సాక్షి, న్యూఢిల్లీ: స్వామి వివేకానంద చికాగో ప్రసంగానికి 125 సంవత్సరాలైన సందర్భంగా ఆయనకు ఘనంగా కృతజ్ఞతలు తెలియజేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మధ్యన కొన్ని పోలికలు కొట్టొచ్చినట్ల కనిపిస్తాయి. పేరులో కూడా ఆ పోలిక ఉంది. స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. ఇద్దరూ ప్రసంగాల్లో దిట్ట. వీరిరువు తమ ప్రసంగాల ద్వారా ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తారు.
వీరు దేశంలో చేసిన ప్రసంగాలకన్నా అమెరికా, ఇతర దేశాల్లో చేసిన ప్రసంగాలకే ఎక్కువ ప్రాముఖ్యత లభించింది. ప్రజలను విశేషంగా ఆకర్షించాయి. రకరకాల నిండైన దుస్తులు ధరించడమన్నా, సరైన భంగిమల్లో ఫొటోలకు ఫోజులివ్వడమన్నా వీరిరువురికి అమిత ఇష్టం. వివేకానంద మద్రాస్‌కు లేదా లండన్‌కు వెళ్లినప్పుడల్లా ఆయన ఎక్కువ సమయాన్ని ఫొటో స్టూడియోల్లోనే గడిపేవారట.
తలపాగా, జుట్టూ సరిచేసుకుంటూ వివిధ భంగిమల్లో ఫొటో స్టూడియోల్లోని అద్దాల్లో చూసుకోవడం ఆయనకు అలవాటు అట. జాతిపిత మహాత్మాగాంధీకున్న మరో మంచి అలవాటు కూడా ఆయనకు ఉంది. గాంధీ ఎన్నడు కూడా కెమేరాకేసి చూడలేదు. అలాగే వివేకానందుడు కూడా కెమేరా వైపు చూడలేదట. కానీ మంచి ఫోజులో ఫొటో వచ్చేలా ఓ పక్కకు నిలబడి మరోపక్కకు చూస్తూ ఫొటోలు దిగేవారట. ఆయన నేరుగా నిలబడి, నేరుగా చూస్తున్న ఫొటోలు చాలా అరుదు.
గాంధీకి తెలిసి ఆయన ఎన్నడూ కెమేరా వైపు చూడలేదు. 1931, లండన్‌లో రెండో రౌండ్ టేబుల్ సమావేశం అయినప్పుడు ఫొటోగ్రాఫర్ ఆదేశం మేరకు బీఆర్ అంబేద్కర్ సహా అందరూ కెమేరావైపు చూడగా గాంధీ మాత్రం తన ముందున్న డాక్యుమెంట్లవైపు చూస్తూ ఉండిపోయారు.
నరేంద్ర మోదీ అలా కాదు. ఆయన కెమేరా కన్ను ఎక్కడుందో ఇట్టే పసిగడతారు. ఎలా చూస్తే ఫొటో బాగా వస్తుందో ఆయనకు బాగా తెలుసు. 1893, సెప్టెంబర్ 11వ తేదీన చికాగోలో వివేకానందుడు ప్రసంగించి 125 వసంతాలైన సందర్భంగా మోదీ ఆయనకు కతజ్ఞతలు తెలుపారుగానీ ఎలా లెక్కేసిన 124 సంవత్సరాలే అవుతుంది.
ఏడాది ముందుగానే ఆయన ప్రసంగాన్ని మోదీ ఎందుకు గుర్తు చేశారో తెలియదు. దేశంలో అసహనం పెరిగిపోతూ జర్నలిస్ట్ గౌరీ లంకేష్‌లలాంటి మేథావులు హత్యలకు గురవుతున్న నేటి పరిస్థితుల్లో వివేకానందుడి చికాగో ప్రసంగాన్ని పదే పదే గుర్తు చేసుకోవాల్సిందే. ‘సహనాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మతానికి చెందిన వాడినని చెప్పుకోవడానికి నేనెంతో గర్వపడుతున్నాను’ అన్న ఆయన వ్యాఖ్యలు ఈ జాతికి కొత్త స్ఫూర్తినివ్వాలి.