విమానానికి కొత్త రెక్కలు!
విమానాలను చూసి అబ్బురపడని పిల్లలుంటారా? చిన్నప్పుడు అతనూ అంతే. నింగిలోకి ఎగిరే లోహ విహంగాలతో పాటే ఊహాలోకాల్లో
విహరించేవాడు... అందుకే.. వందేళ్లుగా పెద్దగా ఏ మార్పులకూ నోచుకోని విమాన రెక్కలకు సరికొత్త్త రూపునిచ్చాడు! ఆకారం మార్చే విద్యతో విమానయానానికి కొత్త రెక్కలు మొలిపించాడు! విమానాల చరిత్రనే మలుపుతిప్పనున్న ఆ రెక్కల సష్టికర్త మన తెలుగువాడు శ్రీధర్ కోట కావడం విశేషం.
ఆధునిక విమానం తొలిసారి గాలిలోకి ఎగిరి వందేళ్లు దాటింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా సైజు మొదలుకొని ఆకారం వరకూ అనేక రకాలుగా మారిపోయింది. కానీ.. పెద్దగా మారనిది రెక్కలు మాత్రమే. విమానం రెక్కలు దాదాపు వందేళ్లుగా ఇలాగే ఉన్నాయి. కాస్త పెద్దగా లేదా చిన్నగా. అంతే తప్ప నిర్మాణమంతా ఒకే తీరు. ఇంతకూ విమానాలకు రెక్కలెందుకు? పక్షి మాదిరిగా గాలిలో బాగా ఎగిరేందుకు. గగనతలంలో వాతావరణం, గాలి ద్వారా ప్రయాణిస్తూ స్థిరంగా ముందుకు సాగడానికి, గాలి నిరోధాన్ని తట్టుకోవడానికీ అవసరం. అయితే సాంకేతికతలో మార్పు వస్తున్నకొద్దీ విమానాల్లోనూ మార్పులు వచ్చాయి. అలాగే, విమానాల రెక్కల విషయంలోనూ మార్పులు చేసేందుకు అనేక మంది ప్రయత్నించారు. ఫలితం లేకపోయింది. కానీ.. ఎట్టకేలకు ఇన్నేళ్ల తర్వాత శ్రీధర్ కోట దీనిని సాధ్యం చేశారు. రెండు దశాబ్దాల సుదీర్ఘ పరిశోధనల అనంతరం ఆకారం మార్చుకోగలిగే రెక్కల అంచులు(వింగ్ ఫ్లాప్స్)ను సృష్టించగలిగారు. మడతపెట్టేందుకు వీలయ్యే ఈ అంచులను ‘ఫ్లెక్స్‌ఫాయిల్స్’గా పిలుస్తున్నారు. ఈ అంచుల సృష్టితో విమానయానంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు.
ఫ్లెక్స్‌ఫాయిల్స్ అవసరమేంటి?
విమానాల రెక్కలకు కొత్త అంచుల అవసరమేంటో తెలుసుకోవాలంటే ముందుగా ఇప్పుడున్న అంచులతో సమస్యలేంటో తెలుసుకోవాలి. ప్రస్తుతం విమానాల రెక్కలకు సుమారు 19 అడుగుల పొడవుండే అంచులు(ఫ్లాప్స్)ను వాడుతున్నారు. వివిధ విడిభాగాలతో తయారు చేస్తున్న వీటిని రెక్కకు బిగించే చోట, ఇతర చోట్ల ఖాళీలు మిగిలిపోతున్నాయి. గాలినిరోధాన్ని తగ్గించేందుకోసం వీటిని అవసరమైన విధంగా మార్చుకునే అవకాశమూ లేదు. దీనివల్ల విమానం పైకి ఎగిరేటప్పుడు, కిందికి దిగేటప్పుడు శబ్దం మోత మోగిపోతోంది. గాలి నిరోధం కారణంగా ఇంధన ఖర్చులూ పెరిగిపోతున్నాయి. అందువల్ల ఈ సమస్యలను నివారించేందుకే ఫ్లెక్స్‌ఫాయిల్స్ అవసరం ఏర్పడింది.
ఎలా పనిచేస్తాయి?
మడత పెట్టేందుకు వీలయ్యే రెక్క అంచులే ఫ్లెక్స్‌ఫాయిల్స్. అల్యూమినియానికి బదులుగా మదువైన, దృఢ పదార్థంతో తయారు చేసే ఈ అంచుల్లో ఎక్కడా అతుకులు, ఖాళీలు ఉండవు. వీటిని రెక్కలకు బిగించే చోట సైతం ఖాళీ ఉండదు. అదేసమయంలో ఇది అవసరమైనప్పుడు సాగుతుంది. చాలా తేలికగా కూడా ఉంటుంది.
ఇన్ని ప్రత్యేకతలతో పాటు పనితీరు కూడా సమర్థంగా ఉంటుంది. అవసరమైనప్పుడు సులభంగా ఆకారం మార్చుకుంటాయి. అల్యూమినియం అంచుల వాడకం వల్ల రెక్కలో.. అంచులు, రెక్కకు మధ్య ఖాళీలు ఏర్పడతాయి. విమానం రెక్కల అంచులను అవసరమైన విధంగా మడిచేందుకు లేదా తిప్పేందుకూ వీలవుతుంది. గాలి నిరోధాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. ఖాళీలు లేకుండానే రెక్కలకు ఎలా కావలిస్తే అలా ఇవి అతుక్కుని ఉంటాయి.
ప్రయోజనాలేంటి?
ఫ్లెక్స్‌ఫాయిల్స్‌వల్ల విమాన ఇంధన ఖర్చు 12 శాతం వరకూ తగ్గుతుంది. విమానాల టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో శబ్దం సుమారుగా 40 శాతం వరకూ తగ్గిపోతుంది. వీటి బరువు కూడా తక్కువే కాబట్టి విమానానికి ఆ మేరకు బరువు కూడా తక్కువే. వీటివల్ల గాలినిరోధం తగ్గడం వల్ల విమానం తక్కువ ఇంధనంతోనే ఎక్కువ దూరం ప్రయాణించగలుగుతుంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగంలో పెద్ద ఎత్తున ఖర్చు ఆదా అవుతుంది. అటు పర్యావరణానికీ కీడు తగ్గుతుంది. విమానయానంలోనే కాక ఇతర రంగాల్లోనూ వీటిని ఉపయోగించే అవకాశాలూ ఉన్నాయి.
20 ఏళ్ల సుదీర్ఘ కృషి
సికింద్రాబాద్‌కు చెందిన రిటైర్డ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఉద్యోగి కేవీ సుబ్రమణ్యం కుమారుడైన శ్రీధర్ 1980లో ఉస్మానియా యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసి గోల్డ్ మెడల్ సాధించారు. తర్వాత 1984లో ఎంఎస్ కోసం అమెరికా వెళ్లారు. అక్కడ వివిధ వర్సిటీల్లో ఎంఎస్ పూర్తిచేసిన శ్రీధర్ విమానయానంపై ప్రత్యేక ఆసక్తితో పరిశోధనలు చేపట్టారు. ఈ ఫ్లెక్స్‌ఫాయిల్స్ గురించి తొలిసారిగా ఇరవై ఏళ్ల క్రితం ప్రతిపాదించారు. తన ప్రతిపాదనను నాసా, అమెరికా వాయుసేనలకు వివరించి ప్రాజెక్టు చేపట్టేందుకు ఒప్పించారు. దీంతో వాయుసేన, నాసాలు శ్రీధర్‌కు పరిశోధనల నిమిత్తం రూ. 250 కోట్ల నిధులు అందజేశాయి. శ్రీధర్‌కు అప్పగించిన ప్రాజెక్టుకు ‘అడాప్టివ్ కంప్లెయింట్ ట్రెయిలింగ్ ఎడ్జ్(ఏసీటీఈ)’ పేరుతో ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేశాయి. 2001లో ‘ఫ్లెక్స్‌సిస్.ఇంక్’ను స్థాపించిన శ్రీధర్ ఎట్టకేలకు ఫ్లెక్స్‌ఫాయిల్స్‌ను ఆవిష్కరించారు.
19 అడుగుల పొడవైన సంప్రదాయ అల్యూమినియం రెక్కల అంచులకు ప్రత్యామ్నాయంగా శ్రీధర్ రూపొందించిన ఈ కొత్త రెక్కల అంచులను గల్ఫ్‌స్ట్రీమ్-3 బిజినెస్ జెట్ విమానానికి అమర్చి ఇటీవల నాసా, వాయుసేనలు విజయవంతంగా పరీక్షించాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా అనేక విమాన తయారీ కంపెనీలు సైతం శ్రీధర్ ఆవిష్కరణపై ఆసక్తి చూపుతున్నాయి. కాగా, ప్రస్తుతం మిచిగన్‌లో స్థిరపడిన 55 ఏళ్ల శ్రీధర్ యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్‌లో మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్‌గా కూడా పనిచేస్తున్నారు. ఇప్పటిదాకా ఈయన మొత్తం 25 పేటెంట్లు పొందారు.