ఆరోగ్యమూ సక్సెస్‌కు ఓ సోపానమే..! | Health is also important for success | Sakshi
Sakshi News home page

ఆరోగ్యమూ సక్సెస్‌కు ఓ సోపానమే..!

Published Thu, Sep 12 2013 12:45 PM | Last Updated on Fri, Sep 1 2017 10:39 PM

Health is also important for success

 Anything that makes you weak physically,
 intellectually and spiritually reject it as poison..
 శరీరాన్నిగానీ, బుద్ధినిగానీ ఆధ్యాత్మికతనుగానీ బలహీనపరిచే దేన్నయినా విషంలా తిరస్కరించాలి..
 - స్వామి వివేకానంద


 
 పదో తరగతి, ఇంటర్, ఇంజనీరింగ్ విద్యార్థులైనా.. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారైనా.. అందరి లక్ష్యం ఒక్కటే! అది పరీక్షల్లో మంచి మార్కులు సాధించి విజయ తీరాలకు చేరుకోవాలని! ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయాణించే మార్గంలో ఒత్తిడి, ఆందోళన, భయం, కోపం, అలసట, అనారోగ్యం వంటి కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. అలాంటి అడ్డంకులు ఎదురుకాకుండా ఉండాలన్నా, ఒకవేళ ఎదురైనా వాటిని అధిగమించే నేర్పును సొంతం చేసుకోవాలన్నా విద్యార్థులు అనుసరించాల్సిన మార్గాలపై స్పెషల్ ఫోకస్..


 
 రోజువారీ తరగతులకు ఉరుకుల పరుగులు.. దండిగా ఉన్న పుస్తకాలతో బరువెక్కిన బ్యాగులు.. యూనిట్ టెస్ట్‌లు, మిడ్ టెస్ట్‌లు.. ర్యాంకుల చిట్టాలు.. ప్రతి విద్యార్థి జీవితంలో నిత్యం ఎదురయ్యే కొన్ని అనుభవాలివి. ఇంత బిజీ లైఫ్‌లో ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావడం కష్టమే. చదివిన పాఠాలు ఒంటబట్టి, లక్ష్యాన్ని చేరుకోవాలంటే శారీరకంగానే కాకుండా మానసికంగానూ, సామాజికంగానూ ఆరోగ్యంగా ఉండాలి. విద్యార్థి ప్రగతి పథంలో ఎదురయ్యే పెద్ద అవరోధాలు వ్యాధులన్న విషయాన్ని గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
 
 
 ధ్యానం (మెడిటేషన్)
 యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్‌కు చెందిన పరిశోధకులు సైకాలజీ తరగతికి చెందిన విద్యార్థులపై ఓ అధ్యయనం చేశారు. ఇందులో భాగంగా ఓ లెక్చర్‌ను వినడానికి ముందు కొందరు విద్యార్థులు ధ్యానం చేశారు. మిగిలిన వారు చేయలేదు. లెక్చర్ పూర్తయిన తర్వాత క్విజ్ నిర్వహించగా ధ్యానం చేయని వారికంటే ధ్యానం చేసిన వారు మంచి స్కోర్ సాధించారు. ఇలాగే ధ్యానంతో అకడమిక్స్‌లో మంచి ఫలితాలు సాధించవచ్చని అనేక అధ్యయనాల్లో తేలింది. దటీజ్ పవర్ ఆఫ్ మెడిటేషన్..
 
 అనంతమైన ఆనందానికి తలుపులు తెరిచేదే ధ్యానం. లక్ష్యంపై గురి కుదరాలన్నా, చదువుపై ఏకాగ్రత నిలపాలన్నా విద్యార్థులు ధ్యాన సాధనను అలవరచుకోవాలి.
 ప్రతి రోజూ విద్యార్థులు ధ్యానం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. రాత్రి పగలు గాను, పగలు రాత్రిగాను మారే ఘడియల్లో మిగిలిన సమయాలకన్నా ఎక్కువ ప్రశాంతత నెలకొని ఉంటుంది. అందువల్ల వేకువజాము, సాయంత్రం సమయాలను ధ్యాన సాధనకు ఎంచుకోవాలి. ధ్యాన సాధన తొలి దశలో నిండుగా గాలి పీల్చి ఊపిరితిత్తుల్ని నింపాలి. నెమ్మదిగా ఊపిరిని బయటకు పంపాలి. ఇలా లయబద్ధంగా కనీసం పది నిమిషాల సేపు శ్వాసించాలి. ఇలా చేయడం వల్ల మనసుకు నిజమైన ప్రశాంతత కలుగుతుంది.
 గాఢ నిద్ర తర్వాత మనిషి ఏవిధంగా శరీరంలోనూ, మనసులోనూ కొత్త ఉత్తేజాన్ని పొందుతాడో అదే విధంగా ధ్యానం చేసిన తర్వాత కొత్త ఉత్తేజం పొందుతాడు. ఇలాంటి ఉత్తేజమే విద్యార్థిని ఇష్టంతో చదివేలా చేస్తుంది.
 ఉన్నత ధ్యాన సాధన విధానాలను తెలుసుకునేందుకు విద్యార్థులు వీలునుబట్టి ధార్మిక సంస్థల శిక్షణ కార్యక్రమాలకు హాజరుకావాలి.
 వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్.. మైండ్ మేనేజ్‌మెంట్ టెక్నిక్స్, యోగాసనాలు, జాయ్ ఆఫ్ మెడిటేషన్, పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ వంటి శిక్షణ కార్యక్రమాలు యువతకు అందుబాటులో ఉంచింది.
 ఫిట్‌నెస్ అండ్ వెల్‌నెస్ కెరీర్‌ను ఎంచుకోవాలనుకునే ఔత్సాహికులకు వివిధ యూనివర్సిటీలు ఫిట్‌నెస్, వెల్‌నెస్, న్యూట్రిషన్‌లలో డిప్లొమా, పీజీ డిప్లొమా, గ్రాడ్యుయేషన్ స్థాయి కోర్సులను అందిస్తున్నాయి.


 
 ధ్యానంతో ప్రయోజనాలు:
 ఒత్తిడిని నియంత్రిస్తుంది.
 అధిక రక్తపోటు(బీపీ)ను తగ్గిస్తుంది.
 ఆందోళన సంబంధిత రుగ్మతల నుంచి ఉపశమనం లభిస్తుంది.
 రోగ నిరోధకశక్తిని పెంచుతుంది.
 సృజనాత్మకంగా ఆలోచించగల సామర్థ్యాన్ని పెంచుతుంది.
 ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
 మొత్తంగా ధ్యాన సాధన విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి తోడ్పడుతుంది.


 
 వ్యాయామం
 రోజూ విద్యార్థులు కొంత సమయాన్ని వ్యాయామానికి కేటాయించాలి. వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు దీర్ఘాయుష్షు కలుగుతాయి. లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన సామర్థ్యం సొంతమవుతుంది. ఉదయాన్నే ఇంటికి సమీపంలోని పార్కుకు వెళ్లి పచ్చని చెట్లు, పక్షుల కిలకిలారావాల సవ్వడి చెంత కొంతసేపు నడవటం వల్ల శరీరం ఉత్తేజితమవుతుంది. దీనివల్ల ఆ రోజంతా చురుగ్గా ఉండగలుగుతారు. పనులను సక్రమంగా చేయగలుగుతారు. ఆటలు ఆడటం, యోగాసనాల ద్వారా కూడా శరీరానికి వ్యాయామం లభిస్తుంది. వ్యాయామాన్ని ఎవరికి వారు తమకు అందుబాటులో ఉన్న సమయం బట్టి నిర్ణయించుకోవచ్చు. వ్యాయామాన్ని ఓ అలవాటుగా మార్చుకోవాలి. ఇదే సమయంలో అతి వ్యాయామంతో కీడు కలుగుతుందన్న విషయాన్ని మరచిపోకూడదు.


 
 సమయ పాలన
 విద్యార్థులు తమకు అందుబాటులో ఉన్న ప్రతి నిమిషాన్ని తెలివిగా ఉపయోగించుకోవాలి. రోజు మొత్తంలో ఆరేడు గంటల నిద్రా సమయాన్ని మినహాయించి మిగిలిన సమయాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలి. ఉదయం లేచింది మొదలు నిద్రపోయే వరకు చేయాల్సిన పనుల జాబితా, వాటికి కేటాయించాల్సిన సమయంతో టైం టేబుల్‌ను రూపొందించుకోవాలి. ఏ రోజు చదవాల్సిన అంశాలు ఆ రోజే చదవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయకూడదు. అలా వాయిదా వేస్తే ఒత్తిడి సమస్యల్ని కోరికోరి ఆహ్వానించినట్లవుతుంది.


 
 నిత్యం పాటించే టైం టేబుళ్లు కాకుండా ఎప్పటికప్పుడు ఆయా అవసరాలకు తగినట్లు ప్రత్యేక టైం టేబుళ్లు రూపొందించుకోవాలి. పండుగ సెలవులను సక్రమంగా ఉపయోగించుకునేందుకు ఇలాంటివి ఉపయోగపడతాయి. ఇలా చేస్తే ‘పలానా పని చేయడానికి నాకు టైం లేదు’ అని ఇతరులతో చెప్పుకోవాల్సిన అవసరం రాదు.


 
 తొందరగా నిద్ర లేవడం
 రోజూ సూర్యోదయానికి ముందే నిద్రలేచి క్రమబద్ధమైన జీవితాన్ని ప్రారంభిస్తే ఆ రోజులో చేయాల్సిన పనులన్నీ సాఫీగా కచ్చితమైన సమయానికి పూర్తవుతాయి. వ్యాయామం, ధ్యానానికి తగిన సమయం అందుబాటులో ఉంటుంది. మిగిలిన సమయాల్లో కంటే వేకువజామున చదివిన విషయాలు బాగా గుర్తుంటాయి. అందువల్ల కచ్చితంగా నాలుగు గంటలకు నిద్రలేచి కార్యసాధనకు సిద్ధమైతే ప్రస్తుత పోటీ ప్రపంచంలో ముందుకు దూసుకెళ్లే నేర్పు సొంతమవుతుంది. ‘‘నేను హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో ఓ కోచింగ్ సెంటర్‌లో గ్రూప్-2 కోచింగ్ తీసుకుంటున్నా.

 

రోజూ ఉదయం ఏడు గంటలకు తరగతులు ప్రారంభమవుతాయి. మొదట్లో 6.45 గంటలకు నిద్రలేచి ముఖంపై నీళ్లు చల్లుకొని హడావుడిగా వెళ్లేవాడిని. ఎక్కడో చివర కూర్చొని, నిద్ర ముఖంతో విన్న పాఠాలు సరిగా తలకెక్కేవి కావు. తర్వాత నా స్నేహితుడిని చూసి నాలుగు గంటలకే నిద్రలేచి కొంతసేపు చదివేవాడిని. కొంత సేపు వాకింగ్ చేసి, తర్వాత మిగిలిన పనులను పూర్తిచేసుకొని ప్రశాంతంగా క్లాస్‌కు వెళ్లడం అలవాటు చేసుకున్నాను. ఇలా చేయడం వల్ల కలుగుతున్న అనుభూతిని మాటల్లో చెప్పలేం. ఎవరికి వారు ఆచరించి ఆ ఆనందాన్ని అనుభవించవచ్చు’’ అంటారు ఖమ్మంకు చెందిన వేణుగోపాల్. ఇతడు తన స్నేహితుడిని రామకృష్ణ మఠంలో ’Self Transformation through Meditation’ కోర్సులో చేర్చేందుకు తీసుకొచ్చిన సందర్భంలో తన అనుభవాలను వెల్లడించారు.
 


 సక్సెస్ చిట్కాలు:
 విద్యార్థులు ఓ ప్రణాళిక ప్రకారం చదివితే ఎంతటి కష్టతరమైన లక్ష్యాన్ని అయినా తేలిగ్గా సాధించవచ్చు. కొన్ని మార్గాలను అనుసరించడం ద్వారా అకడమిక్స్‌లో మంచి ఫలితాలు సాధించవచ్చు. అవి:
 
 పబ్లిక్ పరీక్షలకైనా, పోటీ పరీక్షలకైనా సిద్ధమవుతున్న విద్యార్థులు ఓ గంట సేపు చదివిన తర్వాత కూర్చొన్న చోటు నుంచి లేచి, కొద్దిసేపు ఇంటి ఆవరణలో తిరుగుతూ చల్లని గాలిని ఆస్వాదించాలి. తర్వాత ఓ గ్లాసు నీళ్లు తాగి మళ్లీ చదువుకు ఉపక్రమించాలి. చదువుతున్నప్పుడు మధ్యమధ్యలో నీరు తాగడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. తద్వారా శరీరంలోని అన్ని అవయవాలు చురుగ్గా ఉంటాయి.
 
 చదువుతున్న సమయంలో కొన్ని క్లిష్టమైన పదాలు ఎదురుకావొచ్చు. కొన్ని విషయాలు అర్థం కాకపోవచ్చు. అలాంటి వాటిని ఓ పేపరుపై నోట్ చేసుకొని సహ విద్యార్థులు, ఉపాధ్యాయుల సహాయంతో వాటిని నివృత్తి చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మరింత ఎక్కువ చదవాలన్న ఉత్సాహం కలుగుతుంది.
 
 ఇప్పుడు చాలా మంది విద్యార్థుల్లో రక్తహీనత ఉంటోంది. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతిని, నిస్సత్తువ ఆవరిస్తుంది. హాస్టళ్లలోనూ, అద్దె గదుల్లోనూ ఉండి చదువుకుంటున్న విద్యార్థులు వేరుశనగలు, బెల్లంతో చేసిన పప్పుండలు అప్పుడప్పుడు తినడం వల్ల ఫలితం ఉంటుంది.
 
 కొందరు విద్యార్థులపై పరీక్షల భయం దాడి చేస్తుంది. దీని ఒత్తిడి వల్ల జ్వరం బారినపడతారు. విరేచనాలు, వాంతులు అవుతాయి. దీనివల్ల సంవత్సరం చదివిన చదువంతా వృథా అవుతుంది. ఇలాంటి భయం బారిన పడకుండా ఉండాలంటే ఏడాది మొదట్నుంచీ ఓ క్రమపద్ధతిలో చదవాలి. క్రమం తప్పకుండా కళాశాలకు వెళ్లడం, ఏ రోజు పాఠాలను ఆ రోజే చదవడం, నమూనా పరీక్షలు రాస్తూ స్వీయ మూల్యాంకనం చేసుకోవడం ద్వారా పరీక్షల సమయంలో ఒత్తిడి సమస్యల బారినపడకుండా బయటపడొచ్చు.
 
 చదువుతున్న పుస్తకానికీ, కళ్లకు మధ్య సరైన దూరం ఉండేలా చూసుకోవాలి. లేదంటే కళ్లు, మెదడు త్వరగా శ్రమకు గురవుతాయి.
 
 చదవడం, రాయడం.. రెండూ కలిపితేనే చదువని అర్థం చేసుకోవాలి. విశ్లేషణాత్మకంగా చదవడం ఎంత ముఖ్యమో తప్పులు లేకుండా భావయుక్తంగా రాయడం కూడా అంతే ప్రధానం. పరీక్షల్లో అన్ని ప్రశ్నలకు నిర్దిష్ట సమయంలో సమాధానాలు రాయాలి కనుక రోజూ క్రమంతప్పకుండా రాయడాన్ని సాధన చేయాలి. రాసేటప్పుడు అక్షరాల పరిమాణం, పదాల మధ్య దూరం సరిగా ఉండేలా చూసుకోవాలి.
 
 విద్యార్థులు ఏదైనా అంశం అనువర్తనాలకు సంబంధించి సొంతంగా విశ్లేషిస్తూ రాసే విధానాన్ని అలవరచుకోవాలి.
 
 ఆదివారాలు, ఇతర సెలవు దినాల్లో కొంత సమయాన్ని సమష్టి అధ్యయనానికి కేటాయించాలి. బృందంగా కలిసి చదివిన తర్వాత సామూహిక చర్చలను నిర్వహించాలి. ఇలా చేయడం వల్ల ఒకరి ఆలోచనల్ని మరొకరితో పంచుకునేందుకు వీలవుతుంది.
 
 పోషకాహారం.. చదువుకు ఓ ఇంధనం!
 
 తిండికలిగితే కండకలదోయ్..! కండగలవాడే మనిషోయ్! ఈ తరం కుర్రకారుకు కెరీర్‌పట్ల ఉన్నంత అవగాహన ఆరోగ్యంపట్ల లేకపోవటం ఆందోళన కలిగిస్తోంది. ఇనుప కండలు, ఉక్కు నరాలు గల యువత దేశానికి అవసరమన్న స్వామి వివేకానందుని మాటలతో ఆరోగ్యకరమైన వ్యక్తులే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించగలరన్న వాస్తవాన్ని అర్థం చేసుకోవచ్చు. ఫాస్ట్‌ఫుడ్ పుణ్యమాని ఒబెసిటీ క్రమేణా పెరుగుతోంది. అయితే ఇప్పటి వరకు పట్టణ, నగరప్రాంతాలకే పరిమితమైన ఈ స్థూలకాయ సమస్యలు గ్రామీణ ప్రాంత యువతనూ చుట్టుముడుతున్నాయి.

 

పల్లెల్లోనూ 35 శాతం మంది యువత ఊబకాయంతో బాధపడుతున్నారు. పోషకాహారం అంటే కేవలం ఖరీదైన భోజనం అనేది అపోహ మాత్రమే. కార్బోహైడ్రేట్లు, విటమిన్‌లు, ప్రొటీన్, కాల్షియం వంటివి ఎదిగే వయసుకు అవసరం. తక్కువ ఖర్చుతో లభించే జామ, అరటి వంటి పండ్లతోపాటు బెల్లం, బఠానీలు, శనగల్లో కూడా మంచి పోషకాలున్నాయి. రక్తంలో ఉండాల్సిన హిమోగ్లోబిన్ ఆధారంగా ఆరోగ్యాన్ని అంచనా వేయొచ్చు. రక్తంలో హిమోగ్లోబిన్ ఉండాల్సిన దానికన్నా తక్కువగా ఉన్నట్లయితే రక్తహీనత (ఎనీమియా)తో బాధపడుతున్నట్లు లెక్క.

 

ఆంధ్రప్రదేశ్‌లో యువతలో అధిక శాతం మంది రక్తహీనత  బాధితులే.  పిజ్జాలు.. బర్గర్లు వంటివి తినటం వల్ల యువతలో ఒబెసిటీ సమస్యలు పెరుగుతున్నాయి. మంచి పోషకాహారాన్ని మితంగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారి నుంచి తప్పించుకోవచ్చు. బెల్లం, ఆకు కూరల్లో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. కందులు, పెసలు, శనగలు వంటి వాటిలో ప్రొటీన్లు ఉంటాయి. విద్యార్థులు ఐరన్‌తో పాటు ప్రోటీన్లు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ పెరుగుతుంది. పోషకాహారం చదువుకు ఓ ఇంధనమన్న విషయాన్ని గుర్తించాలి.
 - డాక్టర్ ఆవుల లక్ష్మయ్య, ఎన్‌ఐఎన్ శాస్త్రవేత్త.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement