సాక్షి, హైదరాబాద్: నేర న్యాయవ్యవస్థ (క్రిమినల్ జస్టిస్ సిస్టం)లో ప్రాసిక్యూటర్లు వెన్నెముకలాంటి వారని, నేరస్తులకు శిక్షలు పడేలా చేయడంలో ప్రాసిక్యూటర్లదే కీలకపాత్ర అని హైకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి కీలకమైన ప్రాసిక్యూషన్ విభాగంలో పోస్టులను భర్తీ చేయకపోవడం తమను ఆందోళనకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 270 ప్రాసిక్యూటర్ పోస్టులు ఖాళీగా ఉండగా, ఇందులో 70 మాత్రమే భర్తీ చేయడంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రాసిక్యూషన్ విభాగాన్ని బలోపేతం చేయకుండా, వారికి అవసరమైన ప్రత్యేక శిక్షణ, మౌలిక వసతులు కల్పించకపోతే నేరస్తులకు శిక్షలు పడేశాతం తక్కువగానే ఉంటుందని పేర్కొంది. కొన్ని సందర్భాల్లో బెయిల్ ఇవ్వడానికి వీల్లేని కేసుల్లో కూడా ప్రాసిక్యూషన్ వైఫల్యం కారణంగా నిందితులకు బెయిల్ లభిస్తోందని, దీంతో శాంతిభద్రతల సమస్య ఉత్పన్నం అయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రాసిక్యూషన్ విభాగం బలోపేతానికి స్పష్టమైన ప్రణాళికలతో రావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
‘ప్రాసిక్యూటర్ల ఖాళీలన్నింటినీ భర్తీ చేసేందుకు ఎంత సమయం పడుతుంది? ఈ విభాగానికి ఏ మేరకు నిధులు కేటాయిస్తారు? ఇప్పటికే నియమితులైన ప్రాసిక్యూటర్లకు ప్రత్యేక శిక్షణ ఏర్పాట్లు ఎప్పుడు చేస్తారు? కోర్టు భవనాల ఆవరణలో ప్రాసిక్యూటర్ల కోసం ప్రత్యేకంగా భవనాల నిర్మాణం.. ఇతర సదుపాయాలపై ఈనెల 14 లోగా సమగ్రమైన నివేదిక సమర్పించాలి’అని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్‌ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 15కు వాయిదా వేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్. జస్టిస్ బి.విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఇటీవల ప్రాసిక్యూటర్ల కొరత విషయంలో దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాసిక్యూటర్ పోస్టుల ఖాళీలతో కింది కోర్టుల్లో క్రిమినల్ కేసుల విచారణలో జరుగుతున్న జాప్యంపై రిజిస్ట్రార్ జనరల్ రాసిన లేఖను 2018లో ధర్మాసనం సుమోటోగా ప్రజాహిత వ్యాజ్యంగా విచారణకు స్వీకరించింది.
చాలా కోర్టుల్లో ప్రాసిక్యూటర్లు లేరు
‘చాలా కోర్టులకు ప్రాసిక్యూటర్లు లేరు. ఒకే ప్రాసిక్యూటర్ పలు కోర్టులకు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. మహిళల మీద నేరాలను విచారించేందుకు ఏర్పాటైన ప్రత్యేక కోర్టులకు ఫుల్‌టైం ప్రాసిక్యూటర్లు లేరు. దీంతో కేసుల విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ప్రాసిక్యూటర్లకు సైతం నైపుణ్యం లేదు, వారికి ప్రత్యేక శిక్షణ ఇప్పించాల్సిన అవసరం ఉంది. అలాగే నిందితులకు సంబంధించి ఇతర నేరాల రికార్డులను కూడా సమర్పించడం లేదు. నార్కోటిక్స్.. తదితర కేసుల్లో సమర్థవంతంగా వాదనలు వినిపించలేకపోవడంతో నిందితులు బెయిల్ మీద విడుదల అవుతున్నారు. అయితే ప్రభుత్వం ప్రాసిక్యూటర్లకు తగిన మౌలిక వసతులను కూడా కల్పించడం లేదు. అనేక కోర్టుల్లో వారు కూర్చోవడానికి, కేసులకు సంబంధించిన ఫైళ్లు పెట్టుకోవడానికి కూడా స్థలం లేని పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితులు వారిలో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమేకాక బాధితులకు సత్వర న్యాయం జరిగే అవకాశం లేకుండా పోతోంది’అని ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment