Forensic Science Laboratory
-
ఇంకా సుత్తి, శానం వాడుతుండడం బాధాకరం..
ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వైద్యశాస్త్ర విభాగానికి సంబంధించి ఇటీవలి కాలం (2017)లో... హైకోర్టు క్రిమినల్ అప్పీల్ నం. 326లో వెల్లడించిన ఆదేశాలను అనుసరించి, ఒక సమూల ప్రక్షాళనకై ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించింది. హైకోర్టు న్యాయమూర్తులు తమ తీర్పులో శవపరీక్షల నిర్వహణలో పాటించాల్సిన శాస్త్రబద్ధమైన ప్రమాణాలు, తదనంతరం తయారు చేసే నివేదికల నిబద్ధతపై విస్తృతంగా చర్చించారు. ఆధునిక సమాజంలో ప్రజల అసహజ మరణాలకు గల కారణాలను తెలుసుకోవడం, దోషులను శిక్షించడం, నేరాలను నివారించడం ప్రభుత్వాల బాధ్యత. ఈ ప్రక్రియలో పోలీసులు, కోర్టు లతో పాటు ఫోరెన్సిక్ వైద్యుల పాత్ర చెప్పుకోదగ్గది.గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున వైద్యుల నియామకాలు జరిగిన పుణ్యమా అని చాలాచోట్ల ఫోరె న్సిక్ వైద్యులు అందుబాటులో ఉండడంచేత శవపరీక్షలు నాణ్యతా ప్రమాణాలతో నిర్వహించడానికి అవకాశం ఏర్పడింది. అయితే హైకోర్టు ఆశించిన విధంగా న్యాయ వైద్య శాస్త్రంలో అంతర్జాతీయ ప్రమాణాలు పాటించడానికి నియమ నిబంధనావళి రూపొందించడం ఈ విశేషజ్ఞుల కమిటీకి పెద్ద కష్టమైన పని కాకపోయినప్పటికీ... దానిని ఆచరణలో పెట్టాలంటే మన శవాగారాలను ఆధునీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాల చోట్ల శవాలను భద్రపరిచే శీతల వ్యవస్థ (కోల్డ్ స్టోరేజ్) అవసరాలకు సరిపోయేలా లేదు.మన మార్చురీలలో బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ.. ముఖ్యంగా ద్రవ వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాల్సి వుంది. శవపరీక్షలు చేయడానికి కావల్సిన ఆధునిక పనిముట్లు చాలాచోట్ల అందుబాటులో లేవు. ప్రపంచం అంతా ఎలక్ట్రిక్ రంపాలతో పుర్రెలను తొలచి మెదడును పరీక్షిస్తుంటే, మనం మాత్రం పాత పద్ధతిలో ఇంకా సుత్తి, శానం వాడుతుండడం బాధాకరం. కొన్ని అసహజ మరణాలను పరిశోధించడానికి బాడీ శాంపుల్స్‌ను దూరంగా ఉన్న ప్రయోగశాలలకు పంపాల్సి ఉంటుంది, అప్పటివరకు ఆ నమూనాలను పరిరక్షించడానికి డీప్ ఫ్రీజర్లు, అవి చెడిపోకుండా ఉండడానికి ప్రత్యేక సంరక్షక ద్రవ్యాలు అవసరం అవుతాయి. ఈ ప్రాథమిక మౌలిక సదుపాయాలు కల్పన పని నాణ్యతను పెంచడానికి ఎంతగానో దోహదపడతాయి.చదవండి: నిజంగా పవన్ కల్యాణ్‌కు ఆ ధైర్యం ఉందా?ఆంధ్రప్రదేశ్‌లోని న్యాయ వైద్య శాస్త్ర ప్రయోగశాలలు (ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీస్) అనేక విష పదార్థాల కారణంగా మరణించినవారి శవపరీక్షలలో పరిమాణాత్మక ఫలితాలను అందించ లేకపోతున్నాయి. అనేక విషాలను గుణాత్మకంగా గుర్తించడంలో పేలవంగా ఉన్నాయి. కాలం చెల్లిన విశ్లేష ణాత్మక విషశాస్త్ర పద్ధతులు (ఎనటికల్ టాక్సికాలజీ) ఉపయోగించడమే దీనికి గల ముఖ్య కారణం. ఎఫ్ఎస్ఎల్లు న్యాయ వైద్య విభాగం మధ్య సరిగ్గా సమన్వయం లేక పోవడం కొన్ని కేసుల న్యాయ విచారణ విఫలమయ్యేందుకు కూడా కారణ మవుతోంది.మొత్తంగా న్యాయ వైద్యశాస్త్ర విభాగం బాగుపడాలంటే... మన మార్చురీలలో, న్యాయ వైద్య ప్రయోగశాలల్లో, పోలీస్ వ్యవస్థలో, అలాగే సంబంధిత వ్యక్తులకు వృత్తి పట్ల అంకిత భావంలో పెను మార్పులు అవసరం.– కట్టంరెడ్డి అనంత రూపేష్ రెడ్డిసహాయ ఆచార్యులు, న్యాయ వైద్య శాస్త్రం– విష విజ్ఞాన శాస్త్రం, ఆంధ్ర వైద్య కళాశాల -
న్యాయం వేగంగా జరిగేనా?
కేంద్ర ప్రభుత్వం నూతనంగా భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య చట్టాలను తెచ్చింది. పార్లమెంట్ భద్రతా వైఫల్యం గురించిన ప్రతిపక్షాల ఆందోళన, బదులుగా అత్యధిక ఎంపీలు సస్పెండ్ కావడంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కొత్త బిల్లులు చర్చ లేకుండానే ఆమోదం పొందాయి. ఇందులో పోలీసు కస్టడీ సంభావ్య వ్యవధికి సంబంధించిన భారీస్థాయి విస్తరణ, పౌర హక్కుల పరిరక్షణ మూలాన్నే దెబ్బతీస్తోంది. ఈ నూతన చట్టాలు వలసవాద తార్కికతకు తిరిగి శంకుస్థాపన చేశాయి. ఇక్కడ ప్రజలను గరిష్ఠ స్థాయిలో నియంత్రించడమే ప్రభుత్వ ప్రధాన ఆసక్తిగా ఉంది. అయితే దర్యాప్తు, విచారణ సమయంలో సమయపాలన,సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించడం ద్వారా న్యాయబద్ధతకూ, సామర్థ్యానికీ కట్టుబడి ఉండే నేర న్యాయవ్యవస్థను మాత్రం బీఎన్ఎస్ఎస్ ఊహిస్తోంది. కేంద్ర ప్రభుత్వం క్రిమినల్ లా బిల్లులను వేగంగా ఉపసంహరించు కుంది; వాటికి బదులుగా భారతీయ న్యాయ సంహిత (ఐపీసీ, 1860 స్థానంలో తీసుకొచ్చిన బీఎన్ఎస్–2), భారతీయ నాగరిక్ సురక్షాసంహిత (క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, 1973 స్థానంలో వచ్చిన బీఎన్ఎస్ఎస్–2) కొత్త వెర్షన్ లను తెచ్చింది. అలాగే, భారతీయ సాక్ష్య చట్టాన్ని (ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, 1872 స్థానంలో తెచ్చిన బీఎస్బీ–2) తెచ్చింది. వీటి సారాంశం కచ్చితంగా, వివరంగా ఉన్నప్పటికీ, ఈ చట్టాలలో దాగి ఉన్న వాక్చాతుర్యం గురించి ఆందో ళన చెందవలసి ఉంటుంది. క్రిమినల్ చట్టం, న్యాయం విషయంలో ఏదైనా పరివర్తనా దృష్టిని చూడటం వీటిల్లో కష్టమనే చెప్పాలి. మొత్తంమీద మితిమీరిన నేరీకరణ (క్రిమినలైజేషన్), విస్తృతమైన పోలీసు అధికారాల ద్వారా ప్రభుత్వ నియంత్రణను అసమంజసంగా విస్తరించే వ్యవస్థ వైపు మనం వెళ్తున్నట్లు కనిపిస్తోంది. పోలీసులకు విస్తృత అధికారాలా? బీఎన్ఎస్ఎస్కి చెందిన ఒక ప్రత్యేక అంశం పౌర హక్కులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. కానీ అది పెద్దగా ఎవరిదృష్టినీ ఆకర్షించలేదు. బీఎన్ఎస్ఎస్లో పోలీసు కస్టడీ సంభావ్య వ్యవధికి సంబంధించిన భారీస్థాయి విస్తరణ, పౌర హక్కుల పరిరక్షణ మూలాన్నే దెబ్బతీస్తోంది. సాధారణ క్రిమినల్ చట్టం ప్రకారం ఉన్న 15 రోజుల పోలీసు కస్టడీ గరిష్ఠ పరిమితిని 60 రోజులు లేదా 90 రోజులకు (నేర స్వభావాన్ని బట్టి) బీఎన్ఎస్ఎస్ విస్తరించింది. ఇప్పటివరకూ ఉన్న చట్టం ప్రకారం, పోలీసు కస్టడీని అరెస్టయిన మొదటి 15 రోజులకు పరిమితం చేస్తారు. అయితే బీఎన్ఎస్ఎస్లోని ఈ కస్టడీ విస్తరణ పోలీసుల మితిమీరిన చర్యల ప్రమాదాన్ని పెంచు తుంది. పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తుల భద్రత గురించి ఇప్పటికే ఎన్నో ఆందోళనలు ఉన్నాయి. నిర్బంధపూరితంగా, బలవంతంగా పొందు పర్చే కల్పిత సాక్ష్యాలకు చెందిన అధిక ప్రమాదం కూడా ఉంటుంది. అయినప్పటికీ బీఎన్ఎస్ఎస్ పోలీసు అధికారాలను దిగ్భ్రాంతికరంగా విస్తరించిందనే చెప్పాల్సి ఉంది. విశేషమేమిటంటే, మన సాధారణ క్రిమినల్ చట్టం ఇప్పుడు ప్రత్యేక చట్టాలకే పరిమితమైన నిబంధ నలను కలిగి ఉండటం. వాస్తవానికి, ఈ నిబంధనలు పోలీసు కస్టడీ వ్యవధిపై ‘ప్రత్యేక చట్టాలు’ అందించిన వాటికంటే కూడా మించి ఉన్నాయి. ఈ పోలీసు కస్టడీ విస్తరణను భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని అత్యంత విస్తారమైన, అస్పష్టమైన నేరాల నేపథ్యంలో అర్థం చేసుకోవాలి. అనేక నేరాలు మితిమీరిన నేరీకరణ గురించిన కసరత్తులా ఉన్నాయి. రాజ్య భద్రతను పరిరక్షించడానికి ఉద్దేశించిన నేరాలకు ఇది ప్రత్యేకంగా వర్తిస్తుంది. ఉదాహరణకు, బీఎన్ఎస్–1లోని విస్తృత పదాలతో కూడిన నిబంధనలు, తప్పుడు సమాచారానికి శిక్ష (భారతదేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రత లేదా భద్రతకు హాని కలిగించే తప్పుడు లేదా తప్పుదారి పట్టించే సమాచారం) వంటివి బీఎన్ఎస్–2లోనూ అలాగే ఉన్నాయి. పునర్నిర్మించిన బీఎన్ఎస్లో ‘విద్రోహం’ అనే పదాన్ని తొలగించి నప్పటికీ, దానికి మరోరూపమైన నేరం – భారత సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రతకు హాని కలిగించడం– రెండు వెర్షన్లలోనూ విస్తార మైన, అస్పష్టమైన పదాలతో బాధించడం కొనసాగింది. బీఎన్ఎస్–1 కూడా ‘వ్యవస్థీకృత నేరం’, ‘ఉగ్రవాద చర్య’పై విస్తారమైన పదాలతో కూడిన నేరాలను పరిచయం చేసింది. ప్రత్యేకించి వాటిని ఎదు ర్కోవడానికి వాటి ప్రస్తుత నిర్వచనాలకు మించి నిర్వచించింది. ‘చిన్న వ్యవస్థీకృత నేరం’ అనేది ఒకటి కొత్తగా చేరింది. ఇందులో స్నాచింగ్, పిక్–పాకెటింగ్, బ్లాక్‌లో టిక్కెట్లను విక్రయించడం వంటి వివిధ రకాల వ్యవస్థీకృత దొంగతనాల గురించిన అస్పష్టమైన జాబితా ఉంది.ఈ నేరాల పరిధి బీఎన్ఎస్–2లో విస్తృతంగా కొనసాగుతుండగా, చిన్న వ్యవస్థీకృత నేరాల, వ్యవస్థీకృత నేరాల పరిధిని స్పష్టం చేయడానికి, పరిమితం చేయడానికి ప్రయత్నం అయితే జరిగింది. ‘ఉపా’లోని సెక్షన్ 15 కింద ఉన్న ‘ఉగ్రవాద చట్టం’ నిర్వచనానికి అనుగుణంగానే బీఎన్ఎస్–2 కూడా ఉంది. అయినప్పటికీ, ఉపాపై పెట్టిన తీవ్రవాద నేరాలకు బీఎన్ఎస్ వర్తింపు గురించి స్పష్టత లేదు. బీఎన్ఎస్–2లో కొత్తగా జోడించిన వివరణ ప్రకారం, పోలీసు సూపరింటెండెంట్ స్థాయి కంటే తక్కువ స్థాయి లేని అధికారి ఈ నిబంధన లేదా చట్టవిరుద్ధమైన కార్యకలాపాల (నివారణ) చట్టం, 1967 ప్రకారం కేసు నమోదు చేయాలా వద్దా అని నిర్ణయిస్తారు. అధికారి ఏ ప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకుంటారనే దానిపై నిజమైన మార్గదర్శకత్వం లేని ఇది ఒక ఆసక్తికరమైన నిబంధన. చట్టంలోని అనేక సానుకూల అంశాలు మన నేర న్యాయ వ్యవస్థలో ప్రాథమిక పరివర్తనలపై ఆధారపడి ఉంటాయి. దర్యాప్తు, విచారణ సమయంలో సమయపాలన, సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించడం ద్వారా, న్యాయబద్ధతకూ, సామర్థ్యానికీ కట్టుబడి ఉండే నేర న్యాయ వ్యవస్థను బీఎన్ఎస్ఎస్ ఊహించింది. శోధనకు, నిర్బంధానికి సంబంధించిన ఆడియో–వీడియో రికార్డింగ్ తప్పనిసరి అవసరం అనేది పోలీసు పనితీరులో మరింత జవాబుదారీతనం, పారదర్శకత తేవడంలో ఒక ముఖ్యమైన దశ అవుతుంది. ఏది ఏమైనప్పటికీ, మనం లోతైన నిర్మాణాత్మక అడ్డంకులను పరిష్కరిస్తే తప్ప, సత్వర న్యాయం, సమర్థవంతమైన దర్యాప్తునకు చెందిన లక్ష్యాలను న్యాయబద్ధంగా సాధించలేమని గుర్తించడం చాలా ముఖ్యం. కస్టడీలో సీసీటీవీ కెమెరాలుండాలి అధికంగా ఉన్న ఖాళీలు, ఇప్పటికే అధిక భారం మోస్తున్న న్యాయవ్యవస్థ సమస్యలను పరిష్కరించకుండా సమయపాలనను చేరుకోలేము. విచారణలో ఫోరెన్సిక్ నిపుణుల తప్పనిసరి ప్రమేయం, విచారణ సమయంలో ఆడియో–వీడియో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం (పోలీసుల వాంగ్మూలాల రికార్డింగ్‌తో సహా), మౌలిక సదుపాయాలు, పరికరాలు, సిబ్బంది శిక్షణలో అభివృద్ధి అవసరం. ఫోరెన్సిక్స్‌లో, సామర్థ్య సమస్యలతో పాటు, మన నేర న్యాయ వ్యవస్థలో ఉపయోగించే పద్ధతుల శాస్త్రీయ ప్రామాణికతకు సంబంధించి చాలా లోతైన సమస్య ఉంది. నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ద్వారా దేశంలో ఫోరెన్సిక్ సైన్స్ సామర్థ్యాన్ని పెంపొందించడానికి గణనీయమైన తోడ్పాటు అవసరం. అయితే ఫోరెన్సిక్, నిపుణుల సాక్ష్యాలకు సంబంధించిన విధానం గురించి ప్రాథమిక ప్రశ్నలు ఎక్కువగా పరిష్కృతం కాలేదు. సమర్థత, న్యాయం గురించి మనం జాగ్రత్త పడినట్లయితే, కస్టడీ హింసను నిరోధించడానికి పోలీసు స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసే ప్రయత్నం విధిగా ఉండాలి. ఇవి ఏ నేపథ్యంలో అమలు అవుతాయో తగినంతగా లెక్కించకుండానే మనం తరచుగా సాంకేతికత, సామర్థ్యానికి చెందిన ప్రశ్నలను పరిశీలిస్తాము. మొత్తంగా ఈ చట్టాలు మన నేర న్యాయ వ్యవస్థలో పాతుకు పోయిన అన్యాయాలను సరిదిద్దే అవకాశాలను కోల్పోయాయి. బీఎన్ఎస్, బీఎన్ఎస్ఎస్, బీఎస్బి రెండు వెర్షన్ ల మధ్య మార్పులు ఉన్నాయి, కానీ నేర చట్టానికి సంబంధించిన విధానంలో ఎటువంటి ప్రాథమిక మార్పు వీటిలో లేదు. ఇప్పటికే ఉన్న క్రిమినల్ చట్టాన్ని నిర్వీర్యం చేసే బదులు, ఈ నూతన చట్టాలు వలసవాద తార్కికతకు మళ్లీ శంకుస్థాపన చేశాయి. ఇక్కడ ప్రభుత్వ ప్రధాన ఆసక్తి ప్రజలను గరిష్ఠ స్థాయిలో నియంత్రించడంగానే ఉంది. – అనూప్ సురేంద్రనాథ్, జెబా సికోరా వ్యాసకర్తలు ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ‘ప్రాజెక్ట్ 39ఏ’లో పనిచేస్తున్నారు. -
దటీజ్ డాక్టర్ మహాలక్ష్మీ..వెయ్యికి పైగా డైడ్బాడీస్కి పోస్ట్‌మార్టం
‘అమ్మాయిలు పోస్ట్‌మార్టం చేయలేరు’ ఈ అపోహ తప్పని నిరూపిస్తున్నారు ఈ రంగంలోకి వస్తున్న యువ డాక్టర్లు. నాలుగేళ్లలో వెయ్యికి పైగా మృతదేహాలకు పోస్ట్‌మార్టం చేసి, అమ్మాయిలూ చేయగలరు అని నిరూపిస్తున్నారు కర్ణాటకలోని కార్వార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మహాలక్ష్మి మన దేశంలో మొట్టమొదటి ఫోరెన్సిక్ సైంటిస్ట్‌గా డాక్టర్ రుక్మిణీ కృష్ణమూర్తి వార్తల్లో నిలిచారు. ముంబయ్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీలో 1974లో చేరిన ఆమె రిటైర్ అయ్యేంతవరకు వర్క్ చేశారు. ఆమె స్ఫూర్తితో ఆ తర్వాత ఈ రంగంవైపు ఆసక్తి చూపినవాళ్లు ఉన్నారు. కానీ, వేళ్లమీద లెక్కించదగిన సంఖ్యలోనే ఉన్నారు. అనారోగ్యంతో ఉన్నవారిని చూడటం సాధారణం. కానీ, కాలిపోయిన శరీరాలు, ప్రమాదాలలో ఛిద్రమైన శరీరాలు, నీటిలో మునిగిపోయిన శరీరాలు చూడటం సాధారణం కాదు. విషం కారణంగా శరీరం నీలం రంగులోకి మారడం లేదా ఆత్మహత్య కారణంగా మృతదేహాలను చూడటం మరింత బాధాకరం. సున్నితమనస్కులైన మహిళలు ఈ ఛాలెంజ్‌ను స్వీకరించలేరనేది అందరూ అనుకునేమాట. అయితే, ఈ వృత్తిని తాను ఛాలెంజింగ్‌గా తీసుకున్నానని చెబుతున్నారు డాక్టర్ మహాలక్ష్మి. చదువుకునే రోజుల్లో... ‘‘అమ్మనాన్నలకు ఐదుగురం ఆడపిల్లలం. అందులో ముగ్గురం డాక్టర్లమే. ఒక అక్క డెంటిస్ట్, మరొకరు ఆయుర్వేద డాక్టర్. వాళ్లని చూసే నేనూ డాక్టర్ కావాలని కల కన్నాను. ఆయుర్వేద వైద్యురాలైన మా అక్క ఫోరెన్సిక్ డాక్టర్ కావాలనుకుంది. కానీ, తను ఆ దారిలో వెళ్లలేకపోయింది. నేను ఈ టాపిక్‌ను ఎంచుకున్నప్పుడు మా అక్క ఎంతో సపోర్ట్‌నిచ్చింది. మా నాన్న ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసేవారు. అమ్మ గృహిణి. మా ఇంట్లో ఎప్పుడూ చదువుకే ప్రాధాన్యత ఉండేది. రిస్క్ ఎందుకు అన్నారు.. చదువుకునే రోజుల్లో సీఐడీ సీరియల్ చూసేదాన్ని. అందులో ఫోరెన్సిక్ విభాగం నాకు చాలా ఆసక్తిగా అనిపించేది. ఎంబీబీఎస్ రెండో సంవత్సరంలోనే ఫోరెన్సిక్‌కు సంబంధించిన సమాచారం తెలుసుకోవడం మొదలుపెట్టాను. మా ప్రొఫెసర్లు కూడా నాకు ఆ విభాగానికి సంబంధించిన సమాచారాన్ని, నేర కథనాలను వివరించేవారు. ఇందుకు సంబంధించిన నవలలు కూడా చదివాను. మా క్లాస్మేట్ అబ్బాయిలు మాత్రం ‘ఈ విభాగం వద్దు, అమ్మాయివి ఎందుకు రిస్క్. ఇది కేవలం మార్చురీ గురించి మాత్రమే కాదు, సాక్ష్యం కోసం కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. పోలీసులతో కలిసి పనిచేయాలి. రాత్రి, పగలు ఎప్పుడు అవసరమున్నా చురుగ్గా పనిచేయాలి. లేడీస్‌కి అంత సులభం కాదు’ అన్నారు. ‘మా నాన్నగారు కూడా పెళ్లై, సంప్రదాయ కుటుంబంలోకి వెళితే ఇబ్బందులుగా మారతాయి’ అన్నారు. కానీ, ఒక కేసు దర్యాప్తులో ఫోరెన్సిక్ నిపుణుల పాత్ర చాలా ముఖ్యం అని నాకు తెలుసు. ఈ ఫీల్డ్‌లో ఛాలెంజెస్ ఎక్కువ. నేను చేయగలను అని భావించే ఈ విభాగంలోకి వచ్చాను. ఇప్పుడు నా నిర్ణయాన్ని అంతా సమర్ధిస్తున్నారు’’ అని వివరించారు ఈ ఫోరెన్సిక్ డాక్టర్. అనేక పరిశోధనలు.. మేల్ డామినేటెడ్ వృత్తిలో ఎలా చోటు సంపాదించుకున్నావని నన్ను చాలామంది అడుగుతుంటారు. సవాళ్లు అంటే ఇష్టం అని చెబుతుంటాను. నేను పుట్టి పెరిగింది కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలోని హుబ్లీ నగరం. ప్రాథమిక విద్య వరకు బెల్గాంలో చదివాను. ఆ తర్వాత కాలేజీ చదువంతా హుబ్లీలోనే. 2007 నుండి 2017 మధ్యన బెల్గాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి ఎంబీబీఎస్ పూర్తి చేశాను. ఏడాది పాటు గ్రామీణ ప్రజలకు సేవ చేశాను. 2020లో ఫోరెన్సిక్ విభాగంలో చేరాను. అప్పటి నుండి అనేక పరిశోధనలను ఫోరెన్సిక్ నిపుణుల బృందంతో కలిసి పనిచేశాను. మెడికల్ స్టూడెంట్స్‌కు క్లాసులు తీసుకుంటున్నాను. ఈ విభాగంలో గోల్డ్ మెడల్ వచ్చింది. – డాక్టర్ మహాలక్ష్మి -
ప్రీతి కేసు ఎటువైపు? ఇంకెన్ని రోజులు?
సాక్షి, వరంగల్: సంచలనం సృష్టించిన వైద్యవిద్యార్థిని ప్రీతి మృతి కేసులో స్పష్టత కొరవడింది. ఆత్మహత్యనా? ఇతరత్రా ఏమైనా జరిగిందా? అనే అనుమానంపై పోలీసుల నుంచి అధికారిక ప్రకటన రావడం లేదు. ఓ వైపు ప్రీతిది హత్యేనంటూ ఆమె కుటుంబ సభ్యులు వాదిస్తుండగా.. ఇంకోవైపు టాక్సికాలజీ రిపోర్టు అధికారికంగా పోలీసులు వెల్లడించలేదు. అయితే.. ఎఫ్ఎస్ఎల్(Forensic Science Laboratory) రిపోర్టు వస్తేనే స్పష్టమైన కారణాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తుండడమే జాప్యానికి కారణంగా తెలుస్తోంది. దీంతో కేసు చిక్కుముడి వీడేందుకు ఇంకెన్ని రోజులు పడుతుందో అని ఎదురు చూస్తున్నారంతా. మరోవైపు నిందితుడైన ఎం.ఎ.సైఫ్‌ను 4 రోజులు కస్టడీలో విచారించిన మట్టెవాడ పోలీసులు.. మరో 2 రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణను కోర్టు మంగళవారానికి వాయిదా వేయడంతో నిందితుడిని ఖమ్మం జైలుకు తరలించారు. ఇంకా క్లారిటీ రాలేదా? ప్రీతితో గొడవకు దారితీసిన పరిస్థితులతోపాటు ఆమెను వేధించడానికి ఎవరెవరి సహాయాన్ని తీసుకున్నాడన్న దానిపై నిందితుడు సైఫ్‌ను పోలీసులు ప్రశ్నించారు. టెక్నికల్ డేటాను కూడా సైఫ్ ముందుంచి వివరాలు రాబట్టినట్లు తెలిసింది. విష రసాయనాలు ఏమీ తీసుకోలేదని టాక్సికాలజీ రిపోర్టు చెబుతోందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే సైఫ్‌ను మరో 2 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరులో పిటిషన్ వేశారు. ఈ 4 రోజుల కస్టడీలోనూ సైఫ్ పోలీసులకు చెప్పిన సమాచారం అసమగ్రంగా ఉండటంతో మళ్లీ కస్టడీకి కోరినట్లు తెలుస్తోంది. కీలకంగా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ప్రీతి కేసులో వేధింపులు, ర్యాగింగ్ జరిగినట్టు పోలీసులు నిర్ధారించినా ఇప్పటికీ త్రిసభ్య కమిటీ సమర్పించిన నివేదికలోని అంశాలను ఎక్కడా ప్రస్తావించలేదు. తాజాగా టాక్సికాలజీ రిపోర్టులో ఏ విష రసాయనం తీసుకున్నట్టు లేదని నివేదిక వచ్చిందని చక్కర్లు కొడుతున్న వార్తలతో అసలు ప్రీతిది ఆత్మహత్య కాదా...మరేమైనా జరిగిందా అనే దిశగా పోలీసు విచారణ మారినట్టు తెలిసింది. ప్రీతి ఆత్మహత్య కేసును కాస్త అనుమానాస్పద మృతిగా మార్చే అవకాశం కూడా లేకపోలేదు. ఎఫ్ఎల్ఎస్ ఇచ్చే నివేదిక కీలకం కానుంది. -
'శ్రద్ధను చంపాననే బాధ లేదు.. చాలా మంది అమ్మాయిలతో డేటింగ్ చేశా'
న్యూఢిల్లీ: శ్రద్ధా వాకర్ హత్య కేసు నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలాకు మంగళవారం పాలిగ్రాఫ్ టెస్టు నిర్వహించారు అధికారులు. విచారణలో శ్రద్ధను తానే చంపానని అఫ్తాబ్ అంగీకరించినట్లు ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ(ఎఫ్ఎస్ఎల్) అధికారులు వెల్లడించారు. అయితే తాను ఇలా చేసినందుకు ఎలాంటి పశ్చాతాపం లేదని అతను చెప్పాడని పేర్కొన్నారు. అంతేకాదు తాను చాలా మంది అమ్మాయిలలో డేటింగ్ చేసినట్లు పాలిగ్రాఫ్ టెస్టులో అఫ్తాబ్ ఒప్పుకున్నాడు. శ్రద్ధను హత్య చేసిన అనంతరం శవాన్ని ముక్కలు చేసి అడవిలో పడేసినట్లు వివరించాడు. పాలిగ్రాఫ్ టెస్టు సమయంలో అఫ్తాబ్ సాధారణంగానే ప్రవర్తించాడని ఫోరెన్సిక్ అధికారులు చెప్పారు. పాలిగ్రాఫ్ టెస్టుకు ముందు రోజు అఫ్తాబ్‌పై కొందరు కత్తులతో దాడి చేసేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. అతడ్ని వాహనంలో తీసుకెళ్తుండగా.. వెంబడించారు. దీంతో పటిష్ఠ భద్రత నడుమ అఫ్తాబ్‌కు పాలిగ్రాఫ్ టెస్టు నిర్వహించారు. చాలా కాలంగా సహజీవనం చేస్తున్న శ్రద్ధను అఫ్తాబ్ దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆమె శవాన్ని 35 ముక్కలు చేసి ఫ్రిజ్‌లో దాచాడు. ఆ తర్వాత రోజూ కొన్ని శరీర భాగాలు తీసుకెళ్లి అడవిలో పడేశాడు. మే 18న జరిగిన ఈ హత్యోదంతం ఆరు నెలల తర్వాత వెలుగుచూసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో నవంబర్ 12న అఫ్తాబ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. న్యాయస్థానం అతడికి నవంబర్ 22న ఐదు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. అనంతరం కస్టడీని మరో 13 రోజులు పొడిగించింది. నార్కో టెస్టు కూడా నిర్వహించేందుకు అనుమతించింది. డిసెంబర్ 1న ఈ పరీక్ష జరగనుంది. చదవండి: లిక్కర్ స్కాం కేసు.. సిసోడియా సన్నిహితుడు అరెస్ట్ -
నేరస్తులను పట్టుకునేందుకు... దాదాపు 70 శవాలను సూట్‌కేస్‌లో కుక్కి..
హత్య కేసుల్లో నేరస్తులను కనిపెట్టడానికి ఫోరెన్సిక్ బృదం ఇచ్చే రిపోర్టు అత్యత కీలకమైనది. కొన్ని నేరాల్లో మృతదేహాలు పూర్తిగా పాడైపోయిన స్థితిలో దొరకడంతో బాధితుల తోపాటు నిందితులను కూడా గుర్తించడం కష్టమవుతోంది. అలాంటి సందర్భాల్లో కేసును ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలి, ఎలా కేసును పరిష్కరించాలి అనే దిశగా ముర్డోక్ విశ్వవిద్యాలయంలోని ఫోరెన్సిక్ బృదం ఒక సరికొత్త అధ్యయనానికి సిద్ధమైంది. అందుకోసం ఆస్ట్రేలియాలో ఒక ప్రదేశంలో సూట్‌కేసుల్లో దాదాపు 70 మృతదేహాలను కుళ్లిపోయేలా వదిలేశారు. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అవి డికంపోజ్ అవుతాయి. మరణించిన ఎన్ని రోజులకు శరీరం కుళ్లిపోతూ మార్పులు మొదలవుతుంది, అనేదాన్ని బట్టి ఎన్ని రోజలు ఇలా పడి ఉందని అనేది అంచనా వేయడం వంటివి కనుగొంటారు. అంతేగాక నేరస్తులు హత్య చేసి తాము దొరక్కుండా ఉండేందుకు మృతేదేహాన్ని దాచి ఉంచడం లేదా నాశనం చేసేందుకు వారి చేసే ప్రయోగాల్లో మృతదేహం స్థితిని అధ్యయనం చేయడం వంటివి చేస్తారు. పైగా హత్య చేసినప్పటి నుంచి తరలించే సమయంలో సెకండరీ క్రైమ్‌ని అంచన వేయగలుగుతారు. హత్య చేసిన తర్వాత నిందితులు ఏయే ప్రాంతాల్లో ఉంచడానికి ప్రయత్నిస్తుంటారు వంటివి కూడా కనుగొంటారు. ఈ పరిశోధన నేరస్తుడిని ట్రేస్ చేసి మరింత సమాచారాన్ని అధికారులకు అందించేందుకు ఉపకరిస్తుంది. అందుకోసమే పరిశోధకులు సూట్‌కేసులలో వివిధ జంతువుల కళేభరాలను ఉంచి వాటిలో వస్తున్న మార్పులను అంచనా వేస్తున్నారు. నేర పరిశోధకులకు ఈ అతి పెద్ద ప్రయోగం ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు ఫోరెన్సిక్ శాస్త్రవేత్తలు. MU’s resident bug whisperer @doc_magni has provided a fascinating look inside suitcases used to hide murder victims, and the role played by the insects trapped within. Read about her first-of-its kind experiment in @ConversationEDU ➡️ https://t.co/U93ZD7g1x4#forensics #CSI pic.twitter.com/dgAmeFElHe — Murdoch University (@MurdochUni) August 31, 2022 (చదవండి: ఫిరంగి పరిమాణంలో గుడ్లు... డైనోసార్లలో మరోజాతి) -
ఆ కేసుల్లో ఫోరెన్సిక్ దర్యాప్తు తప్పనిసరి
గాంధీనగర్: దేశంలో నేర న్యాయ వ్యవస్థను, ఫోరెన్సిక్ సైన్స్ దర్యాప్తును మిళితం చేయాలని భావిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల కంటే అధికంగా మన దేశంలో నేర నిరూపణల శాతాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఆరేళ్లకుపైగా జైలుశిక్ష పడేందుకు అవకాశం ఉన్న కేసుల్లో ఫోరెన్సిక్ దర్యాప్తును తప్పనిసరి, చట్టబద్ధం చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు. అమిత్ షా ఆదివారం గుజరాత్‌లోని గాంధీనగర్‌లో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ(ఎన్ఎఫ్ఎస్యూ) మొదటి స్నాతకోత్సవంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. దేశవ్యాప్తంగా ప్రతిజిల్లాలో ఫోరెన్సిక్ మొబైల్ దర్యాప్తు సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు వివరించారు. ఫోరెన్సిక్ దర్యాప్తు స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చట్టపరమైన చర్యలు చేపడతామన్నారు. ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(సీఆర్పీసీ), ఎవిడెన్స్ యాక్ట్‌లో మార్పులు తీసుకురానున్నట్లు వెల్లడించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ చట్టాలను ఎవరూ భారతీయ దృష్టికోణంలో చూడడం లేదన్నారు. -
60 ముక్కలుగా శరీరం, పరిశీలించేందుకు రెండు రోజులు
పురుషులు మాత్రమే పనిచేయగలరనే ఫోరెన్సిక్ విభాగంలో మహిళగా ఆమె రికార్డు సాధించింది. ఎంచుకున్న పనిని ఏళ్లుగా సమర్థంగా నిర్వర్తించడంతో పాటు అందమైన ప్రకృతిని తన కెమరా కన్నుతో పట్టేస్తోంది డాక్టర్ గీతారాణి గుప్తా. మధ్యప్రదేశ్ ఫోరెన్సింగ్ విభాగంలో పనిచేస్తున్న ఏకైక మహిళగానే కాదు, 32 ఏళ్ల వైద్య వృత్తిలో 9,500 మృతదేహాలకు పోస్టుమార్టం చేసిన రికార్డు కూడా డాక్టర్ గీతారాణి గుప్తా సొంతం. 63 ఏళ్ల వయసులోనూ భోపాల్‌లోని మెడికో లీగల్ ఇనిస్టిట్యూట్‌లో సీనియర్ ఫోరెన్సిక్ స్పెషలిస్ట్‌గా విధులను నిర్వహిస్తున్నారు. మగవాళ్లే చేయగలరు అనే విభాగంలో పనిచేయడంతో పాటు, రికార్డు సృష్టించిన గీతారాణి గుప్తా ఇన్నేళ్ల వైద్యవృత్తిలో తన అనుభవాలను ఆమె ఇటీవల పంచుకున్నారు. ఇప్పటికీ మధ్యప్రదేశ్‌లో ఫోరెన్సిక్ మెడిసిన్‌లో ఎం.డి చేసిన ఏకైక మహిళగా గీతారాణి పేరే ఉంటుంది. తను పుట్టి పెరిగిన వాతావరణం, ఎంచుకున్న మెడికల్ విభాగం, వృత్తి అనుభవాలతో పాటు, అభిరుచులనూ తెలియజేశారు. కళ్ల ముందు కదలాడే కథలు ‘‘ఎనిమిదేళ్ల క్రితం జరిగిన సంఘటనే అయినా ఇప్పటికీ కళ్ల ముందు కదలాడుతుంది. అది అంత దారుణమైనది. 60 ముక్కలుగా కట్ అయి ఉన్న ఉన్న ఒక శరీరం పోస్ట్ మార్టం కోసం షాజాపూర్ నుండి వచ్చింది. మృతదేహాన్ని ముక్కలుగా చేసి, బోర్‌వెల్‌లో వేశారు హంతకులు. పోలీసులు మృతదేహాన్ని, వెలికి తీసి తరలించడానికే మూడు రోజులు పట్టింది. దీన్ని పరీక్షించడానికి నాకు రెండు రోజులు పట్టింది. నాలుగేళ్ల క్రితం, మూడు నాలుగు ముక్కలు చేసిన పుర్రె, అస్థిపంజరం తీసుకొచ్చారు. ఇది పరీక్షించడం ఓ సవాల్ అయ్యింది. పుర్రెను పరీక్షించినప్పుడు, బుల్లెట్ పుర్రెలో చిక్కుకున్నట్లు కనుక్కున్నాను. అతని కుటుంబ సభ్యులే ఈ హత్యకు పాల్పడినట్లు తెలిసింది. ఎన్ని కేసులు... ప్రతీ రోజూ మృతదేహాల మీద పరీక్షలే. ఏకైక మహిళగా తొలి అడుగు మా నాన్నగారు ఉపాధ్యాయుడు. నేను కూడా మెడికల్ కాలేజీలో లెక్చరర్ కావాలనుకున్నాను. అంతే పట్టుదలగా చదివాను. ఫోరెన్సిక్ విభాగంలో లెక్చరర్ షిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. దానికి నా వయస్సు రెండు నెలల 8 రోజులు ఎక్కువ. లెక్చరర్‌గా వెళ్లకుండా ఈ విభాగంలో చేరిపోయాను. అలా ఫోరెన్సిక్ మెడిసి¯Œ లో ఎమ్‌డి చేసిన రాష్ట్రంలో తొలి మహిళా వైద్యురాలిని అయ్యాను. పీహెచ్‌డి చేయాలనుకున్నాను. కానీ, ప్రభుత్వ పనికి అంతరాయం కలిగించడం నాకిష్టం లేదు. అందుకే, ఎంచుకున్న వృత్తిలో అలాగే కొనసాగాను. మాటలు రాని క్షణాలు నా మొదటి రోజు ఉద్యోగంలో నేను గమనించిన విషయం.. నోరు, ముక్కుపై క్లాత్ అడ్డుపెట్టుకొని మృతదేహాన్ని చూడటానికి ఆ కుటుంబసభ్యులు వచ్చినప్పుడు మనిషి చనిపోయాక ఇక విలువ లేదని అర్ధం చేసుకున్నాను. ఆ క్షణంలో మాటలు రాకుండా అలాగే ఉండిపోయాను. మొదటిరోజే 20 మృతదేహాలను చూశాను. ఆ రోజు రాత్రంతా నిద్రపోలేకపోయాను. కాని నా మనస్సుకు తెల్లవార్లు బలంగా ఉండాలంటూ నాకు నేను నచ్చజెప్పుకుంటూ గడిపాను. ఇది నాకు అంతర్గత ధైర్యాన్ని ఇచ్చింది. ఆ తరువాత ఇక నేను నా విధిని నిర్వర్తిస్తున్నాను అనే అనుకున్నాను. అలా ఆ ఏడాది 20 మృతదేహాలకు పోస్టుమార్టం చేశాను. ఎంపీ మెడికల్ లీగల్ ఇన్స్టిట్యూట్లో మెడికల్ ఆఫీసర్‌గా 1989లో ఎంపి పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎంపిపిఎస్సి) నుంచి ఎంపిక చేశారు. నాటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ నా పని శవపరీక్ష. ఇదే కాకుండా మెడికో లీగల్ కేసుల పరిష్కారానికి కోర్టుకు హాజరు కావడం. ఖాళీ సమయంలో ఫోటోగ్రఫీ.. ఫోరెన్సిక్ విభాగంలో శవపరీక్ష ఛాయాచిత్రాలను తీయిస్తూ ఉండేవాళ్లం. ఆ ఫొటోలను పరిశీలించడానికి ఫోటోగ్రఫీ నేర్చుకున్నాను. ప్రముఖ ఫోటోగ్రాఫర్స్ రాకేశ్ జైమిని, ప్రశాంత్ సక్సేనా ఫోటోగ్రఫీని నేర్పించారు. అలా ఫొటోగ్రఫీ నా అభిరుచిగా మారిపోయింది. నేను ఒంటరిగా ఉంటాను. కానీ, నాకు నచ్చిన అన్ని పనులు చేస్తాను. మరో నచ్చిన పని లాంగ్ డ్రైవింగ్. నా దగ్గర కారు, ల్యాప్‌టాప్, కెమెరా ఉన్నాయి. జంతువులు, పక్షుల ఫోటోలు తీయడానికి సిటీ నుంచి అడవుల వరకు దూరంగా వెళ్లిపోతాను. ఎంపిక మనది అవ్వాలి.. నేను ప్రతి రంగంలో అమ్మాయిలు రాణిస్తున్నారు. పురుషు ఆధిపత్య సమాజంలో మహిళలు చోటు సంపాదిస్తున్నారు. అమ్మాయిలూ ధైర్యంగా ఉండండి. సవాళ్లను స్వీకరించి ముందుకు సాగండి. మీరు ఏ రంగంలో రాణించాలనుకుంటున్నారో ఈ ఎంపికను మీరే చేసుకోండి. ఏదో ఒక అభిరుచిని మీలో ఎప్పుడూ ఉంచుకోండి. అది మిమ్మల్ని నిరంతరం జీవించేలా చేస్తుంది’’ అని నవతరం అమ్మాయిలకు వివరిస్తారు డాక్టర్ గీతారాణి గుప్తా. -
రేప్ కేసుల్లో న్యాయం జరగాలంటే...
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హథ్రాస్ దళిత యువతి అత్యాచారం కేసులో బాధితురాలికి న్యాయం జరగాలంటూ కాంగ్రెస్, దళిత పార్టీలు ఆందోళన చేస్తున్న విషయం తెల్సిందే. ఏ అత్యాచారం కేసులోనైనా బాధితులకు న్యాయం జరగాలంటే ప్రభుత్వం లేదా అధికార యంత్రాంగం ప్రధానంగా మూడు చర్యలు తీసుకోవాల్సి ఉంది. మొదటిది లైంగిక దాడి సాక్ష్యాల కిట్స్‌ను అందుబాటులోకి తీసుకరావడం. రేప్ కేసుల్లో బాధితులకు న్యాయం జరగాలంటే కోర్టు ముందు నిలబడే తిరుగులేని సాక్ష్యాలను బాధితుల నుంచి సేకరించాల్సి ఉంటుంది. వారి నుంచి వివిధ రకాల నమూనాలతోపాటు డీఎన్ఏను సేకరించి సీల్డ్ బాక్సులో నేరుగా ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించే ప్రత్యేకమైన కిట్లను అందుబాటులోకి తీసుకరావడం. నిర్భయ కేసును దృష్టిలో ఉంచుకొని 2014లో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ‘సెక్సువల్ అసాల్ట్ ఫోరెన్సిక్ ఎవిడేన్స్ లేదా సేవ్’ కిట్ల ఆవశ్యకత గురించి తెలియజేస్తూ అందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా సూచించింది. (హథ్రాస్: న్యాయం చేసే ఉద్దేశముందా?) 2019 వరకు అందుబాటులో ఉన్న డేటా ప్రకారం కేవలం తొమ్మిదంటే తొమ్మిది రాష్ట్రాలు మాత్రమే కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేశాయని, సేఫ్ కిట్లను సేకరించాయని తెల్సింది. 16 నిమిషాలకు ఓ అత్యాచారం జరుగుతున్న భారత్‌లో దేశవ్యాప్తంగా 3,120 సేఫ్ కిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని ‘బ్యూరో ఆఫ్ పోలీస్ రీసర్చ్ అండ్ డెవలప్మెంట్’వర్గాలు తెలిపాయి. ఇలాంటి కిట్లు ప్రస్తుతం అమెరికాలో లక్షల్లో ఉన్నాయి. గత ఆరు నెలల్లో ఇలాంటి కిట్ల ద్వారా సేకరించిన డీఎన్ఏ సాక్ష్యాధారాలతోనే రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడులోని పలు కోర్టులు నేరస్థులకు సకాలంలో శిక్షలు విధించగలిగాయి. హథ్రాస్ దళిత యువతి రేప్ కేసులో సేఫ్ కిట్లను ఉపయోగించినట్లయితే సాక్ష్యాధారాలను తారుమారు చేశారన్న ఆరోపణలుగానీ, అనుమానాలుగానీ వ్యక్తం అయ్యేవి కావు. (రేప్ కేసుల్లో బాధితుల పేర్లు వెల్లడిస్తే..) రేప్ కేసుల్లో బాధితులకు న్యాయం జరగాలంటే పోలీసులకు, నర్సులకు, వైద్యులకు తగిన శిక్షణ అవసరం. నిర్భయ గ్యాంగ్ రేప్ నేపథ్యంలో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోకి 357 సీ సెక్షన్ ప్రకారం రేప్ బాధితులకు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు ఉచితంగా వైద్య చికిత్సను అందించాలి. దీనికి సంబంధించి 2014లో కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వం, ప్రైవేటు అనే తేడా లేకుండా వైద్యులు, నర్సులు రేప్ బాధితులు మానసిక ఒత్తిడికి గురికాకుండా అండగా ఉండాలి. ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా బాధితులకు సేఫ్ కిట్లతో పరీక్షలు నిర్వహించి, వాటి ఫలితాలను భద్రంగా ఉంచాలి. రేప్ కేసుల్లో సాక్ష్యాధారాల సేకరణకు మూడు నుంచి ఆరు గంటల సమయం పడుతుంది కనుక వైద్య సిబ్బందికి ఎంతో క్రమశిక్షణ అవసరం. అత్యాచార కేసుల్లో బాధితులు మరణించిన పక్షంలో వారి మత దేహాలను కొంతకాలం పాటు భద్రపర్చాలి. అనుమానాలు వ్యక్తం అయిన సందర్భాల్లో మరోసారి ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించేందుకు వీలుంటుంది. మతదేహాన్ని దహనం చేయకుండా పూడ్చి పెట్టినట్లయితే సాక్ష్యాధారాలను సేకరించేందుకు వీలుంటుంది. భారత్‌లాంటి దేశంలో మెజారిటీ సామాజిక వర్గాల ప్రజలు దహన సంస్కారాలే చేస్తారు. (హత్రాస్ ఉదంతం.. ఐదుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు) హథ్రాస్ రేప్ కేసులో బాధితురాలు మంగళవారం ఉదయం మరణించగా, ఆ రోజు అర్ధరాత్రి పోలీసులు ఆమె మతదేహాన్ని దహనం చేయడం తెల్సిందే. ఆ మరుసటి రోజే బాధితురాలిపై అత్యాచారం జరగలేదంటూ పోలీసులు ఫోరెన్సిక్ నివేదికను బయట పెట్టారు. దానిపై సర్వత్ర అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోసారి ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించేందుకు బాధితురాలి మృతదేహం లేకుండా పోయింది. ఈ విషయంలో పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, చట్టం ముందు దోషులను నిరూపించేందుకు పోలీసులకు కూడా తగిన శిక్షణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. -
దిశకేసులో కీలకంగా మారిన ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్
-
దిశ కేసు: నిందితుల డీఎన్ఏలో కీలక అంశాలు
సాక్షి, హైదరాబాద్ : దిశ అత్యాచారం, హత్య కేసు విచారణలో ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ(ఎఫ్ఎస్ఎల్) నివేదిక కీలకంగా మారింది. కాలిపోయిన దిశ శరీరం స్టెర్నమ్ బోన్ నుంచి సేకరించిన డీఎన్ఏ ఆధారంగా.. ఆ మృతదేహం దిశదే అని నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అదే విధంగా ఘటనాస్థలంలోనే నిందితులు అత్యాచారం చేసినట్లుగా స్పష్టమైన ఫోరెన్సిక్ ఆధారాలు లభించాయి. ఈ క్రమంలో మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. దిశ శరీరంలో ఆల్కహాల్ ఉన్నట్లుగా ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారించారు. దీంతో దిశపై అత్యాచారానికి పాల్పడటానికి ముందు నిందితులు ఆమెకు మద్యం తాగించినట్లుగా నిర్ధారణ అయ్యింది. కాగా ఈ విషయాన్ని నిందితులు ఇప్పటికే పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఇక ఎన్కౌంటర్లో మరణించిన దిశ నిందితుల డీఎన్ఏ నివేదికలో సైతం కీలక అంశాలు వెలుగుచూస్తున్నాయి. గతంలో జరిగిన నేరాలతో దిశ నిందితుల డీఎన్ఏ మ్యాచ్ అవుతున్నట్లు నిపుణులు వెల్లడించారు. దీని ఆధారంగా నిందితులకు నేర చరిత్ర ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా వెటర్నరీ డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న దిశను నలుగురు నిందితులు చటాన్‌పల్లి వద్ద పాశవికంగా అత్యాచారం చేసి, హత్యకు పాల్పడిన విషయం విదితమే. అనంతరం ఆమె మృతదేహాన్ని కాల్చివేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ క్రమంలో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారించారు. క్రైం సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం నిందితులను ఘటనాస్థలికి తీసుకువెళ్లగా అక్కడ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో నిందితులు మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో నిందితులది బూటకపు ఎన్కౌంటర్ అంటూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కాగా... విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం... ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిషన్‌ను నియమించింది. -
ఫోరెన్సిక్ ల్యాబ్‌ల ఆధునీకరణ
న్యూఢిల్లీ: నేర ఘటనలలో సమర్థవంతమైన దర్యాప్తు జరిపేందుకు వీలుగా దేశంలోని ఆరు కేంద్ర ఫోరెన్సిక్ ప్రయోగశాలలను అప్‌గ్రేడ్ చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. చండీగఢ్, హైదరాబాద్, కోల్‌కతా, భోపాల్, పుణే, గువాహటిలలో ఉన్న ఆరు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలు (సీఎఫ్ఎస్ఎల్)లను ఆధునీకరించనుంది. ఈ ఆరు సీఎఫ్ఎస్ఎల్ల సామర్థ్యాన్ని పెంచాలని హోం శాఖ నిర్ణయించిందని ఒక అధికారి తెలిపారు. తీవ్రమైన నేరాలలో మరింత సమర్థవంతమైన, శాస్త్రీయ విధానంలో దర్యాప్తును సులభతరం చేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. పరిశోధన కార్యకలాపాలను నిర్వహించడానికి ఇటీవల ఢిల్లీలోని డైరెక్టరేట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్ సర్వీసెస్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిహేవియరల్ సైన్సెస్, గుజరాత్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందన్నారు. దీని ద్వారా విద్యావేత్తలు–అభ్యాసకుల మధ్య భాగస్వామ్యాన్ని పెండడంతోపాటు అత్యాధునిక పరిశోధనలకు దోహదపడుతుందని భావిస్తున్నారు. -
థర్డ్ డిగ్రీలకు కాలం చెల్లింది
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా క్రిమినల్ కేసుల్లో నేర నిర్థారణ శాతం చాలా తక్కువగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. పోలీసులు అనుమానితుల పట్ల థర్డ్ డిగ్రీని ప్రయోగించడం, ఫోన్ల ట్యాపింగ్ లాంటి పురాతన విధానాలు నేరాలను అరికట్టడంలో ఆశించిన ఫలితాలను ఇవ్వలేవని చెప్పారు. బుధవారం ఢిల్లీలో పోలీస్ పరిశోధన, అభివృద్ధి సంస్థ (బీపీఆర్డీ) 49వ వ్యవస్థాపక దినోత్సవంలో అమిత్ షా మాట్లాడారు. దర్యాప్తులో పోలీసులు ఫోరెన్సిక్ ఆధారాలను వినియోగించుకోవాలని, వీటి ద్వారా మెరుగైన ఫలితాలు ఉంటాయని సూచించారు. నేర శిక్షా స్మృతి, భారతీయ శిక్షా స్మృతిని సవరించడంపై చర్చల ప్రక్రియను ప్రారంభించాలన్నారు. దీనిపై సూచనలు, సలహాలు సేకరించి హోంశాఖకు పంపాలన్నారు. శిక్షా కాలం ఏడేళ్లు అంతకు మించిన క్రిమినల్ కేసుల్లో ఫోరెన్సిక్ ఆధారాలను తప్పనిసరి చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. శాస్త్రీయ విధానాలను అనుసరించాలి ‘ఫోరెన్సిక్ ఆధారాలను సైతం జత చేస్తూ పోలీసులు సమగ్రవంతమైన చార్జ్‌షీటును కోర్టుకు సమర్పిస్తే నిందితుల తరపు న్యాయవాదులకు వాదించడానికి పెద్దగా అవకాశాలు ఉండవు. శిక్ష పడే అవకాశాలు సైతం బాగా పెరుగుతాయి. నేరగాళ్లు, నేర ప్రవృత్తి వ్యక్తుల కన్నా పోలీసులు నాలుగు అడుగులు ముందు ఉండటం అత్యవసరం. పోలీసులు వెనకపడకూడదు. బలగాల ఆధునికీకరణతోనే ఇది సాధ్యం. ఇది థర్డ్ డిగ్రీలు ప్రయోగించే కాలం కాదు. దర్యాప్తులో శాస్త్రీయ విధానాలను అనుసరించాలి. ఫోన్ల ట్యాపింగ్ సత్ఫలితాలు ఇవ్వదు. పౌర పోలీసింగ్, ఇన్ఫార్మర్ల వ్యవస్థతో చాలా ప్రయోజనాలున్నాయి. బీట్ కానిస్టేబుళ్ల విధానాన్ని బలోపేతం చేయాలి’ అని అమిత్ పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో ఫోరెన్సిక్ వర్సిటీ జాతీయ స్థాయిలో పోలీస్ ఫోరెన్సిక్ సైన్స్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేయాలని కేంద్రం భావిస్తోందని అమిత్ షా వెల్లడించారు. వర్సిటీకి ప్రతి రాష్ట్రంలో అనుబంధ కాలేజీలు ఏర్పాటు చేస్తామన్నారు. 12వ తరగతి తరువాత పోలీస్ దళాల్లోకి ప్రవేశించాలనుకునే విద్యార్థుల కోసం శిక్షణ ఇచ్చి పరీక్షల్లో వెయిటేజ్ కల్పిస్తామన్నారు. ఈమేరకు బీపీఆర్డీ అందచేసిన ప్రతిపాదనలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. గుజరాత్లో ఈ ప్రయోగం విజయవంతమైందని, ఫోరెన్సిక్ వర్సిటీల నుంచి పట్టా పొందిన విద్యార్థుల్లో ఒక్కరు కూడా నిరుద్యోగిలా మిగిలిపోలేదన్నారు. -
నేరపరిశోధనలో నారీమణి
అత్యాచారాలు.. హత్యలు.. దోపిడీలు.. ఇంకా క్రూరాతి క్రూరమైన లైంగిక నేరాలలో.. నిజ నిర్ధారణ సవాళ్లతో కూడుకున్న పని. అయితే ‘ఫోరెన్సిక్ ఒడంటాలజీ’లో నిష్ణాతురాలైన డా. హేమలతా పాండే ఎంతో నైపుణ్యంతో ఈ అంతుచిక్కని నేరాలను ఛేదిస్తున్నారు. దంత వైద్యశాస్త్రంతో ముడిపడిన ‘ఫోరెన్సిక్ ఒడంటాలజీ’ భారత్‌లో ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నా.. లైంగికదాడులు, ఇతర హింసాత్మక కేసుల్లో నిందితుల ప్రమేయాన్ని నిగ్గుతేల్చడంలో ముఖ్యమైన ఆధారంగా ఉపయోగపడుతోంది. వివిధ సివిల్, క్రిమినల్ కేసులతో పాటు క్రీడాకారుల వయసు నిర్ధారణ వివాదాల పరిష్కారానికీ ఈ శాస్త్ర పరిశోధన దోహదపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసు విచారణలో భాగంగా తొలిసారి ఫోరెన్సిక్ ఒడంటాలజీ వెలుగులోకి వచ్చింది. దీని ద్వారానే ఈ కేసులో నిందితుల క్రూరత్వాన్ని సాక్ష్యాధారాలతో సహా నిరూపించగలిగారు. పోలీసులిచ్చిన అనుమానితుల ఫొటోల్లోని ముఖకవళికలను బట్టి నిందితుల నోటి పళ్ల సరళి ద్వారా వారి వయసు (రేప్‌కు పాల్పడిన వారిలో ఓ మైనర్ కూడా ఉండటంతో) నిర్ధారించారు.నిర్భయ శరీరంపైæగాయాలను ఈ నిందితుల పలువరసను పోల్చి చూడటం ద్వారా ఈ కేసును పరిష్కరించారు. ఇలాంటి కేసులను ఛేదించడంతో పాటు హత్యలు లేదా ఏవైనా ప్రమాదాల్లో ఆనవాలు పట్టలేని విధంగా మారిపోయిన శరీర అవశేషాలతో అపరిష్కృతంగా మిగిలిపోయిన కేసుల పరిష్కారంలోనూ ఈ శాస్త్రం ముఖ్యభూమిక పోషిస్తోంది. అస్థిపంజరం లేదా ఎముకల ఆధారంగా వేసే వయసు అంచనాలో పదేళ్ల వరకు వ్యత్యా సం ఉండే అవకాశం ఉండగా.. దంతాల ఆధారంగా హతులు లేదా నిందితుల వయసు అంచనా ఓ ఏడాది మాత్రమే అటూ ఇటుగా ఉండటంతో ఈ ఒడంటాలజీకి ప్రాధాన్యం చేకూరింది. దేశంలో ఉన్నది పదిమందే! సవాళ్లతో కూడుకున్న ఈ ఫోరెన్సిక్ ఒడంటాలజీ రంగంలో డా. హేమలతా పాండే తనదైన ప్రతిభను చాటుతున్నారు. ఈ ప్రత్యేక నేరపరిశోధనా రంగంలో శాస్త్రపరమైన అనుభవమున్న వారు దేశవ్యాప్తంగా ఉన్నది కేవలం పదిమందే. వీరంతా కూడా విదేశాల్లో ఈ పీజీ కోర్సును పూర్తిచేశాక, అక్కడే శిక్షణ పొంది వచ్చినవారే. ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ (కేఈఎం) హాస్పటల్లో గ్రాడ్యుయేషన్ కోర్సు చదువుతున్నపుడు హేమలతకైతే అర్హులైన ఫోరెన్సిక్ సైన్స్ బోధకులే ఉండేవారు కాదు. అయినా ఫోరెన్సిక్ డెంటిస్ట్రీపై పాండేకు ఆసక్తి పెరిగింది. ఇంగ్లండ్‌లోని వేల్స్ నుంచి మాస్టర్డిగ్రీ పూర్తిచేశాక, 2013 లో కేఈఎం ఆసుపత్రిలోనే చేరారు. ఫోరెన్సిక్ రంగాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ తర్వాత స్థానికంగా, ఇతర రాష్ట్రాల్లోనూ వివిధ కేసుల పరిశోధనలకు పోలీసులకు సహకారాన్ని అందించారు.గుర్తుపట్టలేనంతగా తయారైన శరీరభాగాల కొలతలతో ముందుగా పుర్రె స్వరూపాన్ని రూపొందించుకుని అందులో దంత ద్వయాన్ని, పండ్ల మధ్యనున్న సందులు ఇతర రూపాలను ప్లాస్టర్ ఆఫ్ పారిస్, బంకమట్టి, ఇతర మోడళ్లు, డిజిటల్ పరికరాలతో తయారుచేసుకుంటామని హేమలత తెలిపారు. గ్రామీణ యువతి హత్య కేసు అత్యాచారాలు, లైంగికహింస, హత్యల వంటి కేసుల్లో మరణించిన వారి వయసుతో పాటు, వారు ఆడా, మగా అనేది ముందుగా నిర్ధారించాల్సి ఉంటుంది. హతులు ఫలానావారు అయుండొచ్చని పోలీసులు అనుమానిస్తే తదనుగుణంగా వారి ఫొటోలు, ముఖకవళికలను బట్టి గుర్తించేందుకు వీలుగా పంటి ద్వయాన్ని సిద్ధం చేస్తారు. మహారాష్ట్రలోని ఓ గ్రామీణ యువతి హత్య కేసు పరిశోధనలో భాగంగా పాండే బృందం ఓ గ్రూపు ఫొటో నుంచి ఆనవాళ్లు తీసుకుని, వాటిని శవంతో సరిచూసి నిర్ధారించగలిగారు. ఫొటోను పెద్దదిగా చేసినపుడు ఆ అమ్మాయి నవ్వులో పలువరస కనిపించడంతో దాని ఆధారంగా దంతాల తీరును, ముందుపళ్ల నున్న సందుతో హతురాలిని గుర్తించారు. ఎనిమిది నెలల తర్వాత డీఎన్ఏ టెస్ట్‌లో ఇదే విషయం స్పష్టమైంది. రెండేళ్లక్రితం నాటి అహ్మద్‌నగర్ రేప్ కేస్లోనూ ఆమె పరిశోధనతోనే హతురాలి శరీరంపై పళ్లగాట్లతో నేరస్తుడిని పోల్చి పట్టుకున్నారు. దీనిపై ఆమె కోర్టులోనూ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. దాదాపు పది, పన్నెండు కేసుల్లో కోర్టు విచారణకు హాజరై ఫోరెన్సిక్ సైన్స్ నిపుణురాలిగా హేమలత సాక్ష్యమిచ్చారు. స్పెషల్ కోర్సు లేదు! భారత్‌లో ప్రతీ ఏడాది దాదాపు 26 వేల మంది డెంటిస్ట్ గ్రాడ్యుయేట్లు తయారవుతున్నారు. అందులో మూడువేల మందే పోస్ట్‌గ్రాడ్యుయేషన్ వరకు వెళుతున్నారు. ప్రస్తుతం దేశంలో ‘ఫోరెన్సిక్ డెంటిస్ట్రీ’ కోర్సుకు సంబంధించి ప్రభుత్వ గుర్తింపు పొందిన పీజీ కోర్సు ఏదీ లేదు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫోరెన్సిక్ ఒడొంటాలజీ మాత్రం.. ఓ సర్టిఫికెట్ కోర్సుతో పాటు ఈ రంగంలో వర్క్‌షాపులు, శిక్షణా తరగతులు నిర్వహిస్తోంది. ఈ అసోసియేషన్ కార్యదర్శి డా. ఆషిత్ ఆచార్య నిర్భయకేసు పరిశోధనలో కీలకంగా వ్యవహరించారు. ధార్వాడ్‌లోని ఎస్డీఎం కాలేజి ఆఫ్ డెంటల్ సైన్సెస్ అండ్ హాస్పటల్లో ఆయన అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. కర్ణాటకలోని అన్నెగెరిలో లెక్కకు మించి మనుషుల పుర్రెలు బయటపడినపుడు, అవి 1790 నాటి స్త్రీ, పురుషులవిగా ఆయన తన పరిశోధనలో తేల్చారు. ఇక హైదరాబాద్‌లోని పాణనీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అండ్ రీసెర్చి ఫోరెన్సిక్ డెంటిస్ట్రీ విభాగాధిపతి డా. సుధీర్ బళ్లా వివిధ కేసుల్లోని దోషుల వయసు నిర్ధారణలో తనవంతు కృషి చేస్తున్నారు. 18 ఏళ్ల పైబడిన, ఆ వయసు కంటే తక్కువున్న వారికి చట్ట అన్వయం ఒక్కో విధంగా ఉన్నందున వయసు నిర్ధారణలో ఈ శాస్త్రం కీలకంగా మారింది.. 16–18 ఏళ్ల వయసున్న వారిని వయోజనులుగా పరిగణించవవచ్చు కాబట్టి వారికి పడే శిక్షలు వేరుగా ఉంటాయి. ఈ సైన్స్ ద్వారా మనుషుల్లోని జ్ఞానదంతం పెరుగుదలను బట్టి వయస్సును నిర్ధారిస్తారు. – కె. రాహుల్ -
పళ్లలో పట్టేస్తారు...!
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సష్ఠించిన ఢిల్లీ నిర్భయ సామూహిక అత్యాచారం,హత్య కేసు విచారణలో భాగంగా ఈ పరిశోధన వెలుగులోకి వచ్చింది. దంతవైద్యశాస్త్రంతో ముడిపడిన ఒడంటోలజీ ఫోరెన్సిక్ సైన్స్ ద్వారానే ఈ కేసులో నిందితుల క్రూరత్వాన్ని సాక్ష్యాధారాలతో సహా నిరూపించగలిగారు. పోలీసులిచ్చిన అనుమానితుల ఫోటోల్లోని ముఖకవళికలను బట్టి నిందితుల నోటి పళ్ల సరళి ద్వారా వారి వయసు (రేప్‌కు పాల్పడిన వారిలో ఓ మైనర్ కూడా ఉండడంతో ) నిర్థారించారు. నిర్భయ శరీరంపై æగాయాలను ఈ నిందితుల పలువరసను పోల్చి చూడడం ద్వారా ఈ కేసును పరిష్కరించారు. నేర పరిశోధనలో...మరీ ముఖ్యంగా తీవ్రాతి తీవ్రమైన నేరాలు, క్రూరమైన పద్ధతుల్లో లైంగికహింస, దాడులు, హత్యలు సాగుతున్న ప్రస్తుత సందర్భంలో ‘ఫోరెన్సిక్ ఒడంటోలజీ’ కీలకపాత్ర పోషిస్తోంది. దంతవైద్యశాస్త్రంతో ముడిపడిన ఈ ఫోరెన్సిక్ సైన్స్ భారత్‌లో ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నా, లైంగికదాడులు, ఇతర హింసాత్మక కేసుల్లో నిందితుల ప్రమేయాన్ని నిగ్గుతేల్చడంలో ముఖ్యమైన ఆధారంగా ఉపయోగపడుతోంది. వివిధ సివిల్, క్రిమినల్ కే సులతో పాటు క్రీడాకారుల వయసు నిర్థారణ వివాదాల పరిష్కారానికి ఈ పరిశోధన దోహదపడుతోంది. అస్థిపంజరం, ఎముకల ద్వారా కంటే కూడా ఈ ఫోరెన్సిక్ సైన్స్ నిర్థారణ పక్కాగా ఉంటుంది. దంతాల ఆధారంగా హతులు లేదా నిందితుల వయసు అంచనా ఓ ఏడాది అటూ ఇటూగా ఉంటే, అస్థిపంజరం లేదా ఎముకల ఆధారంగా చేసే అంచనా మధ్య తేడా పదేళ్ల వరకు ఉండొచ్చునంటున్నారు. ఫోరెన్సిక్ ఒడంటోలజీ లో డా. హేమలతా పాండే తనదైన ప్రతిభ, నైపుణ్యాన్ని చాటుతున్నారు. ఈ ప్రత్యేక నేరపరిశోధనా రంగంలో శాస్త్రపరమైన అనుభవమున్న వారు దేశవ్యాప్తంగా కేవలం పది మంది వరకే ఉన్నారు. వీరంతా కూడా విదేశాల్లోనే ఈ పీజీ కోర్సును పూర్తిచేశాక, అక్కడే శిక్షణ పొంది వచ్చినవారే. ఇలాంటి కేసులకు సంబంధించి వార్తలు పత్రికలో చూశాక, తనకు తానే పోలీసుల వద్దకు వెళ్లి వాటి పరిష్కారానికి అవసరమైన సహకారాన్ని అందిస్తానంటూ తొలినాళ్లలో పాండే వంటి వాళ్లు చెప్పాల్సి వచ్చేది. మహారాష్ట్రలోని ఓ గ్రామీణ యువతి హత్య కేసు పరిశోధనలో భాగంగా పాండే బందం ఓ గ్రూపు ఫోటో నుంచి ఆనవాళ్లు తీసుకుని, వాటిని శవంతో సరిచూసి నిర్థారించగలిగారు. ఫోటోను పెద్దదిగా చేసినపుడు ఆ అమ్మాయి నవ్వులో పలువరస కనిపించడంతో దాని ఆధారంగా దంతాల తీరును, ముందుపళ్ల నున్న సందుతో హతురాలిని గుర్తించారు. ఎనిమిదినెలల తర్వాత డీఎన్ఏ టెస్ట్‌లో ఇదే విషయం స్పష్టమైంది. రెండేళ్లక్రితం నాటి అహ్మద్‌నగర్ రేప్‌కేస్‌లోనూ ఆమె పరిశోధనతోనే హతురాలి శరీరంపై పళ్లగాట్లతో నేరస్తుడిని పోల్చి పట్టుకున్నారు. దీనిపై ఆమె కోర్టులోనూ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. దాదాపు పది,పన్నెండు కేసుల్లో కోర్టు విచారణకు హాజరై ఫోరెన్సిక్ సైన్స్ నిపుణురాలిగా సాక్ష్యమిచ్చారు. మనదేశంలో అంతంతే... భారత్‌లో ప్రతీ ఏడాది దాదాపు 26 వేల మంది డెంటిస్ట్ గ్రాడ్యువేట్లు తయారవుతున్నారు. అందులో మూడువేల మందే పోస్ట్‌గ్రాడ్యువేషన్ వరకు వెళుతున్నారు. ప్రస్తుతం దేశంలో ‘ఫోరెన్సిక్ డెంటిస్ట్రీ’కోర్సుకు సంబంధించి ప్రభుత్వ గుర్తింపు పొందిన పీజీ కోర్సు ఏదీ లేదు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫోరెన్సిక్ ఒడొంటోలజీ ఓ సర్టిఫికెట్ కోర్సుతో పాటు ఈ రంగంలో వర్క్‌షాపులు, శిక్షణా తరగతులు నిర్వహిస్తోంది. ఈ అసోసియేషన్ కార్యదర్శి డా. ఆషిత్ ఆచార్య నిర్భయకేసు పరిశోధనలో కీలకంగా వ్యవహరించారు. ధార్వాడ్‌లోని ఎస్డీఎం కాలేజి ఆఫ్ డెంటల్‌సైన్సెస్ అండ్ హాస్పటల్లో ఆయన అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. కర్ణాటకలోని అన్నెగెరిలో లెక్కకు మించి మనుషుల పుర్రెలు బయటపడినపుడు, అవి 1790 నాటి స్త్రీ,పురుషులవిగా ఆయన తన పరిశోధనలో నిగ్గు తేల్చారు. దుర్భిక్షంగా కారణంగా వారంతా మరణించినట్టు వెల్లడించారు. అప్పటివరకు మొగల్ సైన్యం స్థానికులను సామూహికంగా హత్య చేసి ఉంటుందని అందరూ భావించారు. హైదరాబాద్‌లోని పాణ నీయ ఇన్సిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అండ్ రిసెర్చీ ఫోరెన్సిక్ డెంటిస్ట్రీ విభాగాధిపతి డా. సుధీర్ బళ్లా వివిధకేసుల్లోని దోషుల వయసు నిర్థారణలో తనవంతు కషి చేస్తున్నారు. 18 ఏళ్ల పైబడిన, ఆ వయసు కంటే తక్కువున్న వారికి చట్ట అన్వయం ఒక్కో విధంగా ఉన్నందున వయసు నిర్థారణలో ఈ శాస్త్రం కీలకంగా మారింది.. 16–18 ఏళ్ల వయసున్న వారిని వయోజనులుగా పరిగణించవవచ్చు కాబట్టి వారికి పడే శిక్షలు వేరుగా ఉంటాయి. ఈ సైన్స్ ద్వారా మనుషుల్లోని జ్ఞానదంతం పెరుగుదలను బట్టి వయస్సును నిర్థారిస్తారు. -
బురారీ కేసు.. ప్రమాదం మాత్రమే : ఫోరెన్సిక్ రిపోర్టు
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బురారీ సామూహిక మరణాల మిస్టరీ వీడింది. భాటియా కుటుంబ సభ్యులవి ఆత్మహత్యలు కావని.. పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా జరిగిన ప్రమాదం మాత్రమేనని సీబీఐ- సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక ఇచ్చింది. గత జూన్‌లో ఢిల్లీలోని బురారి ప్రాంతంలో నివాసం ఉంటున్న ఒకే కుటుంబంలోని 11 మంది అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. వారిలో 10 మంది ఇంట్లోని సీలింగ్‌కు ఉన్న ఇనుప కమ్మీలకు వేలాడుతుండగా, ఇంటి యజమాని నారాయణ దేవి (75) గొంతు కోయడం వల్ల చనిపోయింది. కాగా తాంత్రిక పూజల ప్రభావానికి లోనుకావడం వల్లే వీరంతా ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు భావించారు. భాటియా కుటుంబ సభ్యుల్లో ఒకడైన లలిత్ భాటియా మూఢనమ్మకాల కారణంగానే ఈ కుటుంబం ఆత్మహత్య చేసుకుందని విచారణలో వెల్లడైంది. అయితే భాటియా కుటుంబంలోని ఇతర వ్యక్తులు ఈ విషయాన్ని వ్యతిరేకించారు. కానీ పోస్టుమార్టం రిపోర్టులో ఉరివేసుకోవడం వల్లే మరణించారని నివేదిక రావడంతో ఢిల్లీ పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకున్నారు. వీరి మరణాలకు గల స్పష్టమైన కారణాలు తెలుసుకునేందుకు.. మృతుల సైకలాజికల్ అటాప్సీ నివేదిక ఇవ్వాల్సిందిగా సీబీఐ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు లేఖ రాశారు. వీరికి ఆత్మహత్య చేసుకోవాలనే భావన ఏమాత్రం లేదని.. ఇదొక ప్రమాదమని ఫోరెన్సిక్ ల్యాబ్ బుధవారం సాయంత్రం నివేదిక ఇచ్చింది. సైకలాజికల్ అటాప్సీ అంటే... మెడికల్ రిపోర్టుల ఆధారంగా ఒక వ్యక్తి మానసిక స్థితిని అధ్యయనం చేసే ప్రక్రియనే సైకలాజికల్ అటాప్సీ అంటారు. సైకలాజికల్ అటాప్సీలో వ్యక్తి స్నేహితులు, వ్యక్తిగత డైరీలు, కుటుంబ సభ్యులు చెప్పిన విషయాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. బురారీ కేసులో కూడా ఈ ప్రక్రియనే అనుసరించామని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. సైకలాజికల్ అటాప్సీలో భాగంగా భాటియా కుటుంబ యజమాని నారాయణ దేవి పెద్ద కుమారుడు దినేశ్ సింగ్ చందావత్, అతడి సోదరి సుజాతా నాగ్‌పాల్‌ల కుటుంబ సభ్యులు, స్నేహితులు, లలిత్ భాటియా డైరీలు, రిజిస్టర్లు, ఇరుగుపొరుగు వారు చెప్పిన విషయాల ఆధారంగా ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. -
ఫోరెన్సిక్‌పై అనాసక్తి!
ఫోరెన్సిక్ విభాగంలో చేరేందుకు వైద్య విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించడమే ప్రధాన విధి కావడంతో విద్యార్థులు అనాసక్తి చూపుతున్నారు. కర్నూలు మెడికల్ కళాశాలలో ఫోరెన్సిక్ విభాగంలో రెండు పీజీ సీట్లు ఉన్నాయి. ఇవి కూడా ఏటా భర్తీకి నోచుకోవడం లేదు. ఏ పీజీ సీటు రాని వారు ఇందులో చేరినా మధ్యలోనే మానేస్తున్నారు. ప్రస్తుతం ఇందులో సిబ్బంది కొరత వేధిస్తోంది. పోస్టుమార్టం చేయడం, కేసుల కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుండటంతో ఉన్నవారిపై భారం పడుతోంది. కర్నూలు(హాస్పిటల్): వైద్య వృత్తి, పోలీసు విభాగంలో ఉన్నవారు వృత్తిరీత్యా మృతదేహాలను వారు తరచూ చూడాల్సి వస్తుంది. అయితే మృతదేహాలను చూడటం వేరు, వాటికి పోస్టుమార్టం చేయడం వేరు. పోస్టుమార్టం చేయడానికి మనోధైర్యం కావాలి. అయితే చాలామందికి మనోధైర్యం ఉండదు. ఈ కారణంగానే ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగంలో చేరే వైద్య విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. చేరినా మధ్యలోనే మానేసి వెళ్లిపోతున్న సంఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. అభ్యసనకు దూరంగా విద్యార్థులు.. ఎంబీబీఎస్ చదివే విద్యార్థులకు ఫోరెన్సిక్ మెడిసిన్ ఒక సబ్జెక్ట్‌గా ఉంటుంది. విద్యార్థులు ఆరు నెలల పాటు ఈ విభాగంలో అభ్యసించాల్సి ఉంటుంది. కానీ చాలా మంది వైద్య విద్యార్థులు ఏదో విధంగా ఈ సబ్జెక్ట్ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తారనే విమర్శలున్నాయి. ఇక పోస్టుమార్టం చేసే విధానాన్ని ఇక్కడి కళాశాలలో చాలా మంది విద్యార్థులు నేర్చుకోవడం లేదనే ఆరోపణలూ ఉన్నాయి. ఎంబీబీఎస్ పూర్తి చేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో మెడికల్ ఆఫీసర్లుగా వెళ్తే అక్కడకు వచ్చే మృతదేహాలకు వీరు పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉంటోంది. పోస్టుమార్టంపై అవగాహన లేకపోవడంతో జిల్లాలో నంద్యాల, ఆదోని మినహా జిల్లాలో ఎక్కడ మెడికో లీగల్ కేసు మరణం సంభవించినా మృతదేహాలను దాదాపు కర్నూలుకే పోస్టుమార్టం కోసం పంపిస్తున్న ఘటనలు అనేకం. వైద్యుల కొరత ఏటా రెండు పీజీ సీట్లు భర్తీ అయితే మూడేళ్లకు ఆరుగురు పీజీ వైద్యులు అందుబాటులో ఉంటారు. అయితే ఫోరెన్సిక్ విభాగంలో ప్రస్తుతం ఒక్క పీజీ వైద్య విద్యార్థే అభ్యసిస్తున్నారు. ఈ విభాగంలో రెండు ప్రొఫెసర్, రెండు అసోసియేట్, నాలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉండాలి. ప్రస్తుతం ఒక ప్రొఫెసర్, ఒక అసోసియేట్, ఇద్దరు అసిస్టెంట్ వైద్యులు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. వైద్యుల కొరతతో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. సాయంత్రం 5 గంటలు దాటితే మృతదేహాలకు పోస్టుమార్టం జరగదు. మరునాడు ఉదయం 10 గంటల తర్వాతే పోస్టుమార్టం నిర్వహించాల్సి వస్తోంది. దీనికితోడు పోస్టుమార్టం చేసిన కేసుల నిమిత్తం నివేదికలు తయారు చేయడం, తరచూ కోర్టులకు వెళ్లి రావడం వల్ల కూడా ఉన్న వారిపై భారం పడుతోంది. వైద్యవృత్తిలో ఎంతో కీలకమైన ఈ విభాగాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. పీజీలో చేరే వారేరీ? కర్నూలు వైద్య కళాశాలలోని ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగంలో రెండు పీజీ సీట్లు ఉన్నాయి. ఏటా పీజీ సీట్ల భర్తీ అన్ని విభాగాలతో పాటు ఈ విభాగానికి జరుగుతుంది. ఏ సీటు రాని వారే ఫోరెన్సిక్ విభాగం పీజీ సీటును తీసుకుంటారనే వాదన కూడా ఉంది. ఈ విభాగంలో చేరుతున్న వైద్య విద్యార్థులు చాలా అరుదుగా కనిపిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో, ఏ పీజీ సీటు రాని వారు ఇందులో చేరినా మధ్యలో వెళ్లిపోతున్నారు. 2009–10లో డాక్టర్ జోషి కుమార్, 2014–15లో డాక్టర్ సునీల్‌బాబు, 2016–17లో డాక్టర్ ఎం. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కోర్సులో చేరి మధ్యలో మానేశారు. 2011–12, 2012–13, 2013–14, 2015–16, 2018–19 విద్యా సంవత్సరాల్లో ఒక్క విద్యార్థి కూడా ఇందులో చేరలేదంటే విద్యార్థుల అనాసక్తిని అర్థం చేసుకోవచ్చు. -
ఫ్లైఓవర్‌కు వేలాడుతూ మృతదేహం.. కలకలం
న్యూఢిల్లీ : జనంతో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ఫ్లై ఓవర్ గ్రిల్‌కు ఓ వ్యక్తి మృతదేహం వేలాడుతుండటం కలకలం రేపింది. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి ఇది గమనించి పోలీసులకు సమాచారం అందించగా వారు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర ఢిల్లీ అజాద్‌పూర్ సమీపంలోని ఎంసీడీ కాలనీలో 38 ఏళ్ల సత్యేంద్ర కుటుంబుం నివాసం ఉంటోంది. ఈ క్రమంలో గురువారం ఉదయం అతడి మృతదేహం దౌలాఖాన్ ఫ్లై ఓవర్ గ్రిల్‌కు వేలాడుతూ కనిపించింది. ఇది గమనించిన ఓ వ్యక్తి నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి జేబులో ఉన్న కార్డులు, ఇతరత్రా పేపర్లు పరిశీలించిన అధికారులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం అనంతరం అతడి ఫ్యామిలీకి సత్యేంద్ర మృతదేహాన్ని అప్పగించారు. మృతుడి వద్ద ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని చెప్పారు. ఫోరెన్సిక్ నివేదిక వస్తే.. అసలు ఇది హత్యా.. లేక ఆత్మహత్యా తెలియనుందని పోలీసులు వివరించారు. -
ప్రొఫెసర్ నిర్మలాదేవికి స్వర పరీక్ష
టీ.నగర్: కళాశాల విద్యార్థినులను లైంగిక ప్రలోభాలకు గురిచేసిన ప్రొఫెసర్ నిర్మలాదేవికి ఫోరెన్సిక్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ హేమలత సమక్షంలో గురువారం స్వర పరిశోధన (వాయిస్ టెస్ట్) జరిగింది. విరుదునగర్ జిల్లా అరుప్పుకోటై ప్రైవేటు కళాశాల ప్రొఫెసర్ నిర్మలాదేవి విద్యార్థినులను సెల్ఫోన్లో సంప్రదించి లైంగిక ప్రలోభాలకు గురి చేసినట్లు ఆడియో సామాజిక మాధ్యమాల్లో విడుదల కావడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగింది. నిర్మలాదేవిపై పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను అరెస్టు చేశారు. అనంతరం మదురై సెంట్రల్జైల్లో నిర్బంధించారు. నిర్మలాదేవికి సహకరించిన మదురై కామరాజర్ వర్సిటీ ప్రొఫెసర్ మురుగన్, పరిశోధక విద్యార్థి కరుప్పస్వామిలను అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ కేసుపై సీబీసీఐడీ పోలీసులు తీవ్ర విచారణ జరుపుతున్నారు. మదురై జైల్లో ఉన్న ప్రొఫెసర్ నిర్మలాదేవికి స్వర పరిశోధన జరపాలంటూ సీబీసీఐడీ పోలీసులు మదురై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మదురైలో ఈ పరీక్షకు తగిన పరికరాలు లేనందున చెన్నైలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు నిర్మలాదేవిని తీసుకువచ్చి పరీక్షలు జరిపేందుకు అనుమతినిచ్చారు. దీంతో గురువారం ఉదయం 9 గంటలకు పుళల్ జైలు నుంచి మైలాపూరులో గల పరిశోధన కేంద్రానికి 10.30 గంటలకు ప్రొఫెసర్ నిర్మలాదేవిని పోలీసు భద్రతతో తీసుకుని వచ్చారు. తరువాత ఆమెను పరిశోధన కేంద్రంలో హాజరు పరచి వాయిస్ టెస్ట్‌తో పాటు వివిధ పరీక్షలు జరిపారు. దీనికి సంబంధించిన నివేదికను మదురై హైకోర్టులో సమర్పించనున్నట్లు సమాచారం. -
6 నెలల్లో 3500 ఫోన్ కాల్స్.. పొసెసివ్‌నెస్ వల్లే
సాక్షి, న్యూఢిల్లీ : సహోద్యోగి భార్యను హత్య చేసిన కేసులో నిందితుడు, ఆర్మీ మేజర్ నిఖిల్ హండాను ఆదివారం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నిఖిల్‌ను సోమవారం కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు.. ఈ కేసులో కీలక సాక్ష్యాధారాలు, వివరాలు రాబట్టేందుకు అతడిని తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరారు. విచారణ అనంతరం పలు కీలక విషయాలు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం... సహోద్యోగి, మేజర్ అమిత్ ద్వివేది భార్య శైలజను వివాహం చేసుకోవాలని భావించిన నిఖిల్.. శైలజను కలవడానికి ముందు రోజే తన భార్యతో గొడవ పడ్డాడు. అనంతరం ఢిల్లీకి వచ్చి శైలజను తన హోండా సిటీ కారులో ఎక్కించుకుని తీసుకెళ్లాడు. తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా ఆమెను కోరాడు. అందుకు శైలజ నిరాకరించడంతో పదునైన ఆయుధంతో ఆమె గొంతు కోసి హత్య చేశాడు. తర్వాత ఆమె మరణాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని తన కారులో తీసుకెళ్లి రోడ్డుపై పడేశాడు. ఆ తర్వాత మీరట్‌కు వెళ్లిన అనంతరం కారును పూర్తిగా శుభ్రం చేశాడు. శైలజ, తన ఫోన్లలో ఉన్న కొన్ని అప్లికేషన్లను డెలిట్ చేశాడు. అంతేకాకుండా తన ఫోన్‌ను పూర్తిగా ధ్వంసం చేసి, ఇంటి సమీపంలో ఉన్న ఓ చెత్త డబ్బాలో పడేశాడు. తర్వాత తన స్నేహితుడికి ఫోన్ చేసి శైలజను చంపేసినట్టు చెప్పాడు. అయితే ఆమెతో తనకు అంతగా చనువు లేదని తెలిపాడు. అయితే నిఖిల్ కారును పరిశీలించిన ఫోరెన్సిక్ నిపుణులు రక్తపు మరకలు, వేలి ముద్రలు, ముందు సీటు భాగంలో ఇరుక్కున్న తల వెంట్రుకలు గుర్తించారు. అవి శైలజకు సంబంధించినవిగా తేల్చారు. నిఖిల్ ఫోన్ డేటాను పరిశీలించినన పోలీసులు గడిచిన ఆరు నెలల్లో 3500 సార్లు శైలజకు ఫోన్ చేసినట్లుగా గుర్తించారు. శైలజ, నిఖిల్ ఫోన్లలో తొలగించిన యాప్స్‌ను తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తునట్లు పోలీసులు తెలిపారు. ఈ అంశాలన్నీ పరిశీలిస్తుంటే శైలజ విషయంలో పొసెసివ్నెస్తోనే నిఖిల్ ఉన్మాదిగా మారినట్టు తెలుస్తోందని పోలీసు ఉన్నతాధికారి పేర్కొన్నారు. అయితే శైలజను హత్య చేసేందుకు ఉపయోగించిన ఆయుధం మాత్రం ఇంకా లభించలేదని ఆయన తెలిపారు. -
ఒకే తుపాకీతో గౌరీ, కల్బుర్గి హత్య
బెంగళూరు: ప్రముఖ పాత్రికేయురాలు, సామాజిక కార్యకర్త గౌరీ లంకేశ్‌ను, హేతువాది ఎంఎం కల్బుర్గిని ఒకే తుపాకీతో కాల్చి చంపినట్టు తేలింది. కర్ణాటక రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ గౌరీ హత్య కేసును విచారిస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)కు నివేదిక అందజేసింది. కల్బుర్గి 2015 ఆగస్టు 30న ధార్వాడ్‌లోని తన ఇంట్లోనే హత్య చేశారు. గౌరి కిందటేడాది సెప్టెంబర్ 5న తన నివాసానికి సమీపంలో దుండగుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. రెండేళ్ల తేడాతో వీరిద్దరినీ ఒకే తుపాకీతో చంపారని సిట్ గతంలో చెప్పినా ఫోరెన్సిక్ నివేదిక సాక్షిగా ఆ విషయం ఇప్పుడు స్పష్టంగా బయటపడింది. 7.65 ఎంఎం దేశవాళీ తుపాకీతో వీరిని చంపినట్టు నివేదిక పేర్కొంది. గౌరీ లంకేశ్ కేసుకు సంబంధించి సిట్ ఇప్పటికే బెంగళూరులోని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు తొలి చార్జిషీట్ సమర్పించింది. అందులో హిందుత్వ కార్యకర్త నవీన్ కుమార్‌ను నిందితుడిగా సిట్ పేర్కొంది. అందులో ‘గౌరీ లంకేశ్ హిందూ వ్యతిరేకి.. ఆమెకు బతికే అర్హత లేదు’ అని ప్రధాన నిందితుడు ప్రవీణ్ కుమార్ తనతో చెప్పాడని నిందితుడు నవీన్ పేర్కొన్నట్లు పొందు పరిచారు. లంకేశ్‌ను హత్య చేసేందుకు బుల్లెట్లు సిద్ధం చేయమని ప్రవీణ్ అడిగాడని నవీన్ చెప్పినట్టు పేర్కొన్నారు. మరో హత్యకు కుట్ర హేతువాది, హిందుత్వ సిద్ధాంత విమర్శకుడు కేఎస్ భగవాన్ హత్యకు కుట్ర జరుగుతున్నట్టు నవీన్ సిట్ వద్ద అంగీకరించాడు. కిందటేడాది నవంబర్‌లో సంజయ్ బన్సారే అను వ్యక్తి తనను కలసి కేఎస్ భగవాన్ను చంపేందుకు తుపాకీలను సిద్ధం చేయమని అడిగాడని సిట్‌తో చెప్పాడు. తనకు శ్రీరామ్ సేనే, బజరంగ్‌దళ్‌తో సంబంధాలున్నా యని, 2014లో హిందూ యువసేనే అనే సంస్థను స్థాపించానని నవీన్ వెల్లడించాడు. -
భర్తను చంపి.. ముక్కలుగా కోసి
పనాజి : కట్టుకున్న భర్తను కడతేర్చిందో భార్య. పోలీసులకు అనుమానం రాకూడదనే ఉద్దేశంతో శవాన్ని అటవీ ప్రాంతంలో పడేసింది. ఈ దారుణ సంఘటన దక్షిణ గోవాలోని కరోచీరాం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బసౌరాజ్ బసు, కల్పనా బసు భార్యాభర్తలు. వీరికి ఇద్దరు సంతానం. బసౌరాజ్ దినసరి కూలీగా పనిచేసేవాడు. నెలరోజుల క్రితం భార్యాభర్తల మధ్య చిన్న గొడవ తలెత్తింది. దీంతో కోపోద్రిక్తురాలైన కల్పన ఆవేశంలో తన భర్తను గొంతు నులిమి హత్య చేసింది. తర్వాత భయంతో ఈ విషయాన్ని భర్త స్నేహితులకు చెప్పి, వారి సాయం కోరింది. అనంతరం ముగ్గురు వ్యక్తులతో కలిసి భర్త శవాన్ని మూడు ముక్కలుగా కోసి, గోనె సంచిలో కుక్కి నిర్మానుష్య ప్రదేశంలో పడేసింది. అనుమానం వచ్చిందిలా.. నిందితుల్లో ఒకరైన వ్యక్తి భార్యకు అతడి ప్రవర్తన పట్ల అనుమానం కలిగింది. విషయమేమిటని నిలదీయగా అతడు నిజం చెప్పేశాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితులు కల్పనా బసు, సురేశ్ కుమార్, అబ్దుల్ కరీం, పంకజ్ పవార్లను అరెస్టు చేశారు. తమదైన శైలిలో నిందితులను విచారించగా నిజాలు వెల్లడించారని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. వారు చెప్పిన అంశాల ఆధారంగా నిర్మానుష్య ప్రదేశంలో, కుళ్లిపోయిన స్థితిలో ఉన్నశవాన్ని కనుగొన్నామని.. అయితే ఆ శవం బసౌరాజ్దేనని తేల్చేందుకు ఆధారాలు లేకపోవడంతో ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామన్నారు. ఈ ఘటనపై లోతుగా విచారణ చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు. -
ఆర్నెల్ల తర్వాత శవానికి పోస్టుమార్టం
కురబలకోట : ఆరు నెలల క్రితం మృతిచెందిన అంగళ్లుకు చెందిన శెట్టి సీతారాంరెడ్డి మృతదేహాన్ని గురువారం వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు. శరీర భాగాలను తిరుపతిలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపుతున్నట్లు ఇన్చార్జి రూరల్ సీఐ సురేష్‌కుమార్ వెల్లడించారు. ఆర్నెళ్ల తర్వాత కూడా మృత దేహం చెక్కు చెదరకుండా ఉండడం విశేషం. వివరాల్లోకెళితే.. అంగళ్లుకు చెందిన సీతారాంరెడ్డి ఆరు నెలల క్రితం మృతిచెందారు. ఆయన గుండెపోటుతో మృతిచెంది నట్టు భావించిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. మదనపల్లెలో ఇటీవల జరిగిన హత్య కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు కొంతమంది నిందితులను అరెస్టు చేశారు. విచారణలో వారు సీతారాంరెడ్డిని హత్య చేసినట్టు అంగీకరించారు. ఆస్తి పంపకాలకు అడ్డుపడుతున్నాడన్న కారణంతో అతన్ని బంధువులు పథకం ప్రకారం హత్య చేయించినట్టు వెల్లడించారు. ఊరి బయటకు వాకింగ్‌కు వెళ్లిన ఆయనకు బలవంతంగా విషపు నీరు తాగించడంతో చనిపోయినట్లు వివరించారు. పోలీసులు తహసీల్దార్ ఆధ్వర్యంలో గురువారం సీతారాంరెడ్డి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం చేయించారు. ఆయన శరీర భాగాలను తిరుపతి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఐదుగురు నిందితులపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి నివేదిక అందిన తర్వాత దర్యాప్తు వేగవంతం చేస్తామన్నారు. -
బోనీకపూర్‌ను అరెస్ట్ చేసే అవకాశం?
-
బోనీకపూర్‌ను అరెస్ట్ చేసే అవకాశం?
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ సినీ నటి శ్రీదేవి మృతిపై అనేక సందేహాలు నెలకొన్నాయి. ఆమె గుండెపోటుతో మరణించలేదని, ప్రమాదవశాత్తూ మృతి చెందినట్టు ఫోరెన్సిక్ నిపుణులు ఇచ్చిన రిపోర్ట్‌పై దుబాయ్ పోలీసులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో కేసును పోలీసులు పునర్విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. నేడు మరోసారి శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ను విచారించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పాస్‌పోర్ట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ పూర్తయ్యేవరకు దుబాయ్ విడిచి వెళ్లొద్దని ఆదేశించారు. బోనీని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. శ్రీదేవి, బోనీకపూర్ కాల్‌డేటాను క్షుణ్ణంగా పోలీసులు పరిశీలిస్తున్నారు. శ్రీదేవి ఫోన్ నుంచి ఒకరికి ఎక్కువగా కాల్స్ వెళ్లినట్లు గుర్తించారు. పెళ్లి ఈ నెల 20న జరిగితే శ్రీదేవి 24వరకు దుబాయ్‌లోనే ఎందుకున్నారు. ముంబై తిరొగొచ్చిన బోనీ మళ్లీ అక్కడికి ఎందుకు వెళ్లారు. టబ్‌లో పడ్డ ఆమెను ఎవరు చూశారు. ఆ సమయంలో బోనీ ఎక్కడున్నారనే ?అన్ని కోణాల్లో పోలీసులు విచారణ జరపుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆమె భౌతిక కాయం అప్పగింతపై సస్పెన్స్ కొనసాగుతోంది. దీంతో ఆమె భౌతిక కాయం వచ్చే అవకాశం కనిపించడంలేదు. అన్ని సందేహాలు తీరాకే ఆమె భౌతికకాయం అప్పగిస్తామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటి వరకు శ్రీదేవి మరణంపై బోనీకపూర్ ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో అనుమానాలకు బలం చేకూరుతోంది.