ఓటుకు కోట్లు: టేపుల డీకోడింగ్ ప్రారంభం
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. ఆడియో, వీడియో టేపులను డీకోడింగ్ చేసే కీలక ప్రక్రియను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ప్రారంభించింది. ఇందుకోసం ప్రత్యేకంగా మూడు బృందాలను ఏర్పాటుచేసింది. మొత్తం 14 ఆడియో, వీడియో టేపులను తెలంగాణ ఏసీబీ వర్గాలు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు గతంలో పంపిన విషయం తెలిసిందే. ఇప్పుడు వాటిని విడిగా కాపీచేసి, వాటిలోని నిజాలను నిగ్గుతేల్చేందుకు ఎఫ్ఎస్ఎల్ సిద్ధమైంది. ఇందుకోసం ఏర్పాటుచేసిన మూడు బృందాలు ఇప్పటికే తమ పని మొదలుపెట్టేశాయి.
తన ఫోన్ ట్యాప్ చేశారని ఒకసారి, అసలు అందులో ఉన్నది తన గొంతు కాదని మరోసారి.. అప్పుడప్పుడు వేర్వేరు సందర్భాలలో మాట్లాడిన మాటలను కట్ అండ్ పేస్ట్ చేసి ఈ టేపులు రూపొందించారని ఇంకోసారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు ఈ మొత్తం విషయాలన్నింటినీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఏర్పాటుచేసిన మూడు ప్రత్యేక బృందాలు నిగ్గు తేలుస్తాయి. డీకోడింగ్ తర్వాత అన్ని విషయాల్లో వాస్తవాలు వెలుగు చూస్తాయని భావిస్తున్నారు.