దిక్సూచి కొరవడిన దివ్యశక్తి | Dileep reddy writes Guest column on Vivekananda Jayanthi | Sakshi
Sakshi News home page

దిక్సూచి కొరవడిన దివ్యశక్తి

Published Fri, Jan 12 2018 1:52 AM | Last Updated on Fri, Sep 28 2018 4:15 PM

Dileep reddy writes Guest column on Vivekananda Jayanthi - Sakshi

♦ సమకాలీనం 
‘...లక్షల మంది ఆకలితో, అజ్ఞానంతో అలమటిస్తున్నపుడు, వారందరి శ్రమనుంచి విద్యార్జన చేసి, వారికేమాత్రం సహకారం అందించని వారిని నేను ద్రోహులుగానే పరిగణిస్తాను. నిర్భాగ్యులను అణచి, దోచి, బాధించి పొందిన సొమ్ముతో తమ ఆడంబరాల్లో బందీలుగా ఉంటూ, ఆ బాధితులకు ఏ రూపంలోనూ ఉపయోగపడని వారూ నా దృష్టిలో ఆకలిగొన్న క్రూర మృగాలే! నిజానికి అటువంటి వారమంతా దరిద్రులం, చివరకు ఏమీ కాకుండా పోతాం!’ అని రాస్తూ, అలా కాకుండా నడుచుకుందామని హితబోధ చేస్తారు.

‘‘ఇప్పటి యువకుల మీద, వారి ఆధునికత పైన నాకు పరిపూర్ణ విశ్వాసం ఉంది. వారి నుండే నాకవసరమైన కార్యకర్తలు లభిస్తారు. వారు సమస్యల్ని సింహబలులై ఎదుర్కొంటారు’’
అని స్వామీ వివేకానందుడు విశ్వాసం ప్రకటించి నూటపాతిక సంవత్సరాలయింది. ఆ తర్వాత అనేక మార్పులొచ్చాయి. రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. భారతదేశం స్వాతంత్య్రం పొందింది. రాజకీయ, ఆర్థిక, సామాజిక, సంస్కృతీ పరంగా ఇంటా బయటా ఎన్నెన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. శాస్త్ర–సాంకేతికత ప్రగతికి బాటలు పరిచాయి. ముఖ్యంగా యువతకు అపారమైన అవకాశాలు అందివస్తున్నాయి. ఇప్పటికీ యువతే ఏ దేశ భవిష్యత్తునైనా నిర్దేశించే స్థితిలో ఉంది. భారతదేశం అత్యధిక యువతరం కలిగిన దేశంగా లెక్కలకెక్కుతోంది. ప్రపంచీకరణ ఫలితంగా విశ్వవ్యాప్తమై లభిస్తున్న ఉద్యోగ, ఉపాధి అవకాశాల్ని ఒడిసిపడుతూ మనవాళ్లు ముందుకు సాగుతున్నారు.

దేశీ యంగానూ ఉన్నంతలో అవకాశాల్ని అందిపుచ్చుకునే యత్నం మన యువత నిర్విరామంగా సాగిస్తోంది. కానీ, వివేకానందుని ఆలోచనా ధోరణికి, తాత్విక చింతనకు, ఆశావహ దృక్పథానికి విరుద్ధమైన భావజాలం, ఆలోచన, కార్యాచరణ అత్యధికుల్లో ఇప్పుడు రాజ్యమేలుతోంది. సరైన గమ్యం, దిశానిర్దేశం లేని పంథాలో వారు సాగుతున్నారు. జాతిని జాగృత పరచి, అనుపమానమైన యువశక్తిని ఏకీకృతం చేసి సరైన మార్గాన నడిపే ఆత్మ దేశంలో కొరవడింది. ఆదర్శ మార్గదర్శకత్వం లేకుండా పోయింది. సరైన దిక్సూచి లేక యువశక్తి... కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు, భావజాలాల వారీగా విడిపోయి సంకుచిత మార్గాల్లో సాగుతోంది. విలువలు పతనమైన ఫక్తు వ్యాపార విద్యావిధానం వల్ల వారిలో పరిమిత యోచన, హ్రస్వ దృష్టి పెరిగి ఆలోచనా పరిధి విస్తరించడం లేదు. జీవనశైలి సంక్లిష్టమౌతోంది. నిర్హేతుకమైన హింస, విధ్వంసాలకు తెగించే పెడధోరణులు యువతలో పెచ్చరిల్లుతున్నాయి. 1984లో ఉత్తర కర్ణాటకకు చెందిన గుల్బర్గా నగరంలోని న్యాయ కళాశాల వార్షికోత్సవ సదస్సు జరి గింది. న్యాయ కోవిదుడు రామ్‌జెఠ్మలానీని ఆహ్వానించి ‘‘భారతదేశానికిపుడు రాజకీయ నాయకుల కన్నా నైతికనేతల అవసరం ఎక్కువుంది’’ అనే అంశంపై ప్రసంగ కార్యక్రమం ఏర్పాటు చేశాము. మూడున్నర దశాబ్దాల తర్వాత... ఇప్పటికీ పరిస్థితిలో ఏం మార్పు లేదు! ఒక పిలుపుతో అత్యధికుల్ని ఒక్కతాటిపై నడిపే నిబద్ధత కలిగిన నైతిక, ధార్మిక నేతృత్వపు నేటి అవసరాన్ని వివేకానందుడు గుర్తుచేస్తున్నారు.

విత్తొకటి వేస్తే చెట్టొకటి వస్తుందా?
దారితప్పిన మన విద్యావిధానం ప్రస్తుత పెడధోరణులకు ప్రధాన కారణం. ప్రభుత్వ నిర్వహణ నుంచి విద్య క్రమంగా ప్రయివేటు వైపు మళ్లుతున్న క్రమంలోనే ప్రతి అంశంలోనూ ఫక్తు వ్యాపార ధోరణి పెచ్చు మీరింది. లాభాపేక్షతో విద్యాబోధన జరిపించే ‘పరిశ్రమ’లు వెలిశాయి. ఫలితంగా విలువలు అడుగంటుతున్నాయి. విద్యార్థులు–యువతరం ఆలోచనా ధోరణి వికటిస్తోంది. ప్రపంచీకరణలో అన్నీ వినియోగ వస్తు దృక్పథంతో చూడటం అలవాటయ్యాక త్యాగ భావనే కొరవడుతోంది. చదువులో, ఉద్యోగాలు పొందడంలో అనారోగ్యకర పోటీ పెరిగి వారిలో స్వార్థం కట్టలు తెంచుకుంటోంది. దాని చుట్టే జీవనశైలి రూపుదిద్దుకుంటోంది. ఇది విద్యావిధానమే కాదనేది వివేకానందుడి భావన. ‘మెదడును అసంఖ్యాకమైన వైజ్ఞానిక విషయాలతో నింపటం విద్య కాదు. మనస్సు సమగ్ర ఉత్తీర్ణతను సాధించాలి. దానిపై సాధికారతను, నియంత్రణను సమకూర్చడమే విద్య లక్ష్యమై ఉండాలి’ అంటారాయన.

విద్య ఎలా ఉండకూడదో చెబుతూ, ‘గంధపు చెక్కలు మోసే గాడిదకు వాటి బరువు తప్ప విలువ తెలియదు, ఎంత సమాచారం మెదడులో నింపామన్నది మన విద్యాజ్ఞానం కొలమానమే కాదంటారు. ‘సమాచార సేకరణ, విషయ గ్రహణమే విద్య అయితే, మన గ్రంథాలయాలు తాపసులౌతాయి, మన విజ్ఞానసర్వస్వాలు మహర్షులుగా వెలుగొందుతాయ’ని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తారు. ‘జీవితానికి, ప్రవర్తనకు అక్కరకొచ్చే అయిదు ఆలోచనల్ని మనస్సుకు పట్టించుకుంటే చాలంటారు. ‘విద్యవల్ల సత్ప్రవర్తన అలవడాలి, మనో దారుఢ్యం పెరగాలి, వ్యక్తిత్వ వికాసం–వివేక విస్తరణ జరగాలి. చివరగా, మన కాళ్లమీద మనం నిలబడగలగాలి అంతే!’ అంటారు స్వామీజీ.

