విజయవాడలోని ఓ ఆస్పత్రిలో గర్భిణి, ఇద్దరు శిశువుల మృతి
వైద్యురాలి నిర్లక్ష్యం వల్లే ముగ్గురు బలయ్యారని బంధువుల ఆందోళన
విచారణకు ఆదేశించిన డీఎంహెచ్‌వో
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
లబ్బీపేట(విజయవాడతూర్పు): పురిటినొప్పులతో ఆస్పత్రికి వచ్చిన గర్భిణీతోపాటు ఆమె కవల శిశువులు మరణించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పటమటలోని పద్మావతి హాస్పిటల్‌లో ఈ ఘటన జరిగింది. డాక్టర్ సకాలంలో స్పందించకపోవడంతోనే ఈ దారుణం జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం... కృష్ణాజిల్లా పోరంకికి చెందిన బండ్రపల్లి ప్రశాంత్, మాధవి(25) దంపతులకు ఒక బాబు(2) ఉన్నాడు.
మాధవి రెండోసారి గర్భం దాల్చడంతో పటమటలోని పద్మావతి హాస్పిటల్‌లో రెగ్యులర్‌గా వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. సోమవారం రాత్రి మాధవికి పురిటినొప్పులు రావడంతో ప్రసవం కోసం కుటుంబ సభ్యులు అదే ఆస్పత్రికి తీసుకొచ్చారు. మాధవిని పరీక్షించిన డాక్టర్ వెంకటరమణ సాధారణ ప్రసవం కోసం ప్రయత్నించారు.
తొలుత నార్మల్ డెలివరీలో ఒక శిశువు జన్మించినా, అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. రెండో శిశువు అడ్డం తిరగడంతో సిజేరియన్ చేశారు. అప్పటికే రెండో శిశువు కూడా మృతిచెందింది. సిజేరియన్ చేసిన అనంతరం మాధవి ఆరోగ్య పరిస్థితి కూడా విషమించడంతో మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మాధవి బుధవారం ఉదయం మృతిచెందారు.
ఆస్పత్రి వద్ద బంధువుల ఆందోళన
తన భార్య, ఇద్దరు శిశువులు మృతిచెందడంతో పద్మావతి ఆస్పత్రి వద్ద మాధవి భర్త ప్రశాంత్‌తోపాటు బంధువులు ఆందోళనకు దిగారు. తాము ఆస్పత్రికి వచ్చిన వెంటనే డాక్టర్ వెంకటరమణ స్పందించి సిజేరియన్ చేసి ఉంటే తల్లీబిడ్డలు బతికేవాళ్లని, డాక్టర్ నిర్లక్ష్యంవల్లే మరణించారని ప్రశాంత్ ఆవేదన వ్యక్తంచేశారు.
డాక్టర్ వెంకటరమణపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పటమట పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకుని బాధితుల నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అనంతరం పోస్టుమార్టం కోసం మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
వైద్యశాఖ విచారణ
తల్లీ, ఇద్దరు బిడ్డలు మృతిచెందడంతో ఎన్టీఆర్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని బుధవారం పద్మావతి ఆస్పత్రికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. వాస్తవాలను తెలుసుకునేందుకు నిపుణులైన వైద్యులను నియమించాలని విజయవాడ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌కు లేఖ రాశారు.
ఈ మేరకు జీజీహెచ్ గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ హిమబిందు, పీడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ పరుచూరి అనిల్‌కుమార్, ఎనస్తీషియా విభాగాధిపతి డాక్టర్ ఏవీ రావు, జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ ఇందిర ఆస్పత్రికి చేరుకుని విచారణ చేశారు.
డాక్టర్ వెంకటరమణ నుంచి స్టేట్‌మెంట్ తీసుకున్నారు. వైద్య రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చే సమయానికే మాధవి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్ వెంకటరమణ పేర్కొన్నట్లు సమాచారం. పోస్టుమార్టం రిపోర్టు, విచారణ కమిటీ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోనున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ మాచర్ల సుహాసిని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment