Criminal justice system
-
క్రిమినల్ కేసులకూ ఎన్ స్టెప్
సాక్షి, హైదరాబాద్: సత్వర న్యాయం పొందటం ప్రజల ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ అన్నారు. ముఖ్యంగా క్రిమినల్ కేసుల్లో విచారణ ప్రక్రియ వేగవంతంగా జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కేసుల విచారణలో విపరీతంగా జాప్యం జరుగుతోందని.. ‘న్యాయం ఆలస్యమైతే న్యాయాన్ని నిరాకరించినట్టే’అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని సూచించారు. శనివారం జ్యుడీషియల్ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రంలోని జిల్లా న్యాయవ్యవస్థలో క్రిమినల్ కేసులకు నేషనల్ సర్విస్ అండ్ ట్రాకింగ్ ఆఫ్ ఎల్రక్టానిక్ ప్రాసెస్ (ఎన్ స్టెప్) ప్రక్రియను జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేసేందుకు ఎన్ స్టెప్ వెబ్ అప్లికేషన్ దోహదం చేస్తుందని తెలిపారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే మాట్లాడుతూ.. ఎన్ స్టెప్ అప్లికేషన్‌ను క్రిమినల్ కేసులకూ వర్తింపజేయడం అభినందనీయమని అన్నారు. క్రిమినల్ కేసులకు ఎన్ స్టెప్ అప్లికేషన్‌ను వినియోగించటంలో తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో ఉందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్ తెలిపారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.శామ్ కోషితోపాటు ఇతర న్యాయమూర్తులు, డీజీపీ జితేందర్, బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎ.రవీందర్‌రెడ్డి, అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి, అడిషనల్ ఏజీ తేరా రజనీకాంత్‌రెడ్డి, రిజి్రస్టార్లు, జిల్లా జడ్జీలు పాల్గొన్నారు. ఏమిటీ ఎన్ స్టెప్? నేషనల్ సర్విస్ అండ్ ట్రాకింగ్ ఆఫ్ ఎల్రక్టానిక్ ప్రాసెస్. దీనిని సంక్షిప్తంగా ఎన్ స్టెప్ అని పిలుస్తున్నారు. ఇది మొబైల్ యాప్‌తో కూడిన కేంద్రీకృత ప్రాసెస్ సర్విస్ ట్రాకింగ్ అప్లికేషన్. బెయిలిఫ్లకు, ప్రాసెస్ సర్వర్లకు దీని ద్వారా నోటీసులు, సమన్లను వేగంగా అందజేయవచ్చు. ఎన్ స్టెప్ ద్వారా ఎల్రక్టానిక్ రూపంలో నోటీసులు, సమన్లు జారీ చేస్తారు. మారుమూల ప్రాంతాలకు కూడా ఇవి వేగంగా చేరిపోతాయి. దీంతో కేసుల విచారణలో అనవసర జాప్యాన్ని నివారించవచ్చు. దీనిని ఇప్పటివరకు సివిల్ కేసుల్లోనే వినియోగిస్తూ వచ్చారు. తొలిసారి క్రిమినల్ కేసులకూ వర్తింపజేయనున్నారు. -
అమల్లోకి కొత్త నేర చట్టాలు.. ఈ సంగతులు తెలుసా?
న్యూఢిల్లీ: బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు తెరపడింది. భారత న్యాయ వ్యవస్థలో మూడు కొత్త నేర చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం నేటినుంచి అమల్లోకి వచ్చాయి. భారత శిక్షా స్మృతి (ఐపీసీ), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్(సీఆర్పీసీ), భారత సాక్ష్యాధార చట్టాల చరిత్ర గత అర్ధరాత్రితో ముగిసింది. కొత్త చట్టాలతో జీరో ఎఫ్ఐఆర్, ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేయడం, ఎస్ఎంఎస్ వంటి ఎలక్టాన్రిక్ పద్ధతిలో సమన్లు పంపడం, హేయమైన నేరాలకు సంబంధించిన క్రైమ్ సీన్లను తప్పనిసరి వీడియోల్లో బంధించడం వంటి ఆధునిక పద్ధతులు న్యాయ వ్యవస్థలో రానున్నాయి. బ్రిటిష్ కాలం నాటి చట్టాల మాదిరిగా శిక్షకు కాకుండా, న్యాయం అందించేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచి్చనట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. చట్టాల పేరు మాత్రమే కాదు, వాటి సవరణలు పూర్తి భారతీయ ఆత్మతో రూపొందించామన్నారు. కొత్త చట్టాలు రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయాన్ని అందిస్తాయని చెప్పారు. → భారతీయ శిక్షాస్మృతిలోని రాజద్రోహాన్ని ఇప్పుడు దేశద్రోహంగా మార్చారు. కులం, మతం వంటి కారణాలతో సామూహిక దాడులు, హత్యకు పాల్పడితే ఐపీసీ ప్రకారం ఏడేళ్ల శిక్ష పడుతుంది. దీన్నిప్పుడు యావజ్జీవంగా మార్చారు. హేయమైన నేరాలకు సంబంధించిన క్రైమ్ సీన్ల వీడియో చిత్రీకరణ తప్పనిసరి చేశారు.→ నకిలీ నోట్ల తయారీ, వాటి స్మగ్లింగ్ ఉగ్రవాదం పరిధిలోకి వస్తుంది. విదేశాల్లో మన ఆస్తుల ధ్వంసాన్నీ ఉగ్రవాదంగా నిర్వచించారు. డిమాండ్ల సాధనకు వ్యక్తులను బంధించడం, కిడ్నాప్ చేయడాన్ని ఉగ్రవాదం పరిధిలోకి చేర్చారు. → మహిళలు, పిల్లలపై నేరాలపై కొత్త అధ్యాయాన్ని జోడించారు. పిల్లల్ని కొనడం, అమ్మడం ఘోరమైన నేరంగా మార్చారు. మైనర్‌పై సామూహిక అత్యాచారానికి మరణశిక్ష లేదా జీవిత ఖైదు నిబంధన తెచ్చారు. పెళ్లి చేసుకుంటానన్న తప్పుడు వాగ్దానాలతో లైంగిక సంబంధాలు పెట్టుకుని మహిళలను వదిలేయడం వంటి కేసులకు కొత్త నిబంధన పెట్టారు. మహిళలు, పిల్లలపై నేరాల్లో బాధితులకు అన్ని ఆస్పత్రుల్లో ప్రథమ చికిత్స లేదా ఉచిత వైద్యం అందించాలి. మహిళలు, 15 ఏళ్లలోపు, 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు, వికలాంగులు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఇంటినుంచే పోలీసు సాయం పొందవచ్చు. కోర్టు అనుమతి లేకుండా లైంగిక దాడి గురించి ప్రచురిస్తే రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా నిబంధన చేర్చారు.→ కొత్త చట్టాల ప్రకారం ఫిర్యాదుల నుంచి సమన్లదాకా అన్నీ ఆన్లైన్లో జరగనున్నాయి. పోలీసు స్టేషన్‌కు వెళ్లే పని లేకుండా ఎల్రక్టానిక్ కమ్యూనికేషన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఎస్ఎంఎస్ ద్వారా కూడా సమన్లు పంపవచ్చు. పరిధితో సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్లో అయినా ఎఫ్ఐఆర్ దాఖలు చేసే జీరో ఎఫ్ఐఆర్ విధానం ప్రవేశపెట్టారు. అరెస్టయిన వ్యక్తి కుటుంబానికి, స్నేహితులకు సమాచారాన్ని పంచుకునే వీలు కల్పించడంతోపాటు వివరాలను పోలీస్ స్టేషన్లలో ప్రదర్శిస్తారు. -
ప్రక్షాళన అవసరమే కానీ...
ఎప్పుడో 19వ శతాబ్దంలో తొలిసారిగా చట్టంగా రూపుదాల్చిన భారత నేరసంహితను సమూలంగా మార్చేందుకు ఒక అడుగు ముందుకు పడింది. భారత క్రిమినల్ న్యాయ వ్యవస్థను మారుస్తూ,కేంద్ర ప్రభుత్వం ఆగస్ట్ 11న లోక్‌సభలో మూడు కొత్త బిల్లుల్ని ప్రవేశపెట్టింది. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) –1860 స్థానంలో ‘భారతీయ న్యాయ సంహిత’, తొలిసారిగా 1898లో చట్టమై ఆనక కొద్దిగా మార్పులు జరిగిన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ) – 1973 బదులు ‘భారతీయ నాగరిక్ సురక్షా సంహిత’, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ – 1872 స్థానంలో ‘భారతీయ సాక్ష్య బిల్లు’ రానున్నాయి. మధ్యలో కొద్ది మినహా గణనీయమైన మార్పులేమీ చేయని భారత సర్కార్ 160 ఏళ్ళ పైచిలుకు క్రితం బ్రిటీషు వారి చట్టాలను సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా మార్చాలను కోవడం సహేతుకమే. అయితే, కొత్త బిల్లుల్ని తీసుకొచ్చే ముందు న్యాయనిపుణులతో, ప్రతిపక్షా లతో ఎంత లోతుగా చర్చించారు? ఇది ప్రశ్నార్థకం. ఈ పరిస్థితుల్లో 3 బిల్లుల్నీ సమీక్షించి, సిఫా ర్సులు చేయడానికి ప్రభుత్వం వాటిని పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపడం స్వాగతనీయం. బిల్లుల్లోని అంశాలపై ప్రజలతో సంప్రతింపులు జరిపి, సిఫార్సులు చేసేందుకు కరోనా కాలంలో 2020 మేలో ప్రభుత్వం నిపుణుల సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఆ సంప్రతింపుల ప్రక్రియ విధి విధా నాలు అయోమయమే. వచ్చిన అభ్యర్థనల్ని పరిశీలించి, విశ్లేషించడానికి సదరు నిపుణుల సంఘం ఏ పద్ధతిని అనుసరించిందీ తెలీదు. ఆ నిపుణుల సంఘం ప్రభుత్వానికి ఇచ్చిన సిఫార్సుల్ని ప్రజాక్షేత్రంలో పెట్టనేలేదు. వచ్చిన సిఫార్సులకూ, ప్రభుత్వం బిల్లుల్లో పెట్టిన అంశాలకూ పొంతన ఉండివుండ దని కూడా నిపుణుల మాట. ఇన్ని లోపాలున్నాయి గనకే కొత్త బిల్లుల సామర్థ్యం సందేహాస్పాదం. బ్రిటీషు పాలనా అవశేషాలను తొలగించడమే ధ్యేయమంటూ మోదీ సర్కార్ చెబుతున్న మాట లకూ, కొత్త చట్టాల్లో నిజంగా ఉన్న అంశాలకూ మధ్య ఎంత పొంతన ఉందో చెప్పలేం. క్రిమినల్ న్యాయ వ్యవస్థకు ఈ ప్రక్షాళన సర్వరోగ నివారణి అంటున్నా అదీ అనుమానమే. ఎందుకంటే, పాత చట్టాల్లోని అనేక అంశాలు యథాతథంగా ఈ కొత్త బిల్లుల్లోనూ చోటుచేసుకున్నాయి. కొన్ని మార్పులు ప్రతిపాదించారు కానీ, అవి వ్యవస్థలోని సంక్షోభంపై ఏ మేరకు ప్రభావం చూపుతాయో చెప్పలేం. పైపెచ్చు, కొత్త బిల్లులు ప్రతిపాదించిన కొన్ని మార్పులు ఆందోళన రేపుతున్నాయి. పాత రాజద్రోహ చట్టాన్ని తొలగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. నిజానికి, సామాజిక కార్య కర్తలు, జర్నలిస్టులపై తరచూ దుర్వినియోగమవుతున్న ఈ చట్టానికి గత ఏడాది మేలోనే సుప్రీమ్ కోర్ట్ అడ్డుకట్ట వేసి, సమీక్షను పెండింగ్‌లో పెట్టింది. లా కమిషన్ మాత్రం ఐపీసీలో రాజద్రోహానికి సంబంధించిన ‘సెక్షన్ 124ఏ’ను కొనసాగించాలనీ, శిక్షను పెంచాలనీ రెండునెలల క్రితం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆ సెక్షన్‌ను తొలగించాలని సర్కార్ నిర్ణయించడం ఆశ్చర్యమే. లార్డ్ మెకాలే 1837లో రూపకల్పన చేయగా, 1862లో అమలులోకి వచ్చిన ఐపీసీలో రాజద్రోహ చట్టం లేదు. 1870లో దాన్ని చేర్చి, స్వాతంత్య్ర సమరాన్ని అణిచేసేందుకు విస్తృతంగా వినియోగించారు. 1898లో పరిధిని విస్తరించారు. స్వాతంత్య్రం వచ్చాకా ఈ చట్టం కొనసాగుతూ వచ్చింది. దాని రాజ్యాంగబద్ధతపై కోర్టులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. కొత్త బిల్లులో రాజద్రోహమనే పేరు తొలగించినా, సార్వభౌమాధికారానికి హానికారక చర్యలు శిక్షార్హమంటూ కొత్త మాట తగిలించారు. ఏ చర్యలు ఈ నేరమనేది స్పష్టత లేనందున పోలీసుల ఇష్టారాజ్యపు అరెస్ట్‌లకు అధికారం దఖలు పడుతోంది. అలాగే, ఇప్పటి దాకా ఐపీసీలో లేని వ్యవస్థీకృత నేరం, తీవ్రవాద నేరాలు, మూకదాడి లాంటివీ కొత్తగా చేర్చారు. వివాదాస్పద ‘ఉపా’ చట్టం నుంచి తీసుకున్నవీ ఇందులో ఉండడం విషాదం. అలాగే, సీఆర్పీసీ కింద అరెస్టయిన వ్యక్తిని గరిష్ఠంగా 15 రోజులే పోలీస్ కస్టడీలో ఉంచవచ్చు. కొత్త చట్టంలో చేసిన నేరాన్ని బట్టి 60 నుంచి 90 రోజుల దాకా కస్టడీని పొడిగించవచ్చు. ఇదీ దుర్విని యోగమయ్యే ముప్పుంది. అయితే ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఎఫ్ఐఆర్ నమోదు అవకాశమివ్వడం, పోలీసు సోదా – స్వాధీనాల వేళ తప్పనిసరి వీడియో రికార్డింగ్ లాంటివి బాధితుల హక్కుల్ని కాపాడతాయి. ఎలక్ట్రానిక్ సాక్ష్యాధారాల్ని వినియోగిస్తూ, ఫోరెన్సిక్స్‌కు పెద్ద పీట వేయడం బాగానే ఉన్నా, ఆ సాక్ష్యాల సేకరణ, విశ్లేషణ, వాటిని కోర్టుల్లో వినియోగించే తీరుపై స్పష్టత లేదు. విచారణతోనే జైళ్ళలో మగ్గుతున్న జనం, క్రిక్కిరిసిన జైళ్ళ లాంటి దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం దిశగా ఆలోచించ లేదు. బెయిల్ నిర్ణయంలో చేపట్టాల్సిన సంస్కరణల్ని పట్టించుకోలేదు. ప్రస్తుతం మన కోర్టుల్లో 4.7 కోట్లపైగా కేసులు పెండింగ్‌లో ఉంటే, మూడింట రెండొంతులు క్రిమినల్ కేసులే. క్రిమినల్ న్యాయవ్యవస్థలో సంస్కరణలపై జస్టిస్ మలిమత్ కమిటీ తన నివేదికను సమర్పించి రెండు దశాబ్దాలు దాటింది. 2007లో మాధవ్ మీనన్ కమిటీ సహా అనేకం వచ్చాయి. చివరకిప్పుడు రథం కదిలింది. కానీ, ఇంగ్లీష్ పేర్లు తీసేసి సంస్కృత, హిందీ పేర్లు పెట్టి, కొత్త సీసాలో పాత సారా నింపితే లాభం లేదు. దశాబ్దాల తర్వాతి ఈ ప్రయత్నమూ చిత్తశుద్ధి లోపించి, అసంతృప్తినే మిగిలిస్తే అంతకన్నా అన్యాయం లేదు. కొత్త చట్టాలకు సర్కార్ మరింత కసరత్తు చేయాలి. పార్లమెంట్లో క్షుణ్ణంగా చర్చించాలి. నేరన్యాయ వ్యవస్థలో సంస్కరణలు అవసరమే కానీ, వట్టి చట్టాలు మారిస్తే సరిపోదు. వ్యవస్థకూ, పౌరులకూ మధ్య బంధంలో మార్పు తేవాలి. అప్పుడే వలసవాద వాసనలు వదులుతాయి. అలాకాక ఎన్నేళ్ళయినా పాత పాలకులనే నిందించడం అసమంజసం. అది ఇన్నేళ్ళ సొంత తప్పుల్ని కాలమనే తివాచీ కిందకు నెట్టేసే విఫలయత్నమే! -
ఆ కేసుల్లో ఫోరెన్సిక్ దర్యాప్తు తప్పనిసరి
గాంధీనగర్: దేశంలో నేర న్యాయ వ్యవస్థను, ఫోరెన్సిక్ సైన్స్ దర్యాప్తును మిళితం చేయాలని భావిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల కంటే అధికంగా మన దేశంలో నేర నిరూపణల శాతాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఆరేళ్లకుపైగా జైలుశిక్ష పడేందుకు అవకాశం ఉన్న కేసుల్లో ఫోరెన్సిక్ దర్యాప్తును తప్పనిసరి, చట్టబద్ధం చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు. అమిత్ షా ఆదివారం గుజరాత్‌లోని గాంధీనగర్‌లో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ(ఎన్ఎఫ్ఎస్యూ) మొదటి స్నాతకోత్సవంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. దేశవ్యాప్తంగా ప్రతిజిల్లాలో ఫోరెన్సిక్ మొబైల్ దర్యాప్తు సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు వివరించారు. ఫోరెన్సిక్ దర్యాప్తు స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చట్టపరమైన చర్యలు చేపడతామన్నారు. ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(సీఆర్పీసీ), ఎవిడెన్స్ యాక్ట్‌లో మార్పులు తీసుకురానున్నట్లు వెల్లడించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ చట్టాలను ఎవరూ భారతీయ దృష్టికోణంలో చూడడం లేదన్నారు. -
జైళ్లలోని 80% మంది విచారణ ఖైదీలే
జైపూర్: దేశంలోని జైళ్లలో పెద్ద సంఖ్యలో విచారణ ఖైదీలు ఉండటం చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. క్రిమినల్ జస్టిస్ వ్యవస్థపై ప్రభావం చూపిస్తున్న ఈ అంశాన్ని పరిష్కరించేందుకు చర్యలు అవసరమని పిలుపునిచ్చారు. ఎలాంటి విచారణ లేకుండా దీర్ఘకాలంపాటు వ్యక్తుల నిర్బంధానికి దారితీస్తున్న విధానాలను ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోని 6.10 లక్షల మంది ఖైదీల్లో సుమారు 80% మంది అండర్ ట్రయల్ ఖైదీలేనన్నారు. శనివారం సీజేఐ జైపూర్‌లో ఆల్ ఇండియా లీగల్ సర్వీసెస్ అథారిటీ 18వ వార్షిక సదస్సులో పసంగించారు. న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్ పాల్గొన్నారు. కారాగారాలను బ్లాక్ బాక్సులుగా పేర్కొన్న సీజేఐ.. ముఖ్యంగా అణగారిన వర్గాలకు చెందిన ఖైదీల్లో జైలు జీవితం ప్రతికూల ప్రభావం చూపుతోందని చెప్పారు. విచారణ ఖైదీలను ముందుగా విడుదల చేయడమనే లక్ష్యానికి పరిమితం కారాదని పేర్కొన్నారు. ‘‘నేర న్యాయ వ్యవస్థలో, ప్రక్రియే ఒక శిక్షగా మారింది. అడ్డుగోలు అరెస్టులు మొదలు బెయిల్ పొందడం వరకు ఎదురయ్యే అవరోధాలు, విచారణ ఖైదీలను దీర్ఘకాలం పాటు నిర్బంధించే ప్రక్రియపై తక్షణం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం క్రిమినల్ జస్టిస్ వ్యవస్థ పరిపాలనా సామర్థ్యాన్ని పెంచడానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అవసరం’’అని ఆయన అన్నారు. దీంతోపాటు పోలీసు వ్యవస్థ ఆధునీకరణ, పోలీసులకు శిక్షణ, సున్నితత్వం పెంచడం వంటి వాటి ద్వారా క్రిమినల్ జస్టిస్ వ్యవస్థను మెరుగుపరచవచ్చని అన్నారు. రాజకీయ వైరుధ్యం శత్రుత్వంగా మారడం ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి సంకేతం కాదని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘వివరణాత్మక చర్చలు, పరిశీలనలు లేకుండా చట్టాలు ఆమోదం పొందుతున్నాయి’’అని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ లాయర్లకే ఎక్కువ గౌరవం: రిజిజు హైకోర్టులు, దిగువ కోర్టుల్లో కార్యకలాపాలు ప్రాంతీయ భాషల్లోనే జరిపేలా ప్రోత్సహించాలని కిరణ్ రిజిజు చెప్పారు. ఏ ప్రాంతీయ భాష కంటే ఇంగ్లిష్ ఎక్కువ కాదన్నారు. ఇంగ్లిష్ ధారాళంగా మాట్లాడగలిగినంత మాత్రాన లాయర్లు ఎక్కువ గౌరవం, ఎక్కువ ఫీజు పొందాలన్న విధానం సరికాదని చెప్పారు. కొందరు లాయర్లు ఒక్కో కేసుకు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు వసూలు చేస్తున్నారని, ఇంత ఫీజును సామాన్యులు భరించలేరని చెప్పారు. సామాన్యుడిని కోర్టుల నుంచి దూరం చేసే కారణం ఎలాంటిదైనా ఆందోళన కలిగించే అంశమేనన్నారు. -
దేశంలో అలాంటి అరెస్టులే అత్యవసర సమస్యలు: సీజేఐ
జైపూర్: దేశంలో తొందరపాటు, విచక్షణారహితంగా చేసే అరెస్టులు, బెయిల్ పొందటంలో ఇబ్బందులు, ట్రయల్స్‌లో దీర్ఘకాలం జైలులో ఉంచటం వంటివి ప్రస్తుతం అత్యవసర సమస్యలుగా పేర్కొన్నారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలను గుర్తు చేసుకుంటూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు, సుప్రీం కోర్టు సీనియర్ జడ్జీల సమక్షంలో మాట్లాడారు. ఏ కేసును చూపకుండానే భారత క్రిమినల్ జస్టిస్ వ్యవస్థలోని ప్రక్రియ ప్రజలకు శిక్షగా అభివర్ణించారు. 'సవాళ్లు చాలా ఉన్నాయి. మన నేర న్యాయ వ్యవస్థలో ఉన్న ప్రక్రియ ఒక శిక్షగా మారింది. తొందరపాటు, విచక్షణారహితంగా చేసే అరెస్టుల నుంచి.. బెయిల్ పొందటంలో ఇబ్బంది, ట్రయల్స్‌లో ఉన్న వారు ఎక్కువ కాలం జైలులో ఉండటం వరకు ఇవన్నీ అత్యవసర సమస్యలే. నేర న్యాయ వ్యవస్థ పరిపాలన సామర్థ్యాన్ని పెంచడానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అవసరం. పోలీసులకు శిక్షణ ఇవ్వటం, జైలు వ్యవస్థను ఆధునికీకరించటం వంటి వాటితో పరిపాలన సామర్థ్యాన్ని పెంచవచ్చు.' అని పేర్కొన్నారు జస్టిస్ ఎన్వీ రమణ. ఈ సమస్యలపై నాల్సా(నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ), లీగల్ సర్వీసెస్ అథారిటీలు దృష్టి సారించి ఏ విధంగా పరిష్కరించవచ్చో చూడాలన్నారు. జైళ్లలో మగ్గుతున్న వారిని త్వరితగతిన విడుదల చేసేందుకు 'బెయిల్ యాక్ట్' తీసుకువచ్చే అంశాన్ని పరిశీలించాలని ఇటీవల సుప్రీం కోర్టు కేంద్రానికి సూచించింది. ప్రస్తుతం ఆ వాదనలను జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యలు బలపరుస్తున్నట్లు కనిపిస్తోంది. రాజకీయ వ్యతిరేకత శత్రుత్వంగా మారకూడదు.. రాజకీయ వ్యతిరేకత అనేది శత్రుత్వం, శాసన పనితీరు నాణ్యతపై ప్రభావం చూపే విధంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ వ్యతిరేకత శత్రుత్వంగా మారకూడదని సూచించారు. ఇటీవల అలాంటి సంఘటనలు వెలుగు చూశాయని, అవి ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం సూచనలు కావన్నారు. ఇదీ చదవండి: Vice President Election 2022: వీడిన సస్పెన్స్.. ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్కర్ -
‘బెయిల్ చట్టం’ శిరోధార్యం
‘చట్టం, న్యాయం ముసుగులో అన్యాయం రాజ్యమేలడం కంటే మించిన నిరంకుశత్వం మరొకటి లే’దని ఫ్రెంచ్ రాజకీయ తత్వవేత్త మాంటెస్క్యూ అంటాడు. దురదృష్టవశాత్తూ మన నేర న్యాయవ్యవస్థలో ఉన్న లొసుగులు చడీచప్పుడూ లేకుండా ఇలాంటి నిరంకుశత్వానికి బాటలు పరుస్తున్నాయి. ఈ పోకడలను సర్వోన్నత న్యాయస్థానం గుర్తించి నిందితులకు బెయిల్ మంజూరు చేసే ప్రక్రియకు సంబంధించి ఒక ప్రత్యేక చట్టం అవసరమని సూచించడం హర్షించదగ్గ విషయం. సీబీఐ అరెస్టు చేసిన సతీందర్ కుమార్ కేసులో నిరుడు జూలైలో ఇచ్చిన తీర్పుపై వివరణనిస్తూ సుప్రీంకోర్టు తాజా సూచన చేసింది. కేవలం అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే నిందితులను జైలుకు పంపాలనీ, ఎక్కువ సందర్భాల్లో బెయిల్ మంజూరు చేయొచ్చనీ, బెయిల్ పొందడం నిందితులకుండే హక్కనీ అనేకానేకసార్లు సుప్రీంకోర్టు తెలిపింది. వలస పాలనను వదుల్చుకుని 75 ఏళ్లవుతున్నా మన అధికార వ్యవస్థలను మాత్రం ఆ జాడ్యం వదలడం లేదు. దర్యాప్తు సంస్థలు జరిపే అరెస్టుల్లో కనీసం 60 శాతం అనవసరమైనవేనని జాతీయ పోలీసు కమిషన్ నివేదిక గతంలో ఒకసారి చెప్పింది. అయినా యధేచ్ఛగా అరెస్టులు సాగుతూనే ఉన్నాయి. కింది కోర్టులు సైతం నిందితులను రిమాండ్‌కు పంపి చేతులు దులుపుకొంటున్నాయి. దేశవ్యాప్తంగా సామాజిక కార్యకర్తలనూ, రాజకీయ నాయకులనూ, పాత్రికేయులనూ అరెస్టు చేయడం, వారు బెయిల్ దొరక్క నెలల తరబడి జైళ్లలో మగ్గడం ఈమధ్యకాలంలో మితిమీరింది. ఇక స్వప్రయోజనాల కోసమో, పెత్తందార్ల ప్రయోజనాలు నెరవేర్చే ఉద్దేశంతోనో అమాయకులను అరెస్టు చేయడం గురించి చెప్పనవసరం లేదు. ఇలాంటివారు ఏళ్లతరబడి జైళ్లలో మగ్గుతున్నారు. ఇందువల్ల పౌర హక్కులకు భంగం కలగడం మాత్రమే కాదు... విచారణలో ఉన్న ఖైదీలతో జైళ్లు కిటకిటలాడుతున్నాయి. అక్కడ సౌకర్యాల లేమితో పరిస్థితి అధ్వాన్నంగా ఉంటున్నది. ఖైదీల్లో మూడింట రెండువంతులమంది విచారణలో ఉన్నవారేననీ, ఇది దారుణమనీ జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఎంఎం సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం చెప్పవలసి వచ్చిందంటే దేశంలో నేర న్యాయవ్యవస్థ ఎలా ఉందో అర్థమవుతుంది. మన శిక్షాస్మృతి(సీఆర్పీసీ) వలస పాలకుల హయాంలో 1882లో రూపొందించింది. స్వాతంత్య్రానంతరం అలాంటి చట్టాలను పూర్తిగా రద్దు చేసి, మెరుగైన చట్టాలను రూపొందించుకోవాలని పాలకులు ఎన్నడూ అనుకోలేదు. కాలానుగుణంగా సీఆర్పీసీకి సవరణలు చేస్తూ పోవడమే పరిష్కార మార్గంగా ఎంచుకున్నారు. 2009లో సీఆర్పీసీలోని సెక్షన్ 41ను సవరించారు. అరెస్టు చేసేందుకు పోలీసులకుండే అధికారాలను అది రెండు తరగతులుగా వర్గీకరించింది. ఏడేళ్లు, అంతకన్నా తక్కువ శిక్షపడే అవకాశమున్న నేరాలను 41(బీ) కిందా, అంతకన్నా ఎక్కువ శిక్షపడే అవకాశమున్న నేరాలను 41(బీఏ) కింద విభజించింది. మొదటి కేటగిరీ పరిధిలోకి వచ్చేవారిని అరెస్టు చేయాలంటే అందుకు తగిన కారణాలను రికార్డు చేయాలి. ఆ కారణాలు సహేతుకమైనవో కాదో మేజిస్ట్రేట్లు పరిశీలించాలి. వారు సంతృప్తి పడితేనే నిందితుడి రిమాండ్‌కు ఆదేశాలివ్వాలి. 2014లో అర్నేష్‌కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఈ విషయంలో మరింత స్పష్టమైన మార్గదర్శకాలిచ్చింది. ఒక నిందితుణ్ణి అరెస్టు చేసేముందు ఆ చర్య అవసరమో కాదో పోలీసు అధికారి పరిశీలించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు మాత్రమే కాదు, హైకోర్టులు సైతం వివిధ సందర్భాల్లో సూచనలు చేస్తూనే ఉన్నాయి. కానీ పట్టేదెవరికి? ఫలితంగా విచక్షణారహిత అరెస్టులూ, నిందితులు నెలల తరబడి జైలు గోడల వెనక మగ్గడం రివాజుగా మారింది. క్రిమినల్ కేసుల్లో శిక్షలు పడటం అంతంతమాత్రమవుతున్న ధోరణివల్ల కింది కోర్టులు బెయిల్ నిరాకరిస్తున్నాయన్న అభిప్రాయం చాలామందిలో ఉంది. దర్యాప్తు సంస్థలు తమ సామర్థ్యం మెరుగుపరుచుకోవడం, పకడ్బందీ సాక్ష్యాలను సేకరించడం ఈ సమస్యకు పరిష్కారం తప్ప చట్ట నిబంధనలకు విరుద్ధంగా, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు భిన్నంగా వ్యవహరించడం కాదు. కనుకనే ధర్మాసనం మరోసారి దీనిపై దృష్టి సారించాల్సి వచ్చింది. నిందితుడు మరిన్ని నేరాలకు పాల్పడే అవకాశముందని, సాక్ష్యాలను తారుమారు చేయొచ్చని, పరారయ్యే అవకాశముందని సహేతుకంగా భావించినప్పుడు మాత్రమే అరెస్టు చేయాలనీ... ఈ అంశాలన్నింటిలో పోలీసులు సక్రమంగానే వ్యవహరించారని న్యాయస్థానాలు సంతృప్తి పడితేనే నిందితుణ్ణి జైలుకు పంపాలనీ తాజాగా ధర్మాసనం చేసిన సూచనలు ఈ పరిస్థితిని చక్కదిద్దగలిగితే మంచిదే. జీవించే హక్కుకూ, స్వేచ్ఛకూ పూచీ పడుతున్న రాజ్యాంగంలోని 21వ అధికరణ పదే పదే ఉల్లంఘనకు గురవుతుంటే మౌనంగా ఉండటం రాజ్యాంగానికి అపచారం చేసినట్టే. అసలు బెయిల్‌కి సంబంధించి ఒక ప్రత్యేక చట్టం అవసరమని సుప్రీంకోర్టు చేసిన సూచన కూడా శిరోధార్యమైనది. బ్రిటన్‌లో 1976లో ఈ మాదిరి చట్టం వచ్చింది. జైళ్లలో ఖైదీల సంఖ్యను తగ్గించడానికి ఈ చట్టం తీసుకొస్తున్నట్టు అప్పట్లో బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. నేరారోపణలు ఎదుర్కొంటున్నవారికి న్యాయసహాయం అందించే నిబంధనలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ చట్టం అమలు మెరుగైన ఫలితాలనిచ్చిందని అక్కడి గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అందుకే సుప్రీంకోర్టు చేసిన సూచనను కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలి. ఈ విషయంలో తగిన ఆలోచన చేయాలి. -
‘క్రిమినల్ జస్టిస్’లో ప్రాసిక్యూటర్లే కీలకం
సాక్షి, హైదరాబాద్: నేర న్యాయవ్యవస్థ (క్రిమినల్ జస్టిస్ సిస్టం)లో ప్రాసిక్యూటర్లు వెన్నెముకలాంటి వారని, నేరస్తులకు శిక్షలు పడేలా చేయడంలో ప్రాసిక్యూటర్లదే కీలకపాత్ర అని హైకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి కీలకమైన ప్రాసిక్యూషన్ విభాగంలో పోస్టులను భర్తీ చేయకపోవడం తమను ఆందోళనకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 270 ప్రాసిక్యూటర్ పోస్టులు ఖాళీగా ఉండగా, ఇందులో 70 మాత్రమే భర్తీ చేయడంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రాసిక్యూషన్ విభాగాన్ని బలోపేతం చేయకుండా, వారికి అవసరమైన ప్రత్యేక శిక్షణ, మౌలిక వసతులు కల్పించకపోతే నేరస్తులకు శిక్షలు పడేశాతం తక్కువగానే ఉంటుందని పేర్కొంది. కొన్ని సందర్భాల్లో బెయిల్ ఇవ్వడానికి వీల్లేని కేసుల్లో కూడా ప్రాసిక్యూషన్ వైఫల్యం కారణంగా నిందితులకు బెయిల్ లభిస్తోందని, దీంతో శాంతిభద్రతల సమస్య ఉత్పన్నం అయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రాసిక్యూషన్ విభాగం బలోపేతానికి స్పష్టమైన ప్రణాళికలతో రావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘ప్రాసిక్యూటర్ల ఖాళీలన్నింటినీ భర్తీ చేసేందుకు ఎంత సమయం పడుతుంది? ఈ విభాగానికి ఏ మేరకు నిధులు కేటాయిస్తారు? ఇప్పటికే నియమితులైన ప్రాసిక్యూటర్లకు ప్రత్యేక శిక్షణ ఏర్పాట్లు ఎప్పుడు చేస్తారు? కోర్టు భవనాల ఆవరణలో ప్రాసిక్యూటర్ల కోసం ప్రత్యేకంగా భవనాల నిర్మాణం.. ఇతర సదుపాయాలపై ఈనెల 14 లోగా సమగ్రమైన నివేదిక సమర్పించాలి’అని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్‌ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 15కు వాయిదా వేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్. జస్టిస్ బి.విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఇటీవల ప్రాసిక్యూటర్ల కొరత విషయంలో దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాసిక్యూటర్ పోస్టుల ఖాళీలతో కింది కోర్టుల్లో క్రిమినల్ కేసుల విచారణలో జరుగుతున్న జాప్యంపై రిజిస్ట్రార్ జనరల్ రాసిన లేఖను 2018లో ధర్మాసనం సుమోటోగా ప్రజాహిత వ్యాజ్యంగా విచారణకు స్వీకరించింది. చాలా కోర్టుల్లో ప్రాసిక్యూటర్లు లేరు ‘చాలా కోర్టులకు ప్రాసిక్యూటర్లు లేరు. ఒకే ప్రాసిక్యూటర్ పలు కోర్టులకు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. మహిళల మీద నేరాలను విచారించేందుకు ఏర్పాటైన ప్రత్యేక కోర్టులకు ఫుల్‌టైం ప్రాసిక్యూటర్లు లేరు. దీంతో కేసుల విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ప్రాసిక్యూటర్లకు సైతం నైపుణ్యం లేదు, వారికి ప్రత్యేక శిక్షణ ఇప్పించాల్సిన అవసరం ఉంది. అలాగే నిందితులకు సంబంధించి ఇతర నేరాల రికార్డులను కూడా సమర్పించడం లేదు. నార్కోటిక్స్.. తదితర కేసుల్లో సమర్థవంతంగా వాదనలు వినిపించలేకపోవడంతో నిందితులు బెయిల్ మీద విడుదల అవుతున్నారు. అయితే ప్రభుత్వం ప్రాసిక్యూటర్లకు తగిన మౌలిక వసతులను కూడా కల్పించడం లేదు. అనేక కోర్టుల్లో వారు కూర్చోవడానికి, కేసులకు సంబంధించిన ఫైళ్లు పెట్టుకోవడానికి కూడా స్థలం లేని పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితులు వారిలో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమేకాక బాధితులకు సత్వర న్యాయం జరిగే అవకాశం లేకుండా పోతోంది’అని ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. -
మారని నేరగాళ్లు!
ఉప్పల్: కరడుగట్టిన నేరగాళ్లను మార్చడానికి పోలీసులు పడుతున్న తపన వృథానే అవుతోంది. రూ.లక్షలు ఖర్చు పెట్టి స్వయం ఉపాధి కింద వ్యాపారాలు పెట్టించినా నేరగాళ్లు తమ పంథాన్ని వీడటంలేదు. అప్పటికప్పుడు కొన్ని రోజులు మాత్రమే మారినట్లు నటించినా ఆచరణలో అది కనిపించడంలేదు. వందల కేసుల్లో చర్లపల్లి జైలులో శిక్షను అనుభవించిన ఖైదీల పరివర్తన కోసం మల్కాజిగిరి డివిజన్ పరిధిలోని 2015లో అప్పటి క్రైం డీసీపీ నవీన్, మల్కాజిగిరి ఏసీపీలతో కలిసి ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పక్కనే ఖాళీ ప్రాంతంలో వెంకటరమణకు టిఫిన్ సెంటర్‌ను ఏర్పాటు చేయించారు. 2016 ఫిబ్రవరిలో వరంగల్ జిల్లా కాజీపేటకు చెందిన కర్నకంటి వీరబ్రహ్మచారికి ఉప్పల్ చౌరస్తాలో టీ కొట్టును ఏర్పాటు చేయించారు. కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో రాజుతో టీ కొట్టు పెట్టించారు. నేరెడ్మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శ్రీనివాస్‌రెడ్డి, ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ప్రసాద్‌రెడ్డి.. ఇలా ఎంతోమంది కరడుగట్టిన నేరగాళ్లను మార్చడానికి టీ కొట్టు, టిఫిన్ సెంటర్లను ఏర్పాటు చేయించి జన జీవన స్రవంతిలో కలిసేందుకు అవకాశం కల్పించారు. కొందరు నేరగాళ్లు మారినా మరికొందరు మాత్రం తమ ప్రవృత్తిని పోలీసుల కళ్లుగప్పి కొనసాగిస్తూనే ఉన్నారు. గత రెండున్నరేళ్లుగా వీరు ఏం చేస్తున్నారో.. ఎక్కడ ఉంటున్నారో.. పోలీసులకే తెలియడంలేదు. ఇదే కోవలో ఉప్పల్ చౌరస్తాలోని బస్టాప్‌లో టీ కొట్టును నడిపిస్తున్న బ్రహ్మచారి కొంతకాలం మాత్రమే దానిని నడిపించి మరొకరికి అప్పగించి మళ్లీ నేర ప్రవృత్తిని కొనసాగిస్తూనే వచ్చాడు. మూడు రోజుల క్రితం జహీరాబాద్‌లో బస్సులో ప్రయాణిస్తున్న మహిళను పోలీసులమని బెదిరించి బస్సులో నుంచి దించి ఆమెపై అత్యాచారం చేసిన కేసులో బ్రహ్మచారి ఉండటం గమనార్హం. ఇలా పోలీసులచే పునరావాసం కల్పించిన నేరగాళ్లు తమ పంథాన్ని వీడకపోవడమే కాకుండా మరింత కసితో నేరాల బాట పడుతుండటం శోచనీయం. -
నిందితులకు శిక్ష పడే రేటు పెరిగేలా చూడాలి
సాక్షి, సిద్దిపేట: క్రిమినల్ జస్టిస్ సిస్టం ద్వారా ఎంట్రీ చేసే డాటాలో తప్పులుండొద్దని పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ సూచించారు. శుక్రవారం కమిషనర్ కార్యాలయంలో కోర్టు డ్యూటీ అధికారులకు సీసీటీఎన్ఎస్, కోర్టు మానిటర్ సిస్టంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఎంట్రీ చేసిన డాటా దేశంలో ఎక్కడైనా.. ఏ అధికారి అయినా చూసుకునే అవకాశం ఉంటుందని, అందు కోసం కన్వెక్షన్(నిందుతులకు శిక్ష పడే రేటు) పెంచాలన్నారు. దీని ద్వారా ప్రజల్లో డిపార్ట్‌మెంట్‌పై మంచి అభిప్రాయం కలుగుతుందని, అలాగే క్రైమ్ రేటు తగ్గుతుందని సూచించారు. ట్రయల్ నడిచే కేసుల్లో సాక్ష్యం ఎలా చెప్పాలో ముందే ప్రిపేర్ చేయాలని, కోర్టు విధులు నిర్వహించే ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉండాలన్నారు. కమిషనరేట్ పరిధిలో సీఐలు, ఎస్ఐలు కొన్ని ముఖ్యమైన కేసులు అడాప్ట్ చేసుకోవడం జరిగిందని, ఆ కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలన్నారు. సుప్రీం కోర్టు పోక్సో కేసులపై ఒక కమిటీ మానిటర్ చేస్తుందని, రాష్ట్రంలో ఉమెన్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ అధికారులు సీసీటీఎన్ఎస్ మానిటర్ చేస్తున్నారన్నారు. అందువల్ల డాటా ఎంట్రీ చేసేపుడు ఏలాంటి తప్పులు లేకుండా నమోదు చేయాలన్నారు. పోలీస స్టేషన్ల వారీగా యాక్టులో ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయో త్వరలో లిస్ట్ అవుట్ చేసి పంపాలన్నారు. కోర్టు కానిస్టేబుల్ బాధ్యత చాలా కీలకమైనదని ఎఫ్ఐఆర్ నమోదైనప్పటి నుంచి కేసు పూర్తయ్యేంతవరకు అవసరమైన పత్రాలు, సాక్షుల వాంగ్మూలంను కోర్టుకు సమర్పించడంలో బాధ్యతగా ఉండాలన్నారు. కేసు ట్రయల్స్ సమయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ సలహాలు, సూచనలు స్వీకరించాలన్నారు. కోర్టు విధులలో ప్రతిభ కనబర్చి నిందితులకు శిక్షలు పడేవిధంగా పనిచేసే సిబ్బందికి ప్రతినెల రివార్డులు అందజేస్తామన్నారు. సీసీటీఎన్ఎస్ కోర్టు మానిటర్ సిస్టంలో డాటా ఏ విధంగా ఏంట్రీ చేయాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఐటీ కోర్స్ సిబ్బంది శ్రీధర్, స్వామిలు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీసీటీఎస్ఎన్ టాస్క్‌ఫోర్స్ ఏసీపీ హబీబ్‌ఖాన్, టాస్క్‌ఫోర్స్ సీఐ లక్ష్మణ్, కోర్టు లైజనింగ్ హెడ్‌కానిస్టేబుల్ స్వామిదాస్ తదితరులు పాల్గొన్నారు. -
దర్యాప్తు పైనే పరిమితులా?
విశ్లేషణ నేరారోపణపై దర్యాప్తు చేయడం నేర న్యాయవ్యవస్థలో కనీస ధర్మం. కానీ, దర్యాప్తు ప్రాథమిక దశలోనే పరిమితులు విధించడం చాలా అన్యాయం. అవినీతి ఆరోపణలు వచ్చిన అధికారిపైన దర్యాప్తు చేయడం కనీస అవసరం. పౌరుడు నేరం చేస్తే ఫిర్యాదు నమోదుచేసి దర్యాప్తు, నేరారోపణ పత్రం దాఖలు, నేరవిచారణ జరగాలనేది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చెప్పే విధానం. అదే ప్రభుత్వ ఉద్యోగి, అవి నీతికి పాల్పడితే పై అధికారి ముందస్తు మంజూరీ ఇస్తేనే దర్యాప్తు (ఇన్వెస్టిగేషన్) జరుగుతుంది. అనుమతి ఉంటేనే నేరవిచారణ (ప్రాసిక్యూషన్) జరుగుతుంది. నిజాయితీ పరులైన అధికారులను వేధించే ఆరోపణలు నిరోధించేందుకు ఈ మంజూరీ నిబంధన చేశారు. చట్టం వచ్చింది కానీ అమలు కావడం లేదు. అయితే కొందరి మిత్రులను శిక్షించి మరికొందరిని శిక్షించాలని మంజూరీ అధికారం వాడినపుడు నింద పొందిన సహ ఉద్యోగులు ఒకరి సమాచారం మరొకరు అడగడం, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు అడగడం, ఇతర నేరారోపిత ఉద్యోగులు, లేదా ఇతర పౌరులు కూడా సమాచారం అడిగేందుకు సమాచార హక్కు వీలు కల్పిం చింది. ఈ సమాచారం మూడో వ్యక్తి సమాచారమనీ, ఉద్యోగి వ్యక్తిగత సమాచారమనీ ఇవ్వకుండా తిరస్కరిం చడం చట్టబద్ధం అవుతుందా? ఇద్దరు ప్రభుత్వోద్యోగుల పదవీ విరమణ తేదీ వారి ప్రాసిక్యూషన్ కోసం మంజూరీ ఇచ్చిన వివరాలు కావాలని సుర్జిత్ అనే వ్యక్తి సమాచార హక్కు కింద కోరారు. సమాచార అధికారి దాన్ని పాలనా నిఘా వ్యవహారాలు చూసే మరొక సమాచార అధికారికి బదిలీ చేశారు. కొన్ని అంశాలమీద సమాచారం లేదన్నారు. మూడో వ్యక్తి వివరాలు కొన్ని అడుగుతున్నారనీ, వారి అనుమతి లేనిదే ఇవ్వలేమన్నారు. మొత్తానికి అంతా కలసి సమాచారం ఇవ్వలేదు. తమ ప్రభుత్వ సంస్థలోనే మరొక సీపీఐఓకు బదిలీ చేస్తే బాధ్యత తీరిపోదు. తమసంస్థకు సంబంధించిన సమాచారమే అడిగినప్పుడు ఆయన మరొక సీపీఐఓ పరిధిలో ఉన్న సమాచారం కూడా ఇవ్వవలసిన బాధ్యత చట్టం కింద వహించవలసి ఉంటుంది. ఇది మూడో వ్యక్తి సమాచారం అనడం కూడా సమంజసం కాదు. ఎందుకంటే అది అదే సంస్థలో పనిచేసే ఉద్యోగి చేసే అధికారిక పనికి సంబంధించిన అంశం కనుక అని వాదించారు. అయినా సెక్షన్ 11(1) కింద దీన్ని మూడోవ్యక్తి సమాచారం అనుకున్నప్పటికీ, ఆ సమాచారం ఈ సంస్థకు ఇచ్చినపుడు రహస్యం అని వర్గీకరించి ఉంటే, ఆ సమాచారం ఇవ్వాలనుకుని ఉంటే, సీపీఐఓ నీ అభిప్రాయమేమిటి అని నోటీసు ఇవ్వాలని, ఆ తరువాత అతను అభ్యంతరపెడితే దాన్ని పరిశీలించి, ఇవ్వాలని నిర్ణయించాను, ఏమంటావు అనీ రెండో నోటీసు ఇవ్వాలని, అందుకు ఆయన ఇంకేవయినా సమంజసమైన కారణాలు రాసి పంపిస్తే చూసి పరి శీలించి ప్రజాశ్రేయస్సు దృష్ట్యా ఇవ్వాలని తీర్మానిస్తే, ఆ విధంగా నిర్ణయించినట్టు మూడో లేఖ రాయాలని చట్టం వివరిస్తున్నది. జనహిత సమాచారమే అడిగారా లేదా తెలుసుకోవడానికి కమిషన్ ఈ కేసులో సంబంధిత ఫైళ్లను కమిషన్ ముందుంచాలని ఆదేశించింది. ఫైళ్లను అధికారులు కమిషన్ కు చూపించారు. ఆ దస్తావేజులలో సుర్జిత్ అడిగిన సమాచారానికి సంబంధించిన పత్రాలేవీ మినహాయింపుల కిందికి రావు. ఇద్దరు అధికారుల పదవీవిరమణ తేదీల సమాచారం మూడోపక్ష సమాచారం అన డం సమంజసం కాదు. వారు తమ పదవీ విరమణ తేదీ రహస్య సమాచారం అని ముందే నిర్ధారించలేదు. సీపీఐఓ తనకు ఆ సమాచారం ఇచ్చే ఉద్దేశం ఉందని తెలియజేయలేదు. కనుక మూడో వ్యక్తిని సంప్రదించే అవసరమే లేదు. వారి అభ్యంతరానికి వీటో శక్తి కూడా లేదు. ఒక వేళ అభ్యంతరం తెలిపినా ఆ విషయాన్ని కూడా పరిశీలించి అడిగిన సమాచారం వెల్లడించడం జనహితానికి అనుకూలమా లేక ప్రతికూలమా అని ఆలోచించి ఒక నిర్ణయాన్ని సీపీఐఓ స్వతంత్రంగా తీసుకోవాలి. ఆ పనిచేసినట్టు రికార్డు కనిపించడం లేదు. కనుక అడిగిన సమాచారం నిరాకరించడానికీ వీల్లేనిదే అవుతుంది. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 19, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 197 ప్రకారం తగిన అధికారి మంజూరీ ఇచ్చేంత వరకు న్యాయస్థానం ఏ నేర ఫిర్యాదును గుర్తిం చడానికి వీల్లేదు. సుబ్రమణ్యంస్వామి వర్సెస్ భారత ప్రభుత్వం (2014) 8 ఎస్ సి సి 682 కేసులో ఢిల్లీ స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్ మెంట్ చట్టం సెక్షన్ 6ఎ కింద మంజూరీ ఇస్తే తప్ప అత్యున్నత ప్రభుత్వోద్యోగి నేరాలపై దర్యాప్తు చేయడానికి వీల్లేదనే నిబంధన రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. వచ్చిన నేరారోపణ మీద దర్యాప్తు చేయడం నేర న్యాయవ్యవస్థలో కనీస ధర్మం. అసలు దర్యాప్తు అనే ప్రాథమిక దశలోనే పరిమితులు విధించడం చాలా అన్యాయం. అదీ లంచగొండితనం, అవినీతి, భ్రష్టాచారం, నేరపూరిత దుర్వ్య వహారం అనే ఆరోపణలకు వచ్చిన అధికారిపైన దర్యాప్తు చేయడం కనీస అవసరం కూడా. ముందస్తు మంజూరీ లేకుండా దర్యాప్తు నేర విచారణ జరగకూడదనే నియమాలకు వ్యతిరేకంగా అనేక తీర్పులు వచ్చాయి. అయినా మంజూరీ నియమం బతికే ఉంది. కొందరు ప్రభుత్వోద్యోగులపై ఆరోపణలను దర్యాప్తు చేయడానికి తరువాత ప్రాసిక్యూట్ చేయడానికి ఎందుకు అనుమతించారు, మరికొందరిని ఎందుకు అనుమతించడం లేదో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది. సమాచార హక్కు ఈ హక్కును ధృవీకరించింది. కేంద్ర నిఘా కమిషన్ తన వెబ్సైట్లో ముందస్తు మంజూరీతో నేరవిచారణ జరుగుతున్న అధికారుల జాబితా ప్రచురిస్తున్నది. ఇది మూడో వ్యక్తి సమాచారం అయ్యే ప్రసక్తే లేదు. సమాచారం పదిరోజుల్లో ఇవ్వాల్సిందే అని కమిషన్ ఆదేశించింది (సుర్జిత్ పాణిగ్రాహి వర్సెస్ శాస్త్ర విజ్ఞాన శాఖ ఇఐఇ/ M ఖీఇఏ/అ/2017/15 6475 కేసులో సిఐసి 17 జనవరి 2018 నాటి తీర్పు ఆధారంగా). - మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
ఉగ్రవాదైనా ఉరితీయొద్దు!
కాంగ్రెస్ ఎంపీ థరూర్ వ్యాఖ్య తిరువనంతపురం: మరణశిక్షకు తాను వ్యతిరేకమని కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ మరోసారి స్పష్టంచేశారు. ఉగ్రవాదులను సైతం ఉరితీయరాదని, వారిని జీవితాంతం పెరోల్ లేకుండా జైల్లోనే ఉంచాలని పేర్కొన్నారు. దేశాలు హంతకుల మాదిరి ప్రవర్తించకూడదని పేర్కొన్నారు. నేర న్యాయ వ్యవస్థలో కూడా అనేక లోటుపాట్లు, పాక్షిక దృష్టి కోణాలున్నాయన్నారు. ‘పాతకాలంలో ఓ వ్యక్తి ఎవరినైనా చంపితే అతడిని కూడా చంపేయాలనుకునేవారు. ఆ కాలం చెల్లిన ఆలోచన ధోరణిని మనం ఇంకా పాటించడం ఎందుకు? మనం మరణశిక్ష వేస్తున్నామంటే ఆ పాతవారి లాగే ప్రవర్తిస్తున్నామని అర్థం. ఉగ్రవాదులైనా సరే ఉరేయకూడదు. వారు బతికున్నంత కాలం పెరోల్ లేకుండా జైల్లోనే ఉంచితే సరిపోతుంది’ అని ఆదివారమిక్కడ ఓ కార్యక్రమంలో అన్నారు. యాకూబ్ మెమన్ ఉరిశిక్షపై తాను ట్విటర్లో వివాదాస్పద వ్యాఖ్యలేమీ చేయలేదని స్పష్టంచేశారు. ‘ప్రపంచంలో 143 దేశాలు ఉరిశిక్షను రద్దు చేశాయి. ఉరిశిక్ష వేయాలని చట్టాల్లో ఉన్నా.. వాటికి జోలికి వెళ్లని దేశాలు మరో 25 ఉన్నాయి. అలాంటప్పుడు మనదేశం ఉరిశిక్షను ఎందుకు అమలు చేయాలి?’ అని ప్రశ్నించారు. -
సా...గుతున్న న్యాయం!
నానాటికీ నేరాలు అడ్డూ ఆపూ లేకుండా పెరిగిపోతున్నాయన్నది నిజం. అందుకు ఇతర కారణాల మాటెలా ఉన్నా నేర న్యాయ వ్యవస్థ చురుగ్గా పనిచేయకపోవడం ప్రధానమైన కారణమని న్యాయనిపుణులు చెబుతారు. నేరం చేస్తే వెనువెంటనే చర్యలు మొదలవుతాయన్న భయం ఉంటే అవి చాలామటుకు అదుపుచేయ వచ్చంటారు. ఈ విషయంలో సాక్షాత్తూ సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని హితబోధ చేసినా చెప్పుకోదగ్గ కదలికలేదు. నాలుగు దశాబ్దాల క్రితం బాంబు పేలుడు ఉదంతంలో కన్నుమూసిన ఆనాటి రైల్వే మంత్రి ఎల్. ఎన్. మిశ్రా కేసులో నలు గురు నిందితులకు ఢిల్లీ కోర్టు యావజ్జీవ శిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పు ఈ సమస్య తీవ్రతను తెలియజేస్తున్నది. 1975 జనవరి 2న బీహార్‌లోని సమస్తిపూర్‌లో జరిగిన ఆ ఘటన చుట్టూ ఎన్నో వివాదాలూ, ఊహాగానాలూ అలుముకున్నాయి. తన ను అంతం చేసేందుకు కుట్ర జరుగుతున్నదని స్వయంగా మిశ్రాయే చెప్పారని ఒక సీనియర్ పాత్రికేయుడు అప్పట్లో వెల్లడించారు. అనంతర కాలంలో దేశంలో అత్యవసర పరిస్థితి విధించడానికి ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ ఏకరువు పెట్టిన పలు కారణాల్లో ఈ హత్యోదంతం ఒకటి. ఆనంద్ మార్గ్ సంస్థ కార్యకర్తలే ఈ హత్యకు కుట్ర పన్నారన్నది ప్రాసిక్యూషన్ అభియోగం. ఆనంద్‌మార్గ్ దీన్ని అప్పట్లోనే ఖండించగా మిశ్రా కుటుంబ సభ్యులు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. రాజకీయ రంగంలో ఉన్నత స్థానంలో ఉన్నవారి కుట్రలకు ఆయన బలైపోయారన్నది కుటుంబసభ్యుల అభియోగం. నిజమైన నిందితులను మరుగు పర్చి సంబంధం లేనివారిని దోషులుగా తేల్చారన్నది వారి ఆరోపణ. ఒక కేసు దర్యాప్తు ఎలా ఉండకూడదో తెలుసుకోవడానికి సీబీఐ ఫైళ్లలో చాలా ఉదాహరణలు ఉండొచ్చు. అలాంటి అన్ని కేసులన్నిటిలో మిశ్రా కేసు విలక్షణ మైనది. ఇందులోని నిందితులంతా బాంబు పేలుడు ఉదంతం జరిగేనాటికి 20 నుంచి 35 ఏళ్లలోపువారు. వారిలో కొందరు మరణించారు. సాక్ష్యంగా నిలిచి నవారిలోనూ పలువురు కాలం చాలించారు. నిందితుల్లో చాలామంది అవసాన దశకు చేరుకున్నారు. ఇందులో ఒకాయన వయసు 79 అయితే మరో ఇద్దరు 75, 73 ఏళ్ల ప్రాయానికి చేరుకున్నారు. మరణించిన వ్యక్తి అత్యంత ప్రముఖుడు కనుక, ఇందులో పెద్ద కుట్ర ఉండొచ్చు గనుక దీన్ని సీబీఐకి అప్పగించడమే సరైనదని ఆనాటి ప్రభుత్వం నిర్ణయించింది. తీరా అది నడిచిన తీరు సీబీఐ ప్రతిష్టను ఏమీ పెంచలేదు. అడుగడుగునా కేసు విచారణకు అవరోధాలు ఏర్పడుతుండటంతో 1979లో దీన్ని ఢిల్లీ కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్నది. 1981లో నిందితులపై అభియోగాలు నమోదయ్యాయి. అయినా కేసుది నత్తనడకే! చివరికిది ఏ స్థాయికి చేరుకున్నదంటే...విచారణ సుదీర్ఘకాలం నడించింది కనుక దీన్ని కొట్టేయాలని రెండేళ్లక్రితం నిందితులంతా సుప్రీంకోర్టుకెక్కారు. వారి వాదన విని ధర్మాసనం కూడా ఏంచేయాలన్న విచికిత్సలో పడింది. దీనిపై వాదనలు వినిపించమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. కేసు దర్యాప్తు, విచార ణలకు ఇంత సుదీర్ఘ సమయం పట్టింది కనుక నిందితుల వాదనలో సహేతుకత ఉన్నట్టు కనిపిస్తున్నా ఈ ఒరవడి ప్రమాదకర పర్యవసానాలకు నాంది పలకగలదని చివరకు ధర్మాసనం భావించింది. కేసును రోజువారీ విని పూర్తిచేయాలని నిర్దేశించింది. అలా చెప్పినా తీర్పు వెలువడటానికి ఇన్నేళ్ల సమయం పట్టింది. అయితే, ఈ కేసు వ్యవహారం ఇంతటితో ముగిసిపోయినట్టు కాదు. తమకు విధించిన శిక్షపై ఉన్నత న్యాయస్థానాల్లో అప్పీల్ చేసుకునేందుకు నిందితులకు అవకాశం ఉంది. మన న్యాయస్థానాల్లో ప్రస్తుతం 3 కోట్ల 13 లక్షలకుపైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో సుప్రీంకోర్టులో 63,843 కేసులు, వివిధ హైకోర్టుల్లో 44 లక్షల కేసులు వాయిదాల్లో నడుస్తున్నాయి. జిల్లా కోర్టులు, అంతకంటే కింది స్థాయిలో వీటి సంఖ్య 2 కోట్ల 68 లక్షలు. ఈ పెండింగ్ కేసుల్లో 25 శాతం అయిదేళ్లు అంత కన్నా పైబడినవి. 70 శాతం కేసులు అయిదేళ్లలోపులోనివి. పోలీసులు జరిపే అరెస్టుల్లో 60 శాతం అసందర్భమైనవేనని జాతీయ పోలీస్ కమిషన్ నివేదిక చెప్పిన నేపథ్యాన్ని గమనిస్తే ఈ పెండింగ్ కేసుల్లో ఎన్ని నిలబడతాయో సందేహమే. ఏ నేరపూరిత చర్యనైనా మొత్తం సమాజానికి వ్యతిరేకంగా చేసిన నేరంగా చట్టం పరిగణిస్తుంది. ఇలాంటి కేసుల్లో కూడా అలవిమాలిన జాప్యం జరుగుతున్నదంటే సమాజ క్షేమం విషయంలో మనం ఉపేక్షవహిస్తున్నామని అర్థం. ఇందువల్ల సమాజంలో అభద్రతాభావం పెరుగుతుంది. కనీసం తీవ్రమైన నేరాలకు సంబం ధించిన కేసులనైనా వేగిరం తేల్చాలన్న ఉద్దేశం ఏ స్థాయిలోనూ ఉన్నట్టు కనబడదు. ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి పోలీసులవద్ద జరిగే జాప్యం మొదలు కొని న్యాయమూర్తుల పదవులను భర్తీ చేయడంలో, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకాల్లో ప్రభుత్వాలు చూపుతున్న అలసత్వం వరకూ ఇందుకు ఎన్నో కారణాలున్నాయని రెండేళ్లక్రితం సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో లా కమిషన్ వివరించింది. పోలీసుశాఖలో పేరుకుపోయిన అవినీతి, అలసత్వం... పలుకుబడి ఉన్నవారి జోలికి వెళ్లలేని నిస్సహాయత, దర్యాప్తులో లోపిస్తున్న ప్రమా ణాలు, న్యాయవాదులు తరచు వాయిదాలు కోరడం, సాక్షులకు రక్షణ కల్పించక పోవడం, న్యాయస్థానాలకు మౌలిక సదుపాయాల లేమి వంటివెన్నో క్రిమినల్ కేసులు ఏళ్లతరబడి పెండింగ్‌లో ఉండటానికి ప్రధాన కారణమని ఆ నివేదిక విశ్లేషించింది. ఇరవై నాలుగు నెలలు గడిచినా క్షేత్ర స్థాయిలో వీటిల్లో ఏ ఒక్కటీ మెరుగుపడలేదన్న సంగతి సులభంగానే అర్థమవుతుంది. కనుకనే ఎల్ ఎన్ మిశ్రా హత్య కేసు వంటివి సైతం ఏళ్ల తరబడి అతీగతీ లేకుండా పెండింగ్‌లో పడుతు న్నాయి. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. లేనట్టయితే మన నేర న్యాయవ్యవస్థ మొత్తం నవ్వులపాలవుతుంది. -
న్యాయస్థానాల ఏర్పాటు మా పనికాదు: సుప్రీం
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థ వేగం పుంజుకోవడానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పెండింగ్ లో కేసులను సత్వరమే పరిష్కారించాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. ఇందుకోసం అదనపు కోర్టులు ఏర్పాటు చేయాలని, న్యాయవ్యవస్థకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ ఎమ్ లేధా నేతృత్వంలోని బెంచ్ పేర్కొంది. కొత్త కోర్టులు తాము ఏర్పాటు చేయలేమని, ఆ బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. లా సెక్రటరీలు, అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించి ఈ దిశగా ముందుకెళ్లాలని దిశానిర్దేశం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి కోర్టుల్లో మౌలిక సదుపాయాలు మెరుగు పరిచేందుకు చర్యలు చేపట్టాలని సూచించింది. నెల రోజుల్లోగా ఈ ప్రతిపాదనతో రావాలని కేంద్రాన్ని కోరింది. నేషనల్ పాంథర్స్ పార్టీ అధ్యక్షుడు భీమ్ సింగ్ వేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.