తప్పు తెలిస్తే, దిద్దుకోవడం తేలిక!
భారతదేశంలో రెండు దుష్కర్మలు సాగుతున్నాయని వివేకానందుడనేవారు. ఒకటి స్త్రీ జాతి అణచివేత, రెండోది బీదల పట్ల వివక్ష, ముఖ్యంగా కుల వివక్షతో చూపే నిర్దాక్షిణ్య వైఖరి అని ఆయన అభిప్రాయం. అవి ఇంకా కొనసాగడం దురదృష్టకరం! మహిళల పట్ల ఇప్పటికీ జరుగుతున్న దాష్టీకాలు చూస్తుంటే, లింగపరంగా సరైన దృక్పథం అలవడకపోవడమే వాటికి కారణం అనిపిస్తుంది. ఈ విషయంలో స్వామీజీకి ఉదాత్తమైన భావాలుం డేవి. ‘స్త్రీ పురుష భేదాన్ని విస్మరించి, మానవులంతా సమానులే అన్న భావన రానంతవరకు, స్త్రీ జనోద్ధరణకు అవకాశమే ఉండదు’ అని బలంగా అభిప్రాయపడ్డారు. ‘మానవ జాతి ఒక్కటే. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని ఏమీ ఉండదు. అందరూ సర్వసమానతా భావాన్ని ప్రోత్సహిస్తూ ఒకరి సాహచర్యాన్ని మరొకరు అభిలషిస్తూ స్త్రీ–పురుషులు పరస్పర సహకారంతో సంచరిస్తేనే జీవతం ఆనందమయమౌతుంది’అనేవారు. ‘ప్రపంచ శ్రేయస్సును సంరక్షించుకోవాలంటే స్త్రీ పరిస్థితి మెరుగుపడాలి. పక్షి ఎన్నడూ ఒక రెక్క సహాయంతో ఎగురలేదు’ అన్నారాయన. తరాల తరబడి కొన్ని అట్టడుగు వర్గాల ప్రజలు మోసగించబడ్డారని, వాటికి చారిత్రక సాక్ష్యాధారాలున్నాయని వివేకానందుడు పేర్కొనేవారు.

‘మనదేశంలో బీదలను, అట్టడుగు వర్గాల వారిని ఆదుకునేందుకు స్నేహితులుండరు. వారు ఎంత కష్టించినా వారొక స్థాయి నుండి పైకి రాలేరు. రోజులు గడిచిన కొద్దీ ఇంకా తక్కువ స్థాయికి దిగజారుతున్నారు. సమాజం నిర్దయగా వారిని చెప్పుదెబ్బలు కొడుతూనే ఉంది. ఆ దెబ్బలు ఏ సమయంలో ఎలా వచ్చి తాకుతాయో కూడ ఆ నిస్సహాయ ప్రజలకు తెలియదు’ అన్నారు. 1894లో చికాగో నుంచి ‘అలి సింగ’కు రాసిన ఉత్తరంలో చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ‘...లక్షల మంది ఆకలితో, అజ్ఞానంతో అలమటిస్తున్నపుడు, వారందరి శ్రమనుంచి విద్యార్జన చేసి, వారికేమాత్రం సహకారం అందించని వారిని నేను ద్రోహులుగానే పరిగణిస్తాను. నిర్భాగ్యులను అణచి, దోచి, బాధించి పొందిన సొమ్ముతో తమ ఆడంబరాల్లో బందీలుగా ఉంటూ, ఆ బాధితులకు ఏ రూపంలోనూ ఉపయోగపడని వారూ నా దృష్టిలో ఆకలిగొన్న క్రూర మృగాలే! నిజానికి అటువంటి వారమంతా దరిద్రులం, చివరకు ఏమీ కాకుండా పోతాం!’ అని రాస్తూ, అలా కాకుండా నడుచుకుందామని హితబోధ చేస్తారు.

ముందు మేల్కొనండి...
యువత పట్ల వివేకానందుడికి అపారమైన ఆశ, నమ్మకం ఉండేవి. మీలో ఎంతో శక్తి ఉంది, ఆత్మవిశ్వాసంతో ఉండండి, అప్రమత్తం కండి, అంతే చాలు, మిగతావన్నీ వాటంతట అవే జరిగిపోతాయని యువతరానికి సందేశం ఇచ్చేవారు. సమాజంలో కొనసాగుతున్న అరిష్టాల్ని ఎదుర్కొనేందుకు యువత సన్నద్దం కావాలని పిలుపునిచ్చేది. 1896 జూన్‌ 7న లండన్‌ నుంచి మిస్‌ మార్గరెట్‌ నోబెల్‌కు ఉత్తరం రాస్తూ వివేకానందుడు ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. ‘... ప్రపంచం దుఃఖంతో జ్వలిస్తోంది. మీరు నిద్రించగలరా? మనం బిగ్గరగా అరవాలి... ఎంతలా అంటే, మనలో విశ్రమిస్తున్న దేవత నిద్రలేవాలి, ఆ పిలుపులకు ప్రతిస్పందించాలి’ అని రాశారు.

యువత ఎక్కువగా ఉన్న ఒక సమావేశంలో మాట్లాడుతూ, ‘సాహసికులైన యువకులారా! మీకు కావలసినవి మూడే విషయాలు: అవి ప్రేమ, నిజాయితీ, సహనం. జీవితమంటే ప్రేమ. ప్రేమమయమే జీవితం. ఇదే జీవిత పరమార్థం. స్వార్థపరత్వమే మరణం! ఇది ఇప్పటికే కాదు ఎప్పటికీ సత్యమే. మనకు భావి లేదనుకున్నా, ఇతరులకు మంచి చేయడమే జీవితం. హాని సల్పటం మరణం. నీకు కనిపించే పశుప్రవృత్తి కలిగిన మానవుల్లో నూటికి తొంబై మంది మృతులే!’ అన్నారు. జీవితంపైనే సరైన దృక్పథం లేని నేటి యువకులు కొందరు, ఉన్మాదంతో ఎదుటివారి జీవితాల్ని హరిస్తున్నారు. వివేకానందుడు చెప్పిన ప్రేమ, నిజాయితీ, సహనం మూడూ లేని ముష్కరులు తయారవుతున్నారు. చిన్న వయసులో తాగి తందనాలాడుతున్నారు. నేర ప్రవృత్తిలోకి దిగుతున్నారు. విలువలు నశించినా ఆడంబరాలకు అతుక్కుపోతున్నారు.

అందరి పూనికతోనే మార్పు...
యువతరం భారత్‌కు ఓ గొప్ప శక్తి! 35 ఏళ్ల లోపు వయస్కులైన 65 శాతం జనాభాతో ప్రపంచంలోనే అగ్రగామి ‘యువ’దేశంగా మనకు కీర్తి లభిస్తోంది. 15–29 మధ్య వయస్కుల జనాభా 27.5 శాతంగా మానవవనరుల సహాయ మంత్రి డా. సత్యపాల్‌సింగ్‌ వారం కింద లోకసభకు తెలిపారు. తగిన విద్య, శిక్షణ, నైపుణ్యాల వృద్ధి చేస్తూ వారిని శ్రమశక్తి వనరుగా తీర్చిదిద్దుతున్నట్టు చెప్పారు. ప్రపంచ కార్మిక సంస్థ (ఐఎల్వో) ప్రమాణాల ప్రకారం పనిచేసే–చేయని మానవ వనరుల నిష్పత్తి, రాగల ఒకటిన్నర దశాబ్దాల్లో (2016–30) చైనా, కొరియా, బ్రెజల్‌ కంటే భారత్‌లోనే మెరుగ్గా ఉంటుందని కార్మిక మంత్రి సంతోష్‌కుమార్‌ గాంగ్వార్‌ తెలిపారు. భారత యువజనాభివృద్ధి సూచిక 0.569 సగటుతో ఆశావహంగానే ఉందని యువజన వ్యవహారాలు–క్రీడల సహాయ మంత్రి రాజ్యవర్ధన్‌ రాథోడ్‌ వివరించారు. 2014 యువ విధాన పత్రం ప్రకారం, అభివృద్ది ఫలాల గ్రహీతలుగా మాత్రమే కాకుండా యువతను చోదకశక్తులుగా, క్రియాశీలంగా ఉంచే కార్యక్రమాలు రచించి, అమలు చేస్తున్నట్టు ఆ శాఖ మంత్రి విజయ్‌గోయల్‌ సభలో వెల్లడించారు.

ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది అర్హులైన నిరుద్యోగులు తమ ఉద్యోగ–ఉపాధి అవకాశాల కోసం నిత్య పోరాటం చేస్తున్నారు. మరో వంక మూడు ప్రభుత్వాలు తాము ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని ప్రకటనలు చేస్తున్నాయి. ప్రభుత్వ లెక్కలు, కథలు, కథనాలెలా ఉన్నా... నేటి యువతరం ప్రవర్తన, ఆలోచనా ధోరణి, దృక్పథాలను తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు, విద్యాసంస్థల పాత్ర ఎంతో కీలకం. దివంగత రాష్ట్రపతి అబ్దుల్‌ కలామ్, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్, ఫేస్‌బుక్‌ అధినేత జుకెర్‌బర్గ్, ఐటీ దిగ్గజాలు అజీమ్‌ ప్రేమ్‌జీ, నందన్‌ నీలేకనీ వంటి వారి మాటలకు అక్కడక్కడ యువతరం ఎంతో కొంత ప్రభావితమవుతున్నారు, స్పందిస్తున్నారు.

కానీ, యువతను దారిన పెట్టే ప్రభావశీలురు, వైతాళికులు లేకుండా పోయారు. కుంచించుకుపోతున్న యువత ఆలోచనా ధోరణి విస్తరించాలి. విశాల దృక్పథం అలవడాలి. ఇందుకు, తల్లిదండ్రులు క్రియాశీల పాత్ర పోషించాలి. ఆదర్శమూర్తుల దారిన నడిచేలా తమ పిలల్ని చిన్నప్పట్నుంచే ప్రభావితుల్ని చేయాలి. నరేంద్రుడు వివేకానందుడిగా మారేంత ప్రభావితం చేసిన భువనేశ్వరీ దేవి అందరికీ ఆదర్శం కావాలి. ఒకనాడు తల్లి తనకు చెప్పినట్టు వివేకానందుడే స్వయంగా తన పుస్తకంలో రాసుకున్న మాటలతో ముగిస్తా. ‘‘పవిత్రంగా ఉండు. స్వచ్ఛమైన జీవితాన్ని గడుపు. ఆత్మగౌరవాన్ని సంరక్షిం చుకో. ఇతరులను గౌరవంగా చూడు. సరళ స్వభావుడవై నిరాడంబరంగా మెలుగు. కానీ, అవసరమైనచోట దృఢత్వాన్ని ప్రదర్శించడానికి వెనుకాడకు’’
(నేడు వివేకానంద జయంతి)

దిలీప్‌ రెడ్డి
వ్యాసకర్త పూర్వ సమాచార కమిషనర్‌
ఈ–మెయిల్‌ :
dileepreddy@sakshi.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement