* తొలి దశలో నల్లగొండ, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో
* వరంగల్‌లో డీఎన్‌ఏ కేంద్రం.. ఎఫ్‌ఎస్‌ఎల్ అధికారుల ప్రతిపాదన
* త్వరలోనే సర్కారు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: నేరస్తుల నిగ్గు తేల్చడంలో కీలక పాత్ర వహించే ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రాంతీయ కేంద్రాలను రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. దీంతోపాటు హైదరాబాద్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో ఉన్న డీఎన్‌ఏ కేంద్రం తరహాలో మరో కేంద్రాన్ని వరంగల్‌లో ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్‌లోని ఎఫ్‌ఎస్‌ఎల్‌కు కేసుల తాకిడి పెరిగింది. ఓవైపు కేసులు పెరుగుతుండటం.. మరోవైపు సైంటిఫిక్ అసిస్టెంట్లు, శాస్త్రవేత్తల కొరత వంటి సమస్యలు వేధిస్తున్నాయి. వరంగల్‌లో ఓ ప్రాంతీయ కేంద్రం ఉన్నా.. మిగతా జిల్లాల నుంచి వచ్చే కేసులకు సంబంధించి ఘటనా స్థలం నుంచి సేకరించిన ఆధారాల విశ్లేషణ బాధ్యత హైదరాబాద్ ఎఫ్‌ఎస్‌ఎల్‌పైనే పడుతోంది. దీంతో అనేక కేసుల్లో దర్యాప్తు ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది.
ముఖ్యంగా మహిళలపై అత్యాచారాల కేసుల్లో డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించే ప్రక్రియ మందకొడిగా సాగుతోందనే విమర్శలున్నాయి. అయితే, డీఎన్‌ఏ పరీక్షలకు సంబంధించి ప్రతి నెలా 60కి పైగా కేసులు వస్తుండటం.. సంస్థలో నిష్ణాతుల సంఖ్య తక్కువగా ఉండటం వంటివి ఈ జాప్యానికి కారణమని ఎఫ్‌ఎస్‌ఎల్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వరంగల్‌లో మరో డీఎన్‌ఏ కేంద్రం ఏర్పాటు చేయాలని ఎఫ్‌ఎస్‌ఎల్ అధికారులు ప్రతిపాదించారు. అదేవిధంగా మిగిలిన కేసులకు సంబంధించి ప్రాంతీయ ఫోరెన్సిక్ ల్యాబ్‌లను తొలి దశలో మహబూబ్‌నగర్, నల్లగొండ, ఆదిలాబాద్‌లలో ఏర్పాటు చేయాలని సిఫార్సు చేశారు. అనంతరం మిగిలిన జిల్లాల్లో ఏర్పాటు చేయాలని సూచించారు. వీరి ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఇదిలా ఉండగా.. ఎఫ్‌ఎస్‌ఎల్‌కు 220 మందికి పైగా నిపుణుల అవసరముండగా.. ప్రస్తుతం 150 మంది వరకే ఉన్నారని.. ఆ కొరతను కూడా తీర్చాలని అధికారులు ప్రభుత్వానికి విన్నవించారు.
జిల్లాల్లో ఫోరెన్సిక్ ల్యాబ్‌లు
Published Tue, Dec 9 2014 2:34 AM | Last Updated on Thu, Oct 4 2018 5:51 PM
Advertisement