విశ్లేషణ
నేరారోపణపై దర్యాప్తు చేయడం నేర న్యాయవ్యవస్థలో కనీస ధర్మం. కానీ, దర్యాప్తు ప్రాథమిక దశలోనే పరిమితులు విధించడం చాలా అన్యాయం. అవినీతి ఆరోపణలు వచ్చిన అధికారిపైన దర్యాప్తు చేయడం కనీస అవసరం.
పౌరుడు నేరం చేస్తే ఫిర్యాదు నమోదుచేసి దర్యాప్తు, నేరారోపణ పత్రం దాఖలు, నేరవిచారణ జరగాలనేది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చెప్పే విధానం. అదే ప్రభుత్వ ఉద్యోగి, అవి నీతికి పాల్పడితే పై అధికారి ముందస్తు మంజూరీ ఇస్తేనే దర్యాప్తు (ఇన్వెస్టిగేషన్) జరుగుతుంది. అనుమతి ఉంటేనే నేరవిచారణ (ప్రాసిక్యూషన్) జరుగుతుంది. నిజాయితీ పరులైన అధికారులను వేధించే ఆరోపణలు నిరోధించేందుకు ఈ మంజూరీ నిబంధన చేశారు. చట్టం వచ్చింది కానీ అమలు కావడం లేదు. అయితే కొందరి మిత్రులను శిక్షించి మరికొందరిని శిక్షించాలని మంజూరీ అధికారం వాడినపుడు నింద పొందిన సహ ఉద్యోగులు ఒకరి సమాచారం మరొకరు అడగడం, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు అడగడం, ఇతర నేరారోపిత ఉద్యోగులు, లేదా ఇతర పౌరులు కూడా సమాచారం అడిగేందుకు సమాచార హక్కు వీలు కల్పిం చింది. ఈ సమాచారం మూడో వ్యక్తి సమాచారమనీ, ఉద్యోగి వ్యక్తిగత సమాచారమనీ ఇవ్వకుండా తిరస్కరిం చడం చట్టబద్ధం అవుతుందా?
ఇద్దరు ప్రభుత్వోద్యోగుల పదవీ విరమణ తేదీ వారి ప్రాసిక్యూషన్ కోసం మంజూరీ ఇచ్చిన వివరాలు కావాలని సుర్జిత్ అనే వ్యక్తి సమాచార హక్కు కింద కోరారు. సమాచార అధికారి దాన్ని పాలనా నిఘా వ్యవహారాలు చూసే మరొక సమాచార అధికారికి బదిలీ చేశారు. కొన్ని అంశాలమీద సమాచారం లేదన్నారు. మూడో వ్యక్తి వివరాలు కొన్ని అడుగుతున్నారనీ, వారి అనుమతి లేనిదే ఇవ్వలేమన్నారు. మొత్తానికి అంతా కలసి సమాచారం ఇవ్వలేదు.
తమ ప్రభుత్వ సంస్థలోనే మరొక సీపీఐఓకు బదిలీ చేస్తే బాధ్యత తీరిపోదు. తమసంస్థకు సంబంధించిన సమాచారమే అడిగినప్పుడు ఆయన మరొక సీపీఐఓ పరిధిలో ఉన్న సమాచారం కూడా ఇవ్వవలసిన బాధ్యత చట్టం కింద వహించవలసి ఉంటుంది. ఇది మూడో వ్యక్తి సమాచారం అనడం కూడా సమంజసం కాదు. ఎందుకంటే అది అదే సంస్థలో పనిచేసే ఉద్యోగి చేసే అధికారిక పనికి సంబంధించిన అంశం కనుక అని వాదించారు. అయినా సెక్షన్ 11(1) కింద దీన్ని మూడోవ్యక్తి సమాచారం అనుకున్నప్పటికీ, ఆ సమాచారం ఈ సంస్థకు ఇచ్చినపుడు రహస్యం అని వర్గీకరించి ఉంటే, ఆ సమాచారం ఇవ్వాలనుకుని ఉంటే, సీపీఐఓ నీ అభిప్రాయమేమిటి అని నోటీసు ఇవ్వాలని, ఆ తరువాత అతను అభ్యంతరపెడితే దాన్ని పరిశీలించి, ఇవ్వాలని నిర్ణయించాను, ఏమంటావు అనీ రెండో నోటీసు ఇవ్వాలని, అందుకు ఆయన ఇంకేవయినా సమంజసమైన కారణాలు రాసి పంపిస్తే చూసి పరి శీలించి ప్రజాశ్రేయస్సు దృష్ట్యా ఇవ్వాలని తీర్మానిస్తే, ఆ విధంగా నిర్ణయించినట్టు మూడో లేఖ రాయాలని చట్టం వివరిస్తున్నది.
జనహిత సమాచారమే అడిగారా లేదా తెలుసుకోవడానికి కమిషన్ ఈ కేసులో సంబంధిత ఫైళ్లను కమిషన్ ముందుంచాలని ఆదేశించింది. ఫైళ్లను అధికారులు కమిషన్ కు చూపించారు. ఆ దస్తావేజులలో సుర్జిత్ అడిగిన సమాచారానికి సంబంధించిన పత్రాలేవీ మినహాయింపుల కిందికి రావు. ఇద్దరు అధికారుల పదవీవిరమణ తేదీల సమాచారం మూడోపక్ష సమాచారం అన డం సమంజసం కాదు. వారు తమ పదవీ విరమణ తేదీ రహస్య సమాచారం అని ముందే నిర్ధారించలేదు. సీపీఐఓ తనకు ఆ సమాచారం ఇచ్చే ఉద్దేశం ఉందని తెలియజేయలేదు. కనుక మూడో వ్యక్తిని సంప్రదించే అవసరమే లేదు. వారి అభ్యంతరానికి వీటో శక్తి కూడా లేదు. ఒక వేళ అభ్యంతరం తెలిపినా ఆ విషయాన్ని కూడా పరిశీలించి అడిగిన సమాచారం వెల్లడించడం జనహితానికి అనుకూలమా లేక ప్రతికూలమా అని ఆలోచించి ఒక నిర్ణయాన్ని సీపీఐఓ స్వతంత్రంగా తీసుకోవాలి. ఆ పనిచేసినట్టు రికార్డు కనిపించడం లేదు. కనుక అడిగిన సమాచారం నిరాకరించడానికీ వీల్లేనిదే అవుతుంది.
అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 19, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 197 ప్రకారం తగిన అధికారి మంజూరీ ఇచ్చేంత వరకు న్యాయస్థానం ఏ నేర ఫిర్యాదును గుర్తిం చడానికి వీల్లేదు. సుబ్రమణ్యంస్వామి వర్సెస్ భారత ప్రభుత్వం (2014) 8 ఎస్ సి సి 682 కేసులో ఢిల్లీ స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్ మెంట్ చట్టం సెక్షన్ 6ఎ కింద మంజూరీ ఇస్తే తప్ప అత్యున్నత ప్రభుత్వోద్యోగి నేరాలపై దర్యాప్తు చేయడానికి వీల్లేదనే నిబంధన రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. వచ్చిన నేరారోపణ మీద దర్యాప్తు చేయడం నేర న్యాయవ్యవస్థలో కనీస ధర్మం. అసలు దర్యాప్తు అనే ప్రాథమిక దశలోనే పరిమితులు విధించడం చాలా అన్యాయం. అదీ లంచగొండితనం, అవినీతి, భ్రష్టాచారం, నేరపూరిత దుర్వ్య వహారం అనే ఆరోపణలకు వచ్చిన అధికారిపైన దర్యాప్తు చేయడం కనీస అవసరం కూడా.
ముందస్తు మంజూరీ లేకుండా దర్యాప్తు నేర విచారణ జరగకూడదనే నియమాలకు వ్యతిరేకంగా అనేక తీర్పులు వచ్చాయి. అయినా మంజూరీ నియమం బతికే ఉంది. కొందరు ప్రభుత్వోద్యోగులపై ఆరోపణలను దర్యాప్తు చేయడానికి తరువాత ప్రాసిక్యూట్ చేయడానికి ఎందుకు అనుమతించారు, మరికొందరిని ఎందుకు అనుమతించడం లేదో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది. సమాచార హక్కు ఈ హక్కును ధృవీకరించింది. కేంద్ర నిఘా కమిషన్ తన వెబ్‌సైట్‌లో ముందస్తు మంజూరీతో నేరవిచారణ జరుగుతున్న అధికారుల జాబితా ప్రచురిస్తున్నది. ఇది మూడో వ్యక్తి సమాచారం అయ్యే ప్రసక్తే లేదు. సమాచారం పదిరోజుల్లో ఇవ్వాల్సిందే అని కమిషన్ ఆదేశించింది (సుర్జిత్ పాణిగ్రాహి వర్సెస్ శాస్త్ర విజ్ఞాన శాఖ ఇఐఇ/ M ఖీఇఏ/అ/2017/15 6475 కేసులో సిఐసి 17 జనవరి 2018 నాటి తీర్పు ఆధారంగా).
- మాడభూషి శ్రీధర్
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్
professorsridhar@gmail.com
Comments
Please login to add a commentAdd a comment