పెళ్లంటేనే పెద్ద మిస్టరీ... | Hollywood Movie | Sakshi
Sakshi News home page

పెళ్లంటేనే పెద్ద మిస్టరీ...

Published Wed, May 25 2016 11:07 PM | Last Updated on Thu, Oct 4 2018 5:51 PM

పెళ్లంటేనే పెద్ద మిస్టరీ... - Sakshi

పెళ్లంటేనే పెద్ద మిస్టరీ...

హాలీవుడ్ సినిమా / గాన్ గర్ల్


ఆ రోజు వాళ్ల పెళ్లిరోజు. పెళ్లయి అయిదేళ్లయింది. సెలబ్రేట్ చేసుకోవలసిన తరుణంలో భార్య హఠాత్తుగా మాయమైంది. ఫోరెన్సిక్ నిపుణులకి భార్య అమీ రక్తపు మరకలు దొరికాయి. భర్త నిక్, ఆమెని చంపేసి మాయమైనట్లు ఆధారాలు సృష్టించాడని పోలీసులు భావించారు. నిక్ తనకేమీ తెలియదంటాడు. ఇంతకీ ఏం జరిగింది?

  

ఏమై ఉంటుందో ఈ కథని రాసిన గిలియన్ ఫ్లిన్‌కి తెలుసు. ఫ్లిన్ వృత్తి రీత్యా జర్నలిస్ట్. మనిషి మనసుని మించిన థ్రిల్లర్ మరొకటి ఉండదని ఫ్లిన్ ప్రగాఢ నమ్మకం. క్రూరమైన స్త్రీ పాత్రలు సృష్టించడంలో ఆమె స్పెషలిస్ట్. ఆమె రాసిన ఫస్ట్ డ్రాఫ్ట్ తర్వాత దర్శకుడు డేవిడ్ ఫించర్‌కి మరో రచయిత అవసరం లేదన్పించింది. బెన్ ఎఫ్లెక్, రోజ్‌మండ్ పైక్ హీరో హీరోయిన్లుగా షూటింగ్ ప్రారంభించాడు. సరిగ్గా ఏడాది తర్వాత 2014 సెప్టెంబర్‌లో విడుదలయింది. విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా 61 మిలియన్ల డాలర్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా 370 మిలియన్ల డాలర్లు వసూలు చేసింది! ఇంతకీ మాయమైంది కేవలం ఓ స్త్రీ కాదు. మానవ సంబంధాలు. వెదుకులాట జరగాల్సింది - ప్రేమానురాగాల కోసం. అందుకే ‘గాన్ గర్ల్’ ఓ మంచి సైకలాజికల్ థ్రిల్లర్‌గా నిలిచిపోయింది.

  

కథేమిటంటే...
నిక్, అమీ భార్యాభర్తలు. వాళ్ల వివాహ వార్షికోత్సవం రోజున అమీ కనబడకుండా పోయింది.  ఓ కామిక్ క్యారెక్టర్ అమీని దృష్టిలో ఉంచుకుని, ఆమె తల్లిదండ్రులు సృష్టించి ఉంటారు. ఆ పాత్ర జనంలో బాగా పాపులర్. అందుకే అమీ అదృశ్యం మీడియాకి హాట్ న్యూస్ అయింది. పోలీస్ డిటెక్టివ్‌లు, ఫోరెన్సిక్ నిపుణులు రంగప్రవేశం చేశారు.


ఆ ఇంట్లో అమీ రక్తపు మరకలని కడిగి, శుభ్రం చేసినట్లుగా ఫోరెన్సిక్ వాళ్లకి ఆధారాలు దొరికాయి. నిక్ తన భార్య అమీని హత్య చేశాడనే అనుమానం పోలీసులతో పాటు, ప్రజల్లో కూడా పెరిగింది. ఈ కేసు పరిశోధనలో భాగంగా- నిక్, అమీల గతాన్ని తవ్వి చూస్తే, వారిద్దరూ పేరుకి భార్యాభర్తలయినా - అనుబంధం అంతంత మాత్రమే. రిసెషన్‌లో ఉద్యోగాలు పోగొట్టుకుని, న్యూయార్క్ నుంచి నిక్ స్వగ్రామం మిస్సోరికి చేరుకున్నారు. రకరకాల ఆర్థిక ఇబ్బందులు. భార్యాభర్తల మధ్య గొడవలు. నిక్ చిరాగ్గా, నిరాశా నిస్పృహలతో కాలం గడుపుతుండేవాడు. మాయం కావడానికి ముందు అమీ గర్భవతి అని ఓ మెడికల్ రిపోర్ట్ దొరికింది. ఆ విషయం తనకి తెలియదంటాడు నిక్.

 
అమీ ఓ గన్ కొనే ప్రయత్నం చేసింది. ఆమె రాసుకున్న డైరీలో తన భర్త తనని చంపుతాడనే భయం వ్యక్తం చేసింది. ఈ ఆధారాలతో నిక్ ఆమెని చంపేశాడనే అభియోగం బలపడసాగింది. నిజానికి అమీ బతికే ఉంది. భర్త తనని నిర్లక్ష్యం చేయడం, తన డబ్బుతో వ్యాపారం చేయాలనుకోవడం, మరో స్త్రీతో అక్రమ సంబంధం... ఇలాంటివి అమీని బాధపెట్టాయి. భర్తమీద ఒక రకమైన కసి, కోపం ఏర్పడ్డాయి. గర్భవతి అయిన పక్కింటావిడ యూరిన్ సేకరించి, అది తన శాంపిల్‌గా క్రియేట్ చేసింది. తనని తాను గాయపర్చుకుని ఇల్లంతా రక్తపు మరకలు పడేలా చేసింది. డైరీలో కావాలనే నిక్ మీద అనుమానం వచ్చేట్లు రాసింది. పోలీసులు కచ్చితంగా నిక్‌ని అరెస్ట్ చేసి, ఉరిశిక్ష వేస్తారని, ఆ తర్వాత తను ఆత్మహత్య చేసుకోవాలని అమీ ప్లాన్. ఈ కేసు నుంచి బయటపడటానికి నిక్ టానర్ బోల్ట్ అనే లాయర్‌ని ఆశ్రయించాడు. భార్యలని చంపిన భర్తల తరఫున కేసులు వాదించడంలో ఆ లాయర్ దిట్ట. అమీ తన మాజీ బాయ్‌ఫ్రెండ్ దేశీ కోలింగ్స్ లేక్‌హౌస్‌లో రహస్యంగా తలదాచుకుంది.

 
ఓ టీవీ ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో నిక్ తన తప్పులని ఒప్పుకుంటూ, తనో మంచి భర్త కానని, అమీ తిరిగి తనకి లభిస్తుందనే ఆశని వ్యక్తం చేస్తాడు. నిక్ మాటలు అమీని కదిలించాయి. కాని మాయమైన తను తిరిగి ఎలా బయటి ప్రపంచంలోకి రావాలి? మళ్లీ మాస్టర్ ప్లాన్ చేసింది అమీ. తనని తాను గాయపర్చుకుంది. దేశిని రెచ్చగొట్టి, సెక్స్‌లో పాల్గొంది. ఆ సమయంలో దేశి గొంతు కోసి, చంపేసింది. ఆ గాయాలతో, రక్తపు మరకలతో ఇంటికి తిరిగొచ్చి దేశీ కోలింగ్స్ తనని కిడ్నాప్ చేశాడని, రేప్ చేశాడని పోలీసుల ముందు చెప్పింది. నిక్ నిర్దోషిగా విడుదలయ్యాడు.

 
జరిగిన వాస్తవాలను భర్తతో చెప్పింది అమీ. ఇదే విషయాన్ని నిక్ పోలీస్ డిటెక్టివ్ బోనీ, లాయర్ బోల్ట్, తన సోదరి మార్గరెట్‌కి చెబుతాడు. కాని సాక్ష్యాధారాలు లేకపోవడంతో అమీని నేరస్తురాలిగా నిరూపించలేకపోతారు. టీవీ ఇంటర్వ్యూలో నిక్ వ్యక్తం చేసిన ప్రేమకి తను చలించిపోయానని, నిక్ లేకుండా బతకలేనని అమీ చెబుతుంది. ఓ ఫెర్టిలిటీ క్లినిక్‌లో స్టోర్ చేసిన నిక్ వీర్యం ద్వారా తను కృత్రిమ గర్భధారణ చేశానని, నిక్ బిడ్డ తన కడుపులో పెరుగుతుందని అమీ చెబుతుంది. భార్యని వదల్లేని పరిస్థితుల్లో ఆమెతో కలిసి కాపురం చేస్తుంటాడునిక్. హ్యాపీ కపుల్‌గా జనం దృష్టిలో పేరు తెచ్చుకుంటారు.

 - తోట ప్రసాద్

 

సున్నిత మనస్కురాలైన స్త్రీ దుర్మార్గంగా మారే పరిస్థితులు ఎందుకొస్తాయి అనేది ఫ్లిన్ రచనల సెల్లింగ్ పాయింట్. 2012లో తను రాసిన పాపులర్ నవలే ‘గాన్ గర్ల్’. రెండు మిలియన్ల కాపీలు అమ్ముడయింది. థ్రిల్లర్ నవలల్లో నెంబర్‌వన్‌గా నిలిచింది. అయితే నవలగా మార్కెట్‌లోకి రావడానికి ముందే 2011లో ఈ సినిమా ఎగ్జిక్యూటివ్ నిర్మాత వెస్లీ డిక్సన్ - ఆ నవల రాతప్రతిని చదివింది. విశేషంగా నచ్చేసింది. వెంటనే సినిమా తీద్దామని రచయిత్రి ఫ్లిన్‌తో సంప్రదింపులు ప్రారంభించింది. నవల విడుదల అయిన తర్వాత ‘ట్వంటీయత్ సెంచరీ ఫాక్స్’ నవల హక్కులు కొనుగోలు చేసింది. అయితే రచయిత్రి ఫ్లిన్ స్క్రీన్‌ప్లే కూడా తనే రాయాలని కండిషన్ పెట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement