
ఇటీవల మన తెలుగు హీరోలు గ్లోబల్ స్టార్లుగా మారుతున్నారు. ఇప్పటి దాకా చూస్తే హాలీవుడ్( Hollywood) సినిమాల్లో బాలీవుడ్ తారలకు వచ్చిన స్థాయిలో దక్షిణాదికి అవకాశాలు రాలేదు. అయితే ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూ.ఎన్టీయార్...లు ఇప్పుడు హాలీవుడ్‌లో సైతం చర్చకు వస్తున్నారు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే... మరికొన్ని టాలీవుడ్ హీరోల చిత్రాలు అంతర్జాతీయ స్థాయిలో దుమ్ము రేపితే త్వరలోనే హాలీవుడ్ సినిమాలో తెలుగు హీరోని చూడడం ఖాయంగా కనిపిస్తోంది. ఆల్రెడీ మన జూనియర్ ఎన్టీయార్‌తో సినిమా తీయాలని ఉందని సూపర్ మ్యాన్ సినిమా దర్శకుడు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో మరోసారి దక్షిణాది హీరోలు హాలీవుడ్ తెరంగేట్రం టాక్ ఆఫ్ ది ఇండియన్ సినిమాగా మారింది.
అయితే దక్షిణాది హీరోలు హాలీవుడ్ ని ఆకర్షించడం, అక్కడి సినిమాల్లో నటించే అవకాశం మరీ అంత అందని ద్రాక్ష ఏమీ కాదు. గతంలోనూ పలువురు దక్షిణాది హీరోలు నటించిన దాఖలాలు ఉన్నాయి. గత 2018లో దక్షిణాది స్టార్ ధనుష్ హాలీవుడ్ చిత్రంలో నటించాడు. ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్ పేరుతో రూపొందిన ఆ చిత్రంతో పాటు ఆంథోనీ, జోయ్ రుస్సో దర్శకత్వం వహించిన ది గ్రే మ్యాన్ అనే చిత్రంలోనూ నటించాడు. సోనీ ప్రొడక్షన్స్ ఫిల్మ్ స్ట్రీట్ ఫైటర్‌లో నటిస్తాడని వార్తలు వస్తున్నాయి.

ప్రముఖ దక్షిణాది నటుడు పలు తెలుగు చిత్రాల్లో విలన్‌గా నటించిన నెపోలియన్... గత 2019లో హాలీవుడ్ అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఆయన అతీంద్రీయ శక్తుల కధతో రూపొందిన థ్రిల్లర్ మూవీ డెవిల్స్ నైట్‌లో నటించాడు. అలాగే అమెరికన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ క్రిస్మస్ కూపన్‌లో కూడా ఆయన చేశారు.
అచ్చ తెలుగు అమ్మాయి అవంతిక వందనపు... పలు తెలుగు సినిమాల్లో చెప్పుకోదగ్గ పాత్రల్లో నటించింది. మనమంతా, ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం వంటి సినిమాల్లో కనిపించిన అవంతిక... అమెరికాలో నివసించే హైదరాబాదీ యువతి. ఈమె కూడా మీన్ గాళ్స్ అనే హాలీవుడ్ మూవీలో నటించింది.
తమిళ సూపర్ స్టార్ సీనియర్ నటడు రజనీకాంత్(Rajinikanth )... చాలా మందికన్నా ముందే... అప్పట్లో ఒక హాలీవుడ్ చిత్రంలో నటించాడు. అశోక్ అమృత్‌రాజ్, సునంద మురళీ మనోహర్‌లు రూపొందించిన బ్లడ్ స్టోన్ అనే సినిమాలో ఆయన ఒక క్యాబ్ డ్రైవర్ పాత్ర పోషించాడు.
మన మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) సైతం హాలీవుడ్ చిత్రంలో నటించిన విషయం చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఆయన తన సమకాలీకుడైన రజనీకాంత్ కన్నా ఓ పదేళ్లు ఆలస్యంగా అంటే 1999లో హాలీవుడ్ లో రంగప్రవేశం చేశారు. థీఫ్ ఆఫ్ బాగ్థాద్ అనే సినిమాలో ఆయన చేశాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా షూటింగ్ అర్థంతరంగా ఆగిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment