Fights over rice bags in US stores - Sakshi
Sakshi News home page

వీడియో: భారత్‌ బ్యాన్‌ డెసిషన్‌.. యూఎస్‌లో బియ్యం కష్టాలకు అసలు కారణం ఇదే..

Jul 22 2023 11:32 AM | Updated on Jul 22 2023 12:08 PM

Fights over rice bags in US stores After India Rice Export Ban - Sakshi

బియ్యం ఎగుమతులపై భారత్‌ బ్యాన్‌ విధించడంతో.. 

ఢిల్లీ: విదేశాలకు బియ్యం ఎగుమతులపై భారత్‌ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. గురువారం రాత్రి తీసుకున్న ఈ నిర్ణయం.. అమెరికాలో దావానంలా పాకింది. దీంతో ఎక్కడ బియ్యం కొరత.. సంక్షోభం తలెత్తుతాయనే భయంతో బియ్యం కోసం ఎగబడిపోతున్నారు మనవాళ్లు. ఈ క్రమంలోనే అమెరికాలో మునుపెన్నడూ కనిపించని పరిస్థితులు కనిపిస్తున్నాయి.

 

అమెరికాలో బియ్యం స్టోర్‌ల ముందు నో స్టాక్‌ బోర్డులు కనిపిస్తుండగా.. ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రత్యేకించి సోనామసూరికి విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది.  దీంతో భారతీయులకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. 

అమెరికాలో  బియ్యం కోసం భారతీయులు.. ఎక్కువగా తెలుగువాళ్లు  ఎగబడుతున్నారు. మార్ట్‌ల బయట క్యూలు కడుతున్నారు. అగ్రరాజ్యంలో ఇప్పటికే నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వీటికి తోడు ఎక్కడ  బియ్యం సంక్షోభం వస్తుందనే భయంతో..  ఒక్కొక్కరు ఐదారు బాగ్యులకు మించి కొనుగోలు చేస్తున్నారు. దీంతో పరిమితంగా కొనుగోలు చేయాలనే నోటీసులు కనిపిస్తున్నాయి. చాలా చోట్ల ఇప్పటికే నో స్టాక్‌ బోర్డులూ కనిపిస్తున్నాయి. ఇక అదే అదనుగా..  అధిక ధరలు వసూలు చేస్తున్నారు. 

భారత్‌ బియ్యానికే అగ్రతాంబూలం
ప్రపంచంలో.. 90 శాతం బియ్యం ఆసియా నుంచే ఉత్పత్తి అవుతుండగా.. అందులో 45 శాతం వాటా భారత్‌దే. ఇక బాస్మతి బియ్యం ఉత్పత్తిలోనూ 80 శాతం భారత్‌దే ఉంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారుగా భారత్‌ ఉండగా.. 2012 నుంచి అతిపెద్ద ఎగుమతిదారుగా ఉంటూ వస్తోంది. ఇక చైనా, థాయ్‌లాండ్‌, మెక్సికో తదితర దేశాల నుంచి బియ్యం ఎక్కువగా అమెరికా దిగుమతి చేసుకుంటుంది. అయితే.. మన బియ్యానికే అక్కడ క్రేజ్‌ ఎక్కువ. ఈ ప్రాధాన్యం ఇవ్వడంతోనే తాజా పరిస్థితి నెలకొంది.

అందుకే నిషేధం
ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది రుతు పవనాలు ఆలస్యంగా ప్రవేశించాయి. దీని వల్ల దేశంలో చాలా ప్రాంతాల్లో వరినాట్లు ఆలస్యమయ్యాయి. ఫిబ్రవరి, మార్చి నెలల్లో కురిసిన వర్షాల మూలంగా చాలా చోట్ల పంట నష్టం జరిగింది. దీని వల్ల ఈ సారి దిగుబడులపై ప్రభావం ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో బియ్యం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ధరల పెరుగుదల ప్రభావం ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారి తీసుకుందని ప్రభుత్వం భావించింది. దీంతో బియ్యం ఎగుమతులపై నిషేధం విధించాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. విదేశాలకు నాన్‌-బాస్మతి బియ్యం ఎగమతులపై నిషేధం విధిస్తూ డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (డిజీఎఫ్‌టీ) గురువారం నాడు నోటిఫికేషన్‌ జారీ చేసింది.

పాక్షికంగా మరపట్టిన, పూర్తిగా మరపట్టిన, తెల్లటి బియ్యంపై ఈ నిషేధం వర్తిస్తుంది. నోటిఫిికేషన్‌కు ముందే ఓడల్లోకి బియ్యాన్ని లోడ్‌ చేసి ఉంటే అలాంటి వాటిని అనుమతి ఇస్తామని తెలిపింది. ఆహార భద్రత కింద కేంద్ర ప్రభుత్వం అనుమతించిన దేశాలకు మాత్రం బియ్యం ఎగుమతులు యధావిధిగా జరుగుతాయని స్పష్టం చేసింది.

తద్వారా దేశీయ మార్కెట్‌లో బియ్యం ధరలు కొంత మేర తగ్గుతాయని కేంద్రం భావిస్తోంది.  అయితే.. మన దేశం నుంచి బియ్యం ఎగుమతులను నిషేధించడం వల్ల మన దేశం నుంచి దిగుమతులు చేసుకునే దేశాల్లో వీటి ధరలు భారీగా పెరుగుతాయని కేంద్రం ముందుగానే అంచనా వేసింది. అదే ఇప్పుడు నిజమవుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement