ఉగ్రవాదైనా ఉరితీయొద్దు!
కాంగ్రెస్ ఎంపీ థరూర్ వ్యాఖ్య
తిరువనంతపురం: మరణశిక్షకు తాను వ్యతిరేకమని కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ మరోసారి స్పష్టంచేశారు. ఉగ్రవాదులను సైతం ఉరితీయరాదని, వారిని జీవితాంతం పెరోల్ లేకుండా జైల్లోనే ఉంచాలని పేర్కొన్నారు. దేశాలు హంతకుల మాదిరి ప్రవర్తించకూడదని పేర్కొన్నారు. నేర న్యాయ వ్యవస్థలో కూడా అనేక లోటుపాట్లు, పాక్షిక దృష్టి కోణాలున్నాయన్నారు. ‘పాతకాలంలో ఓ వ్యక్తి ఎవరినైనా చంపితే అతడిని కూడా చంపేయాలనుకునేవారు. ఆ కాలం చెల్లిన ఆలోచన ధోరణిని మనం ఇంకా పాటించడం ఎందుకు? మనం మరణశిక్ష వేస్తున్నామంటే ఆ పాతవారి లాగే ప్రవర్తిస్తున్నామని అర్థం.
ఉగ్రవాదులైనా సరే ఉరేయకూడదు. వారు బతికున్నంత కాలం పెరోల్ లేకుండా జైల్లోనే ఉంచితే సరిపోతుంది’ అని ఆదివారమిక్కడ ఓ కార్యక్రమంలో అన్నారు. యాకూబ్ మెమన్ ఉరిశిక్షపై తాను ట్విటర్‌లో వివాదాస్పద వ్యాఖ్యలేమీ చేయలేదని స్పష్టంచేశారు. ‘ప్రపంచంలో 143 దేశాలు ఉరిశిక్షను రద్దు చేశాయి. ఉరిశిక్ష వేయాలని చట్టాల్లో ఉన్నా.. వాటికి జోలికి వెళ్లని దేశాలు మరో 25 ఉన్నాయి. అలాంటప్పుడు మనదేశం ఉరిశిక్షను ఎందుకు అమలు చేయాలి?’ అని ప్రశ్నించారు.