైతే దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుతారో వారికి మాత్రమే ఆ హక్కు ఉంటుందని చెప్పకొచ్చారు. దేవాలయాల కంటే ముందు మరుగుదొడ్లు నిర్మించాలన్న ఆవసరం ఉందని మోదీ అభిప్రాయపడ్డారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై అవగాహన పెంచుకోవాలన్న ప్రధాని మోదీ... ఎన్నిక ప్రచార సమయంలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని విద్యార్థి సంఘాలను కోరారు. కాలేజీలో విద్యార్థుల ఆధునిక పోకడలపై పలువురు విమర్శలు వినిపిస్తున్నప్పటికీ.. దేశ సంస్కృతి విఘాతం కలిగించని పక్షంలో తాను వాటికి వ్యతిరేకం కాదని మోదీ చెప్పగా... విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. సృజనాత్మకత లేనిదే మనిషి జీవితం లేదన్న ప్రధాని మీ సృజనాత్మకతను మన దేశ అభివృద్ధికి, ప్రజల ఆశయాలను నెరవేర్చటానికి వినియోగించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. మన దేశాన్ని.. భాషలను.. సంప్రదాయాలను తప్పక గౌరవించాలని ఆయన అన్నారు. భారత్ మారుతోంది. ప్రపంచ వేదికలో వెలుగొందుతోంది. దీనంతటికి జనశక్తే కారణం అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు.