గడచిన కొద్దిరోజులుగా అమెరికాలోని దుకాణాల వద్ద భారతీయుల భారీ క్యూలు ఓ హాట్ టాపిక్. రానున్న రోజుల్లో బియ్యానికి కొరత రావచ్చనే భయంతో, నిల్వ చేసుకొనేందుకు ప్రవాస భారతీయులు పెద్దయెత్తున కొనుగోళ్ళకు దిగడంతో తలెత్తిన దృశ్యమది. ఉరుము లేని పిడుగులా బాస్మతి బియ్యం మినహా మిగతా రకాల తెల్ల బియ్యం ఎగుమతుల్ని తక్షణమే నిషేధిస్తూ భారత సర్కార్ గత గురువారం తీసుకున్న ఆకస్మిక నిర్ణయంతో రేపు ఇలాంటి దృశ్యాలు ఇంకేం తలెత్తు తాయో తెలీదు.
అది ఫలించక ఇప్పుడు నిషేధమే విధించారు..
ప్రపంచ బియ్యం మార్కెట్‌ను ఇది ఆశ్చర్యపరిచినప్పటికీ, పెరిగిపోతున్న ధాన్యం ధరలను నియంత్రించడం రానున్న ఎన్నికల దృష్ట్యా పాలకులకు అనివార్యమైంది. దేశీయంగా సరఫరా పెంచడానికీ, ద్రవ్యోల్బణానికి ముకుతాడు వేసేందుకూ బియ్యం ఎగుమతులపై ఈ తక్షణ నిషేధం ఉపకరిస్తుందని సర్కార్ భావన. అందుకే, 10 నెలల క్రితం బియ్యం ఎగుమతులపై 20 శాతం సుంకం వేసి, ఆంక్షలు పెట్టిన పాలకులు అది ఫలించక ఇప్పుడు నిషేధమే విధించారు. భారత్ మాటెలా ఉన్నా ఇది ప్రపంచానికి ప్రాణసంకటమే. ఇటీవలే నల్లసముద్రపు ఆహార ధాన్యాల ఒప్పందాన్ని రష్యా రద్దు చేసుకోవడంతో వివిధ దేశాల్లో గోదుమలు, మొక్కజొన్నల ధర నింగికెగసింది. ఇప్పుడు భారత బియ్యం ఎగుమతి నిషేధమూ తోడయ్యేసరికి, ప్రపంచ ఆహార ధరలు ఇంకా పెరగవచ్చని ఆందోళన రేగుతోంది.
Rice bag NRIs standing in line to collect rice in the US,just like how they stand in front of a ration shop.pic.twitter.com/L0YqEwqrsa— Брат (@B5001001101) July 25, 2023
అత్యధిక బియ‍్యం ఎగుమతి మన దేశం నుంచే..
ప్రపంచ దేశాల్లో అత్యధికంగా బియ్యం ఎగుమత య్యేది మన దేశం నుంచే! ప్రపంచ పామాయిల్ ఎగుమతుల్లో ఇండొనేసియా, మలేసియా ఎలాగో బియ్యానికి సంబంధించి మనం అలా! ఎగుమతుల్లో 40 శాతానికి పైగా మన దేశానివే! ఇప్పుడు మన ఉత్పత్తుల్లో ఉన్నతశ్రేణిదిగా భావించే బాస్మతి మినహా మిగతా రకాల బియ్యానికి తాజా నిషేధం వర్తిస్తుంది. పెరిగిన అంతర్జాతీయ అమ్మకాలు సైతం ఈ నిషేధానికి కారణం. గత ఆర్థిక సంవత్సరం భారత్ నుంచి బియ్యం ఎగుమతులు 23 శాతం పెరిగాయి. ఈ ఏడాదిలో జూన్ వరకు మన బియ్యం అంతర్జాతీయ అమ్మకాలు 35 శాతం హెచ్చాయి. వెరసి, గత నెల రోజుల్లో దేశంలో బియ్యం రేటు 3 శాతం పెరిగింది. ఏడాది క్రితంతో పోలిస్తే 11.5 శాతం పెరిగిందని సర్కారే చెబుతోంది.
అదేసమయంలో, దేశీయంగా వరి ఉత్పత్తి పరిస్థితి ఆశాజనకంగా లేదు. ఒకపక్క పంజాబ్, హర్యానా లాంటి చోట్ల వర్షాలతో వరి పంట దెబ్బతింది. మరోపక్క అదనులో తగినంత వర్షాలు పడక కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు వగైరాల్లో వరి నాట్లు ఆలస్యమయ్యాయి. దీంతో భవిష్యత్తులో బియ్యం సరఫరాకు కొరత రావచ్చు. అదే జరిగితే నింగినంటుతున్న ధరలు నేలకు రావడం కష్టమే. ఎన్నికల వేళ అది దెబ్బ తీస్తుందని భావించిన పాలకులు ఎగుమతులపై నిషేధాస్త్రం సంధించారు. మన దేశపు బియ్యం ఎగుమతుల్లో 25 నుంచి 30 శాతం ఇప్పుడు నిషేధానికి గురైన ఈ బాస్మతీయేతర తెల్ల బియ్యమే. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో మన దేశం 1.7 కోట్ల టన్నులకు పైగా బియ్యాన్ని భారత్ ఎగుమతి చేస్తోంది. నిషేధంతో ఈ ఎగుమతులు 40 శాతం పడిపోవచ్చు.
ఈ నిషేధం తాత్కాలికమేనా?
సహజంగానే దీనిపై దేశంలోని ఎగుమతిదారుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే, ఈ నిషేధం తాత్కాలికమేననీ, మహా అయితే ఆరు నెలల వరకే ఉండచ్చనీ, ప్రపంచ వాణిజ్య సంస్థ బరిలోకి దిగాక పరిస్థితి చక్కబడుతుందనే ఆశ లేకపోలేదు. బంగ్లాదేశ్, అంగోలా, గినియా, కెన్యా, నేపాల్ సహా 140కి పైగా దేశాలకు మన దేశం బియ్యం ఎగుమతి చేస్తోంది. థాయిలాండ్, వియత్నామ్, పాకిస్తాన్, మయన్మార్ లాంటి ఇతర ఎగుమతి దేశాలూ ఉన్నా భారత నిర్ణయంతో ఏర్పడ్డ లోటును అవి భర్తీ చేయలేవు. ఫలితంగా, విపణిలో ఇతర ఆసియా దేశాల నుంచి వచ్చే బియ్యం ధరలూ పెరిగాయి. బియ్యం ఎగుమతిలో ప్రపంచంలో రెండు, మూడు స్థానాల్లో ఉన్న థాయిలాండ్, వియత్నామ్‌ల బియ్యం రేటు హెచ్చింది.
రష్యా యుద్ధంతో ఉక్రెయిన్ నుంచి ఎగుమతులకు ఆటంకం చాలదన్నట్టు అమెరికాలో ధాన్యం పండించే ప్రాంతాలు అధిక ఉష్ణోగ్రతలు, వర్షాభావంతో సతమతమవుతున్నాయి. ఈసారి అమెరికాలో గోదుమల దిగుబడి తగ్గవచ్చు. 16 ఏళ్ళలో ఎన్నడూ లేనంత తక్కువకు నిల్వలు పడిపోవచ్చు. గోదుమలు, బియ్యం – రెంటికీ అగ్రరాజ్యంలో కటకట రావచ్చు. గత ఏడాది మేలో గోదుమల ఎగుమతిపై నిషేధం, సెప్టెంబర్‌లో విరిగిన బియ్యంపైన నిషేధం, బాస్మతీయేతర బియ్యంపై 20 శాతం సుంకం విధింపు... ఆ వరుసలో వచ్చినదే భారత సర్కార్ తాజా ఉత్తర్వు. ఈ ఏడాది మే నుంచి పంచదార ఎగుమతుల్నీ ఆపారు. ఇవన్నీ తిరోగామి చర్యలైనా, దేశీయ సరఫరాలో ఇబ్బందులతో అనివార్యమైంది. ఇప్పుడిప్పుడే వర్షాలు పుంజుకుంటున్నా, నాట్లలో జరిగిన జాప్యం దెబ్బతీయవచ్చు. ఇక, ఎల్‌నినో పొంచి ఉండనేవుంది.
So it begins. India has banned some rice exports and now people are panic buying up rice. pic.twitter.com/ujpm66ER3n— Ian Miles Cheong (@stillgray) July 23, 2023
జబ్బలు చరుచుకున్నాం.. మరి నిషేధం విధించాల్సి రావడమేమిటి?
వీటన్నిటి మధ్య ఈ ఏటి దిగుబడి పరిస్థితి ఏమిటో ఇప్పుడే చెప్పలేం. కానీ, గత ఆర్థిక సంవత్సరం బియ్యం, గోదుమలు – రెండూ ఎన్నడూ లేనంత అధిక దిగుబడినిచ్చాయని జబ్బలు చరుచుకున్నాం. ప్రపంచానికి మనమే ఆహారం అందిస్తున్నామన్నాం. తీరా అప్పుడు గోదుమలు, ఇప్పుడు బియ్యంపై ఇలా నిషే«ధం విధించాల్సి రావడమేమిటి? ఇది బేతాళ ప్రశ్న. అలాగే, ఏళ్ళ తరబడి కష్టంతో ప్రపంచ విపణిలో ఎగుమతిదారుగా సంపాదించుకున్న పేరుకు ఈ నిషేధపుటుత్తర్వులు చేటు చేస్తాయి.
గుండుగుత్తగా ఎగుమతులపై నిషేధమనే కన్నా, నిర్ణీత కనీస ధరకు తక్కువైతే ఎగుమతుల్ని అను మతించబోమని చెప్పవచ్చు. దేశీయంగా ఆహార ధరలు నియంత్రించాలంటే పాలకులు ప్రత్యామ్నా యాలు ఆలోచించక తప్పదు. వాణిజ్య విధానాన్ని ఘడియకోసారి మార్చడం మార్గం కానే కాదు!
Comments
Please login to add a commentAdd a comment