సాక్షి, హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసు మళ్లీ కదులుతోంది. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి మనీలాండరింగ్‌కు పాల్పడుతున్నారనే ఆరోపణలపై విచారణ జరిపిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ), ఆదాయపన్ను శాఖ అధికారులకు ‘ఓటుకు కోట్లు కేసు’మూలాలు లభించినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. అందులో భాగంగానే రేవంత్‌రెడ్డితో పాటు ఓటుకు కోట్లు కేసులో సహ నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయసింహ నివాసాల్లో తనిఖీలు జరిపారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని కోరుతూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.5 కోట్లు ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకుని అడ్వాన్స్‌గా రూ.50 లక్షలు ముట్టజెప్పిన సందర్భంలో రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన సంగతి తెలిసిందే. అవినీతి నిరోధక శాఖ అధికారులు వారిని అరెస్టు చేసి జైలుకు తరలించారు.
తాము పట్టుకున్న రూ.50 లక్షలను న్యాయస్థానం అనుమతితో ఆదాయపన్ను శాఖకు అందజేశారు. ఈ కేసులో కీలకమైన చంద్రబాబు– స్టీఫెన్‌సన్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ టేపును ప్రఖ్యాతి గాంచిన చండీగఢ్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. స్టీఫెన్‌సన్‌తో మాట్లాడింది చంద్రబాబేనని ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా నిర్ధారించింది. అయినా ఇప్పటివరకు ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగలేదు. అయితే, స్టీఫెన్‌సన్‌కు ఇచ్చిన డబ్బులు, ఇస్తామన్న డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో దర్యాప్తు చేసి వివరాలు ఇవ్వాలంటూ అవినీతి నిరోధక శాఖ ఈడీకి లేఖ రాసింది. అయినప్పటికీ, దాదాపు రెండున్నరేళ్లపాటు ఈడీ ఎటువంటి విచారణ జరపలేదు. దీంతో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ పోలీసు శాఖ ఇటీవల ఈడీ డైరెక్టర్‌కు లేఖ రాయడంతో.. విచారణ ఎక్కడా ఆగిందో తెలుసుకుంటామని సమాధానం ఇచ్చింది.
వెంటనే ఓ అధికారుల బృందాన్ని ఏర్పాటుచేసి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకునే ప్రయత్నం చేసింది. విచారణలో ఈడీయే బిత్తరపోయే అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. విదేశీ బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున నిధులు ఇక్కడి బ్యాంకు ఖాతాల్లో జమ అయినట్టుగా దర్యాప్తులో తేలింది. తీగ లాగితే డొంక కదలినట్లు కోట్లాది రూపాయల వ్యవహారం బయటపడటంతో.. గుట్టుచప్పుడు కాకుండా గురువారం ఉదయం రేవంత్‌తో పాటు ఈ కేసులో సహ నిందితులైన సెబాస్టియన్, ఉదయసింహ నివాసాల్లో తనిఖీలు నిర్వహించారు. కాగా, విదేశీ బ్యాంకుల నుంచి నిధులు తరలించిన ఘటనలో ప్రముఖుల హస్తం ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది. వారు ఎవరో అనే విషయం తెలుసుకునే పనిలో ఈడీ నిమగ్నమైంది.
Comments
Please login to add a commentAdd a comment