న్యాయస్థానాల ఏర్పాటు మా పనికాదు: సుప్రీం
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థ వేగం పుంజుకోవడానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పెండింగ్ లో కేసులను సత్వరమే పరిష్కారించాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. ఇందుకోసం అదనపు కోర్టులు ఏర్పాటు చేయాలని, న్యాయవ్యవస్థకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ ఎమ్ లేధా నేతృత్వంలోని బెంచ్ పేర్కొంది.
కొత్త కోర్టులు తాము ఏర్పాటు చేయలేమని, ఆ బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. లా సెక్రటరీలు, అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించి ఈ దిశగా ముందుకెళ్లాలని దిశానిర్దేశం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి కోర్టుల్లో మౌలిక సదుపాయాలు మెరుగు పరిచేందుకు చర్యలు చేపట్టాలని సూచించింది. నెల రోజుల్లోగా ఈ ప్రతిపాదనతో రావాలని కేంద్రాన్ని కోరింది. నేషనల్ పాంథర్స్ పార్టీ అధ్యక్షుడు భీమ్ సింగ్ వేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.