వాడు చాలా బాగా రాసిండు | special interview to sridhar | Sakshi
Sakshi News home page

వాడు చాలా బాగా రాసిండు

Published Tue, Oct 7 2014 10:51 PM | Last Updated on Sat, Sep 2 2017 2:29 PM

వాడు చాలా బాగా రాసిండు

వాడు చాలా బాగా రాసిండు

 ... ఇది మా నాన్న ప్రశంస
 
మాడభూషి శ్రీధర్ కాలమిస్టుగా న్యాయశాస్త్ర ఆచార్యుడిగా పరిచయం. సామాజిక, రాజకీయ విశ్లేషకులుగా తెలిసిన వ్యక్తి. ఆ మధ్య కేంద్ర సమాచార కమిషనర్‌గా ఎదిగారనీ తెలుసు. అంతకంటే ముందు ఆయన పాత్రికేయుడు. పాత్రికేయుల కోసం పాఠాలు రాసిన మేధావి. ఎంత ఎదిగినా కౌమార దశలో తండ్రి నుంచి అందుకున్న ప్రశంసా వాక్యమే మకుటంగా భావిస్తారాయన.
 
మీ బాల్యం, చదువు ఎక్కడ?


అంతా వరంగల్‌లోనే. నాన్న ఎం.ఎస్ ఆచార్య, స్వాతంత్య్ర సమరయోధులు, జనధర్మ వారపత్రిక, వరంగల్ వాణి దినపత్రికల వ్యవస్థాపకుడు, సంపాదకుడు. అమ్మ రంగనాయకమ్మ గృహిణి. చదువు అంటారా... ఇంటికి దగ్గరగా ఉన్న చెట్టుకింద బడిలో, వరంగల్ లా కాలేజ్, ఉస్మానియా యూనివర్శిటీలలో సాగింది.

న్యాయశాస్త్రంలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసి మళ్లీ జర్నలిజంలో పి.జి ఎందుకు చేయాలనిపించింది?

మీ ప్రశ్న చిన్నదే. దానికి సమాధానం చెప్పాలంటే నా జీవిత పుస్తకాన్ని తెరవడమే. పెండేకంటి లా కాలేజ్‌లో లా క్లాసులు తీసుకుంటూ రచన జర్నలిజం కాలేజ్‌లో బీసీజే, ఎంసీజే చేశాను.

న్యాయశాస్త్రం, జర్నలిజం, సమాచార చట్టం...  మొత్తం ఎన్ని పుస్తకాలు, వ్యాసాలు రాసి ఉంటారు?

పుస్తకాలు 30కి పైగా. వ్యాసాలు వేలల్లో ఉంటాయి.
న్యాయశాస్త్రాన్ని విశ్లేషిస్తూ వ్యాసాలు రాసిన తొలి తెలుగు వ్యక్తి మీరేనేమో!
పెద్దలున్నారు. విస్తృతంగా రాసింది నేనే కావచ్చు.

సమాచార హక్కు చట్టం సామాన్యుడికి ఎంత వరకు అందుబాటులోకి వచ్చిందంటారు?

సామాన్యుడికి సమాచారం కోసం నిలదీసి అడిగే హక్కునిచ్చింది. అధికార వర్గాల్లో సమాచారాన్ని ఇచ్చి తీరాల్సిందే, ఇద్దాం అనే పరిస్థితులు వస్తున్నాయి. ఈ చట్టం సామాన్యుడిని సాధికారిక శక్తిగా మారుస్తుంది.

సెంట్రల్ ఇన్‌ఫర్మేషన్ కమిషనర్‌గా ప్రమాణస్వీకారం చేస్తున్నప్పుడు ఏమనిపించింది?

అది యాదృచ్ఛికమైన అద్భుత సంఘటన. సిఫార్సు లేకుండా దరఖాస్తు ఆధారంగా ఎంపిక కావడం అంటే ఈ వ్యవస్థ నాకు ఇచ్చిన గౌరవం అనిపించింది. కష్టపడితే ఫలితం ఉన్నతంగా ఉంటుందనిపించింది.

అప్పటి విధులకు- ఇప్పటి విధులకూ తేడా?

జర్నలిస్టుగా, రచయితగా, టీచర్‌గా అప్పుడు సమాచారం ఇవ్వడం నా బాధ్యత. సమాచారాన్ని ఇప్పించడం ఇప్పటి విధి. ఇందుకు అధికారం తోడుంది.

మీరు నమ్మే సిద్ధాంతం?...

జ్ఞానాన్ని ఇతరులకు చెప్పాలి. అందుకు నేను ఎంచుకున్న మార్గం అక్షరం.

కలం గొప్పదని నమ్ముతారా?...

నేనూ నిరూపించాను. ఉదయంలో ‘తిరుమల లీలలు’ పేరుతో తిరుమలలో జరుగుతున్న అక్రమాల మీద 9 పరిశోధన వ్యాసాలు రాశాను.  నేను రాసిన వాటిలో 90 శాతం రుజువు చేశాను. కలం గొప్పదే.

మీ రచనలను నాన్నగారు మెచ్చుక్ను సందర్భం?

నాకప్పుడు పదహారేళ్లు. ఎమర్జెన్సీ సమయంలో ‘మనకు స్వరాజ్యం వచ్చింది. కానీ, స్వాతంత్య్రం రాలేదు’- అనే ఇతివృత్తంతో  ‘నాకూ స్వాతంత్య్రం వచ్చింది’ అనే వ్యంగ్యరచన చేశాను. అప్పుడు నాన్న... అమ్మతో ‘ఇంత లేడు. వీడు ఇందిర ప్రభుత్వాన్ని విమర్శిస్తాడా’ అని నిలదీశారు. చివరగా ‘అయినా వాడు చాలా బాగా రాసిండు’ అన్నారు. అది నాకు అద్భుతమైన ప్రశంస. ఇప్పుడాయన లేకపోయినా... ఆయన ముఖం, ధోతి చేతిలో పట్టుకుని అంటున్న తీరు కళ్లల్లో మెదులుతూనే ఉంటుంది.

పాత్రికేయునిగా- న్యాయశాస్త్ర బోధకునిగా వృత్తిలో తేడా ఎలా అనిపించేది?

రెండూ విద్యాబోధనలే. పాత్రికేయ వృత్తిలో వెనువెంట కష్టాలు, కేసులు, బెదిరింపులు... ఉంటాయి.
 
కేసు ఫైలయ్యేటంతటి సాహసాలు చేశారా?...

ఎన్నో. టీటీడీ వారి కేసు పదకొండేళ్లు నడిచింది.
ఎక్కువ ఆత్మసంతృప్తినిచ్చిన రచన? ...ప్రతిదీ సంతృప్తినిచ్చేదే. అయోధ్య తీర్పు విశ్లేషణ కోసం చాలా కష్టపడ్డాను. ఇటీవల మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును విశ్లేషించాను. మరొకటి రాసే వరకు అదే.

ఎన్ని గంటలు పనిచేస్తారు? ఎంతసేపు నిద్రపోతారు?

ఎప్పుడూ లెక్కపెట్టుకుంటూ పనిచేయలేదు. ప్రెస్‌లో రాత్రి రెండు వరకూ పనిచేసేవాడిని. ఇప్పటికీ పన్నెండయినా రాసుకుంటూ ఉంటాను. నా నిద్ర నాలుగు గంటలే.పిల్లలు, శ్రీమతి గురించిన వివరాలు... పాప వసుప్రద లాయర్‌గా ప్రాక్టీస్ చేస్తోంది. బాబు సంపత్ రామానుజం ఉద్యోగం చేస్తున్నాడు. నా శ్రీమతి  వేదకల్యాణి మా మేనమరదలే. ఆప్టోమెట్రిస్టు.

మీ ప్రమేయం ఏ మాత్రం లేకుండా మీరు బాధితులైన సందర్భం ఉందా?

1978లో చాంద్రాయణ గుట్టలో అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాను. 25 మంది ఆటో ఆపి నన్ను దింపి  కొట్టారు. కేవలం హిందువుననే ఏకైక కారణంతో దెబ్బలు తిన్నాను. దైవికంగా బతికి బయటపడ్డాను.
 
కొట్టిన వారి మీద కోపం రాలేదా?...

రాజకీయాల కోసమే ఆ మతకల్లోలాలు. కొట్టేవాడికి, దెబ్బలు తినేవాడికి ఏ పగలూ లేవు. ఎవరి మీద కోప్పడాలి?

జీవితానికి మీరిచ్చే నిర్వచనం?...

నా దృష్టిలో జీవితం అంటే నిరంతరం పని చేయడమే. అదే మనిషిని ముందుకు తీసుకెళ్తుంది. సోమరితనం ప్రధాన శత్రువు.
 
మీ మీద వృత్తిపరంగా నాన్న ప్రభావం తెలుస్తోంది. అమ్మ నుంచి ఏం నేర్చుకున్నారు?

అమ్మతో సాన్నిహిత్యం అపారం. అమ్మ రోజంతా కష్టపడేది. అమ్మ కోసం ఏదో చేయాలనిపించేది. వంటలో సాయం చేసేవాడిని. రోజంతా పనితో అలసిపోయేది. అమ్మకోసం రోజూ రాత్రి వంటగది నేనే కడిగేవాడిని. అది పెద్ద పని అని కాదు. ఆ వయసులో అమ్మకు చేయగలిగిన సాయం. అది నాకూ- అమ్మకూ ఆత్మీయమైన పని కూడా.
 
 ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయవద్దని కలెక్టర్ నాన్నతో చెప్పినందుకు నాన్న బాగా కోప్పడ్డారు. అప్పుడు అమ్మ ‘వాడు రాసిన వ్యాసాన్ని ఎవరికిచ్చారు’ అన్నది. ‘నాకే ఇచ్చాడు’ అన్నారాయన. ‘మరి మీరోసారి చూసుకోవాల్సింది’ అన్నది మెల్లగా. ఆమె అమాయకంగా అన్న అద్భుతమైన మాట అది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement