మతోన్మాదంపై పోరాటం సాగిద్దాం
వివేకానంద జయంతి కార్యక్రమంలో ప్రధాని, సోనియా
న్యూఢిల్లీ: మతోన్మాదంపై పోరాటం సాగిద్దామని ప్రధాని మన్మోహన్‌సింగ్, యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపునిచ్చారు. అసలైన మతం విద్వేషానికి, విభజనకు మూలం కాజాలదని వారు అన్నారు. స్వామి వివేకానందుని 150వ జయంతి సందర్భంగా ఢిల్లీలో ఆదివారం ఏర్పాటైన కార్యక్రమంలో వారిద్దరూ మాట్లాడారు. ప్రధాని మన్మోహన్ మాట్లాడుతూ, స్వామి వివేకానందుని సిద్ధాంతాలతో తాను స్ఫూర్తి పొందానని అన్నారు. అసలైన మతాలు కీచులాటలకు దిగబోవని, అన్ని మతాల సారం ఒక్కటేనని వాటికి తెలుసునని ఆయన అన్నారు. మతాలన్నీ పరస్పర గౌరవాన్ని, సహనాన్ని బోధిస్తాయన్నారు. వివేకానందుని బోధలు ముఖ్యంగా యువతకు ఇప్పటికీ అనుసరణీయాలని సోనియా అన్నారు. విద్య, సుపరిపాలన, మెరుగైన ఉపాధి వంటి అంశాల్లో యువత ఆకాంక్షలను నెరవేర్చడంలో దేశం విఫలం కారాదని వివేకానందుడు చెప్పిన మాటలను గుర్తు చేశారు. మన ప్రాంతంతో పాటు చాలా దేశాల్లో మతోన్మాదం ముప్పుగా మారిందని సోనియా ఆందోళన వ్యక్తం చేశారు.
వివేకానందుని బోధలను యువత ఆకళింపు చేసుకోవాలని, వారు మతోన్మాదంపై పోరు సాగించాలని అన్నారు. మతోన్మాద, విచ్ఛిన్నకర రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై తరచుగా కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, సోనియా, ప్రధాని తమ ప్రసంగాల్లో మోడీ పేరును నేరుగా ప్రస్తావించకపోయినా, పరోక్షంగా విమర్శలు గుప్పించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల కోసం వివేకానందుని పేరుతో యువతను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, ఆయన సిద్ధాంతాలను, విలువలను పాటించకుండా ఆయనకు మొక్కుబడిగా నివాళులర్పించడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదని ప్రధాని మన్మోహన్ అన్నారు.
షికాగోలో 1893లో జరిగిన సర్వమత సమ్మేళనంలో వివేకానంద చేసిన చరిత్రాత్మక ప్రసంగాన్ని ఆయన గుర్తు చేశారు. ఒంటెత్తువాదం, మత దురభిమానం, మతమౌఢ్యం నేలతల్లిని నెత్తుటేర్లలో ముంచెత్తాయని, నాగరికతలను నాశనం చేశాయని, దేశాలకు దేశాలనే కోలుకోలేనంతగా దెబ్బతీశాయని వివేకానంద చెప్పిన మాటలను ఉటంకించారు. కాగా, ప్రపంచంలోని చాలా దేశాల్లో వృద్ధుల జనాభా పెరుగుతోందని, అందుకు భిన్నంగా మన దేశంలో మాత్రం జనాభాలో అత్యధికులు యువకులేనని సోనియా అన్నారు. సంకుచితవాదులు, స్వార్థశక్తుల చేతిలో యువత పావుగా మారరాదని వివేకానందుని బోధలు చెబుతున్నాయన్నారు. వివేకానందుని బోధలకు ప్రాచుర్యం కల్పించేందుకు రూ.253 కోట్ల ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించిందని సాంస్కృతిక శాఖ మంత్రి చంద్రేశ్‌కుమారి కటోచ్ చెప్పారు. షికాగో వర్సిటీలో వివేకానందుని పేరిట పీఠాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.
‘చౌక విద్యుత్‌తోనే అభివృద్ధి’
నోయిడా: అందుబాటు ధరల్లో విద్యుత్తు లభ్యతే అభివృద్ధికి కీలకమని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. నోయిడాలో ఆదివారం ఏర్పాటైన పెట్రోటెక్-2014 సదస్సులో ఆయన మాట్లాడారు. భారత్ 2020 నాటికి ప్రపంచంలోనే మూడో పెద్ద ఇంధన వినియోగదారుగా మారనున్న నేపథ్యంలో అందుబాటు ధరల్లో విద్యుత్తు లభ్యతే ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. విద్యుదుత్పాదనలో భారత్ ప్రస్తుతం ప్రపంచంలో ఏడో స్థానంలో ఉందని, ప్రపంచంలో ఉత్పత్తయ్యే మొత్తం విద్యుత్తులో భారత్ 2.5 శాతం మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతోందని అన్నారు. రానున్న రెండు దశాబ్దాల్లో విద్యుదుత్పాదనను మూడు నుంచి నాలుగు రెట్ల మేరకు పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.