అత్తగారి కుటుంబంతో సరదాగా.. అమెరికాకు కాబోయే ఉపాధ్యక్షుడి ఫొటో వైరల్‌ | Jd Vance With His Wife Indian Family Has Gone Viral | Sakshi
Sakshi News home page

అత్తగారి కుటుంబంతో సరదాగా.. అమెరికాకు కాబోయే ఉపాధ్యక్షుడి ఫొటో వైరల్‌

Dec 3 2024 6:09 PM | Updated on Dec 3 2024 6:51 PM

Jd Vance With His Wife Indian Family Has Gone Viral

వాషింగ్టన్‌ : అమెరికాకు కాబోయే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌, సతీమణి ఉష చిలుకూరి దంపతుల ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అమెరికా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనా.. సాదాసీదాగా నీలిరంగు టీ షర్ట్‌ ధరించిన జేడీ వాన్స్‌ తన కుమారుడిని ఎత్తుకున్నారు. 

తన భార్య ఉష చిలుకూరి తరఫు బంధువులతో సరదాగా గడిపారు. ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. గతవారం అమెరికాలో థ్యాంక్స్‌ గివింగ్‌ డే సందర్భంగా ఈ ఫొటో దిగినట్లు తెలుస్తోంది. ఈ ఫొటోని సిలికాన్‌ వ్యాలీ వెంచర్‌ క్యాప్టలిస్ట్‌ ఆషా జెడేజా మోత్వాని ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. 


జేడీ వాన్స్‌ తెలుగు వారి అల్లుడే
అమెరికా ఉపాధ్యక్ష పదవిని అధిరోహించబోతున్న రిపబ్లికన్‌ నేత జేడీ వాన్స్‌ తెలుగు వారి అల్లుడే. ఆయన భార్య చిలుకూరి ఉషాబాల తెలుగు సంతతికి చెందిన వారే కావడం విశేషం. 38 ఏళ్ల ఉషా అమెరికాలో జన్మంచినప్పటికీ ఆమె తాత, ముత్తాలది మాత్రం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వడ్లూరు గ్రామమని ఆ గ్రామపెద్దలు చెబుతున్నారు. చిలుకూరి ఉషాబాల ముత్తాత రామశాస్త్రి కొంత భూమిని గ్రామంలో ఆలయం కోసం దానంగా ఇచ్చారు. ఆ స్థలంలోనే గ్రామస్తుల సహకారంతో సాయిబాబా ఆలయం, మండపాన్ని నిర్మించారు. 

ఆంధ్రా విశ్వవిద్యాలయ విశ్రాంత తెలుగు అధ్యాపకురాలు శాంతమ్మ మరిది రామశాస్త్రి కుమారుడు రాధాకృష్ణ. ఆ రాధాకృష్ణ కూతురే ఉష. ఉషా తల్లిదండ్రులు రాధాకృష్ణ, లక్ష్మి 1980లలోనే అమెరికాలో స్థిరపడ్డారు. వీళ్ల సంతానం ముగ్గురిలో ఉషా ఒకరు. కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలం సాయిపురం గ్రామంలోనూ ఉష పూరీ్వకులున్నారు. ఆమెకు తాత వరసైన రామ్మోహనరావు కుటుంబం ప్రస్తుతం ఈ గ్రామంలోనే నివసిస్తోంది. 

ఉష పూర్వీకులు దశాబ్దాల కిందటే ఇతర ప్రాంతాలకు వెళ్లిపోగా సాయిపురంలో 18వ శతాబ్దంలో చిలుకూరి బుచ్చిపాపయ్య శాస్త్రి నివసించారు. ఆయన వంశవృక్షమే శాఖోపశాఖలుగా, కుటుంబాలుగా విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, చెన్నై నగరాలుసహా అమెరికా, ఇతర దేశాల్లో స్థిరపడ్డారు. ఉషా ముత్తాత వీరావధాన్లుకు ఐదుగురు సంతానం. రామశాస్త్రి, సూర్యనారాయణ శాస్త్రి, సుబ్రహ్మణ్యశాస్త్రి, వెంకటేశ్వర్లు, గోపాలకృష్ణమూర్తి. వీరందరూ ఉన్నత విద్యావంతులే. 

తొలి భారత సంతతి ‘సెకండ్‌ లేడీ’ 
అమెరికా అధ్యక్షుడి భార్యను ప్రథమ మహిళగా, ఉపాధ్యక్షుడి భార్యను సెకండ్‌ లేడీగా సంబోధించడం అమెరికాలో పరిపాటి. భర్త వాన్స్‌ వైస్‌ప్రెసిడెంట్‌గా ఎన్నికైన నేపథ్యంలో ఉషా తొలి భారతసంతతి ‘సెకండ్‌ లేడీ’గా చరిత్ర సృష్టించనున్నారు. కాలిఫోర్నియాలోని శాండియాగో ప్రాంతంలో ఉషా జన్మించారు. యేల్‌ విశ్వవిద్యాలయం నుంచి చరిత్రలో డిగ్రీ పట్టా సాధించారు. కేంబ్రిడ్జ్‌ వర్సిటీ నుంచి తత్వశాస్త్రంలో మాస్టర్స్‌ చేశారు. సహాయకురాలిగా న్యాయ సంబంధమైన విభాగాల్లో చాలా సంవత్సరాలు విధులు నిర్వర్తించారు. సుప్రీంకోర్టు ఇద్దరు మాజీ న్యాయమూర్తుల వద్ద పనిచేశారు. గతంలో యేల్‌ లా జర్నల్‌కు ఎగ్జిక్యూటివ్‌ డెవలప్‌మెంట్‌ ఎడిటర్‌గా పనిచేశారు. యేల్‌ వర్సిటీలో లా అండ్‌ టెక్‌ జర్నల్‌కు మేనేజింగ్‌ ఎడిటర్‌గా ఉన్నారు. చివరిసారిగా ముంగర్, టోల్స్,ఓల్సన్‌ సంస్థలో పనిచేశారు. యేల్‌ విశ్వవిద్యాలయంలో ఆమె అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 

విద్యావంతులైన తల్లిదండ్రులు 
ఉషా తల్లిదండ్రులు ఇద్దరూ విద్యావంతులే. తల్లి లక్ష్మి అణుజీవశాస్త్రంలో, జీవరసాయన శాస్త్రంలో పట్టబధ్రులు. ప్రస్తుతం ఆమె అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. శాన్‌డియాగోలోని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలో కార్యనిర్వాహక పదవిలోనూ కొనసాగుతున్నారు. ఉషా తండ్రి రాధాకృష్ణ వృత్తిరీత్యా ఏరోస్పేస్‌ ఇంజినీర్‌. ఆయన గతంలో ఐఐటీ మద్రాస్‌లో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చేశారు. ఆయన ప్రస్తుతం యునైటెడ్‌ టెక్నాలజీస్‌ ఏరోస్పేస్‌ సిస్టమ్స్‌లో ఏరోడైనమిక్స్‌ స్పెషలిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. దాంతోపాటే కాలిన్స్‌ ఏరోస్పేస్‌లో అసోసియేట్‌ డైరెక్టర్‌గా సేవలందిస్తున్నారు. 

వాన్స్‌తో ఉష పరిచయం 
యేల్‌ లా స్కూల్‌లో ఉషా, వాన్స్‌ తొలిసారి కలిశారు. 2013లో ఇద్దరూ కలిసి వర్సిటీలో ఒక చర్చాకార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఆ తర్వాతే ఇద్దరి పరిచయం ప్రేమకు దారితీసింది. 2014 ఏడాదిలో వీరు పెళ్లాడారు. హిందూ సంప్రదాయం ప్రకారమే పెళ్లిచేసుకోవడం విశేషం. వీరికి కూతురు మీరాబెల్, కుమారులు ఎవాన్, వివేక్‌ ఉన్నారు. భర్త వాన్స్‌కు చేదోడువాదోడుగా ఉంటూ విజయంలో ఉషా కీలకపాత్ర పోషించారు. ‘భార్యే నా ధైర్యం. చెబితే నమ్మరుగానీ ఆమె నాకంటే చాలా తెలివైన వ్యక్తి’అని ఉషను పొగడటం తెల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement