
పనామా సిటీ: భారతీయులు సహా సుమారు 300 మంది అక్రమ వలసదారుల్ని లాటిన్ అమెరికా దేశం పనామాలో ఉంచింది అమెరికా. అయితే.. నిర్బంధ కేంద్రంలో వాళ్లంతా దయనీయమైన స్థితిలో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. తమకు సాయం అందించాలని కొందరు ఫ్లకార్డులను ప్రదర్శించడమే అందుకు కారణం. అయితే పనామాలో ఉన్న భారత రాయబార కార్యాలయం ఈ అంశంపై స్పందించింది.
పనామా(Panama)లోని ఓ హోటల్‌లో వాళ్లంతా సురక్షితంగానే ఉన్నట్లు ప్రకటించింది. వాళ్లకు అవసరమైనవన్నీ ఇక్కడి అధికారులు అందిస్తున్నారని, వాళ్ల భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదని స్పష్టం చేసింది. ఈ విషయమై అక్కడి అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నాం అని భారత ఎంబసీ ఎక్స్ ద్వారా తెలిపింది.
Panamanian authorities have informed us that a group of Indians have reached Panama from US
They are safe and secure at a
Hotel with all essential facilities
Embassy team has obtained consular access
We are working closely with the host Government to ensure their wellbeing pic.twitter.com/fdFT82YVhS— India in Panama, Nicaragua, Costa Rica (@IndiainPanama) February 20, 2025
భారత్,ఇరాన్, నేపాల్,శ్రీలంక, పాకిస్థాన్, అఫ్గనిస్థాన్, చైనాకు చెందిన అక్రమ వలసదారుల్ని అమెరికా నుంచి పనామాకు తరలించారు అధికారులు. హోటల్ అయిన ఆ నిర్బంధ కేంద్రం చుట్టూ తుపాకులతో సిబ్బంది ఉన్న ఫొటోలు వైరల్ అయ్యాయి. అదే టైంలో.. వలసదారుల్లో కొందరు సాయం కావాలని, తాము తమ దేశంలో సురక్షితంగా ఉండలేమంటూ హోటల్ అద్దాల గదుల నుంచి ఫ్లకార్డులు ప్రదర్శించారు. ఆ దృశ్యాలు వైరల్ కావడంతో.. ఆందోళన మొదలైంది.

అయితే అక్రమ వలసదారుల్ని(Illegal Migrants) నేరుగా స్వస్థలాలకు పంపడంలో అమెరికా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అందుకే పనామాను వారధిగా(ట్రాన్సిట్ కంట్రీ) ఉపయోగించుకుంటోంది. ఇక వలసదారుల ఆందోళనలను పనామా తోసిపుచ్చుతోంది. అమెరికాతో ఉన్న వలసదారుల ఒప్పందం మేరకు..వాళ్లను ఇక్కడ ఉంచాల్సి వచ్చిందని పనామా సెక్యూరిటీ మినిస్టర్ ఫ్రాంక్ అబ్రెగో వెల్లడించారు. వాళ్లకు సకాలంలో ఆహారం, మందులు..ఇతర సదుపాయాలు అందుతున్నాయని వెల్లడించారాయన. అయితే..వాళ్లలో చాలామంది హోటల్ దాటే ప్రయత్నాలు చేశారని, అందుకే కాపలా ఉంచాల్సి వచ్చిందని పేర్కొన్నారు.బుధవారం చైనాకు చెందిన ఓ మహిళ పారిపోయే ప్రయత్నంలో పట్టుబడిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అక్రమ వలసదారుల్ని ఇక్కడి(పనామా) నుంచే స్వస్థలాలకు పంపనున్నట్లు తెలిపారాయన.
ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 5 నుంచి ఇప్పటిదాకా అమెరికా నుంచి భారత్‌కు 332 మంది అక్రమ వలసదారుల్ని పంపించి వేసింది. ఈ మేరకు మూడు దఫాలుగా అమృత్‌సర్‌లో అమెరికా యుద్ధ విమానం వలసదారుల్ని తీసుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment