swamy vivekananda
-
స్వామి వివేకానందకు సీఎం ఘన నివాళి
సాక్షి, అమరావతి: స్వామి వివేకానంద జయంతి సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఆ మహనీయునికి ఘన నివాళులర్పించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేశారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు పాల్గొన్నారు. వివేకానందుని మాటలు స్ఫూర్తిదాయకం.. యువతకు సీఎం వైఎస్ జగన్ యువజనోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘యువత దేశానికి వెన్నెముక, వారు సాధించలేనిది ఏదీ లేదు’ అన్న స్వామి వివేకానంద మాటలను స్ఫూర్తిగా తీసుకుని లక్ష్య సాధనలో అంకిత భావంతో మనమందరం ముందడుగులు వేయాలి. జాతీయ యువజనోత్సవం సందర్భంగా యువత అందరికీ శుభాకాంక్షలు’ అంటూ సీఎం గురువారం ట్వీట్ చేశారు. -
మహోజ్వల భారతి: మహామహులు చదివిన కాలేజీ
ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ‘స్కాటిష్ చర్చ్ కాలేజ్’ సంస్థాపన జరిగి నేటికి 192 ఏళ్లు. ప్రస్తుతం కలకత్తా యూనివర్శిటీకి అనుబంధంగా ఉన్న ఈ కాలేజ్‌ని 1830 జూలై 13న అలెగ్జాండ్ డఫ్ అనే క్రైస్తవ సంఘం ప్రముఖుడు కలకత్తాలో స్థాపించారు. కో–ఎడ్ అయిన ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆర్ట్ కళాశాల మొదట ‘జనరల్ అసెంబ్లీ’స్ ఇన్స్టిట్యూట్’ అనే పేరుతో మొదలైంది. తర్వాత ‘ఫ్రీ చర్చ్ ఇన్స్టిట్యూట్’, ‘డఫ్ కాలేజ్’, ‘స్కాటిష్ చర్చస్ కాలేజ్’ అని పేర్లు మార్చుకుంటూ.. 1929లో ‘స్కాటిష్ చర్చి కాలేజ్’గా స్థిరపడింది. స్వామి వివేకానంద, సుభాస్ చంద్రబోస్, చంద్రముఖి బసు, గురుదాస్ బెనర్జీ, జానకీనాథ్ బోస్, బ్రహ్మబాంధవ్ ఉపాధ్యాయ వంటి ప్రసిద్ధులు, ఉద్యమకారులు ఈ కళాశాలలో చదివారు. అలెగ్జాండర్ డఫ్ స్కాట్లాండ్లోని ‘జనరల్ అసెంబ్లీ ఆఫ్ ది చర్చ్ ఆఫ్ స్కాట్లాండ్’ ను ఆదర్శంగా తీసుకుని కలకత్తాలో ఈ స్కాటిష్ చర్చ్ కాలేజ్‌ని నెలకొల్పారు. ఈస్టిండియా కంపెనీతో ఉన్న సంబంధాలలో భాగంగా కలకత్తా వచ్చినప్పుడు ఇంగ్లిష్ భాషకు ఇండియాలో ప్రాచుర్యం తెచ్చేందుకు కళాశాల ఏర్పాటును ఒక మార్గంగా ఎంచుకున్నారు. ఇంగ్లిష్తో పాటే స్థానిక భాషలైన బెంగాలీ, సంస్కృతాలకు తగిన ప్రాధాన్యం ఇచ్చారు. భారత ప్రభుత్వం 1980లో ఈ కళాశాల పేరు మీద తపాలా బిళ్లను విడుదల చేసింది. -
మనిషి కాదు కీర్తి కలకాలం బ్రతకాలి!
*వస్తువు ద్వారా, వ్యక్తి ద్వారా జీవితంలో సుఖం ప్రాప్తిస్తుందంటే, దాని కాలపరిమితి కూడా ఆ వస్తువంత, వ్యక్తి అంత పరిమితమైనదే! మనిషి ఎంత కాలం జీవిస్తాడు ? ఈ రోజుల్లో మనిషి సగటు ఆయువు 65సంవత్సరాలు అంటారు విజ్ఞానవేత్తలు. మన సనాతన ధర్మం మనిషి ఆయుర్దాయం నూరు సంవత్సరాలు అంటుంది. అందుకే పెద్దలు 'శతాయుష్మాన్ భవ' అని దీవిస్తారు. కాకిలా కలకాలం జీవించే కంటే హంసలా కొంత కాలం జీవించడం మేలు అన్నది ఒక సామెత. ఆ రెండు పక్షుల జీవన విధానంలో ఆ బేధం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. *మనిషి మరణించిన తరువాత కూడా జీవించి ఉంటాడా? ఒక మారు భౌతిక దేహం బూడిద అయిన తరువాత ఎలా జీవించి ఉంటాడు? నిజమే, కొందరు మరణించిన తరువాత కూడా జీవించివుంటారు, అదెలా! "అభిమాన ధనస్య గత్వరైః అనుభిః స్థాస్తు యశశ్వి చీషతః । అచిరం సువిలాసఞ్చలానను లక్ష్మీః ఫల మానుషఙ్గీ కమ్ ॥ 'ఎప్పుడో ఒకప్పుడు పోయే ప్రాణం చేత చిరస్థాయియైన కీర్తిని సంపాదించదలచిన అభిమానధనుడినికి అచిరకాలంలోనేఆ కీర్తి లభిస్తుంది. దానితో పాటు చంచలమైన లక్ష్మియు అనుషంగీకంగా ప్రాప్తిస్తుంది.' మనిషి చనిపోయినా అతని కీర్తి నిలిచి ఉంటే ఆ వ్యక్తి జీవించి ఉన్నట్లే అని భావము. కీర్తి తనంతటతనే లభించదు. అందుకు మనిషి సద్గుణశీలి కావాలి. పరోపకారం, ఈవి, దయ, సహనం, క్రోధరాహిత్యం వంటి గుణాలు ఉండాలి. ఇందుకు మనముందు ఉన్న సజీవ ఉదాహరణ స్వామి వివేకానంద. *భౌతికంగా స్వామిజీ ఈ భూమిపై కేవలం 39 సంవత్సరాల 6 నెలల 22 రోజులే జీవించి ఉన్నారు. "తాను నిజంగా ఎవరో, తనస్వరూపమేమిటో తెలుసుకున్న తరువాత నరేంద్రుడు ఈ భూమిపై ఉండలేడు. తన స్వస్వరూపంలో లీనమైపోతాడు!" అన్నారు రామకృష్ణులు. కాని మహాసమాధిలో పర బ్రహ్మైక్యం చెందిన వివేకానంద అంతటితో మరణించారా? లేదు!! *గీతలో శ్రీకృష్ణభగవానుడంటాడు " ఈ ఆత్మను శస్త్రాలు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్చివేయజాలదు. ఈ ఆత్మ నిత్యమూ, సర్వవ్యాపి చలింపనిది,స్థాణువు, స్థిరమైనది, సనాతనం, శాశ్వత మైనది." *వివేకానందుడి శరీరాన్ని ఆ 1902 జూలై 4న అగ్నిజ్వాలలు దహించివేసి ఉండవచ్చుగాక! కాని వివేకానందుడి ఆత్మను శస్త్రాలు ఛేధింపలేవు, అగ్ని దయహింపజాలదు, వాయువు ఆర్చివేయజాలదు, వివేకానందుడి ఆత్మ నిత్యమైనది, సర్వవ్యాపి, అచలము, స్థిరమైన, సనాతనము, శాశ్వతమూ అయినది. స్వామిజీ భారతదేశపు ఆత్మ, అంతరాత్మ అయింది." అని వివేకానందుడి ప్రముఖ శిష్యురాలు సోదరి నివేదిత అన్నారు. *భారతదేశం ఈనాడు ప్రపంచ వేదికలపై ఆధ్యాత్మితకూ, సర్వశ్రేష్ఠ సభ్యత, సంస్కృతి, సంప్రదాయాలకు, శాంతి, సహనము, మంచితనము, ఆత్మవిద్యకు కేంద్ర బిందువై, గురు స్థానంలో గౌరవం పొందుతోంది అంటే ఇదంతా స్వామిజీ ఆత్మ ప్రభావమే. *ప్రఖ్యాత ఫ్రెంచి రచయిత, నోబుల్ బహుమతి గ్రహీత రోమారోలా తాను రచించిన పుస్తకం 'స్వామి వివేకానందుడి జీవితం' లో ఇలాగన్నారు."స్వామిజీ నలభై సంవత్సరాల వయస్సులోనే తన వజ్రమయ జీవితాన్ని చాలించి, చితిపై ఉంచబడ్డారు.... కాని అతని చితి నుండి వచ్చిన జ్వాలలు ఆరిపోలేదు. ఇంకా ఇంకా ఉజ్వలంగా వెలుగు తూనేవున్నాయి! ప్రాచీన పౌరాణిక ఫెనిక్స్ అనే పక్షి కొన్ని వందల సంవత్సరాలు జీవించి, తనను తానే దహించివేసుకుని తన చితి భస్మం నుండి మళ్ళీ పునర్జీవత అవుతుంది. అలాగే వివేకానందుడి చితిభస్మం నుండి భారతదేశపు ఆత్మ, అంతరాత్మ చైతన్యం పునర్జీవతమై, మేల్కొన్నాయి. *వివేకానందుడి వాణి మూగవోకూడదు, మనం అతని ఆదర్శాలకు అనుగుణంగా నడుచుకోవడమే మహోన్నతమైన కార్యం. - గుమ్మా ప్రసాద రావు భిలాయి -
జ్ఞానానిధి స్వామి వివేకానందుడు
"ఏకమేవ అద్వితీయం బ్రహ్మ " సృష్టిలో బ్రహ్మం తప్ప అన్యమేదీ లేదనీ; 'సర్వం ఈశావాస్యం' = సకల చరాచర సృష్టి అంతా ఒకే దివ్య చైతన్యంతో నిండి నిబిడీ కృతమై ఉన్నదనీ; భారతీయ వేదాంత విజ్ఞానాన్ని దేశం నలుమూలలా ప్రచారం చేసి, బ్రహ్మ విద్యా సంప్రదాయాన్ని పునః ప్రతిష్ఠించిన వివేకరత్నం ఆదిశంకరాచార్యులు. *ప్రతి ఒక్కరూ దివ్యాత్మస్వరూపులనీ;ప్రతి జీవిలోనూ దివ్యత్వం గర్భితమై ఉందనీ,అంతర్గతంగా ఉన్న దివ్యత్వాన్ని సాక్షారింపజేసుకోవడమే మానవ జీవితధ్యేయమనీ సర్వవేదాంత సారాన్ని ప్రపంచానికి ప్రబో దించి, సనాతన ధర్మాన్ని పరిరక్షించిన వివేక భాస్కరుడు-స్వామి వివేకానంద. *సమస్త ప్రపంచాన్నీ ప్రగతి పథంలో నడి పించగల శక్తిసామర్ధ్యాలు వివేకావందునిలో ఉన్నట్లు ఆయన గురుదేవులైన శ్రీ రామకృష్ణ పరమహంస గుర్తించారు. భారతజాతి గర్వించదగిన ప్రాచీన సంప్రదాయాల గురించి, ఆ సంస్కృతినీ, యోగ్యతల్ని ఇప్పటి ప్రజలు కూడా సంరక్షించుకొంటున్న వైనం వివేకా నందుని ద్వారా ఆయన అనుయాయుల ద్వారా ప్రపంచజాతుల ముందు వివరంగా ఆవిష్కుతం కావడం ముదావహం. *ప్రపంచదేశాలకు ఈయదగిన సంస్కృతి భారతజాతికి ఉందనీ, స్వతంత్ర దేశంగా భాసించే యోగ్యతల్ని పొంది ఉన్నదనీ స్వామి వివేకానంద నిరూపించారు; అభ్యర్ధ నల ద్వారా గాక శౌర్యంతో, పురుషాకారంతో భారతీయులు స్వాతంత్ర్య సముపార్జన చేయగలరని ఋజువు చేసారు. *వివేకానందుని ధైర్యసాహసాలు అస మానం. ఆయన పురుష సింహంగా వెలుగొందారు. ఆ మహనీయుని దివ్యశక్తి ప్రభావం ఇప్పటికీ అత్యున్నత స్థాయిలో మనపై ప్రసరిస్తూనే ఉంది. అది ఎక్కడ ఏ రూపంలో ఉందో మనం ఊహించలేం. కానీ అది చాలా పటిష్ఠమైనదిగా, ఉత్కృష్టమై నదిగా భారతావని ఆత్మలో భాగంగా భాసిస్తోంది. ఆ విధంగా వివేకానంద తన మాతృమూర్తి హృదయంలో, ఆమె సంతతి హృదయాల్లో నివసిస్తూనే ఉన్నారు. అంటారు శ్రీ అరవిందులు. *నీ స్వస్వరూపం ఏమిటో తెలుసుకో , అంతర్నిహితంగా ఉన్న అనంత శక్తిని జాగృతపరచుకో, ఆత్మ స్వరూపాన్నిగ్రహిస్తున్న కొద్దీ మనలో శక్తి అధికమవు తుంది. అప్పుడు బంధాలన్నీ తెగిపోతాయంటారు స్వామి వివేకానంద. *స్వామి వివేకానంద 39 ఏళ్లు మాత్రమే జీవించారు. కానీ ఈ పరమ శంకరుడు మానవాళికి అందించిన జ్ఞాననిధి అనంతం. ఆ పరమేశ్వరుని పవిత్ర పాదస్పర్శతో పునీతమైన ఈ పుణ్యభూమిలో జన్మించినమనం అపారమైన జ్ఞానానికి వారసులమవుదాం. అమరత్వాన్ని అర్హతలుప్రసాదించమంటూ ఆ పరమ శివుణ్ణిప్రార్థిద్దాం. - గుమ్మా ప్రసాద రావు -
ఆ అమ్మాయి మాటను అమెరికా మెచ్చింది
ఎక్కడో మారుమూల... శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం తాడివలస గ్రామం. ఆ గ్రామానికి చెందిన విద్యార్థిని గురుగుబిల్లి ఢిల్లీశ్వరి వివేకానందుని షికాగో ప్రసంగాన్ని అనర్గళంగా చదివి అందరి మన్ననలు అందుకుంది. ఆమె ప్రసంగం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తోంది. విద్యార్థిని ప్రసంగించిన తీరుకు అబ్బురపడిన తానా అధ్యక్షులు స్వయంగా ఆర్థిక సాయం ప్రకటించారు. ఆమె చదువు బాధ్యత అంతా తామే తీసుకుంటామని తానా ప్రకటించింది. అంతేకాకుండా ఆ పాఠశాలలో చదువుతున్న మిగతా పేద విద్యార్థులకు సైతం సాయం చేస్తామని వాగ్దానం చేశారు. ‘అమ్మ ఒడి’తో వివేకానందుని ప్రసంగం.. జనవరి 9, 2019న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకం ప్రారంభోత్సవం సందర్భంగా తాడివలస పాఠశాలలో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. ప్రపంచానికి భారతదేశ గొప్పదనాన్ని, సంస్కృతి, సాంప్రదాయాలను ఎలుగెత్తి చాటిన వివేకానందుని స్ఫూర్తి ప్రసంగాలపై ఉపాధ్యాయులు పోటీలు నిర్వహించారు. పలువురు విద్యార్ధుల ప్రసంగాలకు మించి విద్యార్థిని ఢిల్లీశ్వరి విశేష ప్రతిభను కనబరిచింది. ఢిల్లీశ్వరి చేసిన ప్రసంగాన్ని సంబంధిత పాఠశాల ఉపాధ్యాయులు సామాజిక మాధ్యమాల్లో వీడియో రూపేణా పెట్టారు. ఈ వీడియోకు విపరీతమైన లైక్‌లు... వేలల్లో షేరింగ్‌లు, కామెంట్స్ వచ్చాయి. చివరికి ఈ వీడియో తానా పెద్దల కంట పడింది. ఇంకేముంది... తానా ప్రతినిధులు రామచౌదరి, ఉప్పలూరు రేఖ పాఠశాల హెచ్.ఎం లఖినేని హేమనాచార్యులు, ఉపాధ్యాయుడు పూజారి హరి ప్రసన్నలకు ఫోన్ చేసి మాట్లాడారు. ఢిల్లీశ్వరి కుటుంబ విషయాలను తెలుసుకున్నారు. ఆమె భవిష్యత్‌కు చేయూతనిచ్చేందుకు. ఆమె ఉన్నత చదువులు చదువుకునేందుకు నగదు పురసారాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 31న ఆమెకు లక్షా ముప్ఫైవేల రూపాయల నగదు, ఖరీదైన ఆండ్రాయిడ్ ఫోన్, సైకిల్ ఇవ్వనున్నారు. అదే పాఠశాలలో తల్లితండ్రుల్లో్ల ఒక్కరి సంరక్షణలో మాత్రమే ఉన్నటువంటి 25 మంది విద్యార్థులను ఎంపిక చేసి వారందరికీ సైకిళ్లను అందజేసేందుకు ముందుకొచ్చారు. చుట్టుపక్కల గ్రామాల్లో చదువుతున్న నిరుపేద విద్యార్ధులు మరో 30 మందికి కూడా సైకిళ్లు ఇచ్చేందుకు తానా పెద్దలు హామీ ఇచ్చారు. తానా స్ఫూర్తితో తెలుగు రాష్ట్రాల్లో మరికొంతమంది సహాయాన్ని అందించేందుకు ముందుకొచ్చారు. నేడు శ్రీకాకుళంలో నిర్వహించనున్న బాలరంజని కార్యక్రమంలో గన్నవరంకు చెందిన చలసాని దత్తు రూ. 9,999 ఢిల్లీశ్వరికి అందించనున్నారు. కాగా గురుగుబెల్లి ఢిల్లీశ్వరి తండ్రి వెంకటరమణ సెప్టెంబర్ 9, 2020న మృతి చెందాడు. ఏడేళ్లుగా బ్లడ్ కేన్సర్ వ్యా«ధితో బాధపడ్డ వెంకటరమణ కూలిపని, మేస్త్రీ పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారు. కరోనా సమయంలో మృతి చెందారు. దాంతో కుటుంబ భారమంతా ఢిల్లీశ్వరి తల్లి మీద పడింది. ఈ నేపథ్యంలో తానా అందించనున్న సాయం వారికి కొండంత అండ అయింది. నాన్నే సాయం చేయిస్తున్నట్లుంది..! గత ఏడాది అమ్మ ఒడి ప్రారంభం రోజున హరిప్రసన్న మాస్టారు రాసి ఇచ్చిన రాతప్రతి ఆధారంగా అందరి ముందు ప్రసంగించాను. వివేకానందుని స్ఫూర్తి ప్రసంగం కావడంతో అందరి మన్ననలను పొందాను. నన్ను గుర్తించిన తానా ప్రతినిధులు, తెలుగు రాష్ట్రాల ప్రజలు చదువుకోవడానికి సాయం చేయడం ఎంతో సంతోషంగా ఉంది. మానాన్నే నాకు సాయం చేయిస్తున్నట్లు అనిపిస్తోంది. – గురుగుబెల్లి ఢిల్లీశ్వరి, ఏడో తరగతి, తాడివలస జెడ్పీ హైస్కూల్. అంతా కలలాగా ఉంది! నా కూతురు ప్రతిభ ప్రపంచ దేశాల్లోని తెలుగు వారు గుర్తించడంతో చాలా సంతోషంగా ఉంది. భర్త దూరమైన బాధను మరిపిస్తుంది. అమెరికా నుంచి ఫోన్ రావడం, వారు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పడం అంతా కలగా ఉన్నట్లు అనిపించింది. వాస్తవంగా జరుగుతుండటంతో చాలా ఆనందంగా ఉంది. – గురుగుబెల్లి భాగ్యలక్ష్మి, విద్యార్థిని తల్లి ఎంతో ఆనందంగా ఉంది... మా పాఠశాలకు విదేశాల్లోను, తెలుగు రాష్ట్రాల్లోనూ గుర్తింపు రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఇదే స్ఫూర్తితో మున్ముందు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులకు మంచి విలువలతో కూడిన విద్యను అందించేందుకు కృషి చేస్తాం. తానా సభ్యులు ఈ విద్యార్థినికి ఆర్థిక సహాయం అందించడంతోపాటు మిగిలిన నిరుపేద పిల్లలకు కూడా సైకిళ్లు ఇవ్వాలనుకోవడం సంతోషం. – పూజారి హరిప్రసన్న, గణిత ఉపాధ్యాయుడు, తాడివలస. – కందుల శివశంకర్, సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం, ఫొటోలు: పాయక మధుసూదనరావు, పొందూరు -
జేఎన్‌యూలో విగ్రహావిష్కరణ చెయ్యనున్న మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రు విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ)లో స్వామి వివేకానంద విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహాన్ని జేఎన్‌యూలోని అడ్మినిస్ట్రేషన్ భవనం వద్ద అవిష్కరించనున్నట్లు వర్శిటీ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో జేఎన్‌యూ విద్యార్ధి సంఘం (జేఎన్‌యూఎస్‌యూ) సాయంత్రం 5 గంటలకి నార్త్ గేట్ వద్ద ఆందోళన పిలుపునివ్వడంతో యూనివర్శిటీలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను జేఎన్‌యూఎస్‌యూ అవిష్కరించింది. ఇప్పటికే జేఎన్‌యూ విద్యార్థులు విగ్రహ ఏర్పాటు అంశాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. జేఎన్‌యూ విద్యార్థులను దేశ విద్రోహులుగా అభివర్ణించిన బీజేపీ, ఆరెస్సెస్.. ఇప్పుడు వర్సీటీకి ఎందుకు వస్తున్నారని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. విగ్రహావిష్కరణ అనేది కేవలం నిధుల దుర్వినియోగమేనని ఆరోపించారు. 2016లో మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశామని, ఇప్పుడు రైతులు దేశమంతటా దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నారన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించకుంటే స్వామి వివేకానందను అవమానించినట్టేనని తెలిపారు. మరో విద్యార్థి విష్ణు ప్రసాద్ మాట్లాడుతూ స్వామి వివేకానంద సిద్ధాంతాలకు వ్యతిరేకం కాదని, కానీ ప్రాధాన్యతలను గుర్తించాలన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జేఎన్‌యూని అనగదొక్కాలని చూస్తుందని ఆరోపించారు. విగ్రహాలకు పెట్టే ఖర్చు విద్యార్థులపై పడే భారాన్ని తగ్గించేందుకు వినియోగిస్తే బాగుంటుదని సూచించారు. చదవండి: (బెయిల్ ఇప్పించి నిరసనలా?) ఈ కార్యక్రమంపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. జేఎన్‌యూలో జరగబోయే విగ్రహావిష్కరణ సాయంత్రం 6:30గంటలకి జరగనుందని తెలిపారు. దీనిపై మాట్లాడిన జేఎన్‌యూ వీసీ ఎం.జగదీష్ కుమార్ దేశంలో స్వామి వివేకానంద వంటి మేధావి, ఆధ్యాత్మిక నాయకుడు ఉండటం ఎంతో గర్వకారణమన్నారు. ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని, యువతకు ఆయన స్పూర్తి కావాలన్నారు. దేశా నాగరికతను, సంప్రదాయలను గౌరవించాలని కోరారని తెలిపారు. -
‘ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా’..
సాక్షి, అమరావతి : ‘ స్వామీ వివేకానందే నా నిజమైన హీరో. భారత దేశం ఉన్నంత కాలం వివేకానందుడి పేరు గుర్తుండిపోతుంద’ ని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం యూత్ డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ.. దేశం బాగుంటే మనం అందరం బాగుంటామని అన్నారు. యువత కలలు కని వాటిని సాకారం చేసుకోవాలని చెప్పారు. నాలుగు లక్షల యువతకి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదేనన్నారు. లంచం అనే మాట లేకుండా పాలన చేస్తున్న వ్యక్తి వైఎస్ జగన్ అంటూ కొనియాడారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా కొన్ని పార్టీలు మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. సరైన సదుపాయాలు లేక ఉత్తరాంధ్ర వెనకబడిపోయిందన్నారు. రాయలసీమ అంటే ఫ్యాక్షనిస్టులు, ఉత్తరాంధ్ర అంటే కమెడియన్లుగా చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితి ఉండకూడదనే సీఎం జగన్ తపన అని తెలిపారు. అన్ని ప్రాంతాల అభివృద్దే సీఎం జగన్ ఉద్ధేశ్యమని.. ఉత్తరాంధ్ర, రాయలసీమ, అమరావతి మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని అన్నారు. -
వివేకానంద స్ఫూర్తి చెరగనిది
హిందూ సంస్కృతి విస్తృతార్థంలో విశ్వవ్యాప్తి కావడానికి, సంకుచిత పరిమితులు దాటి సమస్త ప్రపంచ ఆమోదం పొందటానికి కారణమైన మహనీయుడు స్వామి వివేకానంద జయంతి నేడు. మొదటిసారిగా హిందూమతం ఒక మతం కాదని, అది జీవన సంస్కృతీ విధానమని యావత్ ప్రపంచానికి తెలిపిన విశిష్టమూర్తి ఆయన. 1863 డిసెంబర్ 12న కోల్‌కతాలో విశ్వనాథ్ దత్తా, భువనేశ్వరీదేవి వంశాంకురంగా జన్మిం చిన నరేంద్రుడు తర్వాత రామకృష్ణ పరమహంస గురునిర్దేశంలో వివేకానందుడిగా తనను తాను నిర్దేశించుకున్నారు. తారీఖులు, దస్తావేజుల ప్రస్తావనకు పోకుండా వివేకానందుడు అందించిన సందేశం, సంకల్పం, ఆధ్యాత్మిక పథాన్ని రేఖామాత్రంగా స్పృశించుకునే ప్రయత్నం చేస్తే మొదట మనందరికీ తట్టేది.. అమెరికాలోని చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో తోటి మానవులను ప్రియమైన సోదరసోదరీ మణులారా అని సంబోధించి మానవతా వాదాన్ని, మానవ హితాన్ని పాశ్చాత్యులకు ఆయన రుచి చూపించిన ఘటన మాత్రమే. ఆనాటి నుంచి ఆయన జీవితం సమస్తం సందేశాత్మకమే. ఆదర్శాత్మకమే. ఆచరణాత్మకమే. దేశభక్తే కాదు.. సంస్కృతి, సనాతనత్వం, సంప్రదాయం, నిబద్ధత, కార్యోన్ముఖం. బోధలు, ప్రబోధలు, పట్టుదల, అంకితభావం, సామాజిక దృష్టి, ఐక్యతా భావం, విలువలు, విశ్వసనీయత ఇలా.. ఏ కోణంలో చూసినా, ఆయనకు ఆయనే సాటి. స్వామి వివేకానంద జీవితం యావత్తూ సమస్త మానవాళికి ఓ సందేశమే, ఓ ప్రేరణాత్మకమే. 1893లో ప్రపంచ సర్వమత సమ్మేళనంలో భారతదేశాన్ని, హిందూమతాన్ని ఉద్దేశించి వివేకానందుడు చేసిన ప్రసంగం భారత యువతపైనే కాకుండా పాశ్చాత్య ప్రపంచంపై కూడా మహత్తర ప్రభావం కలిగించింది. అందుకే వివేకానందుని జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా కూడా జరుపుకుంటున్నాం. జాతిని ఉద్దీప్తం చేయడానికి యువతకు ఉక్కునరాలు కావాలని ప్రేరేపించిన వివేకానందుడి స్ఫూర్తి నేటికీ అవసరమే. (నేడు స్వామి వివేకానంద జయంతి) రమాప్రసాద్ ఆదిభట్ల, విశాఖపట్నం ‘ 93480 06669 -
ప్రపంచ హిందూ కాంగ్రెస్‌లో ఉపరాష్ట్రపతి ప్రసంగం
సాక్షి, న్యూఢిల్లీ: షికాగోలో స్వామి వివేకానంద ఉపన్యసించి 125 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా అక్కడ ఏర్పాటు చేయనున్న ప్రపంచ హిందూ కాంగ్రెస్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రసంగించనున్నారు. ఇందుకు ఆయన రెండు రోజుల అమెరికా పర్యటనకు శుక్రవారం బయలుదేరి వెళ్లనున్నారు. శనివారం హిందూ టెంపుల్ ఆఫ్ గ్రేటర్ షికాగోలో 14 తెలుగు సంఘాలు ఏర్పాటు చేయనున్న కార్యక్రమంలో పాల్గొంటారు. ఆదివారం ప్రపంచ హిందూ కాంగ్రెస్ మహాసభలో ప్రసంగిస్తారు. తిరిగి అదే రోజు రాత్రి భారత్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు. -
విద్వేష రాజకీయాలను తిరస్కరించారు
బెంగళూరు: విద్వేష రాజకీయాలను ఈశాన్య రాష్ట్రాల ప్రజలు తిరస్కరించారని, అదే సమయంలో బీజేపీకి ఏకగ్రీవంగా అధికారం కట్టబెట్టారని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష కూటమిని ఓడించి బీజేపీ జయకేతనం ఎగురవేసిన సంగతి తెలిసిందే. ఆదివారం బెంగళూరుకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుమకూరులో నిర్వహించిన యూత్ కన్వెన్షన్‌ను ఉద్దేశించి మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఫలితం తమకు అమితానందం ఇచ్చిందని పేర్కొన్నారు. తుమకూరులోని రామకృష్ణ వివేకానంద ఆశ్రమం సిల్వర్ జూబ్లీ వేడుకలు, స్వామీ వివేకానంద శిష్యురాలు సిస్టర్ నివేదిత 150వ జయంతి వేడుకల సందర్భంగా ఈ కన్వెన్షన్‌ను ఏర్పాటు చేశారు. ‘యూత్ పవర్: కొత్త భారతదేశానికి ఓ విజన్’అనే అంశంపై మోదీ ప్రసంగిస్తూ.. అతివాద భావజాలా నికి ఏకత్వంతోనే సరైన సమాధానం ఇవ్వగలమన్నారు. భారత భూభాగంతో సంబంధం లేదనే భావనను గత పాలకులు ఈశాన్య రాష్ట్రాల ప్రజల్లో నాటుకునేలా చేశారని, తమ ప్రభుత్వం వారిలోని ఈ ఆందోళనను తొలగించేం దుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. -
యువత..నీ పయనమెటు!
జీవితం నిరంతరం సాగే ప్రయాణం లాంటిది. మార్గంలో దారితప్పితే అలజడి రేగకతప్పదు. కొంతమంది యువత తమ పయనంలో పట్టుతప్పుతుండటం నేడు ఆందోళన కలిగించే అంశం. స్ఫూర్తివంతమైన సమాజానికి ఇది విఘాతం కలిగించే పరిస్థితి. సౌభాగ్యవంతమైన సమాజ నిర్మాణంలో యువత బలమైన శక్తులుగా నిలవాలని స్వామి వివేకానంద బోధించారు. సంఘంలో యువత సక్రమ మార్గంలో సాగితే భవిత బంగారుమయం కావడం ఖాయం. యువతకు మంచి మార్గాన్ని చూపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందని భావించి సాగితే అంతా మంచే జరుగుతుంది. అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడ సెంట్రల్) : ప్రేమ విఫలమై పాయకాపురానికి చెందిన డిగ్రీ విద్యార్థి బి.మురళీకృష్ణ నవంబర్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తనపైనే ఆధారపడి బతుకుతున్న ఓ తల్లి అనాథగా మారి విలవిల్లాడుతోంది. ♦ సత్యనారాయణపురం శ్రీనగర్ కాలనీకి చెందిన బీటెక్ విద్యార్థి వంశీతేజ క్రికెట్ బెట్టింగ్‌లకు అలవాటుపడి అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. అప్పుల వారి ఒత్తిడిని తట్టుకోలేక వేరే ప్రాంతానికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ♦ మధురానగర్ ప్రాంతానికి చెందిన కొంతమంది విద్యార్థులు గంజాయి, మత్తు పదార్థాలకు బానిసలై అక్కడి బ్లేడ్ బ్యాచ్ సభ్యులతో జత కలిశారు. వారు ఆ మత్తులో.. డబ్బుల వేటలో ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటన గత నెలలో చోటుచేసుకుంది. ♦ ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న వాంబేకాలనీకి చెందిన ఓ యువకుడు ఆమె కోసం.. తమ విలాసాల కోసం ఆ మహిళ మామను గత నెలలో హతమార్చాడు. ♦ సుబ్బరాజునగర్లో క్రికెట్ బెట్టింగ్ జరుగుతుందని సమాచారం రావడంతో పోలీసులు నిఘాపెట్టి దాడులు చేయగా వారిలో కొంతమంది విద్యార్థులు పట్టుబట్టారు. వారి వద్ద గంజాయి కూడా లభించడం గమనార్హం. ♦ ఇలా చెప్పుకుంటూ పోతే దేశానికి వెన్నెముకగా నిలవాల్సిన యువత ఇలా ఆత్మహత్యలు, హత్యలు చేస్తూ వారి జీవితాలను బుగ్గిపాలు చేసుకోవడంతో పాటు వారి తల్లిదండ్రులకు తీరని శోకాన్ని, నిందలు, అవమానాలను తెచ్చిపెడుతున్నారు. ప్రేమ.., మార్కులే జీవితం కాదు ఇటీవల కాలంలో ఎక్కువ మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటానికి ప్రధాన కారణం మార్కులు, రెండోది ప్రేమ అని పలు సర్వేలు చెబుతున్నాయి. మార్కులు తెచ్చుకోవాలని కొన్ని ఘటనల్లో తల్లిదండ్రులు, మరికొన్ని ఘటనల్లో విద్యాసంస్థలు విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయి. అలాగే ప్రేమించిన అమ్మాయి, అబ్బాయి దూరమవుతున్నారనే కారణాలతో కూడా యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ ఒత్తిడి నుంచి దూరం చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. విద్యాసంస్థలు మార్కుల ఒత్తిడి తెచ్చినప్పటికీ తల్లిదండ్రులు వారికి భరోసాగా నిలబడి ధైర్యాన్ని చెప్పడం, తమ పిల్లలపై మితిమీరిన భారాన్ని తొలగించడం చేయాలని వారు సూచిస్తున్నారు. స్వామి వివేకానంద చెప్పిన సూక్తులు ♦ ‘కోపం తెచ్చుకునే హక్కు ఎవరికైనా ఉండవచ్చు.. కానీ ఆ కోపంతో క్రూరంగా ప్రవర్తించే హక్కు మాత్రం ఎవరికి లేదు’. ♦ ‘ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే.. ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్నే నాశనం చేస్తుంది’. ♦ ‘బలమే జీవనం.. బలహీనతే మరణం’. ♦ ‘సహనం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది.. కానీ దాని ఫలితమెప్పుడూ తియ్యగానే ఉంటుంది’. ♦ వీరులు అపజయం చూసి కుంగిపోరు విజయం సాధించే వరకూ పోరాడుతారు.’ మార్పులు గమనించాలి..మార్పు తీసుకురావాలి.. యుక్త వయస్సుకు చేరుకుంటున్న తమ పిల్లల్లో వస్తున్న మార్పులను గురించి ప్రధానంగా వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు గమనించాలి. యువత పెడదోవ పట్టడానికి సమాజంలోని ఏదో ఒక వ్యక్తి గానీ, ఏదో ఒక సంఘటన గానీ కారణమవుతుందని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. జీవితం గురించి పూర్తి అవగాహన కల్పించడం వంటివి చేయడం వల్ల చీకటి కోణం నుంచి బయటపడే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. -
డాలస్‌లో ఘనంగా వివేకానంద జయంతి వేడుకలు
డాలస్ : డాలస్ మహానగరంలో స్వామి వివేకానంద 155వ జయంతి వేడుకలను వైఎస్ఆర్ సీపీ ఎన్నారై వింగ్ ఘనంగా నిర్వహించింది. కార్యక్రమానికి పెద్ద ఎత్తున యువత హాజరై స్వామి వివేకానందుల వారు యువతకి ఎలా ఆదర్శప్రాయులు అయ్యారో.. ఎలా దిశా నిర్దేశం చేశారో గుర్తు చేసుకున్నారు. డాక్టర్ శ్రీధర్ రెడ్డి కొర్సపాటి మాట్లాడుతూ స్వామి వివేకానందుల వారు భారతదేశం ఒక మెల్టింగ్ పాట్ లాగా అన్ని మతాలను తనలో ఇముడ్చుకోగలిగింది అని 1893లో చికాగోలో జరిగిన ప్రపంచ సర్వమత పార్లమెంట్ సదస్సులో చెప్పారని తెలిపారు. అలాగే స్వార్థం కోసం కాకుండా ప్రజల కోసం కష్టపడితేనే అది జీవితమన్న స్వామి సూక్తిని ఆదర్శంగా తీసుకొని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిస్వార్థంగా ప్రజల కోసం పాదయాత్ర చేస్తున్నారని చెప్పారు. గరికపాటి రాము మాట్లాడుతూ యూనివర్సల్ ఆక్సెప్టేన్సీ, సహనం గురించి స్వామి ఆనాడే చెప్పారని అన్నారు. కృష్ణారెడ్డి కోడూరు మాట్లాడుతూ స్వామి వివేకానంద నేటి యువతకి ఆదర్శ ప్రాయులని, బలమే జీవితం, బలహీనతే మరణం అన్న స్వామి వివేకానందుల వారి సూక్తిని యువత ఆదర్శవంతంగా తీసుకోవాలని కోరారు. దేహం బలంగా వుంటే ఆలోచించే మెదడు కూడా బలంగా ఉంటుందని చెప్పారు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా భారతదేశంలో ఉన్నంత యువ శక్తి లేదని యువతకి దేశ భవిష్యత్‌ని మార్చే శక్తి ఉందని, యువత రాజకీయ రంగంలో కూడా దృష్టి పెట్టాలని కోరారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాంటి నాయకుడిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని అన్నారు. కృష్ణ మోహన్ రెడ్డి కుందూరు మాట్లాడుతూ భారతదేశం అన్ని మతాల ఆచార వ్యవహారాలను గౌరవిస్తుందని స్వామి వివేకానందుల వారు ఏనాడో మనకి చెప్పారని గుర్తు చేశారు. రమణ పుట్లూరు మాట్లాడుతూ స్వామి వివేకానంద చేపినట్లుగానే ఏ పని చేసినా అందులో ధ్యాస పెట్టాలని యువతని కోరారు. సుబ్బారెడ్డి కొండూరు కార్యక్రమానికి విచ్చేసిన యువతకు ధన్యవాదాలు తెల్పి కార్యక్రమాన్ని ముగించారు. రాం గరికపాటి, సుబ్బారెడ్డి కొండూరు, ఉమా కుర్రి, శరత్ యర్రం, ఉదయ్, భాస్కర్, కులశేఖర్, ఉమా మహేష్, కిషోర్, జయచంద్ర, వెంకట్, వివేక్ తదితరులు కూడా కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. -
దిక్సూచి కొరవడిన దివ్యశక్తి
♦ సమకాలీనం ‘...లక్షల మంది ఆకలితో, అజ్ఞానంతో అలమటిస్తున్నపుడు, వారందరి శ్రమనుంచి విద్యార్జన చేసి, వారికేమాత్రం సహకారం అందించని వారిని నేను ద్రోహులుగానే పరిగణిస్తాను. నిర్భాగ్యులను అణచి, దోచి, బాధించి పొందిన సొమ్ముతో తమ ఆడంబరాల్లో బందీలుగా ఉంటూ, ఆ బాధితులకు ఏ రూపంలోనూ ఉపయోగపడని వారూ నా దృష్టిలో ఆకలిగొన్న క్రూర మృగాలే! నిజానికి అటువంటి వారమంతా దరిద్రులం, చివరకు ఏమీ కాకుండా పోతాం!’ అని రాస్తూ, అలా కాకుండా నడుచుకుందామని హితబోధ చేస్తారు. ‘‘ఇప్పటి యువకుల మీద, వారి ఆధునికత పైన నాకు పరిపూర్ణ విశ్వాసం ఉంది. వారి నుండే నాకవసరమైన కార్యకర్తలు లభిస్తారు. వారు సమస్యల్ని సింహబలులై ఎదుర్కొంటారు’’ అని స్వామీ వివేకానందుడు విశ్వాసం ప్రకటించి నూటపాతిక సంవత్సరాలయింది. ఆ తర్వాత అనేక మార్పులొచ్చాయి. రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. భారతదేశం స్వాతంత్య్రం పొందింది. రాజకీయ, ఆర్థిక, సామాజిక, సంస్కృతీ పరంగా ఇంటా బయటా ఎన్నెన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. శాస్త్ర–సాంకేతికత ప్రగతికి బాటలు పరిచాయి. ముఖ్యంగా యువతకు అపారమైన అవకాశాలు అందివస్తున్నాయి. ఇప్పటికీ యువతే ఏ దేశ భవిష్యత్తునైనా నిర్దేశించే స్థితిలో ఉంది. భారతదేశం అత్యధిక యువతరం కలిగిన దేశంగా లెక్కలకెక్కుతోంది. ప్రపంచీకరణ ఫలితంగా విశ్వవ్యాప్తమై లభిస్తున్న ఉద్యోగ, ఉపాధి అవకాశాల్ని ఒడిసిపడుతూ మనవాళ్లు ముందుకు సాగుతున్నారు. దేశీ యంగానూ ఉన్నంతలో అవకాశాల్ని అందిపుచ్చుకునే యత్నం మన యువత నిర్విరామంగా సాగిస్తోంది. కానీ, వివేకానందుని ఆలోచనా ధోరణికి, తాత్విక చింతనకు, ఆశావహ దృక్పథానికి విరుద్ధమైన భావజాలం, ఆలోచన, కార్యాచరణ అత్యధికుల్లో ఇప్పుడు రాజ్యమేలుతోంది. సరైన గమ్యం, దిశానిర్దేశం లేని పంథాలో వారు సాగుతున్నారు. జాతిని జాగృత పరచి, అనుపమానమైన యువశక్తిని ఏకీకృతం చేసి సరైన మార్గాన నడిపే ఆత్మ దేశంలో కొరవడింది. ఆదర్శ మార్గదర్శకత్వం లేకుండా పోయింది. సరైన దిక్సూచి లేక యువశక్తి... కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు, భావజాలాల వారీగా విడిపోయి సంకుచిత మార్గాల్లో సాగుతోంది. విలువలు పతనమైన ఫక్తు వ్యాపార విద్యావిధానం వల్ల వారిలో పరిమిత యోచన, హ్రస్వ దృష్టి పెరిగి ఆలోచనా పరిధి విస్తరించడం లేదు. జీవనశైలి సంక్లిష్టమౌతోంది. నిర్హేతుకమైన హింస, విధ్వంసాలకు తెగించే పెడధోరణులు యువతలో పెచ్చరిల్లుతున్నాయి. 1984లో ఉత్తర కర్ణాటకకు చెందిన గుల్బర్గా నగరంలోని న్యాయ కళాశాల వార్షికోత్సవ సదస్సు జరి గింది. న్యాయ కోవిదుడు రామ్‌జెఠ్మలానీని ఆహ్వానించి ‘‘భారతదేశానికిపుడు రాజకీయ నాయకుల కన్నా నైతికనేతల అవసరం ఎక్కువుంది’’ అనే అంశంపై ప్రసంగ కార్యక్రమం ఏర్పాటు చేశాము. మూడున్నర దశాబ్దాల తర్వాత... ఇప్పటికీ పరిస్థితిలో ఏం మార్పు లేదు! ఒక పిలుపుతో అత్యధికుల్ని ఒక్కతాటిపై నడిపే నిబద్ధత కలిగిన నైతిక, ధార్మిక నేతృత్వపు నేటి అవసరాన్ని వివేకానందుడు గుర్తుచేస్తున్నారు. విత్తొకటి వేస్తే చెట్టొకటి వస్తుందా? దారితప్పిన మన విద్యావిధానం ప్రస్తుత పెడధోరణులకు ప్రధాన కారణం. ప్రభుత్వ నిర్వహణ నుంచి విద్య క్రమంగా ప్రయివేటు వైపు మళ్లుతున్న క్రమంలోనే ప్రతి అంశంలోనూ ఫక్తు వ్యాపార ధోరణి పెచ్చు మీరింది. లాభాపేక్షతో విద్యాబోధన జరిపించే ‘పరిశ్రమ’లు వెలిశాయి. ఫలితంగా విలువలు అడుగంటుతున్నాయి. విద్యార్థులు–యువతరం ఆలోచనా ధోరణి వికటిస్తోంది. ప్రపంచీకరణలో అన్నీ వినియోగ వస్తు దృక్పథంతో చూడటం అలవాటయ్యాక త్యాగ భావనే కొరవడుతోంది. చదువులో, ఉద్యోగాలు పొందడంలో అనారోగ్యకర పోటీ పెరిగి వారిలో స్వార్థం కట్టలు తెంచుకుంటోంది. దాని చుట్టే జీవనశైలి రూపుదిద్దుకుంటోంది. ఇది విద్యావిధానమే కాదనేది వివేకానందుడి భావన. ‘మెదడును అసంఖ్యాకమైన వైజ్ఞానిక విషయాలతో నింపటం విద్య కాదు. మనస్సు సమగ్ర ఉత్తీర్ణతను సాధించాలి. దానిపై సాధికారతను, నియంత్రణను సమకూర్చడమే విద్య లక్ష్యమై ఉండాలి’ అంటారాయన. విద్య ఎలా ఉండకూడదో చెబుతూ, ‘గంధపు చెక్కలు మోసే గాడిదకు వాటి బరువు తప్ప విలువ తెలియదు, ఎంత సమాచారం మెదడులో నింపామన్నది మన విద్యాజ్ఞానం కొలమానమే కాదంటారు. ‘సమాచార సేకరణ, విషయ గ్రహణమే విద్య అయితే, మన గ్రంథాలయాలు తాపసులౌతాయి, మన విజ్ఞానసర్వస్వాలు మహర్షులుగా వెలుగొందుతాయ’ని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తారు. ‘జీవితానికి, ప్రవర్తనకు అక్కరకొచ్చే అయిదు ఆలోచనల్ని మనస్సుకు పట్టించుకుంటే చాలంటారు. ‘విద్యవల్ల సత్ప్రవర్తన అలవడాలి, మనో దారుఢ్యం పెరగాలి, వ్యక్తిత్వ వికాసం–వివేక విస్తరణ జరగాలి. చివరగా, మన కాళ్లమీద మనం నిలబడగలగాలి అంతే!’ అంటారు స్వామీజీ. తప్పు తెలిస్తే, దిద్దుకోవడం తేలిక! భారతదేశంలో రెండు దుష్కర్మలు సాగుతున్నాయని వివేకానందుడనేవారు. ఒకటి స్త్రీ జాతి అణచివేత, రెండోది బీదల పట్ల వివక్ష, ముఖ్యంగా కుల వివక్షతో చూపే నిర్దాక్షిణ్య వైఖరి అని ఆయన అభిప్రాయం. అవి ఇంకా కొనసాగడం దురదృష్టకరం! మహిళల పట్ల ఇప్పటికీ జరుగుతున్న దాష్టీకాలు చూస్తుంటే, లింగపరంగా సరైన దృక్పథం అలవడకపోవడమే వాటికి కారణం అనిపిస్తుంది. ఈ విషయంలో స్వామీజీకి ఉదాత్తమైన భావాలుం డేవి. ‘స్త్రీ పురుష భేదాన్ని విస్మరించి, మానవులంతా సమానులే అన్న భావన రానంతవరకు, స్త్రీ జనోద్ధరణకు అవకాశమే ఉండదు’ అని బలంగా అభిప్రాయపడ్డారు. ‘మానవ జాతి ఒక్కటే. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని ఏమీ ఉండదు. అందరూ సర్వసమానతా భావాన్ని ప్రోత్సహిస్తూ ఒకరి సాహచర్యాన్ని మరొకరు అభిలషిస్తూ స్త్రీ–పురుషులు పరస్పర సహకారంతో సంచరిస్తేనే జీవతం ఆనందమయమౌతుంది’అనేవారు. ‘ప్రపంచ శ్రేయస్సును సంరక్షించుకోవాలంటే స్త్రీ పరిస్థితి మెరుగుపడాలి. పక్షి ఎన్నడూ ఒక రెక్క సహాయంతో ఎగురలేదు’ అన్నారాయన. తరాల తరబడి కొన్ని అట్టడుగు వర్గాల ప్రజలు మోసగించబడ్డారని, వాటికి చారిత్రక సాక్ష్యాధారాలున్నాయని వివేకానందుడు పేర్కొనేవారు. ‘మనదేశంలో బీదలను, అట్టడుగు వర్గాల వారిని ఆదుకునేందుకు స్నేహితులుండరు. వారు ఎంత కష్టించినా వారొక స్థాయి నుండి పైకి రాలేరు. రోజులు గడిచిన కొద్దీ ఇంకా తక్కువ స్థాయికి దిగజారుతున్నారు. సమాజం నిర్దయగా వారిని చెప్పుదెబ్బలు కొడుతూనే ఉంది. ఆ దెబ్బలు ఏ సమయంలో ఎలా వచ్చి తాకుతాయో కూడ ఆ నిస్సహాయ ప్రజలకు తెలియదు’ అన్నారు. 1894లో చికాగో నుంచి ‘అలి సింగ’కు రాసిన ఉత్తరంలో చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ‘...లక్షల మంది ఆకలితో, అజ్ఞానంతో అలమటిస్తున్నపుడు, వారందరి శ్రమనుంచి విద్యార్జన చేసి, వారికేమాత్రం సహకారం అందించని వారిని నేను ద్రోహులుగానే పరిగణిస్తాను. నిర్భాగ్యులను అణచి, దోచి, బాధించి పొందిన సొమ్ముతో తమ ఆడంబరాల్లో బందీలుగా ఉంటూ, ఆ బాధితులకు ఏ రూపంలోనూ ఉపయోగపడని వారూ నా దృష్టిలో ఆకలిగొన్న క్రూర మృగాలే! నిజానికి అటువంటి వారమంతా దరిద్రులం, చివరకు ఏమీ కాకుండా పోతాం!’ అని రాస్తూ, అలా కాకుండా నడుచుకుందామని హితబోధ చేస్తారు. ముందు మేల్కొనండి... యువత పట్ల వివేకానందుడికి అపారమైన ఆశ, నమ్మకం ఉండేవి. మీలో ఎంతో శక్తి ఉంది, ఆత్మవిశ్వాసంతో ఉండండి, అప్రమత్తం కండి, అంతే చాలు, మిగతావన్నీ వాటంతట అవే జరిగిపోతాయని యువతరానికి సందేశం ఇచ్చేవారు. సమాజంలో కొనసాగుతున్న అరిష్టాల్ని ఎదుర్కొనేందుకు యువత సన్నద్దం కావాలని పిలుపునిచ్చేది. 1896 జూన్ 7న లండన్ నుంచి మిస్ మార్గరెట్ నోబెల్‌కు ఉత్తరం రాస్తూ వివేకానందుడు ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. ‘... ప్రపంచం దుఃఖంతో జ్వలిస్తోంది. మీరు నిద్రించగలరా? మనం బిగ్గరగా అరవాలి... ఎంతలా అంటే, మనలో విశ్రమిస్తున్న దేవత నిద్రలేవాలి, ఆ పిలుపులకు ప్రతిస్పందించాలి’ అని రాశారు. యువత ఎక్కువగా ఉన్న ఒక సమావేశంలో మాట్లాడుతూ, ‘సాహసికులైన యువకులారా! మీకు కావలసినవి మూడే విషయాలు: అవి ప్రేమ, నిజాయితీ, సహనం. జీవితమంటే ప్రేమ. ప్రేమమయమే జీవితం. ఇదే జీవిత పరమార్థం. స్వార్థపరత్వమే మరణం! ఇది ఇప్పటికే కాదు ఎప్పటికీ సత్యమే. మనకు భావి లేదనుకున్నా, ఇతరులకు మంచి చేయడమే జీవితం. హాని సల్పటం మరణం. నీకు కనిపించే పశుప్రవృత్తి కలిగిన మానవుల్లో నూటికి తొంబై మంది మృతులే!’ అన్నారు. జీవితంపైనే సరైన దృక్పథం లేని నేటి యువకులు కొందరు, ఉన్మాదంతో ఎదుటివారి జీవితాల్ని హరిస్తున్నారు. వివేకానందుడు చెప్పిన ప్రేమ, నిజాయితీ, సహనం మూడూ లేని ముష్కరులు తయారవుతున్నారు. చిన్న వయసులో తాగి తందనాలాడుతున్నారు. నేర ప్రవృత్తిలోకి దిగుతున్నారు. విలువలు నశించినా ఆడంబరాలకు అతుక్కుపోతున్నారు. అందరి పూనికతోనే మార్పు... యువతరం భారత్‌కు ఓ గొప్ప శక్తి! 35 ఏళ్ల లోపు వయస్కులైన 65 శాతం జనాభాతో ప్రపంచంలోనే అగ్రగామి ‘యువ’దేశంగా మనకు కీర్తి లభిస్తోంది. 15–29 మధ్య వయస్కుల జనాభా 27.5 శాతంగా మానవవనరుల సహాయ మంత్రి డా. సత్యపాల్‌సింగ్ వారం కింద లోకసభకు తెలిపారు. తగిన విద్య, శిక్షణ, నైపుణ్యాల వృద్ధి చేస్తూ వారిని శ్రమశక్తి వనరుగా తీర్చిదిద్దుతున్నట్టు చెప్పారు. ప్రపంచ కార్మిక సంస్థ (ఐఎల్వో) ప్రమాణాల ప్రకారం పనిచేసే–చేయని మానవ వనరుల నిష్పత్తి, రాగల ఒకటిన్నర దశాబ్దాల్లో (2016–30) చైనా, కొరియా, బ్రెజల్ కంటే భారత్‌లోనే మెరుగ్గా ఉంటుందని కార్మిక మంత్రి సంతోష్‌కుమార్ గాంగ్వార్ తెలిపారు. భారత యువజనాభివృద్ధి సూచిక 0.569 సగటుతో ఆశావహంగానే ఉందని యువజన వ్యవహారాలు–క్రీడల సహాయ మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ వివరించారు. 2014 యువ విధాన పత్రం ప్రకారం, అభివృద్ది ఫలాల గ్రహీతలుగా మాత్రమే కాకుండా యువతను చోదకశక్తులుగా, క్రియాశీలంగా ఉంచే కార్యక్రమాలు రచించి, అమలు చేస్తున్నట్టు ఆ శాఖ మంత్రి విజయ్‌గోయల్ సభలో వెల్లడించారు. ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది అర్హులైన నిరుద్యోగులు తమ ఉద్యోగ–ఉపాధి అవకాశాల కోసం నిత్య పోరాటం చేస్తున్నారు. మరో వంక మూడు ప్రభుత్వాలు తాము ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని ప్రకటనలు చేస్తున్నాయి. ప్రభుత్వ లెక్కలు, కథలు, కథనాలెలా ఉన్నా... నేటి యువతరం ప్రవర్తన, ఆలోచనా ధోరణి, దృక్పథాలను తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు, విద్యాసంస్థల పాత్ర ఎంతో కీలకం. దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలామ్, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఫేస్బుక్ అధినేత జుకెర్‌బర్గ్, ఐటీ దిగ్గజాలు అజీమ్ ప్రేమ్‌జీ, నందన్ నీలేకనీ వంటి వారి మాటలకు అక్కడక్కడ యువతరం ఎంతో కొంత ప్రభావితమవుతున్నారు, స్పందిస్తున్నారు. కానీ, యువతను దారిన పెట్టే ప్రభావశీలురు, వైతాళికులు లేకుండా పోయారు. కుంచించుకుపోతున్న యువత ఆలోచనా ధోరణి విస్తరించాలి. విశాల దృక్పథం అలవడాలి. ఇందుకు, తల్లిదండ్రులు క్రియాశీల పాత్ర పోషించాలి. ఆదర్శమూర్తుల దారిన నడిచేలా తమ పిలల్ని చిన్నప్పట్నుంచే ప్రభావితుల్ని చేయాలి. నరేంద్రుడు వివేకానందుడిగా మారేంత ప్రభావితం చేసిన భువనేశ్వరీ దేవి అందరికీ ఆదర్శం కావాలి. ఒకనాడు తల్లి తనకు చెప్పినట్టు వివేకానందుడే స్వయంగా తన పుస్తకంలో రాసుకున్న మాటలతో ముగిస్తా. ‘‘పవిత్రంగా ఉండు. స్వచ్ఛమైన జీవితాన్ని గడుపు. ఆత్మగౌరవాన్ని సంరక్షిం చుకో. ఇతరులను గౌరవంగా చూడు. సరళ స్వభావుడవై నిరాడంబరంగా మెలుగు. కానీ, అవసరమైనచోట దృఢత్వాన్ని ప్రదర్శించడానికి వెనుకాడకు’’ (నేడు వివేకానంద జయంతి) దిలీప్ రెడ్డి వ్యాసకర్త పూర్వ సమాచార కమిషనర్ ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
స్వామి వివేకానంద, మోదీకి పోలికలు
సాక్షి, న్యూఢిల్లీ: స్వామి వివేకానంద చికాగో ప్రసంగానికి 125 సంవత్సరాలైన సందర్భంగా ఆయనకు ఘనంగా కృతజ్ఞతలు తెలియజేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మధ్యన కొన్ని పోలికలు కొట్టొచ్చినట్ల కనిపిస్తాయి. పేరులో కూడా ఆ పోలిక ఉంది. స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. ఇద్దరూ ప్రసంగాల్లో దిట్ట. వీరిరువు తమ ప్రసంగాల ద్వారా ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తారు. వీరు దేశంలో చేసిన ప్రసంగాలకన్నా అమెరికా, ఇతర దేశాల్లో చేసిన ప్రసంగాలకే ఎక్కువ ప్రాముఖ్యత లభించింది. ప్రజలను విశేషంగా ఆకర్షించాయి. రకరకాల నిండైన దుస్తులు ధరించడమన్నా, సరైన భంగిమల్లో ఫొటోలకు ఫోజులివ్వడమన్నా వీరిరువురికి అమిత ఇష్టం. వివేకానంద మద్రాస్‌కు లేదా లండన్‌కు వెళ్లినప్పుడల్లా ఆయన ఎక్కువ సమయాన్ని ఫొటో స్టూడియోల్లోనే గడిపేవారట. తలపాగా, జుట్టూ సరిచేసుకుంటూ వివిధ భంగిమల్లో ఫొటో స్టూడియోల్లోని అద్దాల్లో చూసుకోవడం ఆయనకు అలవాటు అట. జాతిపిత మహాత్మాగాంధీకున్న మరో మంచి అలవాటు కూడా ఆయనకు ఉంది. గాంధీ ఎన్నడు కూడా కెమేరాకేసి చూడలేదు. అలాగే వివేకానందుడు కూడా కెమేరా వైపు చూడలేదట. కానీ మంచి ఫోజులో ఫొటో వచ్చేలా ఓ పక్కకు నిలబడి మరోపక్కకు చూస్తూ ఫొటోలు దిగేవారట. ఆయన నేరుగా నిలబడి, నేరుగా చూస్తున్న ఫొటోలు చాలా అరుదు. గాంధీకి తెలిసి ఆయన ఎన్నడూ కెమేరా వైపు చూడలేదు. 1931, లండన్‌లో రెండో రౌండ్ టేబుల్ సమావేశం అయినప్పుడు ఫొటోగ్రాఫర్ ఆదేశం మేరకు బీఆర్ అంబేద్కర్ సహా అందరూ కెమేరావైపు చూడగా గాంధీ మాత్రం తన ముందున్న డాక్యుమెంట్లవైపు చూస్తూ ఉండిపోయారు. నరేంద్ర మోదీ అలా కాదు. ఆయన కెమేరా కన్ను ఎక్కడుందో ఇట్టే పసిగడతారు. ఎలా చూస్తే ఫొటో బాగా వస్తుందో ఆయనకు బాగా తెలుసు. 1893, సెప్టెంబర్ 11వ తేదీన చికాగోలో వివేకానందుడు ప్రసంగించి 125 వసంతాలైన సందర్భంగా మోదీ ఆయనకు కతజ్ఞతలు తెలుపారుగానీ ఎలా లెక్కేసిన 124 సంవత్సరాలే అవుతుంది. ఏడాది ముందుగానే ఆయన ప్రసంగాన్ని మోదీ ఎందుకు గుర్తు చేశారో తెలియదు. దేశంలో అసహనం పెరిగిపోతూ జర్నలిస్ట్ గౌరీ లంకేష్లలాంటి మేథావులు హత్యలకు గురవుతున్న నేటి పరిస్థితుల్లో వివేకానందుడి చికాగో ప్రసంగాన్ని పదే పదే గుర్తు చేసుకోవాల్సిందే. ‘సహనాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మతానికి చెందిన వాడినని చెప్పుకోవడానికి నేనెంతో గర్వపడుతున్నాను’ అన్న ఆయన వ్యాఖ్యలు ఈ జాతికి కొత్త స్ఫూర్తినివ్వాలి. -
మతోన్మాదంపై పోరాటం సాగిద్దాం
వివేకానంద జయంతి కార్యక్రమంలో ప్రధాని, సోనియా న్యూఢిల్లీ: మతోన్మాదంపై పోరాటం సాగిద్దామని ప్రధాని మన్మోహన్సింగ్, యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపునిచ్చారు. అసలైన మతం విద్వేషానికి, విభజనకు మూలం కాజాలదని వారు అన్నారు. స్వామి వివేకానందుని 150వ జయంతి సందర్భంగా ఢిల్లీలో ఆదివారం ఏర్పాటైన కార్యక్రమంలో వారిద్దరూ మాట్లాడారు. ప్రధాని మన్మోహన్ మాట్లాడుతూ, స్వామి వివేకానందుని సిద్ధాంతాలతో తాను స్ఫూర్తి పొందానని అన్నారు. అసలైన మతాలు కీచులాటలకు దిగబోవని, అన్ని మతాల సారం ఒక్కటేనని వాటికి తెలుసునని ఆయన అన్నారు. మతాలన్నీ పరస్పర గౌరవాన్ని, సహనాన్ని బోధిస్తాయన్నారు. వివేకానందుని బోధలు ముఖ్యంగా యువతకు ఇప్పటికీ అనుసరణీయాలని సోనియా అన్నారు. విద్య, సుపరిపాలన, మెరుగైన ఉపాధి వంటి అంశాల్లో యువత ఆకాంక్షలను నెరవేర్చడంలో దేశం విఫలం కారాదని వివేకానందుడు చెప్పిన మాటలను గుర్తు చేశారు. మన ప్రాంతంతో పాటు చాలా దేశాల్లో మతోన్మాదం ముప్పుగా మారిందని సోనియా ఆందోళన వ్యక్తం చేశారు. వివేకానందుని బోధలను యువత ఆకళింపు చేసుకోవాలని, వారు మతోన్మాదంపై పోరు సాగించాలని అన్నారు. మతోన్మాద, విచ్ఛిన్నకర రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై తరచుగా కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, సోనియా, ప్రధాని తమ ప్రసంగాల్లో మోడీ పేరును నేరుగా ప్రస్తావించకపోయినా, పరోక్షంగా విమర్శలు గుప్పించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల కోసం వివేకానందుని పేరుతో యువతను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, ఆయన సిద్ధాంతాలను, విలువలను పాటించకుండా ఆయనకు మొక్కుబడిగా నివాళులర్పించడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదని ప్రధాని మన్మోహన్ అన్నారు. షికాగోలో 1893లో జరిగిన సర్వమత సమ్మేళనంలో వివేకానంద చేసిన చరిత్రాత్మక ప్రసంగాన్ని ఆయన గుర్తు చేశారు. ఒంటెత్తువాదం, మత దురభిమానం, మతమౌఢ్యం నేలతల్లిని నెత్తుటేర్లలో ముంచెత్తాయని, నాగరికతలను నాశనం చేశాయని, దేశాలకు దేశాలనే కోలుకోలేనంతగా దెబ్బతీశాయని వివేకానంద చెప్పిన మాటలను ఉటంకించారు. కాగా, ప్రపంచంలోని చాలా దేశాల్లో వృద్ధుల జనాభా పెరుగుతోందని, అందుకు భిన్నంగా మన దేశంలో మాత్రం జనాభాలో అత్యధికులు యువకులేనని సోనియా అన్నారు. సంకుచితవాదులు, స్వార్థశక్తుల చేతిలో యువత పావుగా మారరాదని వివేకానందుని బోధలు చెబుతున్నాయన్నారు. వివేకానందుని బోధలకు ప్రాచుర్యం కల్పించేందుకు రూ.253 కోట్ల ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించిందని సాంస్కృతిక శాఖ మంత్రి చంద్రేశ్‌కుమారి కటోచ్ చెప్పారు. షికాగో వర్సిటీలో వివేకానందుని పేరిట పీఠాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ‘చౌక విద్యుత్‌తోనే అభివృద్ధి’ నోయిడా: అందుబాటు ధరల్లో విద్యుత్తు లభ్యతే అభివృద్ధికి కీలకమని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. నోయిడాలో ఆదివారం ఏర్పాటైన పెట్రోటెక్-2014 సదస్సులో ఆయన మాట్లాడారు. భారత్ 2020 నాటికి ప్రపంచంలోనే మూడో పెద్ద ఇంధన వినియోగదారుగా మారనున్న నేపథ్యంలో అందుబాటు ధరల్లో విద్యుత్తు లభ్యతే ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. విద్యుదుత్పాదనలో భారత్ ప్రస్తుతం ప్రపంచంలో ఏడో స్థానంలో ఉందని, ప్రపంచంలో ఉత్పత్తయ్యే మొత్తం విద్యుత్తులో భారత్ 2.5 శాతం మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతోందని అన్నారు. రానున్న రెండు దశాబ్దాల్లో విద్యుదుత్పాదనను మూడు నుంచి నాలుగు రెట్ల మేరకు పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. -
వివేకానంద జీవితం యువతకు స్ఫూర్తిదాయకం
మహబూబ్‌నగర్ కల్చరల్/ విద్యావిభాగం, న్యూస్‌లైన్: స్వామి వివేకానంద జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని స్వామి వివేకానంద డిగ్రీ కళాశాలలో వివేకానంద 151వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించి, మాట్లాడారు. విద్యార్థులందరూ వివేకానందుని సందేశాలను విన్నంత మాత్రాన సరిపోదని వాటిని ఆచరించాలని సూచించారు. విద్యార్థులు ధైర్యంగా ఉండి సంఘసేవ చేయాలన్నారు. భారతదేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, వారిని ఉత్తేజితులను చేయడం ద్వారానే జాతి భద్రంగా ఉంటుందని వివేకానందుడు ప్రవచించారని కలెక్టర్ గుర్తు చేశారు. ధైర్యంగా జీవించడం, బలాన్ని గురించి ఆలోచించడమే బలహీనతకు మంద ని, బలమే ప్రాణం-బలహీనతే మరణమనేవి స్వామిజీ సందేశాల్లో ప్రధానమైనవన్నారు. సెలవు రోజుల్లో ఒక గంటపాటు విద్యార్థులను సమీకరించి, వారిచే వివేకానందుడి గురించి మాట్లాడించాలని, తద్వారా వ్యక్తిత్వ వికాసంతో పాటు సామాజిక పరిజ్ఞానం పెంపొందుతుందన్నారు. రామకృష్ణమఠం ప్రతినిధి నియమ చైతన్యనంద మాట్లాడుతూ నిస్వార్థం, ప్రేమ, ధైర్యం, త్యాగం సేవాగుణం అలవర్చుకుంటే గొప్ప వ్యక్తులు అవుతారని అన్నారు. ప్రతి ఒక్కరూ విలువలతో కూడిన విద్యను అభ్యసించి దేశపురోభివృద్ధికి తోడ్పడాలన్నారు. రక్తదాన శిబిరంలో 150మంది విద్యార్థులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ చైర్మన్ మనోహర్‌రెడ్డి, వైస్ చైర్మన్ లయన్ నటరాజ్, జేపీఎన్‌ఈఎస్ చైర్మన్ రవికుమార్, కళాశాల కరస్పాండెంట్ ఫణిప్రసాద్‌రావు, డెరైక్టర్ సయ్యద్ ఇబ్రహీం ఖలీల్, ప్రిన్సిపల్ విఠల్‌రావు, కె.సత్యనారాయణరావు, డాక్టర్ వీరప్ప తదితరులు పాల్గొన్నారు. దేశభక్తిని పెంపొందించారు చిన్నచింతకుంట: ప్రతి భారతీయుడిలో దేశభక్తిని పెంపొందించేందుకు స్వామి వివేకానందుడు ఎంతో కృషి చేశారని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యుడు డాక్టర్ రావుల రవీంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. చిన్నచింతకుంట మండలం నెల్లికొండిలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆరెస్సెస్ వక్త అమరలింగం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ స్వామిజీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పని చేయాలని పిలుపునిచ్చారు. యువత కలిసికట్టుగా ఉంటేనే ఏదైనా సాధించవచ్చని సూచించారు. వివేకానంద కలలుగన్నా దేశాన్ని స్థాపించాలన్నారు. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ వివేకానందుడి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. గ్రామంలో స్వామిజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషిస్తున్నానని అన్నారు. మాజీ ఎమ్మెల్యే స్వర్ణ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ పేదలకు సేవ చేయడమే స్వామి వివేకానంద సిద్ధాంతమని, అన్ని మతాల సారాంశాన్ని గుర్తించి గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నేతలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, డోకూర్ పవన్‌కుమార్‌రెడ్డి, టీ.వేణుగోపాల్, సిద్దార్థారెడ్డి, సర్పంచ్ శారద, మార్కెట్ చైర్మన్ అరవింద్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, కుర్వ రమేష్, తదితరులు పాల్గొన్నారు. -
కన్నతల్లి, జన్మభూమినిమరువొద్దు
వరంగల్ లీగల్, న్యూస్‌లైన్ : జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగి ఉన్నత స్థానానికి చేరినా.. జన్మనిచ్చిన తల్లి, భూమిని మరువొద్దని కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ సూచించారు. కమిషనర్‌గా నియమితులైన తర్వాత తొలిసారి శనివారం జిల్లాకు వచ్చిన ఆయన వరంగల్ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో జరిగిన స్వామి వివేకానంద 151 జయంత్యోత్సవాల్లో పాల్గొని మాట్లాడారు. స్వామి వివేకానంద చెప్పినట్లుగా.. కళ్లు మూసినా, తెరిచినా కనిపించేది భగవంతుడొక్కడేనని, ఎక్కడ విభూది ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడని తెలిపారు. సమాచార హక్కు చట్టం రావడానికి ముందు ఈ అంశంతో పాటు రాజ్యాంగం గురించి రాసిన వ్యాసాలు, ఇచ్చిన ఉపన్యాసాలతో తనకు కేంద్ర సమాచార కమిషనర్ పదవి లభించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్‌ను జిల్లా జడ్జి వెంకటరమణతో పాటు బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. సమావేశంలో ఆచార్య కసిరెడ్డి వెంకట్‌రెడ్డి, బార్ అసోసియేషన్ బాధ్యులు కె.అంబరీషరావు, రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్ ముద్దసాని సహోదర్‌రెడ్డి, కార్యదర్శి సునీల్‌తో పాటు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
ఆరోగ్యమూ సక్సెస్‌కు ఓ సోపానమే..!
Anything that makes you weak physically, intellectually and spiritually reject it as poison.. శరీరాన్నిగానీ, బుద్ధినిగానీ ఆధ్యాత్మికతనుగానీ బలహీనపరిచే దేన్నయినా విషంలా తిరస్కరించాలి.. - స్వామి వివేకానంద పదో తరగతి, ఇంటర్, ఇంజనీరింగ్ విద్యార్థులైనా.. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారైనా.. అందరి లక్ష్యం ఒక్కటే! అది పరీక్షల్లో మంచి మార్కులు సాధించి విజయ తీరాలకు చేరుకోవాలని! ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయాణించే మార్గంలో ఒత్తిడి, ఆందోళన, భయం, కోపం, అలసట, అనారోగ్యం వంటి కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. అలాంటి అడ్డంకులు ఎదురుకాకుండా ఉండాలన్నా, ఒకవేళ ఎదురైనా వాటిని అధిగమించే నేర్పును సొంతం చేసుకోవాలన్నా విద్యార్థులు అనుసరించాల్సిన మార్గాలపై స్పెషల్ ఫోకస్.. రోజువారీ తరగతులకు ఉరుకుల పరుగులు.. దండిగా ఉన్న పుస్తకాలతో బరువెక్కిన బ్యాగులు.. యూనిట్ టెస్ట్‌లు, మిడ్ టెస్ట్‌లు.. ర్యాంకుల చిట్టాలు.. ప్రతి విద్యార్థి జీవితంలో నిత్యం ఎదురయ్యే కొన్ని అనుభవాలివి. ఇంత బిజీ లైఫ్‌లో ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావడం కష్టమే. చదివిన పాఠాలు ఒంటబట్టి, లక్ష్యాన్ని చేరుకోవాలంటే శారీరకంగానే కాకుండా మానసికంగానూ, సామాజికంగానూ ఆరోగ్యంగా ఉండాలి. విద్యార్థి ప్రగతి పథంలో ఎదురయ్యే పెద్ద అవరోధాలు వ్యాధులన్న విషయాన్ని గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ధ్యానం (మెడిటేషన్) యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్కు చెందిన పరిశోధకులు సైకాలజీ తరగతికి చెందిన విద్యార్థులపై ఓ అధ్యయనం చేశారు. ఇందులో భాగంగా ఓ లెక్చర్‌ను వినడానికి ముందు కొందరు విద్యార్థులు ధ్యానం చేశారు. మిగిలిన వారు చేయలేదు. లెక్చర్ పూర్తయిన తర్వాత క్విజ్ నిర్వహించగా ధ్యానం చేయని వారికంటే ధ్యానం చేసిన వారు మంచి స్కోర్ సాధించారు. ఇలాగే ధ్యానంతో అకడమిక్స్‌లో మంచి ఫలితాలు సాధించవచ్చని అనేక అధ్యయనాల్లో తేలింది. దటీజ్ పవర్ ఆఫ్ మెడిటేషన్.. అనంతమైన ఆనందానికి తలుపులు తెరిచేదే ధ్యానం. లక్ష్యంపై గురి కుదరాలన్నా, చదువుపై ఏకాగ్రత నిలపాలన్నా విద్యార్థులు ధ్యాన సాధనను అలవరచుకోవాలి. ప్రతి రోజూ విద్యార్థులు ధ్యానం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. రాత్రి పగలు గాను, పగలు రాత్రిగాను మారే ఘడియల్లో మిగిలిన సమయాలకన్నా ఎక్కువ ప్రశాంతత నెలకొని ఉంటుంది. అందువల్ల వేకువజాము, సాయంత్రం సమయాలను ధ్యాన సాధనకు ఎంచుకోవాలి. ధ్యాన సాధన తొలి దశలో నిండుగా గాలి పీల్చి ఊపిరితిత్తుల్ని నింపాలి. నెమ్మదిగా ఊపిరిని బయటకు పంపాలి. ఇలా లయబద్ధంగా కనీసం పది నిమిషాల సేపు శ్వాసించాలి. ఇలా చేయడం వల్ల మనసుకు నిజమైన ప్రశాంతత కలుగుతుంది. గాఢ నిద్ర తర్వాత మనిషి ఏవిధంగా శరీరంలోనూ, మనసులోనూ కొత్త ఉత్తేజాన్ని పొందుతాడో అదే విధంగా ధ్యానం చేసిన తర్వాత కొత్త ఉత్తేజం పొందుతాడు. ఇలాంటి ఉత్తేజమే విద్యార్థిని ఇష్టంతో చదివేలా చేస్తుంది. ఉన్నత ధ్యాన సాధన విధానాలను తెలుసుకునేందుకు విద్యార్థులు వీలునుబట్టి ధార్మిక సంస్థల శిక్షణ కార్యక్రమాలకు హాజరుకావాలి. వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్.. మైండ్ మేనేజ్మెంట్ టెక్నిక్స్, యోగాసనాలు, జాయ్ ఆఫ్ మెడిటేషన్, పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ వంటి శిక్షణ కార్యక్రమాలు యువతకు అందుబాటులో ఉంచింది. ఫిట్నెస్ అండ్ వెల్నెస్ కెరీర్‌ను ఎంచుకోవాలనుకునే ఔత్సాహికులకు వివిధ యూనివర్సిటీలు ఫిట్నెస్, వెల్నెస్, న్యూట్రిషన్లలో డిప్లొమా, పీజీ డిప్లొమా, గ్రాడ్యుయేషన్ స్థాయి కోర్సులను అందిస్తున్నాయి. ధ్యానంతో ప్రయోజనాలు: ఒత్తిడిని నియంత్రిస్తుంది. అధిక రక్తపోటు(బీపీ)ను తగ్గిస్తుంది. ఆందోళన సంబంధిత రుగ్మతల నుంచి ఉపశమనం లభిస్తుంది. రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. సృజనాత్మకంగా ఆలోచించగల సామర్థ్యాన్ని పెంచుతుంది. ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని పెంచుతుంది. మొత్తంగా ధ్యాన సాధన విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి తోడ్పడుతుంది. వ్యాయామం రోజూ విద్యార్థులు కొంత సమయాన్ని వ్యాయామానికి కేటాయించాలి. వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు దీర్ఘాయుష్షు కలుగుతాయి. లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన సామర్థ్యం సొంతమవుతుంది. ఉదయాన్నే ఇంటికి సమీపంలోని పార్కుకు వెళ్లి పచ్చని చెట్లు, పక్షుల కిలకిలారావాల సవ్వడి చెంత కొంతసేపు నడవటం వల్ల శరీరం ఉత్తేజితమవుతుంది. దీనివల్ల ఆ రోజంతా చురుగ్గా ఉండగలుగుతారు. పనులను సక్రమంగా చేయగలుగుతారు. ఆటలు ఆడటం, యోగాసనాల ద్వారా కూడా శరీరానికి వ్యాయామం లభిస్తుంది. వ్యాయామాన్ని ఎవరికి వారు తమకు అందుబాటులో ఉన్న సమయం బట్టి నిర్ణయించుకోవచ్చు. వ్యాయామాన్ని ఓ అలవాటుగా మార్చుకోవాలి. ఇదే సమయంలో అతి వ్యాయామంతో కీడు కలుగుతుందన్న విషయాన్ని మరచిపోకూడదు. సమయ పాలన విద్యార్థులు తమకు అందుబాటులో ఉన్న ప్రతి నిమిషాన్ని తెలివిగా ఉపయోగించుకోవాలి. రోజు మొత్తంలో ఆరేడు గంటల నిద్రా సమయాన్ని మినహాయించి మిగిలిన సమయాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలి. ఉదయం లేచింది మొదలు నిద్రపోయే వరకు చేయాల్సిన పనుల జాబితా, వాటికి కేటాయించాల్సిన సమయంతో టైం టేబుల్‌ను రూపొందించుకోవాలి. ఏ రోజు చదవాల్సిన అంశాలు ఆ రోజే చదవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయకూడదు. అలా వాయిదా వేస్తే ఒత్తిడి సమస్యల్ని కోరికోరి ఆహ్వానించినట్లవుతుంది. నిత్యం పాటించే టైం టేబుళ్లు కాకుండా ఎప్పటికప్పుడు ఆయా అవసరాలకు తగినట్లు ప్రత్యేక టైం టేబుళ్లు రూపొందించుకోవాలి. పండుగ సెలవులను సక్రమంగా ఉపయోగించుకునేందుకు ఇలాంటివి ఉపయోగపడతాయి. ఇలా చేస్తే ‘పలానా పని చేయడానికి నాకు టైం లేదు’ అని ఇతరులతో చెప్పుకోవాల్సిన అవసరం రాదు. తొందరగా నిద్ర లేవడం రోజూ సూర్యోదయానికి ముందే నిద్రలేచి క్రమబద్ధమైన జీవితాన్ని ప్రారంభిస్తే ఆ రోజులో చేయాల్సిన పనులన్నీ సాఫీగా కచ్చితమైన సమయానికి పూర్తవుతాయి. వ్యాయామం, ధ్యానానికి తగిన సమయం అందుబాటులో ఉంటుంది. మిగిలిన సమయాల్లో కంటే వేకువజామున చదివిన విషయాలు బాగా గుర్తుంటాయి. అందువల్ల కచ్చితంగా నాలుగు గంటలకు నిద్రలేచి కార్యసాధనకు సిద్ధమైతే ప్రస్తుత పోటీ ప్రపంచంలో ముందుకు దూసుకెళ్లే నేర్పు సొంతమవుతుంది. ‘‘నేను హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో ఓ కోచింగ్ సెంటర్లో గ్రూప్-2 కోచింగ్ తీసుకుంటున్నా. రోజూ ఉదయం ఏడు గంటలకు తరగతులు ప్రారంభమవుతాయి. మొదట్లో 6.45 గంటలకు నిద్రలేచి ముఖంపై నీళ్లు చల్లుకొని హడావుడిగా వెళ్లేవాడిని. ఎక్కడో చివర కూర్చొని, నిద్ర ముఖంతో విన్న పాఠాలు సరిగా తలకెక్కేవి కావు. తర్వాత నా స్నేహితుడిని చూసి నాలుగు గంటలకే నిద్రలేచి కొంతసేపు చదివేవాడిని. కొంత సేపు వాకింగ్ చేసి, తర్వాత మిగిలిన పనులను పూర్తిచేసుకొని ప్రశాంతంగా క్లాస్‌కు వెళ్లడం అలవాటు చేసుకున్నాను. ఇలా చేయడం వల్ల కలుగుతున్న అనుభూతిని మాటల్లో చెప్పలేం. ఎవరికి వారు ఆచరించి ఆ ఆనందాన్ని అనుభవించవచ్చు’’ అంటారు ఖమ్మంకు చెందిన వేణుగోపాల్. ఇతడు తన స్నేహితుడిని రామకృష్ణ మఠంలో ’Self Transformation through Meditation’ కోర్సులో చేర్చేందుకు తీసుకొచ్చిన సందర్భంలో తన అనుభవాలను వెల్లడించారు. సక్సెస్ చిట్కాలు: విద్యార్థులు ఓ ప్రణాళిక ప్రకారం చదివితే ఎంతటి కష్టతరమైన లక్ష్యాన్ని అయినా తేలిగ్గా సాధించవచ్చు. కొన్ని మార్గాలను అనుసరించడం ద్వారా అకడమిక్స్‌లో మంచి ఫలితాలు సాధించవచ్చు. అవి: పబ్లిక్ పరీక్షలకైనా, పోటీ పరీక్షలకైనా సిద్ధమవుతున్న విద్యార్థులు ఓ గంట సేపు చదివిన తర్వాత కూర్చొన్న చోటు నుంచి లేచి, కొద్దిసేపు ఇంటి ఆవరణలో తిరుగుతూ చల్లని గాలిని ఆస్వాదించాలి. తర్వాత ఓ గ్లాసు నీళ్లు తాగి మళ్లీ చదువుకు ఉపక్రమించాలి. చదువుతున్నప్పుడు మధ్యమధ్యలో నీరు తాగడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. తద్వారా శరీరంలోని అన్ని అవయవాలు చురుగ్గా ఉంటాయి. చదువుతున్న సమయంలో కొన్ని క్లిష్టమైన పదాలు ఎదురుకావొచ్చు. కొన్ని విషయాలు అర్థం కాకపోవచ్చు. అలాంటి వాటిని ఓ పేపరుపై నోట్ చేసుకొని సహ విద్యార్థులు, ఉపాధ్యాయుల సహాయంతో వాటిని నివృత్తి చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మరింత ఎక్కువ చదవాలన్న ఉత్సాహం కలుగుతుంది. ఇప్పుడు చాలా మంది విద్యార్థుల్లో రక్తహీనత ఉంటోంది. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతిని, నిస్సత్తువ ఆవరిస్తుంది. హాస్టళ్లలోనూ, అద్దె గదుల్లోనూ ఉండి చదువుకుంటున్న విద్యార్థులు వేరుశనగలు, బెల్లంతో చేసిన పప్పుండలు అప్పుడప్పుడు తినడం వల్ల ఫలితం ఉంటుంది. కొందరు విద్యార్థులపై పరీక్షల భయం దాడి చేస్తుంది. దీని ఒత్తిడి వల్ల జ్వరం బారినపడతారు. విరేచనాలు, వాంతులు అవుతాయి. దీనివల్ల సంవత్సరం చదివిన చదువంతా వృథా అవుతుంది. ఇలాంటి భయం బారిన పడకుండా ఉండాలంటే ఏడాది మొదట్నుంచీ ఓ క్రమపద్ధతిలో చదవాలి. క్రమం తప్పకుండా కళాశాలకు వెళ్లడం, ఏ రోజు పాఠాలను ఆ రోజే చదవడం, నమూనా పరీక్షలు రాస్తూ స్వీయ మూల్యాంకనం చేసుకోవడం ద్వారా పరీక్షల సమయంలో ఒత్తిడి సమస్యల బారినపడకుండా బయటపడొచ్చు. చదువుతున్న పుస్తకానికీ, కళ్లకు మధ్య సరైన దూరం ఉండేలా చూసుకోవాలి. లేదంటే కళ్లు, మెదడు త్వరగా శ్రమకు గురవుతాయి. చదవడం, రాయడం.. రెండూ కలిపితేనే చదువని అర్థం చేసుకోవాలి. విశ్లేషణాత్మకంగా చదవడం ఎంత ముఖ్యమో తప్పులు లేకుండా భావయుక్తంగా రాయడం కూడా అంతే ప్రధానం. పరీక్షల్లో అన్ని ప్రశ్నలకు నిర్దిష్ట సమయంలో సమాధానాలు రాయాలి కనుక రోజూ క్రమంతప్పకుండా రాయడాన్ని సాధన చేయాలి. రాసేటప్పుడు అక్షరాల పరిమాణం, పదాల మధ్య దూరం సరిగా ఉండేలా చూసుకోవాలి. విద్యార్థులు ఏదైనా అంశం అనువర్తనాలకు సంబంధించి సొంతంగా విశ్లేషిస్తూ రాసే విధానాన్ని అలవరచుకోవాలి. ఆదివారాలు, ఇతర సెలవు దినాల్లో కొంత సమయాన్ని సమష్టి అధ్యయనానికి కేటాయించాలి. బృందంగా కలిసి చదివిన తర్వాత సామూహిక చర్చలను నిర్వహించాలి. ఇలా చేయడం వల్ల ఒకరి ఆలోచనల్ని మరొకరితో పంచుకునేందుకు వీలవుతుంది. పోషకాహారం.. చదువుకు ఓ ఇంధనం! తిండికలిగితే కండకలదోయ్..! కండగలవాడే మనిషోయ్! ఈ తరం కుర్రకారుకు కెరీర్‌పట్ల ఉన్నంత అవగాహన ఆరోగ్యంపట్ల లేకపోవటం ఆందోళన కలిగిస్తోంది. ఇనుప కండలు, ఉక్కు నరాలు గల యువత దేశానికి అవసరమన్న స్వామి వివేకానందుని మాటలతో ఆరోగ్యకరమైన వ్యక్తులే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించగలరన్న వాస్తవాన్ని అర్థం చేసుకోవచ్చు. ఫాస్ట్‌ఫుడ్ పుణ్యమాని ఒబెసిటీ క్రమేణా పెరుగుతోంది. అయితే ఇప్పటి వరకు పట్టణ, నగరప్రాంతాలకే పరిమితమైన ఈ స్థూలకాయ సమస్యలు గ్రామీణ ప్రాంత యువతనూ చుట్టుముడుతున్నాయి. పల్లెల్లోనూ 35 శాతం మంది యువత ఊబకాయంతో బాధపడుతున్నారు. పోషకాహారం అంటే కేవలం ఖరీదైన భోజనం అనేది అపోహ మాత్రమే. కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ప్రొటీన్, కాల్షియం వంటివి ఎదిగే వయసుకు అవసరం. తక్కువ ఖర్చుతో లభించే జామ, అరటి వంటి పండ్లతోపాటు బెల్లం, బఠానీలు, శనగల్లో కూడా మంచి పోషకాలున్నాయి. రక్తంలో ఉండాల్సిన హిమోగ్లోబిన్ ఆధారంగా ఆరోగ్యాన్ని అంచనా వేయొచ్చు. రక్తంలో హిమోగ్లోబిన్ ఉండాల్సిన దానికన్నా తక్కువగా ఉన్నట్లయితే రక్తహీనత (ఎనీమియా)తో బాధపడుతున్నట్లు లెక్క. ఆంధ్రప్రదేశ్‌లో యువతలో అధిక శాతం మంది రక్తహీనత బాధితులే. పిజ్జాలు.. బర్గర్లు వంటివి తినటం వల్ల యువతలో ఒబెసిటీ సమస్యలు పెరుగుతున్నాయి. మంచి పోషకాహారాన్ని మితంగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారి నుంచి తప్పించుకోవచ్చు. బెల్లం, ఆకు కూరల్లో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. కందులు, పెసలు, శనగలు వంటి వాటిలో ప్రొటీన్లు ఉంటాయి. విద్యార్థులు ఐరన్‌తో పాటు ప్రోటీన్లు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ పెరుగుతుంది. పోషకాహారం చదువుకు ఓ ఇంధనమన్న విషయాన్ని గుర్తించాలి. - డాక్టర్ ఆవుల లక్ష్మయ్య, ఎన్ఐఎన్ శాస్త్రవేత్త. -
యువత చేతిలోనే దేశ భవిత
నెల్లూరు (వేదాయపాళెం), న్యూస్‌లైన్ : యువత చేతిలోనే దేశభవిత దాగి ఉందని కలెక్టర్ ఎన్.శ్రీకాంత్ అన్నారు. యువత మేల్కొని వెనకబడిన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద 150వ జయంతోత్సవాలను పురస్కరించుకుని ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో ‘దేశభవితకు యువత పరుగు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత పురమందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ దేశ సమస్యలపై గళమెత్తిన మొదటి వ్యక్తి స్వామి వివేకానందే అని అన్నారు. భారత జాతికి ఆయన చేసిన సేవలు విశిష్టమైనవన్నారు. వివేకానందున్ని స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు సాగాల్సిన అవసరం ఉందని చెప్పారు. అయితే నేటి యువతరం మానసిక ఒత్తిళ్లకు తలొగ్గుతోందని వాపోయారు. జీవితంలో ప్రేమ, పెళ్లి సాధారణ విషయాలని, నలుగురికీ ఉపయోగపడేలా యువత ఉండాలని సూచిం చారు. తల్లిదండ్రులు సైతం పిల్లలకు చిన్నతనం నుంచే దేశభక్తిని నూరిపోయాలన్నారు. ఎస్పీ పీవీఎస్ రామకృష్ణ మాట్లాడుతూ మహనీయులను స్మరిస్తూ వారి ఆశయాల సాధనకు పాటుపడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదీ అన్నారు. ఆదర్శప్రాయులు ఎక్కడో ఉండరని, ఎవరైతే మంచిమార్గాన నడుస్తారో వారే ఆదర్శప్రాయులన్నారు.మన మధ్యే అలాంటి వారు ఎందరో ఉన్నారన్నారు. వివేకానంద ఉత్సవ సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సుందరరామం మాట్లాడుతూ వివేకానందుడు ఎప్పుడూ దేశం ఇలా తయారవుతుందని ఊహించలేదన్నారు. ప్రస్తుతం దేశాన్ని ఉద్దరించాలంటే వీధికి ఒక నరేంద్రుడు కావాలన్నారు. చిన్నారులు ప్రదర్శించిన యోగా విన్యాసాలు ఆకట్టుకున్నాయి. వందేమాతరం దేశభవిత కోసం యువత పరుగులో గళమెత్తింది. పురమందిరంలో కలెక్టర్ శ్రీకాంత్, ఎస్పీ రామకృష్ణ తదితరులు జ్యోతి వెలిగించి, జెండా ఊపి పరుగును ప్రారంభించారు. అనంతరం అధిక సంఖ్యలో యువతీ, యువకులు భారత్‌మాతాకీ జై, మాతరం...మాతరం...వందే మాతరం, నందా...నందా...వివేకానందా అంటూ నినాదాలు చేస్తూ పురవీధుల్లో పరుగుపెట్టారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుడు, అర్జునుడు, వివేకానందుడు, రామకృష్ణపరమహంస, చత్రపతి శివాజీ, రాణాప్రతాపుడు, శ్రీకృష్ణదేవరాయుల వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్ కుడుముల అశోక్‌రావు, ఉపాధ్యక్షులు యండ్లవల్లి అమృతవల్లి, దుగ్గిశెట్టి జ్యోతి, తురకవి శ్రీహరి, ఆనందరావు, సభ్యులు అచ్చుత సుబ్రహ్మణ్యం, డాక్టర్ రవిశంకర్, సురేష్‌కుమార్, ప్రవీణ్‌కుమార్, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. -
యువజన ఉత్సాహం
సూర్యాపేట, న్యూస్‌లైన్: భారత దేశ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానందుడని ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్‌రెడ్డి తెలిపారు. స్వామి వివేకానంద 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా బుధవారం సూర్యాపేటలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన 3కే రన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. వివే కానందుని స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందు సాగాలన్నారు. సూర్యాపేటలో త్వరలో యువజనోత్సవాలు నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. సూర్యాపేట మున్సిపల్ కాంప్లెక్స్ ఎదుట వివేకానందుడి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి జనవరి 12వ తేదీన ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ఆర్ ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత ప్రచార కర్త దేవెందర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వారి వారి మతాచారాలను పాటిస్తూ ఇతరుల్లో ఉన్న మంచిని చాటి చెప్పాలని వివేకానందుడు సూచించిచారని తెలి పారు. యువకులు సామాజిక సేవ చేసి దేశ ఉన్నతికి పాటు పడాలని కోరారు. అంతకు ముందు స్వామి వివేకానంద చిత్ర పటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి 3కే రన్‌ను ప్రారంభించారు. మెయిన్ రోడ్డు, పూలసెంటర్, పొట్టి శ్రీరాములు సెంటర్, రాఘవప్లాజా, వాణిజ్య భవన్‌సెంటర్, శంకర్‌విలాస్ సెంటర్, గాంధీ విగ్రహం నుంచి నిర్మల ఆసుపత్రి రోడ్డు మీదుగా తిరిగి జూనియర్ కళాశాల వరకు 3కే రన్ నిర్వహించారు. ఇందులో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ వి.నాగన్న, మున్సిపల్ మాజీ చైర్మన్ మీలా సత్యనారాయణ, నాయకులు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి, కొప్పుల వేణారెడ్డి, పోతు భాస్కర్, మార్కెట్ కమిటీ చైర్మన్ తూముల భుజంగరావు, వైస్ చైర్మన్ శ్రీరంగం గణేష్, కార్యక్రమ నిర్వాహకులు గోపగాని వెంకటనారాయణ, అంగిరేకుల నాగార్జున, తీకుళ్ల సాయిరెడ్డి, నాగవెళ్లి ప్రభాకర్, కొల్లు మధుసూదన్‌రావు, తహసీల్దార్ జగన్నాథరావు, నాయకులు అబ్దుల్ రహీం, సయ్యద్ సలీం, ఉప్పల సంపత్‌కుమార్, డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, బండపల్లి పాండురంగాచారి, చల్లమళ్ల నర్సింహ్మ, కుంట్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.