గాంధీనగర్: దేశంలో నేర న్యాయ వ్యవస్థను, ఫోరెన్సిక్ సైన్స్ దర్యాప్తును మిళితం చేయాలని భావిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల కంటే అధికంగా మన దేశంలో నేర నిరూపణల శాతాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఆరేళ్లకుపైగా జైలుశిక్ష పడేందుకు అవకాశం ఉన్న కేసుల్లో ఫోరెన్సిక్ దర్యాప్తును తప్పనిసరి, చట్టబద్ధం చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు.
అమిత్ షా ఆదివారం గుజరాత్‌లోని గాంధీనగర్‌లో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ(ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ) మొదటి స్నాతకోత్సవంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. దేశవ్యాప్తంగా ప్రతిజిల్లాలో ఫోరెన్సిక్ మొబైల్ దర్యాప్తు సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు వివరించారు. ఫోరెన్సిక్ దర్యాప్తు స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చట్టపరమైన చర్యలు చేపడతామన్నారు. ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(సీఆర్‌పీసీ), ఎవిడెన్స్ యాక్ట్‌లో మార్పులు తీసుకురానున్నట్లు వెల్లడించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ చట్టాలను ఎవరూ భారతీయ దృష్టికోణంలో చూడడం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment