ఉసురు తీస్తున్న అమెరికా డ్రీమ్స్‌ | Indians form third largest illegal immigrant population in US | Sakshi
Sakshi News home page

ఉసురు తీస్తున్న అమెరికా డ్రీమ్స్‌

Published Wed, Sep 4 2024 3:04 AM | Last Updated on Wed, Sep 4 2024 3:04 AM

Indians form third largest illegal immigrant population in US

అగ్రరాజ్యంలోకి చొరబడేందుకు మనోళ్ల అడ్డదార్లు

అడ్డంగా దోచుకుంటున్న మాఫియా గ్యాంగులు 

రూ.40 లక్షల నుంచి 80 లక్షల దాకా వసూళ్లు 

స్త్రీలపై అత్యాచారాలు, మగవాళ్లకు చిత్రహింసలు 

నిస్సహాయంగా ప్రాణాలూ కోల్పోతున్న వైనం 

అక్రమ వలసల్లో మనోళ్లదే మూడో స్థానం 

7.25 లక్షలు దాటిన భారతీయులు 

గతేడాది 97 వేల దాకా పట్టుబడ్డ వైనం

అమెరికా. ఊహల స్వర్గం. ముఖ్యంగా భారత యువతకైతే ఎలాగైనా చేరి తీరాలనుకునే కలల తీరం. ఇందుకోసం చాలామంది ప్రాణాలనే పణంగా పెడుతున్నారు. చదువు, నైపుణ్యం వంటి అర్హతలు లేకున్నా అక్రమంగానైనా అగ్రరాజ్యం చేరాలని ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో కరడుగట్టిన మాఫియా ముఠాల కబంధ హస్తాల్లో చిక్కి సర్వం కోల్పోతున్నారు. ధనం, మానంతో పాటు కొన్నిసార్లు నిస్సహాయంగా ప్రాణాలూ పోగొట్టుకుంటున్నారు. కన్నవారికి, అయినవారికి కడుపుకోత మిగులుస్తున్నారు. అయినా అత్యంత ప్రమాదకరమైన ‘డంకీ’ మార్గాల్లో అమెరికా బాట పడుతున్న భారతీయుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది...  – సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

ఇటీవల వచ్చిన షారుఖ్‌ ఖాన్‌ సినిమా డంకీ గుర్తుందా? అక్రమంగా ఇంగ్లండ్‌ చేరేందుకు కొందరు చేసే ప్రయత్నమే దాని ఇతివృత్తం. ఇలా అక్రమ దారుల్లో దేశాలు దాటడాన్ని ‘డంకీ మార్గం’గా పిలుస్తారు. ఇదో పంజాబీ పదం. ఇలా అమెరికా చేరేందుకు ప్రయతి్నస్తున్న భారతీయుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఆ క్రమంలో ప్రమాదకరమైన మార్గాలను ఎంచుకుంటూ, మనుషులను అక్రమంగా చేరవేసే మాఫియా చేతుల్లో నానారకాలుగా చిత్రవధకు గురవుతున్నట్టు స్కై న్యూస్‌ వార్తా సంస్థ వెల్లడించింది.

ఈ విధంగా మానప్రాణాలను రిసు్కలో పెట్టుకుంటున్న భారతీయుల సంఖ్య ఏటా పెరుగుతున్నట్టు తన నివేదికలో పేర్కొంది. ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ నివేదిక ప్రకారం 2022 నాటికే అమెరికాలోకి అక్రమంగా వలస వెళ్లిన భారతీయుల సంఖ్య ఏకంగా 7.25 లక్షలు దాటేసింది. ఈ జాబితాలో మెక్సికో, ఎల్‌ సాల్వెడార్‌ తర్వాత మనోళ్లు మూడో స్థానంలో ఉన్నారు. 2023లో రికార్డు స్థాయిలో ఏకంగా 96,917 మంది భారతీయులను అమెరికాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండగా నిర్బంధించడమో, బలవంతంగా వెనక్కు పంపడమో జరిగినట్టు యూఎస్‌ కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ విభాగం గణాంకాలు చెబుతున్నాయి. 

అమెరికాకు రూటు ఇలా.. 
అమెరికాలో అక్రమంగా ప్రవేశించదలచే భారతీయులు తొలుత పనామా, కోస్టారికా, ఎల్‌ సాల్వడార్, గ్వాటెమాలా వంటి సెంట్రల్‌ అమెరికా దేశాలకు చేరతారు. మాఫియా ప్రపంచంలో వీటికి అమెరికాకు గేట్‌వేలుగా పేరు. ఈ దేశాల వీసా తేలిగ్గా లభిస్తుంది. పైగా అక్కడి నుంచి తొలుత మెక్సికోకు, ఆపై అమెరికాకు చేరడం సులువు. ఆయా దేశాల నుంచి వీళ్లను అమెరికా చేర్చేందుకు ఒక నమ్మకమైన గైడ్‌ను అక్రమ రవాణా మాఫియాయే ఏర్పాటు చేస్తుంది. అతన్ని కొయొటోగా పిలుస్తారు. అయితే అత్యంత కష్టతరం, ప్రమాదకరం అయిన మార్గాల గుండా సాగే ఈ ప్రయాణం అక్షరాలా ప్రాణాంతకమే! దీనికి కొన్నిసార్లు ఒక్రటెండేళ్ల సమయం కూడా పడుతుంది! భారతీయులపై నానారకాల అకృత్యాలు జరిగేది కూడా ఈ దశలోనే.

 అమెరికాలోకి సరిహద్దు దాటించేందుకు ఏటా మూడు సీజన్లుంటాయి. నేను సీజన్‌కు సగటున 500 మందిని పంపుతుంటా.      – స్కై న్యూస్‌తో ఒక ఏజెంట్‌

  ‘అమెరికా వెళ్లేందుకు నా సేవింగ్స్‌ అన్నీ ఊడ్చి మరీ మాఫియాకు రూ.40 లక్షలు చెల్లించా. కానీ నన్ను కఠ్మాండూ తీసుకెళ్లి బంధించారు. మావాళ్ల నుంచి డబ్బులు డిమాండ్‌ చేశారు.     – సుభాష్‌ కుమార్‌ (26)

ఆ సరిహద్దు.. ప్రత్యక్ష నరకం
కిందా మీదా పడి అమెరికా సరిహద్దు దాకా చేరేవారిది మరో రకం దైన్యం. ముఖ్యంగా మెక్సికో బోర్డర్‌ వద్ద చిక్కుపడేవారైతే అక్షరాలా నరకం చవిచూస్తున్నారు. ఆ ప్రాంతమంతా మెక్సికన్‌ మాఫియా నియంత్రణలో ఉంటుంది. దాంతో బాలికలు, మహిళలపై ఇష్టారాజ్యంగా లైంగిక దాడులు, అత్యాచారం జరుగుతున్నాయి. వాళ్లను బలవంతంగా వేశ్యా వృత్తిలోకి కూడా దించుతున్నారు. అక్కడ సగటున ప్రతి ముగ్గురిలో ఒకరిపై లైంగిక దాడి జరుగుతున్నట్టు అంచనా.  

సర్వం తెగనమ్ముకుని..
తమ పిల్లలను ఎలాగైనా అమెరికా పంపడమే లక్ష్యంగా సర్వం తెగనమ్ముకుంటున్న వారికి కొదవ లేదు. మాఫియా అడిగినంత ఇచ్చుకునేందుకు ఇల్లు, పొలం, నగా నట్రా వంటివన్నీ తాకట్టు పెట్టడమో, అమ్మడమో చేస్తున్నారు. అలా ఆస్తులన్నీ అమ్మించి అమెరికా బాట పట్టిన మలీ్కత్‌సింగ్‌ అనే 30 ఏళ్ల టెక్నాలజీ గ్రాడ్యుయేట్‌ దోహా, అల్మాటీ, ఇస్తాంబుల్, పనామా సిటీ గుండా చివరికి ఎల్‌ సాల్వడార్‌ చేరుకున్నాడు. అక్కడ మాఫియా చేతిలో దుర్మరణం పాలయ్యాడు. చివరికి ఓ సోషల్‌ మీడియా పోస్టు ద్వారా అతని మృతదేహాన్ని గుర్తించి తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. సాహిల్‌ అనే మరో 19 ఏళ్ల యువకుడు పనామా నుంచి బయల్దేరి మార్గమధ్యంలోనే గల్లంతయ్యాడు. అప్పట్నుంచీ అతని ఆచూకీ కోసం తండ్రి శివకుమార్‌ (45) చేయని ప్రయత్నమంటూ లేదు.

ఇదీ పరిస్థితి
డంకీ రూటు సెంట్రల్‌ అమెరికా దేశాల మాఫియాకు కొన్నేళ్లుగా ఆకర్షణీయమైన వ్యాపారంగా మారింది. 
  అమెరికా చేర్చేందుకు 50 వేల నుంచి లక్ష డాలర్ల దాకా (రూ.40 లక్షల నుంచి రూ.80 లక్షలు) వసూలు
చేస్తున్నాయి. 
 వీళ్లకు ఉత్తర భారతదేశంలో పలు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో ఏజెంట్లున్నారు. 
వీరి వల్లో పడేవాళ్లలో ప్రధానంగా పంజాబ్, హరియాణా రాష్ట్రాల యువత సంఖ్యే అధికం. 
ఆశావహులు ముందుగా విమాన మార్గంలో పనామా తదితర దేశాలకు చేరతారు. 
అక్కడినుంచి వీళ్ల జుట్టు పూర్తిగా మాఫియా ముఠాల చేతికి చిక్కుతుంది. 
దట్టమైన అడవులు, పర్వత ప్రాంతాలు, జలమార్గాలను దాటుతూ వెళ్లాల్సి ఉంటుంది. 
అలా అమెరికా చేరేదాకా ప్రయాణమంతా ‘వాళ్ల దయ, వీళ్ల ప్రాప్తం’ అన్నట్టుగా ఉంటుంది. 
⇒  చాలాసార్లు ఫేక్‌ బోర్డింగ్‌ పాసులు, వీసాలు చేతిలో పెట్టి ‘ఇదే అమెరికా’ అంటూ నమ్మించి మార్గమధ్యంలోనే వదిలేస్తుంటారు. 
ఇలాంటి వాళ్లంతా పోలీసులకో, క్రిమినల్‌ గ్యాంగులకో చిక్కుతారు. అంతిమంగా వాళ్లకు చిప్ప కూడు, చిత్రహింసలే 
గతవుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement