వరంగల్ లీగల్, న్యూస్‌లైన్ : జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగి ఉన్నత స్థానానికి చేరినా.. జన్మనిచ్చిన తల్లి, భూమిని మరువొద్దని కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ సూచించారు. కమిషనర్‌గా నియమితులైన తర్వాత తొలిసారి శనివారం జిల్లాకు వచ్చిన ఆయన వరంగల్ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో జరిగిన స్వామి వివేకానంద 151 జయంత్యోత్సవాల్లో పాల్గొని మాట్లాడారు. స్వామి వివేకానంద చెప్పినట్లుగా.. కళ్లు మూసినా, తెరిచినా కనిపించేది భగవంతుడొక్కడేనని, ఎక్కడ విభూది ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడని తెలిపారు.
సమాచార హక్కు చట్టం రావడానికి ముందు ఈ అంశంతో పాటు రాజ్యాంగం గురించి రాసిన వ్యాసాలు, ఇచ్చిన ఉపన్యాసాలతో తనకు కేంద్ర సమాచార కమిషనర్ పదవి లభించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్‌ను జిల్లా జడ్జి వెంకటరమణతో పాటు బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. సమావేశంలో ఆచార్య కసిరెడ్డి వెంకట్‌రెడ్డి, బార్ అసోసియేషన్ బాధ్యులు కె.అంబరీషరావు, రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్ ముద్దసాని సహోదర్‌రెడ్డి, కార్యదర్శి సునీల్‌తో పాటు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.