ప్రక్షాళన అవసరమే కానీ... | Sakshi Editorial On Indian Criminal Justice System | Sakshi
Sakshi News home page

ప్రక్షాళన అవసరమే కానీ...

Published Wed, Aug 16 2023 12:25 AM | Last Updated on Wed, Aug 16 2023 12:25 AM

Sakshi Editorial On Indian Criminal Justice System

ఎప్పుడో 19వ శతాబ్దంలో తొలిసారిగా చట్టంగా రూపుదాల్చిన భారత నేరసంహితను సమూలంగా మార్చేందుకు ఒక అడుగు ముందుకు పడింది. భారత క్రిమినల్‌ న్యాయ వ్యవస్థను మారుస్తూ,కేంద్ర ప్రభుత్వం ఆగస్ట్‌ 11న లోక్‌సభలో మూడు కొత్త బిల్లుల్ని ప్రవేశపెట్టింది. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (ఐపీసీ) –1860 స్థానంలో ‘భారతీయ న్యాయ సంహిత’, తొలిసారిగా 1898లో చట్టమై ఆనక కొద్దిగా మార్పులు జరిగిన క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సీఆర్‌పీసీ) – 1973 బదులు ‘భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత’, ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌ – 1872 స్థానంలో ‘భారతీయ సాక్ష్య బిల్లు’ రానున్నాయి.

మధ్యలో కొద్ది మినహా గణనీయమైన మార్పులేమీ చేయని భారత సర్కార్‌ 160 ఏళ్ళ పైచిలుకు క్రితం బ్రిటీషు వారి చట్టాలను సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా మార్చాలను కోవడం సహేతుకమే. అయితే, కొత్త బిల్లుల్ని తీసుకొచ్చే ముందు న్యాయనిపుణులతో, ప్రతిపక్షా లతో ఎంత లోతుగా చర్చించారు? ఇది ప్రశ్నార్థకం. ఈ పరిస్థితుల్లో 3 బిల్లుల్నీ సమీక్షించి, సిఫా ర్సులు చేయడానికి ప్రభుత్వం వాటిని పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపడం స్వాగతనీయం. 

బిల్లుల్లోని అంశాలపై ప్రజలతో సంప్రతింపులు జరిపి, సిఫార్సులు చేసేందుకు కరోనా కాలంలో 2020 మేలో ప్రభుత్వం నిపుణుల సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఆ సంప్రతింపుల ప్రక్రియ విధి విధా నాలు అయోమయమే. వచ్చిన అభ్యర్థనల్ని పరిశీలించి, విశ్లేషించడానికి సదరు నిపుణుల సంఘం ఏ పద్ధతిని అనుసరించిందీ తెలీదు. ఆ నిపుణుల సంఘం ప్రభుత్వానికి ఇచ్చిన సిఫార్సుల్ని ప్రజాక్షేత్రంలో పెట్టనేలేదు.

వచ్చిన సిఫార్సులకూ, ప్రభుత్వం బిల్లుల్లో పెట్టిన అంశాలకూ పొంతన ఉండివుండ దని కూడా నిపుణుల మాట. ఇన్ని లోపాలున్నాయి గనకే కొత్త బిల్లుల సామర్థ్యం సందేహాస్పాదం. బ్రిటీషు పాలనా అవశేషాలను తొలగించడమే ధ్యేయమంటూ మోదీ సర్కార్‌ చెబుతున్న మాట లకూ, కొత్త చట్టాల్లో నిజంగా ఉన్న అంశాలకూ మధ్య ఎంత పొంతన ఉందో చెప్పలేం.

క్రిమినల్‌ న్యాయ వ్యవస్థకు ఈ ప్రక్షాళన సర్వరోగ నివారణి అంటున్నా అదీ అనుమానమే. ఎందుకంటే, పాత చట్టాల్లోని అనేక అంశాలు యథాతథంగా ఈ కొత్త బిల్లుల్లోనూ చోటుచేసుకున్నాయి. కొన్ని మార్పులు ప్రతిపాదించారు కానీ, అవి వ్యవస్థలోని సంక్షోభంపై ఏ మేరకు ప్రభావం చూపుతాయో చెప్పలేం. పైపెచ్చు, కొత్త బిల్లులు ప్రతిపాదించిన కొన్ని మార్పులు ఆందోళన రేపుతున్నాయి.   

పాత రాజద్రోహ చట్టాన్ని తొలగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. నిజానికి, సామాజిక కార్య కర్తలు, జర్నలిస్టులపై తరచూ దుర్వినియోగమవుతున్న ఈ చట్టానికి గత ఏడాది మేలోనే సుప్రీమ్‌ కోర్ట్‌ అడ్డుకట్ట వేసి, సమీక్షను పెండింగ్‌లో పెట్టింది. లా కమిషన్‌ మాత్రం ఐపీసీలో రాజద్రోహానికి సంబంధించిన ‘సెక్షన్‌ 124ఏ’ను కొనసాగించాలనీ, శిక్షను పెంచాలనీ రెండునెలల క్రితం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆ సెక్షన్‌ను తొలగించాలని సర్కార్‌ నిర్ణయించడం ఆశ్చర్యమే.

లార్డ్‌ మెకాలే 1837లో రూపకల్పన చేయగా, 1862లో అమలులోకి వచ్చిన ఐపీసీలో రాజద్రోహ చట్టం లేదు. 1870లో దాన్ని చేర్చి, స్వాతంత్య్ర సమరాన్ని అణిచేసేందుకు విస్తృతంగా వినియోగించారు. 1898లో పరిధిని విస్తరించారు. స్వాతంత్య్రం వచ్చాకా ఈ చట్టం కొనసాగుతూ వచ్చింది. దాని రాజ్యాంగబద్ధతపై కోర్టులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి.

కొత్త బిల్లులో రాజద్రోహమనే పేరు తొలగించినా, సార్వభౌమాధికారానికి హానికారక చర్యలు శిక్షార్హమంటూ కొత్త మాట తగిలించారు. ఏ చర్యలు ఈ నేరమనేది స్పష్టత లేనందున పోలీసుల ఇష్టారాజ్యపు అరెస్ట్‌లకు అధికారం దఖలు పడుతోంది. అలాగే, ఇప్పటి దాకా ఐపీసీలో లేని వ్యవస్థీకృత నేరం, తీవ్రవాద నేరాలు, మూకదాడి లాంటివీ కొత్తగా చేర్చారు. వివాదాస్పద ‘ఉపా’ చట్టం నుంచి తీసుకున్నవీ ఇందులో ఉండడం విషాదం.

అలాగే, సీఆర్‌పీసీ కింద అరెస్టయిన వ్యక్తిని గరిష్ఠంగా 15 రోజులే పోలీస్‌ కస్టడీలో ఉంచవచ్చు. కొత్త చట్టంలో చేసిన నేరాన్ని బట్టి 60 నుంచి 90 రోజుల దాకా కస్టడీని పొడిగించవచ్చు. ఇదీ దుర్విని యోగమయ్యే ముప్పుంది. అయితే ఏ పోలీస్‌ స్టేషన్‌లోనైనా ఎఫ్‌ఐఆర్‌ నమోదు అవకాశమివ్వడం, పోలీసు సోదా – స్వాధీనాల వేళ తప్పనిసరి వీడియో రికార్డింగ్‌ లాంటివి బాధితుల హక్కుల్ని కాపాడతాయి.

ఎలక్ట్రానిక్‌ సాక్ష్యాధారాల్ని వినియోగిస్తూ, ఫోరెన్సిక్స్‌కు పెద్ద పీట వేయడం బాగానే ఉన్నా, ఆ సాక్ష్యాల సేకరణ, విశ్లేషణ, వాటిని కోర్టుల్లో వినియోగించే తీరుపై స్పష్టత లేదు. విచారణతోనే జైళ్ళలో మగ్గుతున్న జనం, క్రిక్కిరిసిన జైళ్ళ లాంటి దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం దిశగా ఆలోచించ లేదు. బెయిల్‌ నిర్ణయంలో చేపట్టాల్సిన సంస్కరణల్ని పట్టించుకోలేదు. 

ప్రస్తుతం మన కోర్టుల్లో 4.7 కోట్లపైగా కేసులు పెండింగ్‌లో ఉంటే, మూడింట రెండొంతులు క్రిమినల్‌ కేసులే. క్రిమినల్‌ న్యాయవ్యవస్థలో సంస్కరణలపై జస్టిస్‌ మలిమత్‌ కమిటీ తన నివేదికను సమర్పించి రెండు దశాబ్దాలు దాటింది. 2007లో మాధవ్‌ మీనన్‌ కమిటీ సహా అనేకం వచ్చాయి. చివరకిప్పుడు రథం కదిలింది. కానీ, ఇంగ్లీష్‌ పేర్లు తీసేసి సంస్కృత, హిందీ పేర్లు పెట్టి, కొత్త సీసాలో పాత సారా నింపితే లాభం లేదు. దశాబ్దాల తర్వాతి ఈ ప్రయత్నమూ చిత్తశుద్ధి లోపించి, అసంతృప్తినే మిగిలిస్తే అంతకన్నా అన్యాయం లేదు.

కొత్త చట్టాలకు సర్కార్‌ మరింత కసరత్తు చేయాలి. పార్లమెంట్‌లో క్షుణ్ణంగా చర్చించాలి. నేరన్యాయ వ్యవస్థలో సంస్కరణలు అవసరమే కానీ, వట్టి చట్టాలు మారిస్తే సరిపోదు. వ్యవస్థకూ, పౌరులకూ మధ్య బంధంలో మార్పు తేవాలి. అప్పుడే వలసవాద వాసనలు వదులుతాయి. అలాకాక ఎన్నేళ్ళయినా పాత పాలకులనే నిందించడం అసమంజసం. అది ఇన్నేళ్ళ సొంత తప్పుల్ని కాలమనే తివాచీ కిందకు నెట్టేసే విఫలయత్నమే! 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement