Central Information Commissioner
-
సీఐసీ చీఫ్ కమిషనర్‌గా హీరాలాల్ సమారియా
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర సమాచార కమిషన్ (సెంట్రల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్) ప్రధాన కమిషనర్‌గా హీరాలాల్ సమారియా బాధ్యతలు స్వీకరించారు. సోమవారం రాష్ట్రపతి భవన్లో ద్రౌపదీ ముర్ము సమక్షంలో హీరాలాల్ ప్రమాణ స్వీకారం చేశారు. వైకే సిన్హా పదవీ కాలం అక్టోబర్ 3న ముగియడంతో.. సమాచార కమిషన్ నియామకాలను చేపట్టాలంటూ కేంద్రానికి ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాజస్తాన్‌కు చెందిన హీరాలాల్ సమారియాను సీఐసీ చీఫ్ కమిషనర్‌గా రెండేళ్ల కాలానికి గాను కేంద్రం నియమించింది. ఈ పదవిని దళిత వర్గానికి చెందిన అధికారి చేపట్టడం ఇదే మొదటిసారి. 1985వ బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి హీరాలాల్ సమారియా గతంలో కేంద్ర కారి్మక, ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పలు విభాగాల్లో కూడా ఆయన సేవలందించారు. -
టీటీడీ ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందే..
సాక్షి, న్యూఢిల్లీ: రూ.వేల కోట్లు ఖర్చు పెడుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందేనని కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు స్పష్టం చేశారు. ప్రజా సంస్థగా ఉన్న టీటీడీ.. ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందేనన్నారు. శ్రీకృష్ణదేవరాయలు 16వ శతాబ్దంలో టీటీడీకి సమర్పించిన అత్యంత విలువైన ఆభరణాలు ఎక్కడున్నాయో చెప్పాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు టీటీడీకి కేంద్ర సమాచార కమిషనర్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మాడభూషి శ్రీధర్ సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. టీటీడీలో నెలకొన్న వివాదం కేవలం శ్రీవారి నగల సమస్యో లేదా శ్రీవారి ప్రాచీన కట్టడాల సమస్యో కాదన్నారు. శాసనాల్లో ఉన్న నగలకు.. ప్రస్తుతం టీటీడీలో ఉన్న నగలకు అసలు పోలికే లేదని పురావస్తు శాఖకు చెందిన ఒక డైరెక్టర్ తనకు చెప్పినట్లు వివరించారు. ఈ వ్యవహారంపై ప్రజలు ప్రశ్నిస్తే టీటీడీ సమాధానం చెప్పాల్సిందేనన్నారు. ఈ నెల 28న శ్రీవారి నగల వ్యవహారంపై విచారణ చేపడతామని తెలిపారు. జవాబుదారీగా ఉండేందుకు ప్రభుత్వానికి గానీ టీటీడీకి గానీ ఏమైనా అభ్యంతరాలుంటే చెప్పవచ్చన్నారు. -
డోపింగ్ చట్టబద్దమా నేరమా?
విశ్లేషణ దేశంలో యాంటీ డోపింగ్ పరీక్షలు నిర్వహించే ప్రయోగశాలలు ప్రాంతీయ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో లేనందున క్రీడాకారులు కింది స్థాయిలో ప్రేరకాలు వాడితే పట్టుకోవడానికి విధానమే లేకుండా పోయింది. తాత్కాలికంగా శక్తిని పెంచే ఉత్ప్రేరక మత్తు మందులను వాడి ఆటల్లో గెలిచే అవినీతి విస్తరిస్తున్నది. క్రీడాస్ఫూర్తితో జీవి తాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దుకోవాలనే నీతి సూత్రాలు చిన్నప్పటి పెద్దమాట. ఇప్పుడు ఏదో రకంగా గెలవడమే కర్తవ్యంగా క్రీడాకారులు భావిం చడం విచారకరం. దీన్ని డోపింగ్ అంటున్నారు. తప్పుడు ప్రేరకాల నేరాన్ని (డోపింగ్) అరికట్టడానికి మనం ఏ విధానాన్ని అనుసరిస్తున్నాం? మన విధా నం న్యాయంగా లేదని విమర్శిస్తూ దీపక్ సాంధూ అనే క్రీడాభిమాని ఒక ఆర్టీఐ దరఖాస్తులో విమర్శించారు. దేశంలోనూ రాష్ట్రాలలోనూ ప్రేరకాల వాడకాన్ని కనిపెట్టి నిరోధించడానికి కఠిన విధానాలను అనుసరించడంలేదని ఆయన అంటున్నారు. ప్రపంచ ప్రేరక వ్యతిరేక సంస్థ (వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ) 2015లో ఒక నియమావళిని రూపొందించింది. పరీక్షలు నిర్వహించి తొండి చేసి గెలవాలని చూసే మోసపూరిత ఆటగాళ్లను పట్టుకొని నిషేధించేందుకు ప్రమాణాలను నిర్దేశించింది. పరిశోధన, రసాయన మందుల పరి మాణం ఎంత ఉండాలని కూడా వివరించింది. క్రీడాకారుని శరీరంలో ప్రవేశించిన మందు పరిమాణాన్ని, అతనికి ప్రేరకం అందిన వనరులను కని పెట్టే ప్రక్రియను కూడా నిర్దేశించింది. మనదేశంలో ఈ ప్రేరకాల నిరోధక పద్ధతులు, ప్రయోగశాలలో కనిపెట్టి అరికట్టే ప్రయోగశాలలు ప్రాంతీయ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఎందుకు లేవన్నది ప్రధానమైన ప్రశ్న. అందువల్ల జాతీయస్థాయి పోటీలకు చేరుకునే వారు అందుకు కింది స్థాయిలో ప్రేరకాలు వాడితే పట్టుకోవడానికి విధానమే లేకుండా పోయింది. అంటే పరోక్షంగా జిల్లా, రాష్ట్ర ప్రాంతీయ స్థాయిలలో ప్రేరకాలు వాడి గెలిచేం దుకు మనదేశంలో వీలుంది. దాన్ని చట్ట వ్యతిరేకతగా భావించడానికి వీల్లేదు. అంటే ప్రేరకాల వాడకం జాతీయస్థాయి కింది అన్ని స్థాయిల్లో చట్టబద్ధం, ఆ తరువాత నేరం. మనకు జాతీయ ప్రేరక నిరోధక సంస్థ, జాతీయ ప్రేరక పరీక్షా ప్రయోగశాల ఉన్నాయి. కాని ప్రాంతీయస్థాయిలో ఈ ప్రయోగశాలలు లేక, అక్కడి క్రీడాకారులను పరీ క్షించే విధానం లేక, ప్రేరకాలు వాడే వారు జాతీయస్థాయి దాకా చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నాడా సంస్థ పరిశీలన ప్రకారం 2015, 2016 సంవత్సరాలలో పోటీనుంచి ఎంతమందిని తప్పించారు? ఎంతమందిని అనుమతించారు? ఎన్ని ప్రయోగాలు జరిపారు, ఎందరు ప్రేరకాలు తీసుకున్నారని తేలింది? వారిపై తీసుకున్న చర్యలు, నిషేధంవంటి వివరాలు కోరారు దీపక్ సాం«ధూ. సీపీఐఓ గానీ మొదటి అప్పీలు అధికారి గానీ ఏ జవాబూ ఇవ్వలేదు. ప్రజాసమాచార అధికారి కొన్ని సంబంధిత పత్రాల ప్రతులు ఇచ్చినట్టు చెప్పారు. అయితే ఇచ్చిన 122 పేజీల పత్రాలలో ఒక్కటి కూడా ధృవీకరణ లేదని దీపక్ సాంధూ విమర్శించారు. ముంబై ఐబీబీఎఫ్ వారి ప్రజాసమాచార అధికారి సంతకం చేయలేదు, స్టాంపుకూడా కొట్టలేదు. క్రీడా సంస్థల జాబితా ఇచ్చారుగాని వారు 2015–16 సంవత్సరంలో నాడా సంస్థకు రాసిన ఉత్తరాల ప్రతులు ఇవ్వలేదని, 10.8.2017న తాను రాసిన లేఖకు జవాబు కూడా ఇవ్వలేదని విమర్శించారు. సెక్షన్ 4(1) సి ప్రకారం కీలకమైన విధాన నిర్ణయాలు తీసుకునేప్పుడు లేదా ప్రకటించేటప్పుడు ప్రజలను ప్రభావితం చేసే ఆ విధానాలకు సంబంధించిన అన్ని వాస్తవాలను ప్రజలముందు తమంత తామే ఉంచవలసి ఉంటుంది. ప్రాంతీయ రాష్ట్రస్థాయిల్లో అసలు ప్రేరకాల వాడకాన్ని నిరోధించే విధానమే ప్రభుత్వం రూపొం దించలేదు. దీనివల్ల జాతీయస్థాయికి వచ్చేదాకా అసలు ఈ పరీక్షే లేకుండా పోయింది. దీనివల్ల ప్రతి భావంతులైన, సహజంగా ఆడగల స్తోమతగల అర్హులైన ఆటగాళ్లు పోటీలో మిగిలే అవకాశమే లేదు. జిల్లాస్థాయిలో ఆ తరువాత రాష్ట్ర స్థాయిలో చివరకు ప్రాంతీయ స్థాయిలో కూడా ఆటగాళ్లు ఈ ప్రేరకాల ప్రభావంతో ఆడి, సహజంగా ఆడే పోటీదారులపై గెలిచిపోతూ ఉంటారు. ఒకవేళ జాతీయ స్థాయిలో పట్టుబడినా అప్పటికే ఆ క్రీడాకారుడు సహజ క్రీడాకారులను వెనక్కితోసి జాతీయ స్థాయికి చేరి ఉంటాడు. కానీ నష్టం అప్పటికే జరిగిపోయి ఉంటుంది. ఈ అనారోగ్యకరమైన విధానాన్ని మార్చి అన్ని స్థాయిలలో ప్రేరకాల వాడకాన్ని నిరోధించడానికి ప్రయత్నించాలని కమిషన్ సిఫార్సుచేసింది. సమాచారం అభ్యర్థించిన దీపక్ సాంధూ అడిగిన విషయాలకు సంబంధించిన ఫైళ్లను పరిశీలనకు సమర్పించాలని, అందులో ఆయన కోరిన పత్రాలను ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది. దీపక్ సాంధూ దాఖలుచేసిన అన్ని సమాచార దరఖాస్తులకు సంబంధించిన దస్తావేజులను చూపాలని ఆదేశించింది. (దీపక్ సాంధూ వర్సెస్ ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్ ఇఐఇ/ అౖఐN/అ/ 2017/140574 కేసులో 21.11.2017 న ఇచ్చిన తీర్పు ఆధారంగా). - మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
దర్యాప్తు పైనే పరిమితులా?
విశ్లేషణ నేరారోపణపై దర్యాప్తు చేయడం నేర న్యాయవ్యవస్థలో కనీస ధర్మం. కానీ, దర్యాప్తు ప్రాథమిక దశలోనే పరిమితులు విధించడం చాలా అన్యాయం. అవినీతి ఆరోపణలు వచ్చిన అధికారిపైన దర్యాప్తు చేయడం కనీస అవసరం. పౌరుడు నేరం చేస్తే ఫిర్యాదు నమోదుచేసి దర్యాప్తు, నేరారోపణ పత్రం దాఖలు, నేరవిచారణ జరగాలనేది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చెప్పే విధానం. అదే ప్రభుత్వ ఉద్యోగి, అవి నీతికి పాల్పడితే పై అధికారి ముందస్తు మంజూరీ ఇస్తేనే దర్యాప్తు (ఇన్వెస్టిగేషన్) జరుగుతుంది. అనుమతి ఉంటేనే నేరవిచారణ (ప్రాసిక్యూషన్) జరుగుతుంది. నిజాయితీ పరులైన అధికారులను వేధించే ఆరోపణలు నిరోధించేందుకు ఈ మంజూరీ నిబంధన చేశారు. చట్టం వచ్చింది కానీ అమలు కావడం లేదు. అయితే కొందరి మిత్రులను శిక్షించి మరికొందరిని శిక్షించాలని మంజూరీ అధికారం వాడినపుడు నింద పొందిన సహ ఉద్యోగులు ఒకరి సమాచారం మరొకరు అడగడం, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు అడగడం, ఇతర నేరారోపిత ఉద్యోగులు, లేదా ఇతర పౌరులు కూడా సమాచారం అడిగేందుకు సమాచార హక్కు వీలు కల్పిం చింది. ఈ సమాచారం మూడో వ్యక్తి సమాచారమనీ, ఉద్యోగి వ్యక్తిగత సమాచారమనీ ఇవ్వకుండా తిరస్కరిం చడం చట్టబద్ధం అవుతుందా? ఇద్దరు ప్రభుత్వోద్యోగుల పదవీ విరమణ తేదీ వారి ప్రాసిక్యూషన్ కోసం మంజూరీ ఇచ్చిన వివరాలు కావాలని సుర్జిత్ అనే వ్యక్తి సమాచార హక్కు కింద కోరారు. సమాచార అధికారి దాన్ని పాలనా నిఘా వ్యవహారాలు చూసే మరొక సమాచార అధికారికి బదిలీ చేశారు. కొన్ని అంశాలమీద సమాచారం లేదన్నారు. మూడో వ్యక్తి వివరాలు కొన్ని అడుగుతున్నారనీ, వారి అనుమతి లేనిదే ఇవ్వలేమన్నారు. మొత్తానికి అంతా కలసి సమాచారం ఇవ్వలేదు. తమ ప్రభుత్వ సంస్థలోనే మరొక సీపీఐఓకు బదిలీ చేస్తే బాధ్యత తీరిపోదు. తమసంస్థకు సంబంధించిన సమాచారమే అడిగినప్పుడు ఆయన మరొక సీపీఐఓ పరిధిలో ఉన్న సమాచారం కూడా ఇవ్వవలసిన బాధ్యత చట్టం కింద వహించవలసి ఉంటుంది. ఇది మూడో వ్యక్తి సమాచారం అనడం కూడా సమంజసం కాదు. ఎందుకంటే అది అదే సంస్థలో పనిచేసే ఉద్యోగి చేసే అధికారిక పనికి సంబంధించిన అంశం కనుక అని వాదించారు. అయినా సెక్షన్ 11(1) కింద దీన్ని మూడోవ్యక్తి సమాచారం అనుకున్నప్పటికీ, ఆ సమాచారం ఈ సంస్థకు ఇచ్చినపుడు రహస్యం అని వర్గీకరించి ఉంటే, ఆ సమాచారం ఇవ్వాలనుకుని ఉంటే, సీపీఐఓ నీ అభిప్రాయమేమిటి అని నోటీసు ఇవ్వాలని, ఆ తరువాత అతను అభ్యంతరపెడితే దాన్ని పరిశీలించి, ఇవ్వాలని నిర్ణయించాను, ఏమంటావు అనీ రెండో నోటీసు ఇవ్వాలని, అందుకు ఆయన ఇంకేవయినా సమంజసమైన కారణాలు రాసి పంపిస్తే చూసి పరి శీలించి ప్రజాశ్రేయస్సు దృష్ట్యా ఇవ్వాలని తీర్మానిస్తే, ఆ విధంగా నిర్ణయించినట్టు మూడో లేఖ రాయాలని చట్టం వివరిస్తున్నది. జనహిత సమాచారమే అడిగారా లేదా తెలుసుకోవడానికి కమిషన్ ఈ కేసులో సంబంధిత ఫైళ్లను కమిషన్ ముందుంచాలని ఆదేశించింది. ఫైళ్లను అధికారులు కమిషన్ కు చూపించారు. ఆ దస్తావేజులలో సుర్జిత్ అడిగిన సమాచారానికి సంబంధించిన పత్రాలేవీ మినహాయింపుల కిందికి రావు. ఇద్దరు అధికారుల పదవీవిరమణ తేదీల సమాచారం మూడోపక్ష సమాచారం అన డం సమంజసం కాదు. వారు తమ పదవీ విరమణ తేదీ రహస్య సమాచారం అని ముందే నిర్ధారించలేదు. సీపీఐఓ తనకు ఆ సమాచారం ఇచ్చే ఉద్దేశం ఉందని తెలియజేయలేదు. కనుక మూడో వ్యక్తిని సంప్రదించే అవసరమే లేదు. వారి అభ్యంతరానికి వీటో శక్తి కూడా లేదు. ఒక వేళ అభ్యంతరం తెలిపినా ఆ విషయాన్ని కూడా పరిశీలించి అడిగిన సమాచారం వెల్లడించడం జనహితానికి అనుకూలమా లేక ప్రతికూలమా అని ఆలోచించి ఒక నిర్ణయాన్ని సీపీఐఓ స్వతంత్రంగా తీసుకోవాలి. ఆ పనిచేసినట్టు రికార్డు కనిపించడం లేదు. కనుక అడిగిన సమాచారం నిరాకరించడానికీ వీల్లేనిదే అవుతుంది. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 19, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 197 ప్రకారం తగిన అధికారి మంజూరీ ఇచ్చేంత వరకు న్యాయస్థానం ఏ నేర ఫిర్యాదును గుర్తిం చడానికి వీల్లేదు. సుబ్రమణ్యంస్వామి వర్సెస్ భారత ప్రభుత్వం (2014) 8 ఎస్ సి సి 682 కేసులో ఢిల్లీ స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్ మెంట్ చట్టం సెక్షన్ 6ఎ కింద మంజూరీ ఇస్తే తప్ప అత్యున్నత ప్రభుత్వోద్యోగి నేరాలపై దర్యాప్తు చేయడానికి వీల్లేదనే నిబంధన రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. వచ్చిన నేరారోపణ మీద దర్యాప్తు చేయడం నేర న్యాయవ్యవస్థలో కనీస ధర్మం. అసలు దర్యాప్తు అనే ప్రాథమిక దశలోనే పరిమితులు విధించడం చాలా అన్యాయం. అదీ లంచగొండితనం, అవినీతి, భ్రష్టాచారం, నేరపూరిత దుర్వ్య వహారం అనే ఆరోపణలకు వచ్చిన అధికారిపైన దర్యాప్తు చేయడం కనీస అవసరం కూడా. ముందస్తు మంజూరీ లేకుండా దర్యాప్తు నేర విచారణ జరగకూడదనే నియమాలకు వ్యతిరేకంగా అనేక తీర్పులు వచ్చాయి. అయినా మంజూరీ నియమం బతికే ఉంది. కొందరు ప్రభుత్వోద్యోగులపై ఆరోపణలను దర్యాప్తు చేయడానికి తరువాత ప్రాసిక్యూట్ చేయడానికి ఎందుకు అనుమతించారు, మరికొందరిని ఎందుకు అనుమతించడం లేదో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది. సమాచార హక్కు ఈ హక్కును ధృవీకరించింది. కేంద్ర నిఘా కమిషన్ తన వెబ్సైట్లో ముందస్తు మంజూరీతో నేరవిచారణ జరుగుతున్న అధికారుల జాబితా ప్రచురిస్తున్నది. ఇది మూడో వ్యక్తి సమాచారం అయ్యే ప్రసక్తే లేదు. సమాచారం పదిరోజుల్లో ఇవ్వాల్సిందే అని కమిషన్ ఆదేశించింది (సుర్జిత్ పాణిగ్రాహి వర్సెస్ శాస్త్ర విజ్ఞాన శాఖ ఇఐఇ/ M ఖీఇఏ/అ/2017/15 6475 కేసులో సిఐసి 17 జనవరి 2018 నాటి తీర్పు ఆధారంగా). - మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
సమాజంలో ప్రశ్నించేతత్వం రావాలి
కేంద్ర సమాచార కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ సిరిసిల్ల: సమాజంలో ప్రశ్నించేతత్వం రావాలని, తెలియని విషయాలను అడిగే ధైర్యం చేయాలని కేంద్ర సమాచార కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శనివారం రంగినేని ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌లో ‘రంగినేని ఎల్లమ్మ’రాష్ట్రస్థాయి సాహిత్య పురస్కార ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ సమాజంలో జరిగే వివక్షపై, సామాజిక అంశాలపై ప్రశ్నించడం నేర్చుకోవాలన్నారు. ముందుగా అడుగడం నేర్చుకోవాలని, లేకుంటే అజ్ఞానిగానే జీవితాంతం ఉంటామని వివరించారు. సాహిత్యం సమాజ హితాన్ని కోరుకుంటుందని, ప్రజల్లో కొత్త ఆలోచనలను సాహిత్యం ద్వారా వస్తుందన్నారు. అనాథ ఆశ్రమాలు, వృద్ధశ్రమాలు అనే పదాలు వాడవద్దని గౌరవ ప్రదమైన పేర్లను పెట్టాలని శ్రీధర్ అన్నారు. ‘రంగినేని ఎల్లమ్మ రాష్ట్ర స్థాయి సాహిత్య పురస్కారం–2016’ను ఎ.ఎన్.జగన్నాథశర్మ రాసిన ‘కథా స్రవంతి’, ప్రొఫెసర్ ఎమ్.ఎమ్. వినోదిని రాసిన ‘బ్లాక్ ఇంక్’కథా సంపుటాలను శ్రీధర్‌కు అందించారు. మెమొంటో, శాలువ, అవార్డులతో సత్కరించారు. కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నలిమెల భాస్కర్, నేషనల్ బుక్‌ట్రస్ట్ సంపాదకులు పత్తిపాక మోహన్, మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని, ట్రస్ట్ అధ్యక్షులు రంగినేని మోహన్‌రావు, సాహితీవేత్తలు జూకంటి జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. -
వాయిదాలకు న్యాయం బలి!
వందలాది కేసుల్లో న్యాయ నియమాలు, ప్రక్రియ చట్టాలు, పెద్దల ప్రబోధాలతోపాటు, సహ చట్టం కూడా నిర్దేశిస్తున్నా, తగిన కారణాలు తెలపకుండా విచారణను వాయిదా వేయడం అన్యాయం, అసమంజసం. తనమీద దాడిచేసిన వారి పైన పెట్టిన క్రిమినల్ కేసు విచారణ ఆలస్యం ఎందుకవు తున్నదని మహావీర్ అనే వ్యక్తి ఢిల్లీ కోర్టును ఆర్టీఐ కింద అడిగారు. అక్టోబర్ 2012లో చార్జిషీటు, కోర్టు వ్యవహారాల వివరాలు అడిగాడు. నింది తులు ఎన్నిసార్లు హాజరుకా లేదు? ఎన్ని వాయిదాలు ఇచ్చారు? ఆరోపణలు నిర్ధారించడానికి చట్ట ప్రకారం ఉన్న కాలపరిమితి ఏమిటి? మూడేళ్లనుంచి ఈ నేర విచారణ ఎందుకు ముందుకు సాగడం లేదు? అని నిలదీశాడు. కొన్ని వివరాలు ఇస్తూ కోర్టు ఫైలును తనిఖీ చేసుకోవచ్చునని పీఐవో లేఖ రాశాడు. తనిఖీ కాదనీ, ప్రతి అంశానికి వివరాలు చెప్పాల్సిందే అంటూ మొదటి అప్పీలు వేశారు. వాయిదా తేదీల వివరాలు ఇచ్చేశారని ఫిర్యాదు దారుడి హోదాలో కూడా మహావీర్ కేసు ఫైలును పూర్తిగా పరిశీలించే హక్కు ఉందని న్యాయాధికారి (అప్పీలు అధికారి) మార్చి 2016 స్పష్టం చేశారు. న్యాయ నిర్ణయ వివరాలు సహ చట్టం కింద అడగడానికి వీల్లేదని ఢిల్లీ జిల్లాకోర్టుల సహ చట్ట నియమాలను 2008లో 7(4) నిర్దేశించిందని ఆయన గుర్తుచేశారు. ఆరోపణల నిర్ధారణకు ఎంత కాలపరి మితి?, కేసును చాలా దూరం వాయిదా ఎందుకు వేశారనే ప్రశ్నలకు రికార్డు లేదని జవాబిచ్చారు. కారణాలను విశ్లేషించి వ్యాఖ్యానించే బాధ్యత పీఐవో పైన లేదని రూల్ 7(9) వివరిస్తున్నదని న్యాయమూర్తి తెలిపారు. కేసును చాలాకాలం వరకు వాయిదా వేయ డానికి కారణాలు ఆ ఆదేశంలో ఉంటే చదువుకోవచ్చని, లేకపోతే ఆర్టీఐ కింద అడగడానికి వీల్లేదని వివరించారు. తగాదాలతో కోర్టుకు వెళ్లిన న్యాయార్థులందరికీ ఎదురయ్యే సమస్య సుదీర్ఘ వాయిదాలే. దిక్కుమాలిన వాయిదాలకు కారణాలు ఏమిటని పెండింగ్ దెబ్బ తిన్న లక్షల మంది కక్షిదారులు అడుగుతూనే ఉంటారు. న్యాయసూత్రాల ప్రకారం ప్రతి ఆదేశానికి కారణాలు వివరించాల్సిందే. సుదీర్ఘంగా వాయిదా వేయడం కూడా న్యాయపరమైన నిర్ణయమే కనుక కారణాలు ఇవ్వవలసిందే. కారణాలు ఉండవు, చెప్పరు, ఆర్టీఐ కింద ఇవ్వడానికి వీల్లేదంటారు. ఇదేం న్యాయం? అని అభ్యర్థి ఆవేదన. ఆ కారణాలు ఫైల్లో లేవు కనుక ఇవ్వ జాలను అనడం చట్టబద్ధమైన లాంఛనం. కారణాలు ఇవ్వకుండా వాయిదా వేయకూడదని తెలిసి కూడా న్యాయాధికారులు అదేపని పదేపదే చేస్తుంటే ఎవరు అడగాలి? దానికి జవాబుదారీ ఎవరు? ఇది న్యాయ పాలనకు సంబంధించిన ప్రశ్నకాదా? కోర్టు పనివేళలను పూర్తిగా వినియోగించాలని, జడ్జి నిక్కచ్చిగా సమయానికి విచారణలు మొదలు పెట్టాలని, లాయర్లు కూడా అయిందానికి కానిదానికి వాయిదాలు అడగరాదని లా కమిషన్ 230వ నివేదికలో సూచించారు. చట్టనియమాలను కచ్చితంగా పాటించకుండా వాయిదాలు ఇవ్వరాదన్నారు. తగిన కారణం చూపడంతోపాటు ఎట్టిపరిస్థితిలోనూ మూడు సార్లకన్న ఎక్కువ వాయిదాలు ఇవ్వరాదని, వాయిదా వల్ల కలిగే నష్టాలను భర్తీ చేయాలని ఆదేశించాలని సీపీసీ నియమాలు నిర్దేశిస్తున్నారు. కారణాలను వాయిదా ఆదేశంలో తప్పనిసరిగా వివరించాలని కూడా నిర్దేశించారు. వృథా వాయిదాలు, అనవసర అప్పీళ్లతో న్యాయవ్యవస్థ నిర్వీర్యమైపోతున్నదని, లాయర్లలో నైతిక విలువల పతనం అంశాన్ని బార్ కౌన్సిల్ పట్టించుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా వినే దిక్కులేదు. లాయర్లు అడిగిందే తడవుగా వాయిదా ఇవ్వడానికి జడ్జిలు సిద్ధంగా ఉండడం అన్యాయమని ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎం లోధా విమర్శించారు. కక్షిదారులు, వారి లాయర్లు కూడా వారుుదాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. విచక్షణా రహితమైన వాయిదాలే న్యాయ వితరణలో విపరీత ఆలస్యాలకు కారణమని అందరికీ తెలుసు. తమ నిర్ణయాలవల్ల, విధానాల వల్ల దెబ్బతినే వారికి ఆ నిర్ణయాలకు దారితీసిన అన్ని వివరాలు ఇవ్వాలని సమాచార హక్కు చట్టం సెక్షన్ 4(1)(సీ) శాసిస్తున్నది. 4(1)(డి) ప్రకారం తమ పాలనాపర మైన, అర్ధన్యాయపరమైన నిర్ణయాలకు కారణాలను బాధితులకు తెలియజేయాలని శాసిస్తున్నది. ఇవి తమంత తాము ప్రజాసంస్థలు తెలియజేయాల్సిన సమాచారాలు. వాటిని ప్రత్యేకంగా ఎవరూ అడగనవ సరం లేదు. వారు వెల్లడించనప్పుడు అడిగే హక్కు పౌరులకు ఉందని, ఈ రెండు నియమాల కింద కూడా ప్రతిపౌరుడికి కేసులను తరచుగా వాయిదా వేయడానికి కారణాలను తెలుసుకునే హక్కును వాడుకోవచ్చని సీఐసీ వివరించింది. న్యాయ నియమాలు, ప్రక్రియ చట్టాలు, లా కమిషన్ నివేదికలు, వందలాది కేసుల్లో ఉన్నత న్యాయస్థానాల ప్రవచనాలు, పెద్దల ప్రబోధాలతోపాటు, సహ చట్టం కూడా నిర్దేశిస్తున్నా కారణాలు తెలపకుండా వాయిదా వేయడం అన్యాయం, అసమంజసం. ఈ పరిస్థితిని తొలగించడానికి న్యాయస్థానాలు తగిన విధానాలు రూపొందించుకోవాలని సీఐసీ సూచించింది. ఈ కేసులో మొత్తం ఫైలును మహావీర్‌కు చూపాలని ఆదేశించింది. (ఇఐఇ/అ/అ/2016/0011 76 మహావీర్ వర్సెస్ పాటియాలా హౌస్ కోర్టు కేసులో 24.6.2016న ఇచ్చిన తీర్పు ఆధారంగా) మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ ఈమెయిల్: professorsridhar@gmail.com -
ఆ నివేదిక కూడా గోప్యమేనా?!
విశ్లేషణ ఢిల్లీలో శాసనసభను రద్దు చేయాలని ఎల్జీ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికకు ఏ రక్షణా లేదు. అంతే గాకుండా గవర్నర్‌కు ఉన్న రక్షణ నియమాలను రాజ్యాంగంలో లెఫ్టినెంట్ గవర్నర్‌కు కల్పించలేదు. దేశభద్రత వంటి కీలకమైన అంశాల్లో తప్ప ప్రభుత్వాలు పాలనా రహస్యాలు అంటూ సమాచారం చెప్పకుండా దాచడానికి ప్రస్తుతం వీల్లేదు. సర్కారీ పెద్దల మధ్య సాగిన ఉత్తర ప్రత్యుత్తరాలు పాలనకు సంబంధించినైవైతే బయట పెట్టడానికి వీల్లేదని ప్రభుత్వం వాటిని దాచడానికి వీలుగా ప్రివిలేజిని వాడుకోవడానికి సాక్ష్య చట్టం సెక్షన్ 123 అనుమతించేది. దీనిపైన చాలా వాద వివాదాలు చెలరేగాయి. ఎన్నో కోర్టు తీర్పులు ప్రివిలేజి విస్తారాన్ని తగ్గించాయి. రాష్ర్టపతి ఉత్తర్వులు, గవ ర్నర్ నివేదికలు, ప్రధాన న్యాయమూర్తికి, ప్రభుత్వానికి మధ్య జరిగిన లేఖాయణం ఇవన్నీ ఒకప్పుడు మూడో కంటికి తెలియడానికి వీల్లేని పాలనా వ్యవహరాలనీ, కనుక వీటిని బయట పెట్టడానికి వీల్లేదని సూత్రీకరించారు. సార్వభౌమాధికారం ఉన్న కార్యపీఠాలు తమ వ్యవహారాల గురించి చెప్పితీరాలని అడిగే అధికారం కూడా ఎవరికీ లేదనే వాదం కూడా తరచూ వినిపించేది. ప్రివిలేజ్డ్ కమ్యూనికేషన్ పేరుతో ప్రజావ్యవహారాల సమాచారం మరుగునపడేది. కాని సమాచార హక్కు చట్టం 2005 వచ్చిన తరువాత అటువంటి ప్రివిలేజికి స్థానం లేదు. సెక్షన్ 123 సాక్ష్య చట్టం నియమాన్ని కాదని సెక్షన్ 22 సమాచార హక్కు చట్టం పనిచేస్తుంది. ఆ సమాచారం ఇవ్వవచ్చా లేదా అనే విషయంలో సెక్షన్ 8, 9 తప్ప మరే ఇతర శాసన నియమాలను కూడా పరిశీ లించడానికి వీల్లేదు. 2013-14లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేసిన తరువాత లెఫ్టినెంట్ గవ ర్నర్ (ఎల్జి)కేంద్ర ప్రభుత్వానికి పంపిన నివేదిక, దానికి సంబంధించిన ఇతర పత్రాల ప్రతులు ఇవ్వాలని ఆదిత్య అనే యువకుడు సహ చట్టం కింద అడిగారు. ఎల్జీ కార్యాలయం ఇవ్వడానికి వీల్లేదన్నది. మొదటి అప్పీలులో కూడ చుక్కెదురైంది. రెండో అప్పీలులో కమిషన్ ముందు ఈ ప్రశ్నకు సమాధానం, సమాచారం దొరుకుతుందా అన్నది రాజ్యాంగం కీలక శాసనాల సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. రికార్డులు, పత్రాలు, మెమోలు, ఈమెయిల్‌లు, అభిప్రాయాలు, సలహాలు, పత్రికా ప్రకటనలు, సర్క్యులర్లు, ఆర్డర్లు, లాగ్ పుస్త కాలు, ఒప్పందాలు, నివేదికలు, కాగితాలు, నమూ నాలు, మోడల్స్, డేటా, వంటివి ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్నవి కూడా సమాచారం నిర్వచనంలోకి వస్తాయని సెక్షన్ 2(ఎఫ్) సహ చట్టం వివరించింది. లెఫ్టినెంట్ గవర్నర్ ఇచ్చింది నివేదిక అయినా, సలహా అయినా, అభిప్రాయమైనా సరే ఈ నిర్వచనం పరిధిలోనే ఉంటుంది. ఇది లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి పంపినది కనుక వారి కార్యాలయంలోనూ, కేంద్ర హోంమంత్రి కార్యాలయంలోనే ఉండి తీరుతుంది. అది సమాచారమే అయి, ప్రభుత్వ అధీనంలో ఉండి ఉంటే వెల్లడించాల్సిందే. అయితే అంతకు ముందు ఒక్కసారి పరిమితులు, మినహాయింపులు ఏమైనా వర్తిస్తాయో లేదో పరిశీలించాలి. ఎల్జీ కార్యాలయ ప్రజాసమాచార అధికారి సెక్షన్ 8(1)(ఐ) కింద ఆ నివేదిక ఇవ్వడానికి వీల్లేదన్నారు. పార్లమెంటు లేదా శాసనసభల ప్రత్యేకా ధికారాల (ప్రివిలేజ్)కు భంగం కలిగిస్తుందనుకునే సమాచారాన్ని ఇవ్వనవసరం లేదని ఈ సెక్షన్ నిర్దేశిం చింది. ఈ నివేదిక వెల్లడి పార్లమెంటు ప్రివిలేజ్ని ఏవిధంగా దెబ్బతీస్తుందని వివరించలేదు. ఊరికే సెక్షన్ నెంబరు చెబితే సరిపోదు. అది ఏ విధంగా వర్తిస్తుందో సమర్థించే బాధ్యత ప్రజా సమాచార అధికారిపైన ఉందని సెక్షన్ 19(5) చాలా స్పష్టంగా వివరిస్తున్నది. అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేసిన తరువాత మరో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేదని, కనుక ఢిల్లీ శాసనసభను రద్దు చేయాలనే ఎల్జీ నివేదికను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఇంత జరిగిన తరు వాత వెల్లడి చేయబోమనడానికి అందులో ఏముంది అనేది ప్రశ్న. ఆర్టికల్ 74(2) కింద రాష్ర్టపతికి కేంద్ర మంత్రి మండలి ఇచ్చిన సలహాను, లేదా ఆర్టికల్ 163(3) కింద గవర్నరుకు రాష్ర్ట మంత్రి మండలి ఇచ్చిన సలహాలో లోటుపాట్లను దర్యాప్తుచేసే అధికారం కోర్టు లకు లేదని రాజ్యాంగం వివరిస్తున్నది. కాని మంత్రి మండలి ఆ సలహానివ్వడానికి ఆధారభూతమైన నివేది కలు పరిస్థితులను సమీక్షించే అధికారం రాజ్యాంగ న్యాయస్థానాలకు ఉందని, ఈ సమీక్షాధికారం మన రాజ్యాంగ మౌలిక స్వరూపమని దాన్ని కాదనే అధికారం ఎవరికీ లేదని ఎస్ఆర్ బొమ్మయ్ కేసులో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. అంటే మంత్రి మండలి సలహాకు ప్రివిలేజ్ ఉందనుకోవచ్చు. కాని గవర్నర్ నివేదిక ఆ సలహాకు ఆధారం అవుతుంది కనుక పరిశీలించే అధికారం కోర్టులకు ఉందని వివరణ ఇచ్చారు. అంటే ఢిల్లీలో శాసనసభను రద్దు చేయాలని ఎల్జీ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికకు ఏ రక్షణా లేదు. అంతే గాకుండా గవర్నర్‌కు ఉన్న రక్షణ నియమాలు రాజ్యాంగంలో లెఫ్టినెంట్ గవర్నర్‌కు కల్పించలేదు. లెఫ్టినెంట్ అంటే ఉప అని అర్థం, ఉప రాజ్య పాలకుడికి ఈ ప్రివిలేజ్ లేదు. ప్రివిలేజ్ ఉందనుకున్నా అది దర్యాప్తు నుంచి రక్షణే కాని అది రహస్యమని అర్థం కాదు. అయినా సమాచారం అడిగిన అభ్యర్థిగా, రెండో అప్పీలు విచా రిస్తున్న సమాచార కమిషన్ గానీ, సలహా బాగోగులకు దర్యాప్తు చేయడం లేదు. ఆ నివేదిక ప్రతిని ఇవ్వమని మాత్రమే కోరుతున్నారు. (ఇఐఇ/అ/అ/2015/000748 ఆదిత్య వర్సెస్ ఎల్జి సచివాలయం కేసులో 25.5.2016న ఇచ్చిన తీర్పు ఆధారంగా) మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
సహచట్టంతో పౌరుడికి సాధికారికత
విశ్లేషణ రహస్యాలు కాపాడుకుంటాం, ఇతరుల రహస్యాలు సాధించి బ్లాక్మెయిల్ చేస్తాం అనే దుర్మార్గపు ధోరణిని ప్రభుత్వంలో, ప్రభుత్వం బయట కూడా సాగించే వారు దుర్మార్గులు. అటువంటి వారిపైన పోరాటానికి సమాచార హక్కు చట్టం ఒక అస్త్రం. సమాచార హక్కు చట్టం 12 అక్టోబర్ 2005న ప్రభుత్వం అమలులోకి తెచ్చిన రోజు భారతదేశానికి మరో స్వాతం త్య్ర దినోత్సవం అని పండుగ చేసుకున్నారు. స్వాతంత్య్రం అయితే 1947లో వచ్చింది కాని, మన కార్యాలయాల్లో ఏం జరుగుతున్నదో, ఫైళ్లలో దాగిన విషయాలేమిటో తెలుసుకునే అవకాశం 2005 దాకా రాకపోవడం చాలా దురదృష్టకరమైన ఆలస్యం. 1766లో స్వీడెన్ ఇటువంటి పారదర్శకతా చట్టాన్ని తెచ్చుకున్నది. మనం స్వతంత్రం సాధించుకున్న తర వాత సమాచారంపైన హక్కు సంపాదించడానికి ఉద్య మాలు చేయవలసి వచ్చింది. 58 సంవత్సరాల తరవాత వచ్చిన ఈ హక్కు వయసు ప్రస్తుతం పదేళ్లు. ఈ హక్కును అమలు చేసుకోవడంలో విజయం సాధించామా లేక వెనుకబడి ఉన్నామా అన్నది దశాబ్ద కాలపు సమీక్షా విషయం. గొప్పగా విజయాలు సాధిం చామని చెప్పలేము గానీ పూర్తిగా పరాజయం చెందిం దని చెప్పడం అన్యాయమే అవుతుంది. ప్రజాస్వా మ్యంలో ఓటర్లకు తగిన ప్రభుత్వం వస్త్తుందంటారు. అదే విధంగా సహ చట్టం కూడా ప్రజల చైతన్యంపైన ఆధారపడి ఉంటుంది. అడిగినంత వారికి అడిగినంత సమాచారం లభిస్తుంది. దొరికిన సమాచారాన్ని ఏ విధంగా వాడుకుంటారనేది కూడా వారి అవసరాలు, ప్రజావసరాలు, సందర్భం, న్యాయాన్యాయాలపైన ఆధారపడి ఉంటుంది. ఏపీ న్యాయ విద్యాసంస్థ, జ్యుడీ షియల్ అకాడమీలో ప్రసంగిస్త్తున్నప్పుడు విరామంలో ఒక న్యాయాధికార మిత్రుడు సమాచార హక్కు చట్టం కింద లభించిన సమాచారం సాక్ష్యంగా పనికి వస్తుందా అని నన్నడిగారు. అవును అని నేనంటే ఆయన కాదన్నట్టు ఒక నవ్వు నవ్వారు. ఒకానొక అంశంపైన అధీకృత పత్రాన్ని పొందే అవకాశం సహ చట్టం కల్పిస్తున్నది. ఇది సమాచారం. సందర్భాన్ని బట్టి సాక్ష్య చట్టం నియమాలను బట్టి, కేసు అంశాలను బట్టి దాన్ని అనుమతిస్తే అది సాక్ష్యమవు తుంది. జడ్జిగారు సాక్ష్యాన్ని అనుమతించడం అనుమ తించకపోవడం, దానికి ఎంత విలువ ఇవ్వాలో నిర్ణయిం చడమనేది ఆయన వివేకానికి, విచక్షణకు వదిలేస్తారు. పౌరులు తమ హక్కులను కాపాడుకోవడానికి అవసర మైన సమాచారాన్ని కోరవచ్చు. ఆ సమాచారాన్ని అవ సరమైన రీతిలో సమంజసంగా వాడుకోవచ్చు. జీవన భృతి కోసం పోరాడుతున్న భార్య ప్రభుత్వ ఉద్యోగి అయిన తన భర్త వేతనం ఎంతో ఈ చట్టం కింద తెలుసు కోవచ్చు. ప్రభుత్వ అధికార సంస్థ ధృవీకృతరూపంలో ఇచ్చిన ఆ సమాచారాన్ని కోర్టులో సాక్ష్యంగా ప్రవేశ పెడు తుంది. దాన్ని పరిశీలించాల్సిన బాధ్యత కోర్టులదే. తన కుటుంబాన్ని పోషించడం, పిల్లల్ని పెంచడం అనేది ప్రతి వాడి ధర్మం.పెళ్లి చేసుకోకపోయినా తల్లిదం డ్రులను పోషించాల్సిన బాధ్యత ఉంటుంది. ప్రభు త్వోద్యోగికి సంబంధించినంత వరకు ఇది క్రమశిక్షణా పరమైన బాధ్యత. రెండు పెళ్లిళ్లు చేసుకున్నా, వరకట్నం కోసం బాధించినా శాఖాపరమైన చర్యలు తీసుకొనడం ప్రజాప్రయోజనకరమైన అంశం. ప్రభుత్వానికి ప్రాతి నిధ్యం వహించే వ్యక్తి ఎటువంటి నేరమూ చేయడానికి వీల్లేదు. సచ్ఛీలుడై ఉండాలని సర్వీసు నియమావళి వివరిస్తున్నది. సమాచార హక్కు చట్టం కింద వచ్చిన సమాచారానికి పరిశీలనా యోగ్యత ఉండడం న్యాయ మని అందరూ అర్థం చేసుకోవలసి ఉంది. ప్రయివేటు రంగంలో పనిచేసే భర్తల జీతం సమాచారం తెలుసుకో వచ్చా అని అడుగుతూ ఉంటారు. దానికి జవాబు ఢిల్లీ హైకోర్టు 2015 జనవరిలో ఇచ్చింది. కుటుంబ తగాదాల విషయంలో కోర్టుకు వచ్చే భార్యాభర్తలు తమ తమ ఆదాయ వ్యయ వివరాలు తామే ప్రమాణ పత్రం రూపంలో ఇవ్వాల్సి ఉంటుందని, అప్పుడే న్యాయంగా సత్వరంగా నిర్ణయించడం సాధ్యం అవుతుందని హైకోర్టు వివరించింది. రహస్యాలు కాపాడుకుంటాం, ఇతరుల రహ స్యాలు సాధించి బ్లాక్ మెయిల్ చేస్తాం అనే దుర్మార్గపు ధోరణిని ప్రభుత్వంలో, ప్రభుత్వం బయట కూడా సాగించే వారు దుర్మార్గులు. అటువంటి వారిపైన పోరా టానికి సమాచార హక్కు చట్టం ఒక అస్త్రం. ఈ చట్టం అమలు చేయడంలో ఇబ్బందులు ఉన్నాయి. పరిమి తులూ ఉన్నాయి. కాని పౌరులు ఎంత జాగ్రత్తగా దీన్ని ఉపయోగించగలరు? దీని గరిష్టశక్తి ఏమిటి? అని ఇంకా పరీక్షించలేదేమో అనిపిస్తుంది. ఇంకా ప్రభుత్వం కూడా దీన్ని అర్థం చేసుకోవడం లేదు. తలనొప్పి చట్టం అని తలపోస్తున్నది. జిల్లా స్థాయి తాలూకా గ్రామస్థాయి కార్యాలయాల్లో సమాచారాన్ని అడగడం ద్వారా అవి నీతిని కనిపెట్టడానికి నిరోధించడానికి చాలా అవకాశా లున్నాయి. పెద్ద పెద్ద స్థాయిలో వేల, లక్షల కోట్ల రూపా యల అవినీతిని సమాచార హక్కు చట్టం అంతగా వెల్లడించకపోవచ్చు. కాని మీడియా భారీ అవినీతి గురించే పట్టించుకుంటుంది. చిన్న అవినీతి వారి కంటికి ఆనదు. సీబీఐ కూడా పట్టించుకోదు. పోలీసులు దర్యాప్తు చేయతగినదే అయినా ఇంత చిన్న లంచగొండి తనాన్ని పరిశోధించే సమయం వారికి ఉండదు. పౌరులు సమాచార హక్కు ద్వారా వెలికి తీసి స్వయంగా పోరాడవలసి ఉంటుంది. కొన్ని లక్షల సంఖ్యలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని ప్రశ్నించే సాధనం ఈ చట్టం. ఎన్ని పరిమితులున్నా, ఎంత ఆలస్యాలు జరిగినా, జాగ్రత్తగా వాడుకుంటే సహ చట్టం కార్యాలయాల పనితీరును మార్చేస్తుంది. ప్రజాస్వా మ్యాన్ని బతికిస్తుంది. ప్రభుత్వాలు, పార్టీలు కూడా ఈ చట్టాన్ని అమలు చేయవలసి ఉంది. ప్రజలు ఈ విలువైన హక్కును కాపాడుకోవడం చాలా అవసరం. మాడభూషి శ్రీధర్(వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్) professorsridhar@gmail.com -
వాడు చాలా బాగా రాసిండు
... ఇది మా నాన్న ప్రశంస మాడభూషి శ్రీధర్ కాలమిస్టుగా న్యాయశాస్త్ర ఆచార్యుడిగా పరిచయం. సామాజిక, రాజకీయ విశ్లేషకులుగా తెలిసిన వ్యక్తి. ఆ మధ్య కేంద్ర సమాచార కమిషనర్‌గా ఎదిగారనీ తెలుసు. అంతకంటే ముందు ఆయన పాత్రికేయుడు. పాత్రికేయుల కోసం పాఠాలు రాసిన మేధావి. ఎంత ఎదిగినా కౌమార దశలో తండ్రి నుంచి అందుకున్న ప్రశంసా వాక్యమే మకుటంగా భావిస్తారాయన. మీ బాల్యం, చదువు ఎక్కడ? అంతా వరంగల్‌లోనే. నాన్న ఎం.ఎస్ ఆచార్య, స్వాతంత్య్ర సమరయోధులు, జనధర్మ వారపత్రిక, వరంగల్ వాణి దినపత్రికల వ్యవస్థాపకుడు, సంపాదకుడు. అమ్మ రంగనాయకమ్మ గృహిణి. చదువు అంటారా... ఇంటికి దగ్గరగా ఉన్న చెట్టుకింద బడిలో, వరంగల్ లా కాలేజ్, ఉస్మానియా యూనివర్శిటీలలో సాగింది. న్యాయశాస్త్రంలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసి మళ్లీ జర్నలిజంలో పి.జి ఎందుకు చేయాలనిపించింది? మీ ప్రశ్న చిన్నదే. దానికి సమాధానం చెప్పాలంటే నా జీవిత పుస్తకాన్ని తెరవడమే. పెండేకంటి లా కాలేజ్‌లో లా క్లాసులు తీసుకుంటూ రచన జర్నలిజం కాలేజ్‌లో బీసీజే, ఎంసీజే చేశాను. న్యాయశాస్త్రం, జర్నలిజం, సమాచార చట్టం... మొత్తం ఎన్ని పుస్తకాలు, వ్యాసాలు రాసి ఉంటారు? పుస్తకాలు 30కి పైగా. వ్యాసాలు వేలల్లో ఉంటాయి. న్యాయశాస్త్రాన్ని విశ్లేషిస్తూ వ్యాసాలు రాసిన తొలి తెలుగు వ్యక్తి మీరేనేమో! పెద్దలున్నారు. విస్తృతంగా రాసింది నేనే కావచ్చు. సమాచార హక్కు చట్టం సామాన్యుడికి ఎంత వరకు అందుబాటులోకి వచ్చిందంటారు? సామాన్యుడికి సమాచారం కోసం నిలదీసి అడిగే హక్కునిచ్చింది. అధికార వర్గాల్లో సమాచారాన్ని ఇచ్చి తీరాల్సిందే, ఇద్దాం అనే పరిస్థితులు వస్తున్నాయి. ఈ చట్టం సామాన్యుడిని సాధికారిక శక్తిగా మారుస్తుంది. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా ప్రమాణస్వీకారం చేస్తున్నప్పుడు ఏమనిపించింది? అది యాదృచ్ఛికమైన అద్భుత సంఘటన. సిఫార్సు లేకుండా దరఖాస్తు ఆధారంగా ఎంపిక కావడం అంటే ఈ వ్యవస్థ నాకు ఇచ్చిన గౌరవం అనిపించింది. కష్టపడితే ఫలితం ఉన్నతంగా ఉంటుందనిపించింది. అప్పటి విధులకు- ఇప్పటి విధులకూ తేడా? జర్నలిస్టుగా, రచయితగా, టీచర్‌గా అప్పుడు సమాచారం ఇవ్వడం నా బాధ్యత. సమాచారాన్ని ఇప్పించడం ఇప్పటి విధి. ఇందుకు అధికారం తోడుంది. మీరు నమ్మే సిద్ధాంతం?... జ్ఞానాన్ని ఇతరులకు చెప్పాలి. అందుకు నేను ఎంచుకున్న మార్గం అక్షరం. కలం గొప్పదని నమ్ముతారా?... నేనూ నిరూపించాను. ఉదయంలో ‘తిరుమల లీలలు’ పేరుతో తిరుమలలో జరుగుతున్న అక్రమాల మీద 9 పరిశోధన వ్యాసాలు రాశాను. నేను రాసిన వాటిలో 90 శాతం రుజువు చేశాను. కలం గొప్పదే. మీ రచనలను నాన్నగారు మెచ్చుక్ను సందర్భం? నాకప్పుడు పదహారేళ్లు. ఎమర్జెన్సీ సమయంలో ‘మనకు స్వరాజ్యం వచ్చింది. కానీ, స్వాతంత్య్రం రాలేదు’- అనే ఇతివృత్తంతో ‘నాకూ స్వాతంత్య్రం వచ్చింది’ అనే వ్యంగ్యరచన చేశాను. అప్పుడు నాన్న... అమ్మతో ‘ఇంత లేడు. వీడు ఇందిర ప్రభుత్వాన్ని విమర్శిస్తాడా’ అని నిలదీశారు. చివరగా ‘అయినా వాడు చాలా బాగా రాసిండు’ అన్నారు. అది నాకు అద్భుతమైన ప్రశంస. ఇప్పుడాయన లేకపోయినా... ఆయన ముఖం, ధోతి చేతిలో పట్టుకుని అంటున్న తీరు కళ్లల్లో మెదులుతూనే ఉంటుంది. పాత్రికేయునిగా- న్యాయశాస్త్ర బోధకునిగా వృత్తిలో తేడా ఎలా అనిపించేది? రెండూ విద్యాబోధనలే. పాత్రికేయ వృత్తిలో వెనువెంట కష్టాలు, కేసులు, బెదిరింపులు... ఉంటాయి. కేసు ఫైలయ్యేటంతటి సాహసాలు చేశారా?... ఎన్నో. టీటీడీ వారి కేసు పదకొండేళ్లు నడిచింది. ఎక్కువ ఆత్మసంతృప్తినిచ్చిన రచన? ...ప్రతిదీ సంతృప్తినిచ్చేదే. అయోధ్య తీర్పు విశ్లేషణ కోసం చాలా కష్టపడ్డాను. ఇటీవల మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును విశ్లేషించాను. మరొకటి రాసే వరకు అదే. ఎన్ని గంటలు పనిచేస్తారు? ఎంతసేపు నిద్రపోతారు? ఎప్పుడూ లెక్కపెట్టుకుంటూ పనిచేయలేదు. ప్రెస్‌లో రాత్రి రెండు వరకూ పనిచేసేవాడిని. ఇప్పటికీ పన్నెండయినా రాసుకుంటూ ఉంటాను. నా నిద్ర నాలుగు గంటలే.పిల్లలు, శ్రీమతి గురించిన వివరాలు... పాప వసుప్రద లాయర్‌గా ప్రాక్టీస్ చేస్తోంది. బాబు సంపత్ రామానుజం ఉద్యోగం చేస్తున్నాడు. నా శ్రీమతి వేదకల్యాణి మా మేనమరదలే. ఆప్టోమెట్రిస్టు. మీ ప్రమేయం ఏ మాత్రం లేకుండా మీరు బాధితులైన సందర్భం ఉందా? 1978లో చాంద్రాయణ గుట్టలో అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాను. 25 మంది ఆటో ఆపి నన్ను దింపి కొట్టారు. కేవలం హిందువుననే ఏకైక కారణంతో దెబ్బలు తిన్నాను. దైవికంగా బతికి బయటపడ్డాను. కొట్టిన వారి మీద కోపం రాలేదా?... రాజకీయాల కోసమే ఆ మతకల్లోలాలు. కొట్టేవాడికి, దెబ్బలు తినేవాడికి ఏ పగలూ లేవు. ఎవరి మీద కోప్పడాలి? జీవితానికి మీరిచ్చే నిర్వచనం?... నా దృష్టిలో జీవితం అంటే నిరంతరం పని చేయడమే. అదే మనిషిని ముందుకు తీసుకెళ్తుంది. సోమరితనం ప్రధాన శత్రువు. మీ మీద వృత్తిపరంగా నాన్న ప్రభావం తెలుస్తోంది. అమ్మ నుంచి ఏం నేర్చుకున్నారు? అమ్మతో సాన్నిహిత్యం అపారం. అమ్మ రోజంతా కష్టపడేది. అమ్మ కోసం ఏదో చేయాలనిపించేది. వంటలో సాయం చేసేవాడిని. రోజంతా పనితో అలసిపోయేది. అమ్మకోసం రోజూ రాత్రి వంటగది నేనే కడిగేవాడిని. అది పెద్ద పని అని కాదు. ఆ వయసులో అమ్మకు చేయగలిగిన సాయం. అది నాకూ- అమ్మకూ ఆత్మీయమైన పని కూడా. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయవద్దని కలెక్టర్ నాన్నతో చెప్పినందుకు నాన్న బాగా కోప్పడ్డారు. అప్పుడు అమ్మ ‘వాడు రాసిన వ్యాసాన్ని ఎవరికిచ్చారు’ అన్నది. ‘నాకే ఇచ్చాడు’ అన్నారాయన. ‘మరి మీరోసారి చూసుకోవాల్సింది’ అన్నది మెల్లగా. ఆమె అమాయకంగా అన్న అద్భుతమైన మాట అది. -
కన్నతల్లి, జన్మభూమినిమరువొద్దు
వరంగల్ లీగల్, న్యూస్‌లైన్ : జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగి ఉన్నత స్థానానికి చేరినా.. జన్మనిచ్చిన తల్లి, భూమిని మరువొద్దని కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ సూచించారు. కమిషనర్‌గా నియమితులైన తర్వాత తొలిసారి శనివారం జిల్లాకు వచ్చిన ఆయన వరంగల్ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో జరిగిన స్వామి వివేకానంద 151 జయంత్యోత్సవాల్లో పాల్గొని మాట్లాడారు. స్వామి వివేకానంద చెప్పినట్లుగా.. కళ్లు మూసినా, తెరిచినా కనిపించేది భగవంతుడొక్కడేనని, ఎక్కడ విభూది ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడని తెలిపారు. సమాచార హక్కు చట్టం రావడానికి ముందు ఈ అంశంతో పాటు రాజ్యాంగం గురించి రాసిన వ్యాసాలు, ఇచ్చిన ఉపన్యాసాలతో తనకు కేంద్ర సమాచార కమిషనర్ పదవి లభించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్‌ను జిల్లా జడ్జి వెంకటరమణతో పాటు బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. సమావేశంలో ఆచార్య కసిరెడ్డి వెంకట్‌రెడ్డి, బార్ అసోసియేషన్ బాధ్యులు కె.అంబరీషరావు, రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్ ముద్దసాని సహోదర్‌రెడ్డి, కార్యదర్శి సునీల్‌తో పాటు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
కేంద్ర సమాచార కమిషనర్‌గా మాడభూషి ప్రమాణం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర సమాచార కమిషనర్‌గా ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని సీఐసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాన సమాచార కమిషనర్ దీపక్ సంధు, మాడభూషితో పాటు సమాచార కమిషనర్లుగా నియమితులైన యశోవర్ధన్ ఆజాద్, శరత్ సబర్వాల్, ముంజుల పరాశర్, ఎంఏ ఖాన్ యూసఫ్‌లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మాడభూషి మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర సమాచార కమిషన్‌లో తొలిసారి తెలుగువాడు కమిషనర్ అయిన ఘనత తనకు దక్కినందుకు సంతోషిస్తున్నానన్నారు. జర్నలిజం నేపథ్యం, న్యాయశాస్త్ర అధ్యాపకత్వం ఉన్న వ్యక్తిని ఈ పదవికి తొలిసారి ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. అనంతరం, ఎంపీ రాపోలు ఆనంద్‌భాస్కర్, కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డిలు సీఐసీ కార్యాలయంలో మాడభూషి శ్రీధర్‌ను అభినందించారు. -
కేంద్ర సమాచార కమిషనర్‌గా మాడభూషి ప్రమాణస్వీకారం
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ కేంద్ర సమాచార కమిషనర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలో ఆయనతో పాటు మరో నలుగురు కూడా కమిషనర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్‌తో ప్రధాన సమాచార కమిషనర్ దీపక్ సంధూ ప్రమాణ స్వీకారం చేయించారు. హైదరాబాద్‌లోని ప్రతిష్ఠాత్మకమైన నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేస్తున్న మాడభూషి శ్రీధర్‌కు జాతీయ స్థాయిలో పదవి లభించడం పట్ల రాష్ట్రానికి చెందిన పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.