వాయిదాలకు న్యాయం బలి!
వందలాది కేసుల్లో న్యాయ నియమాలు, ప్రక్రియ చట్టాలు, పెద్దల ప్రబోధాలతోపాటు, సహ చట్టం కూడా నిర్దేశిస్తున్నా, తగిన కారణాలు తెలపకుండా విచారణను వాయిదా వేయడం అన్యాయం, అసమంజసం.
తనమీద దాడిచేసిన వారి పైన పెట్టిన క్రిమినల్ కేసు విచారణ ఆలస్యం ఎందుకవు తున్నదని మహావీర్ అనే వ్యక్తి ఢిల్లీ కోర్టును ఆర్టీఐ కింద అడిగారు. అక్టోబర్ 2012లో చార్జిషీటు, కోర్టు వ్యవహారాల వివరాలు అడిగాడు. నింది తులు ఎన్నిసార్లు హాజరుకా లేదు? ఎన్ని వాయిదాలు ఇచ్చారు? ఆరోపణలు నిర్ధారించడానికి చట్ట ప్రకారం ఉన్న కాలపరిమితి ఏమిటి? మూడేళ్లనుంచి ఈ నేర విచారణ ఎందుకు ముందుకు సాగడం లేదు? అని నిలదీశాడు. కొన్ని వివరాలు ఇస్తూ కోర్టు ఫైలును తనిఖీ చేసుకోవచ్చునని పీఐవో లేఖ రాశాడు.
తనిఖీ కాదనీ, ప్రతి అంశానికి వివరాలు చెప్పాల్సిందే అంటూ మొదటి అప్పీలు వేశారు. వాయిదా తేదీల వివరాలు ఇచ్చేశారని ఫిర్యాదు దారుడి హోదాలో కూడా మహావీర్ కేసు ఫైలును పూర్తిగా పరిశీలించే హక్కు ఉందని న్యాయాధికారి (అప్పీలు అధికారి) మార్చి 2016 స్పష్టం చేశారు. న్యాయ నిర్ణయ వివరాలు సహ చట్టం కింద అడగడానికి వీల్లేదని ఢిల్లీ జిల్లాకోర్టుల సహ చట్ట నియమాలను 2008లో 7(4) నిర్దేశించిందని ఆయన గుర్తుచేశారు.
ఆరోపణల నిర్ధారణకు ఎంత కాలపరి మితి?, కేసును చాలా దూరం వాయిదా ఎందుకు వేశారనే ప్రశ్నలకు రికార్డు లేదని జవాబిచ్చారు. కారణాలను విశ్లేషించి వ్యాఖ్యానించే బాధ్యత పీఐవో పైన లేదని రూల్ 7(9) వివరిస్తున్నదని న్యాయమూర్తి తెలిపారు. కేసును చాలాకాలం వరకు వాయిదా వేయ డానికి కారణాలు ఆ ఆదేశంలో ఉంటే చదువుకోవచ్చని, లేకపోతే ఆర్టీఐ కింద అడగడానికి వీల్లేదని వివరించారు.
తగాదాలతో కోర్టుకు వెళ్లిన న్యాయార్థులందరికీ ఎదురయ్యే సమస్య సుదీర్ఘ వాయిదాలే. దిక్కుమాలిన వాయిదాలకు కారణాలు ఏమిటని పెండింగ్ దెబ్బ తిన్న లక్షల మంది కక్షిదారులు అడుగుతూనే ఉంటారు. న్యాయసూత్రాల ప్రకారం ప్రతి ఆదేశానికి కారణాలు వివరించాల్సిందే. సుదీర్ఘంగా వాయిదా వేయడం కూడా న్యాయపరమైన నిర్ణయమే కనుక కారణాలు ఇవ్వవలసిందే. కారణాలు ఉండవు, చెప్పరు, ఆర్టీఐ కింద ఇవ్వడానికి వీల్లేదంటారు.
ఇదేం న్యాయం? అని అభ్యర్థి ఆవేదన. ఆ కారణాలు ఫైల్‌లో లేవు కనుక ఇవ్వ జాలను అనడం చట్టబద్ధమైన లాంఛనం. కారణాలు ఇవ్వకుండా వాయిదా వేయకూడదని తెలిసి కూడా న్యాయాధికారులు అదేపని పదేపదే చేస్తుంటే ఎవరు అడగాలి? దానికి జవాబుదారీ ఎవరు? ఇది న్యాయ పాలనకు సంబంధించిన ప్రశ్నకాదా?
కోర్టు పనివేళలను పూర్తిగా వినియోగించాలని, జడ్జి నిక్కచ్చిగా సమయానికి విచారణలు మొదలు పెట్టాలని, లాయర్లు కూడా అయిందానికి కానిదానికి వాయిదాలు అడగరాదని లా కమిషన్ 230వ నివేదికలో సూచించారు. చట్టనియమాలను కచ్చితంగా పాటించకుండా వాయిదాలు ఇవ్వరాదన్నారు.
తగిన కారణం చూపడంతోపాటు ఎట్టిపరిస్థితిలోనూ మూడు సార్లకన్న ఎక్కువ వాయిదాలు ఇవ్వరాదని, వాయిదా వల్ల కలిగే నష్టాలను భర్తీ చేయాలని ఆదేశించాలని సీపీసీ నియమాలు నిర్దేశిస్తున్నారు. కారణాలను వాయిదా ఆదేశంలో తప్పనిసరిగా వివరించాలని కూడా నిర్దేశించారు. వృథా వాయిదాలు, అనవసర అప్పీళ్లతో న్యాయవ్యవస్థ నిర్వీర్యమైపోతున్నదని, లాయర్లలో నైతిక విలువల పతనం అంశాన్ని బార్ కౌన్సిల్ పట్టించుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా వినే దిక్కులేదు. లాయర్లు అడిగిందే తడవుగా వాయిదా ఇవ్వడానికి జడ్జిలు సిద్ధంగా ఉండడం అన్యాయమని ప్రధాన న్యాయమూర్తి ఆర్‌ఎం లోధా విమర్శించారు.
కక్షిదారులు, వారి లాయర్లు కూడా వారుుదాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. విచక్షణా రహితమైన వాయిదాలే న్యాయ వితరణలో విపరీత ఆలస్యాలకు కారణమని అందరికీ తెలుసు. తమ నిర్ణయాలవల్ల, విధానాల వల్ల దెబ్బతినే వారికి ఆ నిర్ణయాలకు దారితీసిన అన్ని వివరాలు ఇవ్వాలని సమాచార హక్కు చట్టం సెక్షన్ 4(1)(సీ) శాసిస్తున్నది. 4(1)(డి) ప్రకారం తమ పాలనాపర మైన, అర్ధన్యాయపరమైన నిర్ణయాలకు కారణాలను బాధితులకు తెలియజేయాలని శాసిస్తున్నది. ఇవి తమంత తాము ప్రజాసంస్థలు తెలియజేయాల్సిన సమాచారాలు. వాటిని ప్రత్యేకంగా ఎవరూ అడగనవ సరం లేదు.
వారు వెల్లడించనప్పుడు అడిగే హక్కు పౌరులకు ఉందని, ఈ రెండు నియమాల కింద కూడా ప్రతిపౌరుడికి కేసులను తరచుగా వాయిదా వేయడానికి కారణాలను తెలుసుకునే హక్కును వాడుకోవచ్చని సీఐసీ వివరించింది. న్యాయ నియమాలు, ప్రక్రియ చట్టాలు, లా కమిషన్ నివేదికలు, వందలాది కేసుల్లో ఉన్నత న్యాయస్థానాల ప్రవచనాలు, పెద్దల ప్రబోధాలతోపాటు, సహ చట్టం కూడా నిర్దేశిస్తున్నా కారణాలు తెలపకుండా వాయిదా వేయడం అన్యాయం, అసమంజసం.
ఈ పరిస్థితిని తొలగించడానికి న్యాయస్థానాలు తగిన విధానాలు రూపొందించుకోవాలని సీఐసీ సూచించింది. ఈ కేసులో మొత్తం ఫైలును మహావీర్‌కు చూపాలని ఆదేశించింది. (ఇఐఇ/అ/అ/2016/0011 76 మహావీర్ వర్సెస్ పాటియాలా హౌస్ కోర్టు కేసులో 24.6.2016న ఇచ్చిన తీర్పు ఆధారంగా)
మాడభూషి శ్రీధర్
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్
ఈమెయిల్: professorsridhar@gmail.com